కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలను పెంచే విషయంలో నమ్మదగిన సలహా

పిల్లలను పెంచే విషయంలో నమ్మదగిన సలహా

పిల్లలను పెంచే విషయంలో నమ్మదగిన సలహా

“నా కప్పుడు 19 ఏళ్లు, నేను ఉమ్మడి కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాను, దానికి నేను అసలు సిద్ధంగా లేను” అని రూత్‌ తన మొదటి కాన్పు గురించి చెబుతోంది. ఒక్కగానొక్క కూతురుగా పెరిగిన ఆమె తల్లికావడంలో ఏమేమి ఇమిడివున్నాయో అంతగా ఆలోచించలేదు. పిల్లల ఆలనాపాలనకు సంబంధించిన నమ్మదగిన సలహా కోసం ఆమె ఎవరి దగ్గరికి వెళ్లవచ్చు?

మరోవైపు, ఇప్పుడు ఇద్దరు ఎదిగిన పిల్లల తండ్రి అయిన జాన్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నేను మొదట్లో ఎంతో నిశ్చింతగా ఉన్నాను. పిల్లలను పెంచే విషయంలో ఉపయోగపడే పరిజ్ఞానం నాకు లేదని గ్రహించడానికి ఎంతోకాలం పట్టలేదు.” తమ పిల్లలను పెంచే విషయంలో శ్రేష్ఠమైన పద్ధతేమిటో తల్లిదండ్రులకు తెలియకపోయినా లేక ఆ తర్వాత తాము ఉపయోగిస్తున్న పద్ధతులు సరైనవో కావో అని అనుమానం వచ్చినా, వారెక్కడ సహాయం పొందవచ్చు?

నేడు చాలామంది తల్లిదండ్రులు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, అక్కడ దొరికే సలహా ఎంతమేరకు నమ్మదగినదని మీరు అనుకుంటుండవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండేందుకు మంచి కారణం ఉంది. ఇంటర్నెట్‌ ద్వారా మీకు సలహా ఇస్తున్నవారు ఎవరో మీకు నిజంగా తెలుసా? వారు తమ పిల్లలను పెంచే విషయంలో ఎంతమేరకు విజయం సాధించారు? మీరు మీ కుటుంబాన్ని ప్రభావితం చేసే విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా అనుకుంటారు. ముందరి ఆర్టికల్‌లో పేర్కొనబడినట్లుగా, కొన్నిసార్లు నిపుణుల సలహా కూడా నిరాశపరచవచ్చు. కాబట్టి మీరు ఎవరి సలహా తీసుకోవచ్చు?

పిల్లలను పెంచే విషయంలో తిరుగులేని సలహాను, కుటుంబ ఏర్పాటును ఆరంభించిన యెహోవా దేవుడే ఇస్తాడు. (ఎఫెసీయులు 3:​15) ఆయనే నిజమైన నిపుణుడు. ఆయన తన వాక్యమైన బైబిల్లో నమ్మదగిన, ప్రయోజనకరమైన ఆచరణసాధ్యమైన ఉపదేశాన్నిస్తున్నాడు. (కీర్తన 32:⁠8; యెషయా 48:​17, 18) అయితే దానిని అన్వయించడం మన బాధ్యత.

సమతూకం ఉన్న, దేవునిపట్ల భయభక్తులు కలిగిన పెద్దలుగా పిల్లలను పెంచేటప్పుడు తమ అనుభవాల నుండి నేర్చుకున్న విషయాలను పంచుకోమని చాలామంది దంపతులు కోరబడ్డారు. బైబిలు సూత్రాలు అన్వయించుకోవడం ద్వారానే తాము విజయం సాధించామని వారు చెప్పారు. బైబిలు మొదట్లో రాయబడినప్పుడు అది ఎంత నమ్మదగినదిగా ఉందో నేడూ అంతే నమ్మదగినదిగా ఉందని వారు గ్రహించారు.

