కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రెస్టఫ్‌ ప్లాన్‌టిన్‌ బైబిలు ముద్రణలో అగ్రగామి

క్రెస్టఫ్‌ ప్లాన్‌టిన్‌ బైబిలు ముద్రణలో అగ్రగామి

క్రెస్టఫ్‌ ప్లాన్‌టిన్‌ బైబిలు ముద్రణలో అగ్రగామి

యోహాన్నస్‌ గుటెన్‌బర్గ్‌ (సుమారు 1397-1468) మూవబుల్‌ (టైప్‌ ఫేసుల్ని సులభంగా మార్చుకొనే విధంగా అమర్చబడిన) ముద్రణా యంత్రంపై ముద్రించబడిన మొదటి బైబిలు విషయంలో ప్రసిద్ధికెక్కాడు. కానీ క్రెస్టఫ్‌ ప్లాన్‌టిన్‌ గురించి చాలామందికి తెలీదు. ముద్రించే పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఆయన 1500లలో పుస్తకాలు, బైబిళ్ళు ప్రపంచవ్యాప్త ప్రజలకు లభ్యమయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

క్రెస్టఫ్‌ ప్లాన్‌టిన్‌ ఫ్రాన్స్‌లోని సెన్‌ ఆవర్టిన్‌లో 1520వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు. ఫ్రాన్స్‌లోకన్నా ప్రజలు మతంపట్ల మరింత విశాల దృక్పథంతో ఉన్న, ఆర్థికంగా స్థిరపడేందుకు మంచి అవకాశాలున్న దేశంలో ఉండాలని కోరుకున్న ప్లాన్‌టిన్‌ బహుశా తన 28వ ఏట పల్లపుదేశాల్లోని ఆన్ట్వర్ప్‌లో స్థిరపడ్డాడు. *

ప్లాన్‌టిన్‌ ప్రారంభంలో పుస్తకాల బైండర్‌గా, తోలు వస్తువుల డిజైనర్‌గా పనిచేశాడు. ఆయన విశేషంగా అలంకరించి నైపుణ్యంతో చేసిన తోలు వస్తువులను సంపన్నులు ఎంతో ఇష్టపడేవారు. అయితే, 1555లో జరిగిన ఒక సంఘటనతో ప్లాన్‌టిన్‌ తన వృత్తిని మార్చుకోవాల్సి వచ్చింది. సముద్రతీర దేశాల పరిపాలకుడైన స్పెయిన్‌ రాజు ఫిలిప్‌ II కోసం తయారుచేసిన తోలు పెట్టెను ఇవ్వడానికి తీసుకువెళ్తున్నప్పుడు ప్లాన్‌టిన్‌పై ఆన్ట్వర్ప్‌లోని ఒక వీధిలో దాడి జరిగింది. త్రాగిన మత్తులో ఉన్న కొందరు కత్తితో ఆయన భుజంమీద పొడిచారు. ప్లాన్‌టిన్‌ గాయాలనుండి కోలుకున్నా, చేతులతో ఎక్కువగా పనిచేయలేకపోయేవాడు కాబట్టి, ఆయన తన వృత్తిని వదులుకోవాల్సి వచ్చింది. ఎనబాప్టిస్ట్‌ గుంపుకు నాయకుడైన హెన్డ్రెక్‌ నిక్‌లాస్‌ చేసిన ఆర్థిక సహాయంతో ప్లాన్‌టిన్‌ ముద్రించే పనిని ప్రారంభించాడు.

“పని, పట్టుదల”

ప్లాన్‌టిన్‌ తన ముద్రణా కార్యాలయానికి డా కల్డన్‌ పాస్సార్‌ (ద గోల్డెన్‌ కంపాస్‌) అనే పేరుపెట్టాడు. ఆయన బంగారపు వృత్తలేఖిని (కంపాస్‌) బొమ్మతోపాటు, “లేబోర్‌ ఎట్‌ కొన్‌స్టాన్టియా” అంటే “పని, పట్టుదల” అనే వ్యాఖ్యను తన వ్యాపార చిహ్నంగా ఉపయోగించేవాడు. ఆ వ్యాపార చిహ్నం కష్టపడి పనిచేసే ఆయన స్వభావానికి అతికినట్లు ఉండేది.

