కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన పవిత్ర కూటాలపట్ల గౌరవాన్ని చూపించడం

మన పవిత్ర కూటాలపట్ల గౌరవాన్ని చూపించడం

మన పవిత్ర కూటాలపట్ల గౌరవాన్ని చూపించడం

“నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను.” ​—⁠యెషయా 56:​6, 7.

యెహోవా తన “పరిశుద్ధ పర్వతము”పై తనను ఆరాధించేలా తన ప్రజలైన అభిషిక్త క్రైస్తవులను, వారి సహవాసులను సమకూర్చాడు. ఆయన వారిని “సమస్తజనులకు ప్రార్థనమందిర”ముగా ఉన్న తన ఆధ్యాత్మిక ఆలయమైన “ప్రార్థనా మందిరములో” ఆనందింపజేస్తున్నాడు. (యెషయా 56:⁠7; మార్కు 11:​17) ఈ పరిణామాలు యెహోవా ఆరాధన పరిశుద్ధమైనదని, స్వచ్ఛమైనదని, ఉన్నతమైనదని సూచిస్తున్నాయి. అధ్యయనం, ఆరాధన కోసం ఏర్పాటు చేయబడే మన కూటాలపట్ల సరైన గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే మనకూ ఉందని నిరూపిస్తాం.

2 ప్రాచీన ఇశ్రాయేలులో, యెహోవా తన ఆరాధన కోసం ఎంచుకున్న స్థలాన్ని పవిత్రమైనదిగా పరిగణించాలి. ఆలయ గుడారాన్ని, దాని సామగ్రిని, పాత్రలను అభిషేకించి, ‘అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని’ పవిత్రపరచాలి. (నిర్గమకాండము 30:​26-29) ఆలయంలోని రెండు భాగాలు, “పరిశుద్ధ స్థలం,” “అతిపరిశుద్ధ స్థలం” అని పిలువబడ్డాయి. (హెబ్రీయులు 9:​2, 3) ఆ తర్వాత ఆలయ గుడారం స్థానంలో యెరూషలేము దేవాలయం నెలకొల్పబడింది. యెహోవా ఆరాధనా కేంద్రమైన యెరూషలేము “పరిశుద్ధ పట్టణము” అని పిలువబడింది. (నెహెమ్యా 11:⁠1; మత్తయి 27:​53) యేసు తన భూపరిచర్య కాలంలో ఆ ఆలయంపట్ల సరైన గౌరవం చూపించాడు. ఆ ఆలయ ప్రాంగణాన్ని అగౌరవంగా వ్యాపార లావాదేవీల కోసమే కాక, దగ్గరి దారిగా ఉపయోగిస్తున్నందుకు ఆయన కోపోద్రేకుడయ్యాడు.​—⁠మార్కు 11:​15, 16.

3 యెహోవాను ఆరాధించేందుకు, ఆయన ధర్మశాస్త్రం చదవబడుతుండగా వినేందుకు ఇశ్రాయేలీయులు క్రమంగా సమావేశమయ్యేవారు. ఈ సమావేశాలు పవిత్రమైనవిగా పరిగణించబడేవని సూచిస్తూ వారి పండుగలకు సంబంధించిన కొన్ని దినాలు పరిశుద్ధమైన లేదా పవిత్రమైన సమావేశాలని పిలువబడ్డాయి. (లేవీయకాండము 23:​2, 3, 36, 37) ఎజ్రా, నెహెమ్యా కాలంలోని బహిరంగ సమావేశంలో లేవీయులు “ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి.” “జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా” లేవీయులు “మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖపడకూడదని” ఓదార్చారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ‘బహు సంతోషముగా’ ఏడురోజులపాటు పర్ణశాలల పండుగ జరుపుకున్నారు. అంతేకాక, ‘మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అనుదినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదవబడగా, వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొన్నారు.’ (నెహెమ్యా 8:​7-11, 17, 18) అవి నిజంగా, హాజరైనవారు గౌరవప్రదమైన శ్రద్ధనివ్వాల్సిన పరిశుద్ధ సందర్భాలుగా ఉన్నాయి.