వారితో సమయం గడపండి

తనకు ఎంతో సహాయపడిన సలహా గురించి చెప్పమని ఇద్దరి పిల్లల తల్లి అయిన క్యాథ్రిన్‌ను అడిగినప్పుడు, ఆమె వెంటనే ద్వితీయోపదేశకాండము 6:⁠7ను పేర్కొంది. ఆ లేఖనం ఇలా చెబుతోంది: ‘నీవు నీ కుమారులకు [బైబిలు సూత్రాలను] అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.’ ఆ సలహా పాటించాలంటే తాను తన పిల్లలతో సమయం గడపాలని ఆమె గుర్తించింది.

‘అది చెప్పినంత సులభంకాదు’ అని మీరనుకోవచ్చు. ఇద్దరు కష్టపడితేనేగాని ఇళ్ళు గడవని కుటుంబాలు అనేకం ఉన్నాయి కాబట్టి, తీరికలేని తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం ఎలా గడపవచ్చు? ద్వితీయోపదేశకాండములో ఉన్న సలహా పాటించడం కీలకమని టోర్లిఫ్‌ అంటున్నాడు, ఆయన కుమారునికి ఇప్పుడు సొంత కుటుంబం ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నా పిల్లలను వెంట తీసుకెళ్లండి, అప్పుడు మాట్లాడే అవకాశాలు సహజంగానే వస్తాయి. “నేనూ మా అబ్బాయి, ఇంటి పనులను కలిసి చేసేవాళ్లం, కుటుంబమంతా కలిసి ప్రయాణాలు చేసేవాళ్లం. మేము కలిసి భోంచేసేవాళ్లం” అని టోర్లిఫ్‌ వివరిస్తున్నాడు. దానివల్ల, “తాను తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయొచ్చని మా అబ్బాయికి ఎల్లప్పుడూ అనిపించేది” అని ఆయన అంటున్నాడు.

అయితే, దాపరికంలేని సంభాషణకు విఘాతం ఏర్పడి, మాట్లాడుకోవడమే కష్టంగా మారితే అప్పుడేమిటి? పిల్లలు పెద్దవారయ్యేకొద్దీ అలాంటి పరిస్థితి కొన్నిసార్లు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా, వారితో ఎక్కువ సమయం గడపడం సహాయకరంగా ఉండవచ్చు. తమ అమ్మాయి కౌమారదశకు చేరుకున్నప్పుడు, తను చెబుతుంది వినట్లేదని ఆయనమీద ఫిర్యాదు చేసినట్లు క్యాథ్రిన్‌ భర్త కెన్‌ గుర్తుచేసుకుంటున్నాడు. టీనేజర్లు సాధారణంగా అలాంటి ఫిర్యాదులు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనేమి చేశాడు? కెన్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను ఆమె ఆలోచనలు, మనోభావాలు, నిరాశల గురించి చర్చిస్తూ తనతో వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. సమస్యను పరిష్కరించడానికి అది నిజంగా ఎంతో తోడ్పడింది.” (సామెతలు 20:⁠5) అయితే, తమ గృహంలో సంభాషణ అసాధారణ విషయం కాదు కాబట్టి ఆ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందామని కెన్‌ నమ్ముతున్నాడు. “నాకు మా అమ్మాయికి ఎల్లప్పుడూ మంచి సంబంధం ఉంది కాబట్టి, నాతో ధైర్యంగా మాట్లాడగలనని తను అనుకునేది” అని ఆయన అంటున్నాడు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, తల్లిదండ్రులూ పిల్లలూ కలిసి ఎక్కువ సమయం గడపరని తమ తల్లిదండ్రులకన్నా టీనేజర్లు ఫిర్యాదు చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని ఇటీవల జరిపిన ఒక అధ్యయనం నివేదించింది. కాబట్టి, బైబిలు సలహాను ఎందుకు పాటించకూడదు? మీ పిల్లలతో తీరిక వేళల్లో, పనిచేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, ఉదయం నిద్ర లేచినప్పుడు, మీరు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. వీలైతే, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారిని తీసుకెళ్లండి. ద్వితీయోపదేశకాండము 6:⁠7 సూచిస్తున్నట్లు, మీ పిల్లలతో గడిపే సమయానికి వేరే ప్రత్యామ్నాయం లేదు.