యూరప్‌లో మతపరంగా, రాజకీయపరంగా ఎంతో అలజడి చెలరేగుతున్న కాలంలో జీవించిన ప్లాన్‌టిన్‌, సమస్యలను కొనితెచ్చుకోవాలనుకోలేదు. ఆయన ముద్రణాపనినే ఎంతో ప్రాముఖ్యమైనదానిగా పరిగణించాడు. ఆయన ప్రొటస్టెంట్‌ సంస్కరణోద్యమ తలంపులతో ఏకీభవించినా “మతం విషయానికొచ్చేసరికి ఆయన అస్పష్ట వైఖరిని అవలంబించాడు” అని రచయిత మారిట్స్‌ సాబ్బే చెప్పాడు. ఆ కారణంగా, ప్లాన్‌టిన్‌ చర్చికి విరుద్ధమైన పుస్తకాలను ప్రచురిస్తున్నాడనే పుకార్లు వ్యాపించాయి. ఉదాహరణకు, ఆయన 1562లో పారిస్‌కు పారిపోయి అక్కడ ఒక సంవత్సరంవరకు ఉండాల్సి వచ్చింది.

ప్లాన్‌టిన్‌ 1563లో ఆన్ట్వర్ప్‌కు తిరిగివచ్చాక, సంపన్నులైన వర్తకులతో భాగస్వామిగా చేరాడు. వారిలో చాలామంది తమ కాల్వినిస్ట్‌ నమ్మకాలకు పేరుగాంచినవారు. ప్లాన్‌టిన్‌ తన ఐదేళ్ళ భాగస్వామ్యంలో, ముద్రణా యంత్రాలపై 260 పుస్తకాలు ముద్రించాడు. వాటిలో హీబ్రూ, గ్రీకు, లాటిన్‌ బైబిళ్ళతోపాటు, రమణీయంగా అలంకరించబడిన డచ్‌ క్యాథలిక్‌ లువాన్‌ బైబిళ్ళు కూడా ఉన్నాయి.

“ముద్రణా కళకు సంబంధించిన అతిగొప్ప కార్యం”

పల్లపు దేశాల్లో స్పానిష్‌ పరిపాలనకు విరుద్ధంగా తిరుగుబాటు పెరుగుతున్న 1567వ సంవత్సరంలో స్పెయిన్‌ రాజైన ఫిలిప్‌ II, ఆల్బా సంస్థానాధిపతిని అక్కడి గవర్నరుగా నియమించాడు. రాజు నుండి సంపూర్ణ అధికారం లభించిన ఆ సంస్థానాధిపతి పెరుగుతున్న ప్రొటస్టెంట్‌ తిరుగుబాటును పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నించాడు. దాంతో, తను చర్చికి విరుద్ధంగా పనిచేస్తున్నానని వ్యాపించిన అపోహలను దూరం చేస్తుందనే ఆశతో ప్లాన్‌టిన్‌ ఒక బృహత్కార్యాన్ని మొదలుపెట్టాడు. విద్వాంసులకు ఉపయోగపడే విధంగా ఆదిమ భాషల్లో ఉన్న బైబిలు మూలపాఠాలుగల ఒక ప్రతిని ముద్రించాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. ఆ కొత్త ప్రతిని ముద్రించడానికి ప్లాన్‌టిన్‌ ఫిలిప్‌ II నుండి మద్దతును సంపాదించగలిగాడు. ఆ రాజు ఆర్థిక మద్దతునిస్తానని వాగ్దానం చేయడమేకాక ప్రఖ్యాత మానవతావాది అయిన ఆర్యాస్‌ మొన్టానోను ఆ పనిని పర్యవేక్షించడానికి పంపించాడు.