మన కూటాలు పవిత్ర సమావేశాలు

4 నిజమే, నేడు భూమ్మీద తన ఆరాధనకోసం ప్రతిష్ఠించబడిన ప్రత్యేకమైన ఆలయం ఉన్న అక్షరార్థమైన పరిశుద్ధ పట్టణమేమీ యెహోవాకు లేదు. అయినప్పటికీ, యెహోవాను ఆరాధించేందుకు ఏర్పాటు చేయబడే కూటాలు పవిత్ర సమావేశాలనే వాస్తవాన్ని మనం మరచిపోకూడదు. లేఖనాల్ని చదివి, అధ్యయనం చేసేందుకు మనం వారంలో మూడుసార్లు కలుసుకుంటాం. నెహెమ్యా కాలంలోలాగే ఆ కూటాల్లో యెహోవా వాక్యము ‘స్పష్టముగా చదవబడి, దానికి అర్థం చెప్పబడుతుంది.’ (నెహెమ్యా 8:⁠8) మన కూటాలన్నీ ప్రార్థనతో ఆరంభించబడి, ముగించబడతాయి, వాటిలో అనేక కూటాల్లో మనం యెహోవాకు స్తుతిగీతాలు పాడతాం. (కీర్తన 26:​12) సంఘకూటాలు నిజానికి మన ఆరాధనలో భాగం కాబట్టి, ఆ కూటాల్లో మనం ప్రార్థనాపూర్వక దృక్పథాన్ని, గౌరవపూర్వకమైన శ్రద్ధను కనబరచాలి.

5 యెహోవా తన ప్రజలు తనను ఆరాధించేందుకు, తన వాక్యాన్ని అధ్యయనం చేసేందుకు, చక్కని క్రైస్తవ సహవాసాన్ని ఆస్వాదించేందుకు సమావేశమైనప్పుడు వారిని ఆశీర్వదిస్తాడు. కూటం జరుగుతున్నప్పుడు, ‘అక్కడ ఆశీర్వాదము ఉండాలని యెహోవా సెలవిస్తాడనే’ నమ్మకంతో మనం ఉండవచ్చు. (కీర్తన 133:​1, 3) మనమా కూటానికి హాజరై, ఆధ్యాత్మిక కార్యక్రమానికి అవధానమిచ్చినప్పుడు మనకా ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాక, యేసు ఇలా చెప్పాడు: “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును.” సందర్భాన్నిబట్టి చూస్తే, ఆ మాటలు ఆయావ్యక్తులకు సంబంధించిన గంభీరమైన సమస్యలతో వ్యవహరించే క్రైస్తవ పెద్దల కూటానికి అన్వయించినా, సూత్రప్రాయంగా అవి మన కూటాలకు కూడా వర్తిస్తాయి. (మత్తయి 18:​20) క్రైస్తవులు తన నామమున కూడుకున్నప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఉంటాడంటే, అలాంటి సమావేశాలను పవిత్రమైనవిగా పరిగణించవద్దా?

6 నిజమే యెహోవా మానవనిర్మిత ఆలయాల్లో నివసించడు. అయినప్పటికీ, మన రాజ్యమందిరాలు సత్యారాధనా స్థలాలుగా ఉన్నాయి. (అపొస్తలుల కార్యములు 7:​47; 17:​24) యెహోవా వాక్యాన్ని అధ్యయనం చేసేందుకు, ఆయనకు ప్రార్థించేందుకు, ఆయనకు స్తుతిగీతాలు పాడేందుకు మనమక్కడ సమావేశమౌతాం. మన అసెంబ్లీ హాల్స్‌ విషయంలో కూడా అది వాస్తవం. మన సమావేశాల కోసం అద్దెకు తీసుకునే ఆడిటోరియమ్స్‌, ఎగ్జిబిషన్‌ హాల్స్‌ లేదా క్రీడా మైదానాల వంటి పెద్ద స్థలాల్ని మన పవిత్ర సమావేశాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు వాటిని మనం ఆరాధనా స్థలాలుగా పరిగణిస్తాం. అలాంటి ఆరాధనా సందర్భాలు పెద్దవైనా, చిన్నవైనా మనం వాటిని గౌరవించాలి, ఆ గౌరవం మన దృక్పథంలో, ప్రవర్తనలో ప్రతిబింబించాలి.