సరైన విలువలను వారికి బోధించండి

ఇద్దరు పిల్లల తండ్రి అయిన మార్యో కూడా అలాంటి సిఫారసే చేస్తున్నాడు: “పిల్లలను అధికంగా ప్రేమించండి, వారి కోసం పుస్తకాలను చదివి వినిపించండి.” అయితే, మీ పిల్లల మానసిక సామర్థ్యాలను ఉత్తేజపరచడం మాత్రమే సరిపోదు. మంచి చెడులను ఎలా గుర్తించాలో కూడా మీరు వారికి బోధించాలి. మార్యో ఇంకా ఇలా చెబుతున్నాడు: “వారితో బైబిలు అధ్యయనం చేయండి.”

దానికి సంబంధించి బైబిలు తల్లిదండ్రులను ఇలా ఆదేశిస్తోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:⁠4) నేడు అనేక కుటుంబాల్లో నైతిక ఉపదేశానికి ప్రాముఖ్యత ఇవ్వబడడంలేదు. పిల్లలు పెద్దవారైనప్పుడు తాము ఎలాంటి విలువలను అంగీకరించాలో స్వయంగా నిర్ణయించుకోగలరని కొందరు నమ్ముతున్నారు. అది సముచితమని మీకు అనిపిస్తోందా? పసిపిల్లల శరీరాలు బలంగా, ఆరోగ్యంగా ఎదగడానికి సరైన పోషణ ఎలా అవసరమో అలాగే పసిపిల్లల మనసులకు, హృదయాలకు ఉపదేశం అవసరం. మీ పిల్లలు ఇంట్లో మీ నుండి నైతిక విలువలను నేర్చుకోనట్లయితే, వారు తమ తోటి విద్యార్థుల, బోధకుల లేక ప్రసార మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను స్వీకరించే అవకాశం ఉంది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చెడులను ఎలా గుర్తించాలో బోధించడానికి బైబిలు సహాయం చేయగలదు. (2 తిమోతి 3:​16, 17) పిల్లలకు సరైన విలువలను నేర్పించడానికి బైబిలును ఉపయోగించమని ఇద్దరు పిల్లల తండ్రి, అనుభజ్ఞుడైన క్రైస్తవ పెద్ద అయిన జెఫ్‌ సిఫారసు చేస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “బైబిలును ఉపయోగించడం ద్వారా ఫలానా విషయం గురించి కేవలం తల్లిదండ్రుల దృక్పథాన్నే కాకుండా సృష్టికర్త దృక్పథాన్ని కూడా పిల్లలు గ్రహించేందుకు దోహదపడుతుంది. మనసుమీద, హృదయంమీద బైబిలు చూపించే ప్రత్యేకమైన ప్రభావాన్ని మేము గమనించాం. తప్పుడు ప్రవర్తనకు లేక ఆలోచనకు సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము సరైన లేఖనాన్ని కనుగొనడానికి సమయం తీసుకున్నాం. ఆ తర్వాత ఎవరూ లేనప్పుడు ఆ లేఖనాన్ని పిల్లవానితో చదివించేవాళ్ళం. అలా చదివిన తర్వాత సాధారణంగా వారు కన్నీళ్లు పెట్టేవారు. ఆశ్చర్యపోవడం మా వంతయ్యేది. మేము చెప్పాలనుకున్న దానికన్నా లేక చేయాలనుకున్న దానికన్నా గొప్ప ప్రభావం బైబిలు వారిమీద చూపించేది.”

హెబ్రీయులు 4:​12 ఇలా వివరిస్తోంది: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై . . . హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” కాబట్టి, బైబిల్లోని సందేశం, దేవుడు తన లేఖికులుగా ఉపయోగించుకున్న మానవుల వ్యక్తిగత అభిప్రాయాలు లేక అనుభవాలు మాత్రమే కాదు. బదులుగా, అది నైతిక విషయాల్లో దేవుని ఆలోచనను సూచిస్తోంది. ఆ అంశమే ఇతర సలహాలన్నింటి నుండి బైబిలు సందేశాన్ని భిన్నమైనదిగా చేస్తుంది. మీ పిల్లలకు బోధించేందుకు బైబిలును ఉపయోగించడం ద్వారా, వివిధ విషయాల్లో వారు దేవుని దృక్పథాన్ని కనబరచేందుకు మీరు వారికి సహాయం చేస్తారు. అలా మీ శిక్షణ సమర్థవంతంగా ఉండడమే కాక, మీ పిల్లవాడి హృదయాన్ని స్పృశించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