మొన్టానోకు భాషా ప్రావీణ్యం ఉంది, ఆయన రోజుకు 11 గంటలు పనిచేసేవాడు. స్పానిష్‌, బెల్జియన్‌, ఫ్రెంచ్‌ భాషా పండితులు ఆ పనిలో ఆయనకు సహాయం చేశారు. ప్రఖ్యాత కాంప్లూటెన్సియన్‌ బహుభాషా బైబిలుకు సంబంధించిన కొత్త వర్షన్‌ను తయారుచేయాలనేదే వారి లక్ష్యం. * ప్లాన్‌టిన్‌ కొత్త బహుభాషా బైబిల్లో లాటిన్‌ వల్గేట్‌, గ్రీకు సెప్టాజింట్‌, ఆదిమ హీబ్రూ మూలపాఠాలతోపాటు అరామిక్‌ టార్గమ్‌, సిరియక్‌ పెషిట్టా, వాటివాటి అక్షరార్థ లాటిన్‌ అనువాదాలు కూడా జతచేయబడ్డాయి.

దాని ముద్రణ 1568లో ప్రారంభమైంది. ఆ గొప్ప కార్యం 1573లో పూర్తైంది. ఆ రోజుల్లో అలాంటి పనికోసం అవసరమయ్యే సమయంతో పోలిస్తే ఇది చాలా తక్కువకాలంలో పూర్తిచేయబడింది. రాజైన ఫిలిప్‌ IIకు మొన్టానో ఉత్తరంలో ఇలా వ్రాశాడు: “రోములో ఒక సంవత్సరంలో జరిగే పనికన్నా ఇక్కడ ఒక్క నెలలో ఎంతో పని జరుగుతోంది.” ప్లాన్‌టిన్‌ ఆ కొత్త బహుభాషా బైబిలుకు సంబంధించిన 1,213 సంచయాలను ముద్రించాడు, వాటిలో ప్రతీ సంచయంలో ఎనిమిది పెద్ద సంపుటులు ఉండేవి. ఆ బైబిలు ముఖపత్రంలో యెషయా 65:⁠25ను చిత్రీకరిస్తూ సింహం, ఎద్దు, తోడేలు, గొర్రెపిల్ల అన్నీ కలిసి ప్రశాంతంగా ఒకే తొట్టి నుండి తింటున్న బొమ్మ ఉంది. విడివిడి సంపుటుల ఒక సంచయపు విలువ 70 గిల్‌డర్లు ఉండేది. అది చాలా పెద్ద మొత్తం, ఎందుకంటే అప్పట్లో ఒక సాధారణ కుటుంబ వార్షిక ఆదాయం దాదాపు 50 గిల్‌డర్లే ఉండేది. కొంతకాలం తర్వాత ఆ పూర్తి సెట్టును ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు అని పిలిచారు. రాజైన ఫిలిప్‌ II ఆ పనికి ఆర్థిక సహాయం చేశాడు కాబట్టి, దాన్ని బిబ్లియా రాగ్యా (రాయల్‌ బైబిల్‌) అని కూడా పిలిచేవారు.

పోప్‌ గ్రెగరీ XIII ఆ బైబిలును ఆమోదించినా, ఆర్యాస్‌ మొన్టానో తన పనికి సంబంధించి తీవ్రంగా విమర్శించబడ్డాడు. దానికొక కారణం ఏమిటంటే, లాటిన్‌ వల్గేట్‌కన్నా ఆదిమ హీబ్రూ మూలపాఠాన్ని మొన్టానో శ్రేష్ఠమైనదని పరిగణించాడు. లాటిన్‌ వల్గేట్‌ మాత్రమే ప్రామాణికమైనదని భావించే స్పానిష్‌ వేదాంతియైన లావోన్‌ డా కాస్ట్రో ఆయనకు ముఖ్య విరోధి అయ్యాడు. బైబిలును త్రిత్వ విరుద్ధ సిద్ధాంతాలతో మొన్టానో కలుషితం చేస్తున్నాడని డి కాస్ట్రో ఆరోపించాడు. ఉదాహరణకు, సిరియక్‌ పెషిట్టాలో 1 యోహాను 5:⁠7లోని “పరలోకంలో . . . తండ్రి వాక్యం పరిశుద్ధాత్మ ఉన్నారు: వీరు ముగ్గురూ ఒకటే” (కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అని తప్పుగా చేర్చబడిన వాక్యం వదిలిపెట్టేశారని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కానీ చర్చి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మొన్టానోమీద ఉన్న అనుమానాలన్నీ తప్పని స్పానిష్‌ ఇన్‌క్విజిషన్‌ (క్రైస్తవ ధర్మ విచారణ సభ) రుజువుచేసింది. ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలును కొందరు “16వ శతాబ్దంలో ఒకే ప్రచురణకర్త సాధించిన ముద్రణా కళకు సంబంధించిన అతిగొప్ప కార్యం”గా పరిగణిస్తారు.

