కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కూటాల్లో వ్యాఖ్యానించడాన్ని మీ పిల్లలకు బోధించండి

కూటాల్లో వ్యాఖ్యానించడాన్ని మీ పిల్లలకు బోధించండి

కూటాల్లో వ్యాఖ్యానించడాన్ని మీ పిల్లలకు బోధించండి

మెక్సికోకు చెందిన పర్లా, తన చిన్నప్పుడు కావలికోట అధ్యయనంలో చిన్న వ్యాఖ్యానాలు సిద్ధపడేందుకు తన తల్లి తనకు సహాయం చేసేదని గుర్తుచేసుకుంటోంది. ఇప్పుడు పర్లాకు ఐదేళ్ల అబ్బాయి ఉన్నాడు. ఆమె ఆ అబ్బాయికి ఎలా సహాయం చేస్తోంది? “మొదటిగా, నేను కావలికోట సిద్ధపడతాను. అలా సిద్ధపడేటప్పుడు మా అబ్బాయి అర్థం చేసుకోగల, తన సొంత మాటల్లో వివరించగల పేరా కోసం నేను చూస్తాను. ఆ తర్వాత దేనినైతే వాడు ఇది ‘నా పేరా’ అంటాడో దానిపై మేము దృష్టినిలుపుతాం. అనుదిన ఉదాహరణలను ఉపయోగిస్తూ దానిని వివరించమని నేను అడుగుతాను. ఆ తర్వాత మేము ఆ వ్యాఖ్యానాన్ని అనేకసార్లు అభ్యసిస్తాం. తను వ్యాఖ్యానిస్తున్నప్పుడు మైక్రోఫోనును ఎలా పట్టుకోవాలో తెలుసుకోవాలని ఆ సైజులో ఉండే వస్తువును మేము అభ్యాసానికి ఉపయోగిస్తాం. వాడు ప్రతీ కూటంలో వ్యాఖ్యానిస్తున్నందుకు లేక చేయి ఎత్తుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అనేకసార్లు మా అబ్బాయి, కూటం ప్రారంభమవకముందు కావలికోట అధ్యయన నిర్వాహకుని దగ్గరకు వెళ్లి తాను ఏ ప్రశ్నకు జవాబివ్వాలనుకుంటున్నాడో చెబుతాడు.”

హిందీ భాషా గుంపులో పెద్దగా సేవచేస్తున్న యెన్స్‌కు రెండు, నాలుగు ఏళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆయన, ఆయన భార్య తమ పిల్లలతో కలిసి కూటాలకు సిద్ధపడుతున్నప్పుడు, యెన్స్‌ తన తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న ఒక పద్ధతిని వారు ఉపయోగిస్తారు. ఆయనిలా చెబుతున్నాడు: “పిల్లలు సమాచారంలోని ఏ భాగాన్ని అర్థం చేసుకోగలరో మేము నిర్ణయిస్తాం. ఆ తర్వాత నిర్దిష్ట విషయం గురించిన సారాంశాన్ని లేక ఆర్టికల్‌ ముఖ్యాంశాలను వారికి వివరించడానికి ప్రయత్నించి కూటాల్లో వారు జవాబివ్వాలని మేము కోరుకుంటున్న ప్రశ్నలను అడుగుతాం. వారిచ్చే అతి సహజమైన జవాబులనుబట్టి మేము చాలాసార్లు ఆశ్చర్యపోయాం. వారు వ్యాఖ్యానించే విధానం వారేమి అర్థం చేసుకున్నారో తెలియజేస్తుంది. దానివల్ల, వారి జవాబులు యెహోవాకు నిజమైన స్తుతిని తీసుకురావడమేకాక, తమ విశ్వాసాన్ని సొంత మాటల్లో వ్యక్తం చేసే అవకాశాన్ని కూడా ఇస్తాయి.”