ముందు ప్రస్తావించబడిన క్యాథ్రిన్‌ కూడా దానిని అంగీకరిస్తోంది. ఆమె ఇలా అంటోంది: “పరిస్థితి ఎంత కష్టకరంగా ఉంటే అంత ఎక్కువగా మేము దేవుని వాక్య నిర్దేశం కోసం ప్రయత్నించాం, దానివల్ల మేము పరిస్థితిని చక్కబరచగలిగాం!” మంచి చెడులను ఎలా గుర్తించాలో మీ పిల్లలకు నేర్పించేందుకు మీరు బైబిలును ఎక్కువగా ఉపయోగించగలరా?

సముచితంగా ప్రవర్తించండి

పిల్లలను పెంచడంలో సహాయపడే మరో ప్రాముఖ్యమైన సూత్రాన్ని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయన తన తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి.” (ఫిలిప్పీయులు 4:⁠5) మన పిల్లలు మనం సహనంతో సముచితంగా ప్రవర్తిస్తుండడాన్ని గమనించేలా చర్యలు తీసుకోవడం కూడా నిశ్చయంగా దానిలో ఇమిడివుంది. మృదువైన రీతిలో సముచితంగా ప్రవర్తించడం “పైనుండివచ్చు జ్ఞానమును” ప్రతిబింబిస్తుందని కూడా గుర్తుంచుకోండి.​—⁠యాకోబు 3:​17.

అయితే, సముచితంగా ప్రవర్తించడం మన పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? మనకు చేతనైనంత సహాయం వారికి చేసినా, వారు చేసే పనులన్నిటినీ మనం నియంత్రించలేం. ఉదాహరణకు, ముందు ప్రస్తావించబడిన యెహోవాసాక్షి అయిన మార్యో ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “బాప్తిస్మం, పూర్తికాల పరిచర్యతోపాటు మరితర ఆధ్యాత్మిక లక్ష్యాలను మేము ఎల్లప్పుడూ మా పిల్లల ముందు ఉంచాం. సమయం వచ్చినప్పుడు ఆ విషయాల్లో వారే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలని మేము వారికి స్పష్టం చేశాం.” దాని ఫలితమేమిటి? వారిద్దరి పిల్లలు ఇప్పుడు పూర్తికాల సువార్తికులుగా సేవచేస్తున్నారు.

కొలొస్సయులు 3:​21లో బైబిలు తండ్రులను ఇలా హెచ్చరిస్తోంది: “మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:​21) ఆ వచనాన్ని క్యాథ్రిన్‌ విలువైనదిగా ఎంచుతోంది. తల్లిదండ్రుల ఓర్పు సన్నగిల్లినప్పుడు వారు త్వరగా కోపపడవచ్చు లేక కఠినంగా ప్రవర్తించవచ్చు. అయితే, “మీరు చేయాలనుకున్నంత మీ పిల్లవాడు కూడా చేయాలని కోరకండి” అని ఆమె అంటోంది. క్యాథ్రిన్‌ కూడా ఒక యెహోవాసాక్షి, ఆమె ఇంకా ఇలా అంటోంది: “యెహోవాను సేవించడం సంతోషకరమైన విషయంగా చేయండి.”

ముందు పేర్కొనబడిన జెఫ్‌, ఈ ఆచరణసాధ్యమైన సలహా ఇస్తున్నాడు: “వారి కోరికలను తీర్చడం వీలుకాదని తన పిల్లలకు ఎంత తరచుగా చెప్పాల్సివస్తుందో తాను గుర్తించానని ఒక మంచి స్నేహితుడు మా పిల్లలు పెద్దవారవుతున్నప్పుడు మాతో చెప్పాడు. అలా చెప్పడం వారిని నిరుత్సాహపర్చి, క్రుంగదీసింది. అలా జరగకూడదంటే వారి కోరికలను మన్నించే మార్గాల కోసం చూడమని ఆయన సిఫారసు చేశాడు.”