మన సమావేశాలపట్ల గౌరవం చూపించే మార్గాలు

7 మన సమావేశాలపట్ల గౌరవం చూపించగల స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజ్య గీతాలు పాడేందుకు అక్కడ ఉండడం. ఈ గీతాల్లో అనేకం ప్రార్థనల రూపంలో కూర్చబడ్డాయి కాబట్టి, వాటిని పూజ్యభావంతో ఆలపించాలి. అపొస్తలుడైన పౌలు 22వ కీర్తనను ఉల్లేఖిస్తూ యేసు గురించి ఇలా వ్రాశాడు: “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును.” (హెబ్రీయులు 2:​11-12) కాబట్టి, ఛైర్మన్‌ పాట పాడేందుకు ఆహ్వానించకముందే మనం మన సీట్లలోవుండాలి, పాట పాడుతున్నప్పుడు దానిలోని పదాల అర్థంపై దృష్టి నిలుపుతూ ఆలపించాలని తీర్మానించుకోవాలి. మన ఆలాపన కీర్తనకర్త మనోభావాలనే ప్రతిబింబించును గాక, ఆయనిలా వ్రాశాడు: “యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.” (కీర్తన 111:⁠1) అవును, కూటాలకు త్వరగా వచ్చి, అవి ముగిసేవరకు ఉండేందుకు యెహోవాకు స్తుతిగీతాలు పాడడం చక్కని కారణంగా ఉంది.

8 మన కూటాల ఆధ్యాత్మిక విలువను పెంచే మరో అంశమేమిటంటే, సమావేశమైన వారందరి కోసం చేయబడే హృదయపూర్వక ప్రార్థన. ఒక సందర్భంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు యెరూషలేములో కూడుకొని, ‘ఏకమనస్సుతో దేవునికి బిగ్గరగా మొఱ్ఱపెట్టి’ పట్టుదలతో ప్రార్థించారు. దానివల్ల, వారు హింసవున్నా ‘దేవుని వాక్యమును ధైర్యముగా బోధించడంలో’ కొనసాగారు. (అపొస్తలుల కార్యములు 4:​24-31) అక్కడ సమావేశమైనవారిలో ఎవరైనా ప్రార్థనా సమయంలో పరధ్యానంలో పడడాన్ని మనం ఊహించగలమా? లేదు, వారు ‘ఏకమనస్సుతో’ ప్రార్థించారు. మన కూటాల్లో చేయబడే ప్రార్థనలు హాజరైనవారందరి మనోభావాలను ప్రతిబింబిస్తాయి. కాబట్టి వాటికి గౌరవప్రదమైన అవధానమివ్వాలి.

9 అంతేకాక, మన సమావేశాల పవిత్రతను మనమెంత ప్రగాఢంగా గౌరవిస్తున్నామో మన వస్త్రధారణ ద్వారా ప్రదర్శించవచ్చు. మన వస్త్రధారణయైనా, కేశాలంకరణయైనా మనం కనబడే తీరు మన కూటాల గౌరవాన్ని పెంచేందుకు ఎంతో దోహదపడతాయి. అపొస్తలుడైన పౌలు ఇలా ఉపదేశించాడు: “ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” (1 తిమోతి 2:​8-10) విశాలమైన స్టేడియంలో జరిగే సమావేశాలకు మనం హాజరైనప్పుడు, వాతావరణ పరిస్థితులకు తగినట్లు మనం దుస్తులు ధరించవచ్చు, అయితే అవి గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాక, ఆ సందర్భంపట్ల మనకున్న గౌరవం, కార్యక్రమం జరుగుతుండగా ఏవైనా తినడం, చూయింగ్‌ గమ్‌ నమలడం వంటివి చేయకుండా సహాయం చేస్తుంది. మన సమావేశాలప్పుడు సముచితమైన వస్త్రధారణ, ప్రవర్తన యెహోవా దేవుణ్ణి, ఆయన ఆరాధనను, మన తోటి ఆరాధకులను ఘనపరుస్తాయి.