చిరకాల ప్రయోజనాలు చేకూర్చేది

ఆ కాలంలో అనేకమంది ముద్రణకర్తలకు రెండు లేదా మూడు ముద్రణా యంత్రాలు మాత్రమే ఉండేవి. కానీ ప్లాన్‌టిన్‌ వృత్తి మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నప్పుడు ఆయన దగ్గర కనీసం 22 ముద్రణా యంత్రాలు ఉండేవి, 160 మంది పనివారు ఉండేవారు. స్పానిష్‌ భాషా సమాజంలో ఆయనొక ప్రముఖ ముద్రణకర్తగా పేరు సంపాదించుకున్నాడు.

అదే సమయంలో పల్లపుదేశాల్లో స్పానిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అధికమయ్యింది. ఆన్ట్వర్ప్‌ నగరం గొడవల్లో మునిగిపోయింది. జీతం లభించని స్పానిష్‌ సైనికులు 1576లో తిరుగుబాటు చేసి, పట్టణాన్ని దోచుకున్నారు. అక్కడ 600కు పైగా ఇళ్ళు తగులబెట్టబడ్డాయి, వేల సంఖ్యలో ఆన్ట్వర్ప్‌ నివాసులు హతమార్చబడ్డారు. వర్తకులు పట్టణం వదిలి పారిపోయారు. దానివల్ల ప్లాన్‌టిన్‌ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. అంతేగాక, ఆయన సైనికులకు పెద్ద మొత్తంలో కప్పం చెల్లించాల్సి వచ్చేది.

ప్లాన్‌టిన్‌ 1583లో ఆన్ట్వర్ప్‌కు ఉత్తరాన దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైడెన్‌ నగరానికి తరలివెళ్లాడు. అక్కడ ఆయన ముద్రణాలయాన్ని స్థాపించాడు. కాల్వినిస్ట్‌ ప్రొటస్టెంట్‌లు స్థాపించిన లైడెన్‌ విశ్వవిద్యాలయానికి ఆయన ముద్రణకర్తగా నియమించబడ్డాడు. ఆయన క్యాథలిక్‌ చర్చీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే పాత ఆరోపణలు తలెత్తాయి. ఆ కారణంగా ప్లాన్‌టిన్‌ 1585వ సంవత్సరపు చివరి భాగంలో, స్పానిష్‌ పరిపాలన పునఃస్థాపించబడిన కొంతకాలం తర్వాత తిరిగి ఆన్ట్వర్ప్‌ చేరుకున్నాడు. ఆ సమయానికి ఆయన తన 60వ పడిలో ఉన్నాడు. ఆయన ముద్రణాలయం కేవలం ఒక్క యంత్రం, నాలుగు ఉద్యోగస్థులు ఉండే స్థాయికి పడిపోయింది. ప్లాన్‌టిన్‌ ఆ ముద్రణాలయాన్ని తిరిగి నిర్మించడం ప్రారంభించాడు. కానీ అది ఎన్నడూ మునుపటి స్థాయికి చేరుకోలేదు. ప్లాన్‌టిన్‌ 1589 జూలై 1న మరణించాడు.