జెఫ్‌ ఇలా అంటున్నాడు: “అది మంచి సలహా అని మేము గ్రహించాం. మేము ఆమోదించిన పరిస్థితుల్లో మా పిల్లలు ఇతరుల సహవాసాన్ని ఆనందించే అవకాశాల కోసం అప్పటినుండి మేము చూశాం. కాబట్టి మేము వారితో ఇలా అనేవాళ్లం: ‘ఫలానావారు ఈ ఏర్పాటు చేశారని మీకు తెలుసా? మీరు కూడా అక్కడికి ఎందుకు వెళ్లకూడదు?’ లేదా తమను ఫలానా ప్రదేశానికి తీసుకువెళ్లమని పిల్లలు మమ్మల్ని అడిగినప్పుడు మేము అలసిపోయినా, వారితో వెళ్ళడానికి ఓపిక తెచ్చుకునేవాళ్ళం. వారు కోరినవిధంగా చేయడం వీలుకాదు అని చెప్పకూడదని మేమలా చేసేవాళ్లం.” నిష్పక్షపాతంగా, దయతో బైబిలు సూత్రాలతో రాజీపడకుండా వారి కోరికలను ఆమోదించడమే సముచితంగా ప్రవర్తించడంలో ఇమిడివున్న విషయం.

నమ్మదగిన సలహా నుండి ప్రయోజనం పొందండి

పైన ప్రస్తావించబడిన దంపతుల్లో అనేకమంది ఇప్పుడు తాతమామ్మలుగా ఉన్నారు. తమ పిల్లలు తల్లిదండ్రులుగా విజయం సాధించేందుకు ఆ బైబిలు సూత్రాలే సహాయం చేస్తుండడాన్ని చూడడం వారికి ఆనందాన్నిస్తుంది. బైబిలు సలహా నుండి మీరు ప్రయోజనం పొందగలరా?

ప్రారంభంలో పేర్కొనబడిన రూత్‌, తల్లి అయినప్పుడు, తాము నిస్సహాయులమనే భావన కొన్నిసార్లు ఆమెలో, ఆమె భర్తలో కలిగింది. కానీ వారు నిస్సహాయులు కారు. దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్న శ్రేష్ఠమైన సలహా వారికి తోడుగా ఉంది. తల్లిదండ్రులకు సహాయం చేయగల అనేక చక్కని బైబిలు అధ్యయన సహాయకాలు యెహోవాసాక్షులు ప్రచురించారు. వాటిలో గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం), నా బైబిలు కథల పుస్తకము, యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి వంటి పుస్తకాలు ఉన్నాయి. రూత్‌ భర్త అయిన టోర్లిఫ్‌ ఇలా అంటున్నాడు: “నేడు ఎన్నో బైబిలు ఆధారిత సలహాలు తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్నాయి. వారు వాటిని సద్వినియోగం చేసుకుంటేనే, పిల్లలు పెరిగేకొద్దీ జీవితంలోని అన్ని రంగాల్లో తమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు వారికి సహాయం లభిస్తుంది.”

[7వ పేజీలోని చిత్రం]

జ్ఞానంగల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఉల్లాస కార్యకలాపాలను ఏర్పాటు చేస్తారు

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

నిపుణులు ఏమి చెబుతున్నారు . . . బైబిలు ఏమి చెబుతోంది

ప్రేమ చూపించే విషయంలో:

ద సైకలాజికల్‌ కేర్‌ ఆఫ్‌ ఇన్ఫెంట్‌ అండ్‌ ఛైల్డ్‌ (1928) అనే పుస్తకంలో డాక్టర్‌ జాన్‌ బ్రోడాస్‌ వాట్సన్‌, తల్లిదండ్రులను ఇలా ప్రోత్సహించాడు: మీ పిల్లలను “ఎన్నడూ కౌగిలించుకోవద్దు, ముద్దుపెట్టుకోవద్దు.” “మీ ఒడిలో వారిని ఎన్నడూ కూర్చోనివ్వద్దు.” అయితే ఇటీవల వైరా లేన్‌, డోరతీ మోలీనో అనే వైద్యురాలు అవర్‌ చిల్డ్రన్‌ పత్రికలో (మార్చి 1999) ఇలా చెప్పింది: “భౌతిక స్పర్శకు దూరమైన, అనురాగాన్ని పొందని చిన్నారులు వర్ధిల్లరని పరిశోధన సూచిస్తోంది.”

వాటికి భిన్నంగా, దేవుడు తన ప్రజలపట్ల తల్లిదండ్రులు చూపించేలాంటి ప్రేమను చూపిస్తున్నట్లు యెషయా 66:​12 పేర్కొంటోంది. అలాగే, ప్రజలు యేసు దగ్గరికి పిల్లలను తీసుకురావడాన్ని ఆపాలని ఆయన శిష్యులు ప్రయత్నించినప్పుడు, ఆయన వారిని ఈ మాటలతో సరిదిద్దాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు.” ఆ తర్వాత ఆయన “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారిమీద చేతులుంచి ఆశీర్వదించెను.”​—⁠మార్కు 10:​14, 16.

సరైన విలువలను బోధించే విషయంలో:

1969 న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌లోని ఆర్టికల్‌లో, ఒక పిల్లవానికి “తన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు ఉందని, ఆయన [తన తల్లిదండ్రుల] ఆదేశాత్మకమైన [బోధనుబట్టి] కాదుగానీ జీవితంలో తనకెదురయ్యే సొంత అనుభవాలనుబట్టే ప్రభావితుడవ్వాలని” డాక్టర్‌ బ్రూనో బెటల్హిమ్‌ నొక్కిచెప్పాడు. అయితే, దాదాపు 30 ఏళ్ల తర్వాత, ద మోరల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ (1997) అనే పుస్తక గ్రంథకర్త అయిన డాక్టర్‌ రాబర్ట్‌ కోల్స్‌ ఇలా అంగీకరించాడు: తల్లిదండ్రులు, ఇతర వయోజనులు ఆమోదించిన “విలువలు, జీవితంలో ఒక సంకల్పం, దిశానిర్దేశం పిల్లలకు ఎంతో అవసరం.”

సామెతలు 22:⁠6 తల్లిదండ్రులను ఇలా ప్రోత్సహిస్తోంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” ‘నేర్పించడం’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి “ప్రారంభించు” అనే అర్థం కూడా ఉంది, ఇక్కడ అది బాలునికి బోధించడాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని సూచిస్తోంది. ఆ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుండే సరైన విలువలను బోధించడాన్ని ప్రారంభించాలని ప్రోత్సహించబడుతున్నారు. (2 తిమోతి 3:​14, 15) ఆ ఎదిగే సంవత్సరాల్లో వారు నేర్చుకునే విషయాలు వారితోనే ఉండే అవకాశం ఉంది.

క్రమశిక్షణ విషయంలో:

ద స్ట్రాంగ్‌ విల్డ్‌ ఛైల్డ్‌ (1978) అనే పుస్తకంలో డాక్టర్‌ జేమ్స్‌ డాబ్సన్‌ ఇలా రాశాడు: “ప్రేమగల తల్లిదండ్రులు ఇచ్చే దండన హానికరమైన ప్రవర్తనను నియంత్రించే ఒక బోధనా సాధనంగా ఉంటుంది.” మరోవైపు, బేబీ అండ్‌ ఛైల్డ్‌ కేర్‌ (1998) అనే ప్రఖ్యాత పుస్తకానికి సంబంధించిన ఏడవ సంచిక నుండి తీసుకోబడిన ఒక ఆర్టికల్‌లో డాక్టర్‌ బెంజమిన్‌ స్పాక్‌ ఇలా అన్నాడు: “పిల్లలను దండించడం ద్వారా పెద్దవారు, బలవంతులు తప్పు చేసినా చేయకపోయినా ఆ బలవంతులు తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చనే భావన పిల్లల్లో కలుగుతుంది.”

క్రమశిక్షణ గురించి బైబిలు ఇలా చెబుతోంది: “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును.” (సామెతలు 29:15) అయితే, పిల్లలందరికీ దండన అవసరంలేదు. సామెతలు 17:​10 మనకిలా చెబుతోంది: “బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.”

[చిత్రం]

హృదయాన్ని స్పృశించేందుకు బైబిలును ఉపయోగించండి

[7వ పేజీలోని చిత్రం]

జ్ఞానంగల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఉల్లాస కార్యకలాపాలను ఏర్పాటు చేస్తారు