దేవుని పరివారానికి తగిన ప్రవర్తన

10 క్రైస్తవ కూటాలు జరిగించబడే విధానం గురించి అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని మనం చూస్తాం. ఆయనిలా చెబుతూ ముగించాడు: “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.” (1 కొరింథీయులు 14:​39) క్రైస్తవ సంఘ కార్యక్రమంలో మన కూటాలు ప్రాముఖ్యమైన భాగంగా ఉన్నాయి, అవి యెహోవా పరివారానికి తగినట్లుండే ప్రవర్తనను కోరుతున్నాయి.

11 కూటాలప్పుడు ఎలా మెలగాలో పిల్లలకు ప్రత్యేకంగా నేర్పించాలి. రాజ్యమందిరంగానీ, సంఘ పుస్తక అధ్యయన స్థలంగానీ ఆట స్థలాలు కావని క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. అవి మనం యెహోవాను ఆరాధించే, ఆయన వాక్యాన్ని అధ్యయనం చేసే స్థలాలు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; . . . సమీపించి ఆలకించుట శ్రేష్ఠము.” (ప్రసంగి 5:⁠1) పెద్దలు, “పిల్లలు” సమావేశమవాలని మోషే ఇశ్రాయేలీయులకు ఉపదేశించాడు. ఆయనిలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు . . . వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని, . . . మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు.”​—ద్వితీయోపదేశకాండము 31:​12, 13.

12 అదేవిధంగా నేడు, తమ తల్లిదండ్రులతోపాటు కూటాలకు హాజరయ్యే పిల్లలు ప్రాథమికంగా అక్కడ విని, నేర్చుకుంటారు. పిల్లలు ప్రాథమిక బైబిలు సత్యాలకు అవధానమిస్తూ, అర్థం చేసుకోవడం ఆరంభించిన వెంటనే, వారు కూడా చిన్నచిన్న వ్యాఖ్యానాలతో తమ విశ్వాసాన్ని ‘నోటితో ఒప్పుకోవచ్చు.’ (రోమీయులు 10:​10) చిన్నపిల్లవాడు తాను అర్థం చేసుకున్న ప్రశ్నకు చిన్న చిన్న మాటలతో జవాబివ్వడం ఆరంభించవచ్చు. మొదట్లో, ఆ పిల్లవాడు జవాబును చదివినా, కొన్నాళ్ల తర్వాత దానిని తన సొంతమాటల్లో చెప్పేందుకు అతను ప్రయత్నించవచ్చు. పిల్లవానికి అది ప్రయోజనకరంగా, ఆసక్తికరంగా ఉంటుంది, అలా సహజంగా తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం ప్రేక్షకుల్లోవున్న పెద్దవారిని కూడా ఆనందింపజేస్తుంది. సహజంగానే తల్లిదండ్రులు స్వయంగా వ్యాఖ్యానాలు ఇవ్వడం ద్వారా వారికి మాదిరిని ఉంచుతారు. సాధ్యమైనప్పుడు పిల్లలకు వారి సొంత బైబిలు, పాటల పుస్తకం, అధ్యయనం చేస్తున్న ప్రచురణ ఉండడం మంచిది. అలాంటి సాహిత్యాలపట్ల సరైన గౌరవం చూపించడాన్ని వారు నేర్చుకోవాలి. ఇవన్నీ మన కూటాలు పవిత్ర సమావేశాలనే విషయాన్ని పిల్లల మనసులపై ముద్ర వేస్తాయి.

13 మన కూటాలు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల కార్యక్రమాల్లా ఉండాలని మనం కోరుకోం. ఆ కార్యక్రమాలు ఉదాసీనంగా, అతి పవిత్రతను ప్రదర్శించేవిగా లేక రాక్‌ సంగీత కచేరీల్లా గోలగోలగా ఉండవచ్చు. మన రాజ్యమందిరంలోని కూటాలు స్నేహపూర్వకమైనవిగా, ఆహ్లాదకరమైనవిగా ఉండాలని కోరుకుంటాం, అంతేగానీ సోషల్‌ క్లబ్‌లా ఉండాలని కోరుకోం. మనం యెహోవాను ఆరాధించేందుకు సమావేశమవుతాం కాబట్టి, మన కూటాలు ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉండాలి. మన కూటాలకు మొదటిసారి హాజరైనవారు, అక్కడ అందించబడిన సమాచారం విని, మన పిల్లల ప్రవర్తనను గమనించిన తర్వాత, “దేవుడు నిజముగా మీలో ఉన్నాడని” చెప్పాలని మనం కోరుకుంటాం.​—⁠1 కొరింథీయులు 14:​25.

మన ఆరాధనకు సంబంధించిన శాశ్వత అంశం

14 ముందు పేర్కొనబడినట్లుగా, యెహోవా తన ప్రజలను సమకూరుస్తూ, తన ఆధ్యాత్మిక ఆలయమైన “ప్రార్థనా మందిరములో” వారిని ఆనందింపజేస్తున్నాడు. (యెషయా 56:⁠7) భౌతికంగా మద్దతివ్వడం ద్వారా అక్షరార్థ ఆలయంపట్ల సరైన గౌరవం చూపించాలని నమ్మకస్థుడైన నెహెమ్యా తోటి యూదులకు గుర్తుచేశాడు. ఆయనిలా అన్నాడు: ‘మన దేవుని మందిరమును మనము విడిచిపెట్టకూడదు.’ (నెహెమ్యా 10:​39) అంతేకాక, తన “ప్రార్థనా మందిరములో” తనను ఆరాధించమనే యెహోవా ఆహ్వానాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు.

15 కలిసి ఆరాధించేందుకు క్రమంగా కూడుకోవాల్సిన అవసరతను వివరిస్తూ, యెషయా ఇలా ప్రవచించాడు: “ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 66:​23) నేడది జరుగుతోంది. సమర్పిత క్రైస్తవులు క్రమంగా నెలలో ప్రతీవారం యెహోవాను ఆరాధించేందుకు కలుసుకుంటారు. ఇతర కార్యకలాపాలతోపాటు వారు క్రైస్తవ కూటాలకు హాజరవుతూ, బహిరంగ పరిచర్యలో పాల్గొంటూ ఆయనను ఆరాధిస్తున్నారు. ‘యెహోవా సన్నిధిని మ్రొక్కేందుకు’ క్రమంగా వచ్చేవారిలో మీరూ ఉన్నారా?

16యెషయా 66:⁠23 యెహోవా వాగ్దానం చేసిన నూతనలోకంలోని జీవితానికి పూర్తిగా అన్వయిస్తుంది. ఆ కాలంలో “సమస్త శరీరులు” అక్షరార్థంగా ప్రతీవారం, ప్రతీనెల యెహోవా ‘సన్నిధిని మ్రొక్కేందుకు’ లేదా యుగయుగములు ఆయనను ఆరాధించేందుకు వస్తారు. నూతన విధానంలోని మన ఆధ్యాత్మిక జీవితాల్లో యెహోవాను ఆరాధించడం శాశ్వత అంశంగా ఉంటుంది కాబట్టి, పవిత్ర సమావేశాలకు క్రమంగా హాజరవడాన్ని ఇప్పుడే మన జీవితాల్లో శాశ్వత అంశంగా చేసుకోవద్దా?

17 అంతం సమీపిస్తున్నకొద్దీ, ఆరాధనా కోసం ఏర్పాటు చేయబడే మన క్రైస్తవ కూటాలకు హాజరవాలని మనం మరింత దృఢనిశ్చయంతో ఉండాలి. మన కూటాల పవిత్రతపట్ల మనకున్న గౌరవాన్నిబట్టి మనం ఉద్యోగం, హోమ్‌వర్క్‌ లేదా సాయంకాలం ట్యూషన్‌ మన తోటి విశ్వాసులతో క్రమంగా కూడుకోవడానికి అడ్డురానివ్వం. సహవాసంవల్ల లభించే బలం మనకు అవసరం. మన సంఘకూటాలు ఒకరినొకరం తెలుసుకునేందుకు, ప్రోత్సహించుకునేందుకు, ‘ప్రేమచూపుటకు సత్కార్యములు చేయుటకు’ పరస్పరం పురికొల్పుకునేందుకు మనకు అవకాశమిస్తాయి. “ఆ దినము సమీపించుట [మనం] చూచిన కొలది మరి యెక్కువగా” అలా చేస్తుండాలి. (హెబ్రీయులు 10:⁠24, 25) కాబట్టి మనం కూటాలకు క్రమంగా హాజరవుతూ, సరైన వస్త్రధారణతో, యోగ్యమైన ప్రవర్తనతో మెలుగుతూ మన పవిత్ర సమావేశాలపట్ల ఎల్లప్పుడూ సరైన గౌరవం చూపిద్దాం. అలా చేయడం ద్వారా, పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే మనకూ ఉందని చూపిస్తాం.

పునఃసమీక్ష

యెహోవా ప్రజల సమావేశాలను పవిత్రంగా పరిగణించాలని ఏది చూపిస్తోంది?

మన కూటాల్లో ఏ అంశాలు అవి పవిత్ర సమావేశాలని నిరూపిస్తున్నాయి?

కూటాల పవిత్రతను గౌరవిస్తున్నారని పిల్లలు ఎలా చూపించవచ్చు?

కూటాలకు క్రమంగా హాజరవడాన్ని మన జీవితంలో శాశ్వతమైన అంశంగా ఎందుకు చేసుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. మన కూటాలపట్ల సరైన గౌరవాన్ని ప్రదర్శించేందుకు మనకు ఏ లేఖనాధార కారణాలున్నాయి?

2. యెహోవా తన ఆరాధన కోసం ఎంచుకున్న స్థలాన్ని పవిత్రంగా పరిగణించాడని ఏది సూచిస్తోంది, తానుకూడా అలాగే పరిగణిస్తున్నాడని యేసు ఎలా చూపించాడు?

3. ఇశ్రాయేలీయుల సమావేశాలు పవిత్రమైనవిగా పరిగణించబడేవని ఏది ఉదాహరిస్తోంది?

4, 5. మన కూటాలకు సంబంధించిన ఏ అంశాలు అవి పవిత్ర సమావేశాలని రుజువు చేస్తున్నాయి?

6. మన కూటాల స్థలాలు పెద్దవైనా, చిన్నవైనా వాటి గురించి ఏమి చెప్పవచ్చు?

7. మన సమావేశాలపట్ల ఏ స్పష్టమైన రీతిలో మనం గౌరవం చూపించవచ్చు?

8. కూటాల్లో చేయబడే ప్రార్థనలకు మనం గౌరవప్రదమైన అవధానమివ్వాలని బైబిల్లోని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

9. మన వస్త్రధారణ, ప్రవర్తన ద్వారా పవిత్రమైన సమావేశాలపట్ల మనమెలా గౌరవాన్ని చూపించవచ్చు?

10. క్రైస్తవ కూటాల్లో ప్రవర్తన విషయంలో ఉన్నత ప్రమాణాన్ని అనుసరించాలని అపొస్తలుడైన పౌలు ఎలా వివరించాడు?

11, 12. (ఎ) మన కూటాలకు హాజరయ్యే పిల్లల మనసులపై ఏ విషయం ముద్రించబడాలి? (బి) మన కూటాల్లో పిల్లలు ఏ సముచితమైన రీతిలో తమ విశ్వాసాన్ని వ్యక్తపర్చవచ్చు?

13. మన కూటాలకు మొదటిసారి హాజరైనవారు ఏమి చెప్పాలని మనం కోరుకుంటాం?

14, 15. (ఎ) మనమెలా ‘మన దేవుని మందిరమును విడిచిపెట్టకుండా’ ఉండవచ్చు? (బి) యెషయా 66:⁠23 ఇప్పటికే ఎలా నెరవేరుతోంది?

16. పవిత్ర సమావేశాలకు క్రమంగా హాజరవడాన్ని ఇప్పుడే మన జీవితాల్లో శాశ్వత అంశంగా ఎందుకు చేసుకోవాలి?

17. “ఆ దినము సమీపించుట [మనం] చూచిన కొలది మరి యెక్కువగా” మనకెందుకు మన కూటాలు అవసరం?

[28వ పేజీలోని చిత్రాలు]

యెహోవాను ఆరాధించేందుకు ఏర్పాటు చేయబడే కూటాలు ఎక్కడ జరిగినా అవి పవిత్ర సమావేశాలుగానే పరిగణించబడతాయి

[31వ పేజీలోని చిత్రం]

మన పిల్లలు విని నేర్చుకునేందుకు కూటాలకు హాజరవుతారు