క్రెస్టఫ్‌ ప్లాన్‌టిన్‌ 34 సంవత్సరాల కాలంలో మొత్తం 1,863 పుస్తకాల ఎడిషన్‌లను, అంటే ఏడాదికి దాదాపు 55 ఎడిషన్‌ల చొప్పున ముద్రించాడు. నేడు సహితం, ఒకే ప్రచురణకర్త అన్ని పుస్తకాలు ముద్రించడం బృహత్కార్యమే అవుతుంది! ప్లాన్‌టిన్‌ స్వయంగా ఒక మతాన్ని అవలంబించకపోయినా, ఆయన పని ముద్రణ, ముద్రణా కళనేకాక, ప్రేరేపిత లేఖనాల అధ్యయనాన్ని కూడా పురికొల్పింది. (2 తిమోతి 3:​16) నిజానికి, సామాన్యులకు బైబిలు అందుబాటులో ఉండేలా చేయడంలో ప్లాన్‌టిన్‌, ఆయన సమకాలీనులు ఎంతో తోడ్పడ్డారు.

[అధస్సూచీలు]

^ పేరా 3 “పల్లపుదేశాలు” అనే పదబంధం జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య ఉండే సముద్ర తీర ప్రాంతాలైన ఆధునిక బెల్జియం, నెదర్లాండ్స్‌, లక్సెంబర్గ్‌లను సూచిస్తుంది.

^ పేరా 11 ఆ బహుభాషా బైబిలు 1517లో ప్రచురించబడింది. దానిలో హెబ్రీ, గ్రీకు, లాటిన్‌ భాషల్లో మూలపాఠం ఉంది, అంతేకాక, కొన్ని భాగాలు అరామిక్‌లో కూడా ఉన్నాయి. కావలికోట, ఏప్రిల్‌ 15, 2004, 28-31 పేజీల్లో ఉన్న “కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు​—⁠చరిత్రాత్మక అనువాదపు ఉపకరణం” అనే ఆర్టికల్‌ను చూడండి.

[15వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్లాన్‌టిన్‌ మోరాటస్‌ మ్యూజియమ్‌

ప్లాన్‌టిన్‌, ఆయన వంశస్థులు నివసించి, ముద్రణకు ఉపయోగించిన ఆన్ట్వర్ప్‌ నగరంలోని భవనం 1877లో ప్రజలు చూసేందుకు వీలుగా మ్యూజియమ్‌గా మార్చబడింది. ఆ కాలానికి చెందిన మరే ఇతర ముద్రణాలయమూ నేటివరకు పదిలంగా లేదు. ఆ మ్యూజియమ్‌లో 17వ, 18వ శతాబ్దాలకు చెందిన ఐదు ముద్రణా యంత్రాలు ప్రదర్శనలో పెట్టారు. దాదాపు ప్లాన్‌టిన్‌ కాలానికి చెందిన, ప్రపంచంలోని అతి ప్రాచీనమైన వేరే రెండు యంత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ మ్యూజియమ్‌లో పోతపోయడానికి వాడే దాదాపు 15,000 మూసలు, అచ్చు ఒత్తడానికి ఉపయోగించే 15,000 కొయ్య అచ్చులు, 3,000 ఇత్తడి ఫలకాలు ఉన్నాయి. ఆ మ్యూజియమ్‌ గ్రంథాలయంలో 9 నుండి 16వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన 638 వ్రాతప్రతులతోపాటు, 1501 సంవత్సరానికి ముందు ప్రచురించబడిన 154 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో 1461 కన్నా ముందు కాలానికి చెందిన ఆదిమ గుటెన్‌బర్గ్‌ బైబిలు, ప్లాన్‌టిన్‌ ప్రచురించిన ప్రఖ్యాత ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు కూడా ఉన్నాయి.

[15వ పేజీలోని చిత్రం]

ఆర్యాస్‌ మొన్టానో

[16వ పేజీలోని చిత్రం]

ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిల్లో హీబ్రూ మూలపాఠం, లాటిన్‌ “వల్గేట్‌”, గ్రీకు “సెప్టాజింట్‌”లతోపాటు సిరియక్‌ “పెషిట్టా,” అరామిక్‌ టార్గమ్‌ వాటివాటి లాటిన్‌ అనువాదాలు కూడా ఉన్నాయి

[చిత్రసౌజన్యం]

By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

రెండు చిత్రాలు: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen