కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రేమలో నిలిచివుండండి!

దేవుని ప్రేమలో నిలిచివుండండి!

దేవుని ప్రేమలో నిలిచివుండండి!

‘ప్రియులారా, నిత్యజీవార్థమైన దేవుని ప్రేమలో నిలిచివుండండి.’​—⁠యూదా 20, 21.

యెహోవా ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, తన అద్వితీయ కుమారుణ్ణి విశ్వసించేవారు నిత్యజీవం పొందగలిగేలా ఆయనను అనుగ్రహించాడు. (యోహాను 3:​16) అలాంటి ప్రేమను అనుభవించడమెంత అద్భుతమో కదా! మీరు యెహోవా సేవకునిగావుంటే, ఆ ప్రేమను నిరంతరం ఆస్వాదించాలని నిశ్చయంగా కోరుకుంటారు.

2 మీరు దేవుని ప్రేమలో నిరంతరమెలా నిలిచివుండవచ్చో శిష్యుడైన యూదా వెల్లడిచేశాడు. “మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి” అని ఆయన వ్రాశాడు. (యూదా 20, 21) దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, సువార్త ప్రకటించడం మీరు ‘విశ్వసించే అతిపరిశుద్ధమైనదానిపై’ అంటే క్రైస్తవ బోధల ద్వారా బలపర్చబడేందుకు మీకు సహాయం చేస్తుంది. దేవుని ప్రేమలో నిలిచివుండేందుకు మీరు “పరిశుద్ధాత్మలో” లేదా దాని ప్రభావంతో ప్రార్థించాలి. నిత్యజీవమనే ఆశీర్వాదం పొందాలంటే మీరు యేసుక్రీస్తు విమోచన క్రయధన బలియందు కూడా విశ్వాసముంచాలి.​—⁠1 యోహాను 4:​10.

3 ఒకప్పుడు విశ్వాసులుగా ఉన్నవారు దేవుని ప్రేమలో నిలిచివుండలేదు. వారు పాపభరిత మార్గాన్ని అనుసరించేందుకు ఎంచుకున్నందున వారిక ఎంతమాత్రం యెహోవాసాక్షులుగా లేరు. మనకలాంటి అనుభవం ఎదురవకుండా ఎలా తప్పించుకోవచ్చు? ఈ క్రింది అంశాలను ధ్యానించడం మీరు పాపానికి దూరంగా ఉండడమేకాక, దేవుని ప్రేమలో నిలిచివుండేందుకు కూడా మీకు సహాయం చేస్తుంది.

దేవునిపట్ల మీ ప్రేమను ప్రదర్శించండి

4 దేవునికి విధేయులవడం ద్వారా ఆయనపట్ల మీ ప్రేమను ప్రదర్శించండి. (మత్తయి 22:​37) “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 5:⁠3) అలవాటుగా దేవునికి విధేయులవడం శోధనను ఎదిరించేలా మిమ్మల్ని బలపర్చడమే కాక, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. కీర్తనకర్త ఇలా అన్నాడు: ‘దుష్టుల ఆలోచన చొప్పున నడువక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు.’​—⁠కీర్తన 1:​1, 2.

5 యెహోవాపట్ల మీకున్న ప్రేమ, ఆయన పేరుకు అవమానం తీసుకొచ్చే ఘోరమైన పాపం చేయకుండా ఉండేందుకు మిమ్మల్ని పురికొల్పుతుంది. “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి​—⁠యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో” అని ఆగూరు ప్రార్థించాడు. (సామెతలు 30:​1, 8, 9) దేవునిపైకి నింద తీసుకురావడం ద్వారా, ‘ఆయన నామాన్ని దూషించకుండా’ ఉండేందుకు నిర్ణయించుకోండి. దేవునిపైకి నింద తీసుకొచ్చే బదులు, ఆయనను మహిమపరిచే నీతికార్యాలు చేసేందుకు ఎల్లప్పుడూ కృషిచేయండి.​—⁠కీర్తన 86:​12.

6 పాపంచేయాలనే శోధనను ఎదిరించేలా సహాయం కోసం ప్రేమగల మీ పరలోకపు తండ్రికి క్రమంగా ప్రార్థించండి. (మత్తయి 6:​13; రోమీయులు 12:​12) మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండేలా దేవుని ఉపదేశాన్ని అనుసరిస్తూ ఉండండి. (1 పేతురు 3:⁠7) మీరు ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే, దాని పర్యవసానాలు విషాదకరంగా ఉంటాయి, ఎందుకంటే తిరుగుబాటుచేసే వ్యక్తుల ప్రార్థనలు తనవద్దకు చేరకుండా యెహోవా అలంకారార్థంగా వాటికి మేఘాన్ని అడ్డుపెడతాడు. (విలాపవాక్యములు 3:​42-44) కాబట్టి, దేవునికి ప్రార్థించలేనంతగా మిమ్మల్ని అడ్డగించే దేనినీ చేయకుండా ఉండేలా దీనమనసు కనబరుస్తూ, ప్రార్థించండి.​—⁠2 కొరింథీయులు 13:⁠7.

దేవుని కుమారునిపట్ల ప్రేమను ప్రదర్శించండి

7 యేసుక్రీస్తు ఆజ్ఞలకు విధేయులవడం ద్వారా ఆయనపట్ల ప్రేమను కనబర్చండి, అలా విధేయులవడం మీరు పాపపు విధానాన్ని విసర్జించేందుకు మీకు సహాయం చేస్తుంది. “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు” అని యేసు చెప్పాడు. (యోహాను 15:​10) యేసు మాటలను అన్వయించుకోవడం దేవుని ప్రేమలో నిలిచివుండేందుకు మీకెలా సహాయం చేయగలదు?

8 యేసు మాటలకు అవధానమివ్వడం నైతిక యథార్థతను కాపాడుకునేందుకు మీకు సహాయం చేయగలదు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “వ్యభిచరింపకూడదు.” (నిర్గమకాండము 20:​14) “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని చెబుతూ ఆ ఆజ్ఞలో ఇమిడివున్న సూత్రాన్ని యేసు వెల్లడించాడు. (మత్తయి 5:​27, 28) మొదటి శతాబ్దపు సంఘంలోని కొందరు ‘వ్యభిచారిణిని చూచి ఆశించుచు, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచూ’ ఉన్నారని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (2 పేతురు 2:​14) అయితే మీరు వారికి భిన్నంగా దేవుణ్ణి, క్రీస్తును ప్రేమిస్తూ వారికి విధేయులై, వారితో మీ సంబంధాన్ని కాపాడుకునేందుకు తీర్మానించుకుంటే లైంగిక పాపాలను విసర్జించవచ్చు.

యెహోవా ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి

9 దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి, ఆ ఆత్మ మిమ్మల్ని నడిపించేందుకు అనుమతించండి. (లూకా 11:​13; గలతీయులు 5:​19-25) మీరు పాపాన్ని కొనసాగిస్తూవుంటే, దేవుడు మీ నుండి తన ఆత్మను వెనక్కి తీసుకుంటాడు. దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత ఆయన దేవుణ్ణిలా యాచించాడు: “నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకుము.” (కీర్తన 51:​11) సౌలు రాజు పశ్చాత్తాపం చూపించని పాపిగావున్న కారణంగా ఆయన దేవుని ఆత్మను కోల్పోయాడు. సౌలు దహనబలి అర్పించడమేకాక, గొర్రెల, పశువుల మందలన్నింటిని, అమాలేకీయుల రాజును హతం చేయకుండా వదిలేసి పాపం చేశాడు. యెహోవా ఆ తర్వాత సౌలునుండి తన ఆత్మను వెనక్కి తీసుకున్నాడు.​—⁠1 సమూయేలు 13:​1-14; 15:1-35; 16:​14-23.

10 పాపాన్ని అభ్యసించాలనే తలంపును తిరస్కరించండి. “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 10:​26-31) అది పాపమని తెలిసీ, ఆ పాపాన్ని కొనసాగిస్తూ ఉండడం ఎంత విచారకరమో కదా!

ఇతరులపట్ల యథార్థ ప్రేమను కనబర్చండి

11 తోటి మానవులపట్ల మీకున్న ప్రేమ, అనుచిత లైంగిక ప్రవర్తనకు పాల్పడకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. (మత్తయి 22:​39) అలాంటి ప్రేమ వేరొకరి వివాహ భాగస్వామి ప్రేమను దోచుకునేందుకు శోధించబడకుండా మీ హృదయాన్ని కాపాడుకునేలా మిమ్మల్ని పురికొల్పుతుంది. అలా శోధించబడడం వ్యభిచారమనే పాపానికి నడిపించగలదు. (సామెతలు 4:​23; యిర్మీయా 4:​14; 17:​9, 10) తన భార్యనుతప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడని యథార్థపరుడైన యోబులా ఉండండి.​—⁠యోబు 31:⁠1.

12 వివాహ పవిత్రతపట్ల మీకున్న గౌరవం ఘోరమైన పాపం చేయకుండా ఉండేందుకు మీకు సహాయం చేయగలదు. గౌరవపూర్వక వివాహాన్ని, లైంగిక సంబంధాలను దేవుడు జీవ పునరుత్పత్తికే ఉద్దేశించాడు. (ఆదికాండము 1:​26-28) లైంగికావయవాలు పవిత్రమైన జీవాన్ని ఉత్పత్తి చేసేందుకే అని గుర్తుంచుకోవాలి. జారులు, వ్యభిచారులు దేవునికి అవిధేయులై, లైంగిక ప్రక్రియను దిగజారుస్తూ, వివాహ పవిత్రతపట్ల గౌరవం లేనివారై తమ సొంత శరీరానికి హానికలిగేలా పాపం చేస్తారు. (1 కొరింథీయులు 6:​18) కానీ దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమతోపాటు దైవిక విధేయతను కనబర్చడం, ఒక వ్యక్తి క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడేందుకు కారణమయ్యేలా ప్రవర్తించకుండా అడ్డుకుంటుంది.

13 మన ప్రియమైనవారిని బాధపెట్టకుండా ఉండేందుకు మనం పాపభరిత ఆలోచనలను అణచివేయాలి. “వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని [‘విలువైనవాటిని,’ NW] పాడుచేయును” అని సామెతలు 29:⁠3 చెబుతోంది. పశ్చాత్తాపపడని వ్యభిచారి దేవునితో తన సంబంధాన్ని పాడుచేసుకొని కుటుంబ సంబంధాల్ని సర్వనాశనం చేస్తాడు. అతని భార్య విడాకులు తీసుకోవచ్చు. (మత్తయి 19:⁠9) తప్పుచేసిన వ్యక్తి భర్తైనా, భార్యైనా వారి వివాహ విచ్ఛిత్తి నిర్దోషియైన భాగస్వామికి, పిల్లలకు తీవ్రవేదన కలిగిస్తుంది. దుర్నీతికర ప్రవర్తన ఎంత నాశనకరమో తెలుసుకోవడం అలాంటి ప్రవర్తనకు పాల్పడాలనే శోధనను ఎదిరించేలా మనల్ని పురికొల్పాలని మీరంగీకరించరా?

14 వ్యభిచారంవల్ల కలిగే నష్టాన్ని పూరించేదేదీ లేదనే వాస్తవం ఘోరమైన ఈ స్వార్థపూరిత చర్యను విసర్జించేందుకు ఒకరిని పురికొల్పాలి. ఆకలితో ఓ దొంగ చేసిన దొంగతనంపట్ల ప్రజలు సానుభూతి చూపించినా, చెడు ఉద్దేశంగల వ్యభిచారిని వారు తృణీకరిస్తారని సామెతలు 6:30-35 వివరిస్తోంది. అతడు “స్వనాశనమును కోరువాడే.” మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతడు మరణశిక్షను అనుభవిస్తాడు. (లేవీయకాండము 20:​10) వ్యభిచరించే వ్యక్తి తన మోహం తీర్చుకునేందుకు ఇతరులకు బాధ కలిగిస్తాడు, పశ్చాత్తాపపడని వ్యభిచారి దేవుని ప్రేమలో నిలిచివుండడు గానీ పరిశుభ్రమైన క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడతాడు.

నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకోండి

15 దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే, పాపం విషయంలో మన మనస్సాక్షి మొద్దుబారేందుకు అనుమతించలేం. ఈ లోకపు దిగజారిన నైతిక ప్రమాణాలను మనం అంగీకరించకుండా ఉండడమేకాక, మన సహవాసులు, చదివే పుస్తకాలు, వినోదం వంటివాటిని ఎంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. పౌలు ఇలా హెచ్చరించాడు: “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదు[రు] . . . ఆ అబద్ధికులు, వాతవేయబడిన మనస్సాక్షిగలవారై [ఉంటారు].” (1 తిమోతి 4:​1-3) “వాతవేయబడిన మనస్సాక్షి,” శరీరం కాలినచోట స్పర్శ కోల్పోయిన గాయపు మచ్చలా ఉంటుంది. మతభ్రష్టులకు, విశ్వాసం నుండి మనల్ని పడేయగల పరిస్థితులకు దూరంగా ఉండాలని అలాంటి మనస్సాక్షి మనల్ని హెచ్చరించడం మానేస్తుంది.

16 మన నిర్మలమైన మనస్సాక్షిమీదే మన రక్షణ ఆధారపడివుంది. (1 పేతురు 3:​21) “జీవముగల దేవుని సేవించుటకు” యేసు చిందించిన రక్తం మీది విశ్వాసం మూలంగా మన మనస్సాక్షి నిర్జీవ క్రియలనుండి శుద్ధిచేయబడింది. (హెబ్రీయులు 9:​13, 14) మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే, మన మనస్సాక్షి అపవిత్రమై, దేవుని సేవకు తగిన పరిశుద్ధ ప్రజలుగా మనమిక ఏ మాత్రం ఉండం. (తీతు 1:​15) కానీ యెహోవా సహాయంతో మనం శుద్ధమైన మనస్సాక్షిని కలిగివుండవచ్చు.

దుష్ప్రవర్తనను విసర్జించేందుకు ఇతర మార్గాలు

17 ప్రాచీన ఇశ్రాయేలీయుడైన కాలేబులాగే ‘పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించండి.’ (ద్వితీయోపదేశకాండము 1:​34-36) దేవుడు మీనుండి కోరుతున్నది చేస్తూ, “దయ్యముల బల్లమీద ఉన్న దానిలో” పాలుపంచుకోవడం గురించి ఎన్నడూ ఆలోచించకండి. (1 కొరింథీయులు 10:​21) మతభ్రష్టతను విసర్జించండి. కేవలం యెహోవా బల్లమీద లభ్యమయ్యే ఆధ్యాత్మిక ఆహారాన్ని కృతజ్ఞతాపూర్వకంగా పుచ్చుకుంటూవుంటే, అబద్ధ బోధకులచేత లేక దురాత్మల సమూహములచేత మీరెన్నటికీ మోసగించబడరు. (ఎఫెసీయులు 6:​12; యూదా 3, 4) బైబిలు అధ్యయనం, కూటాలకు హాజరవడం, క్షేత్ర పరిచర్యవంటి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరించండి. మీరు యెహోవాను పూర్ణమనస్సుతో అనుసరిస్తూ ప్రభువు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులైవుంటే తప్పకుండా సంతోషంగా ఉంటారు.​—⁠1 కొరింథీయులు 15:​58.

18 ‘భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేసేందుకు’ తీర్మానించుకోండి. (హెబ్రీయులు 12:​28) యెహోవాపట్ల మీకున్న పూజ్యభయం ఏ విధమైన తప్పునైనా నిరాకరించేందుకు మిమ్మల్ని పురికొల్పుతుంది. తోటి అభిషిక్తులకు పేతురు ఇచ్చిన ఈ ఉపదేశానికి అనుగుణంగా ప్రవర్తించేందుకు అది మీకు సహాయం చేస్తుంది: “పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.”​—⁠1 పేతురు 1:​17.

19 దేవుని వాక్యంనుండి మీరు నేర్చుకుంటున్న విషయాల్ని ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టండి. ఇలా చేసినప్పుడు మీరు “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియు[న్న]” వారని నిరూపించుకుంటారు కాబట్టి, ఘోరమైన పాపం చేయకుండా ఉండేందుకు అది మీకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 5:​14) మాటలో, ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉండే బదులు, ఈ చెడు దినాల్లో “సమయమును సద్వినియోగము” చేసుకునే జ్ఞానిగా నడుచుకునేందుకు జాగ్రత్తపడండి. “ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొని” దానిని చేస్తూనే ఉండండి.​—⁠ఎఫెసీయులు 5:​15-17; 2 పేతురు 3:​17.

20 ఇతరులవి పొందాలనుకొనే దురాశను పూర్తిగా విసర్జించండి. పది ఆజ్ఞల్లో ఒకటి ఇలా చెబుతోంది: “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.” (నిర్గమకాండము 20:​17) ఈ నియమం ఒక వ్యక్తి ఇంటిని, భార్యను, సేవకులను, పశువులను కాపాడింది. అయితే యేసు చెప్పిన అత్యంత ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, దురాశ లేదా లోభత్వం ఒక వ్యక్తిని అపవిత్రుణ్ణి చేస్తుంది.​—⁠మార్కు 7:​20-23.

21 దురాశ పాపానికి దారి తీయకుండా తగిన నివారణా చర్యలు తీసుకోండి. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకోబు 1:​14, 15) ఉదాహరణకు, ఒక వ్యక్తికి గతంలో త్రాగే అలవాటువుంటే, తన ఇంట్లో మద్యపానీయాలు ఉంచుకోకూడదని నిర్ణయించుకోవచ్చు. భిన్నలింగ వ్యక్తిపట్ల ఆకర్షించబడే శోధనకు దూరంగా ఉండేందుకు, ఒక క్రైస్తవుడు తనపని స్థలాన్ని లేదా ఉద్యోగాన్ని మార్చుకోవలసి ఉంటుంది.​—⁠సామెతలు 6:​23-28.

22 పాపంవైపు ఒక్క అడుగు కూడా వేయకండి. సరసాలు, దుర్నీతికర ఆలోచనలు జారత్వానికి లేదా వ్యభిచారానికి దారితీయవచ్చు. చిన్నచిన్న అబద్ధాలు చెప్పడం పెద్ద అబద్ధాలు చెప్పే ధైర్యమిచ్చి, అబద్ధాలుచెప్పే పాపపు అలవాటుకు దారితీయవచ్చు. చిన్నచిన్న దొంగతనాలు చేయడంవల్ల ఒక వ్యక్తి మనస్సాక్షి మొద్దుబారి అతడు పెద్ద దొంగతనాలు చేయడం ఆరంభించవచ్చు. భ్రష్టత్వాన్ని కాస్తయినా మన్నించడం ఒక వ్యక్తిని పూర్తిస్థాయి భ్రష్టత్వపు మార్గం పట్టించవచ్చు.​—⁠సామెతలు 11:⁠9; ప్రకటన 21:⁠8.

మీరొకవేళ పాపం చేస్తే?

23 మానవులందరూ అపరిపూర్ణులే. (ప్రసంగి 7:​20) కానీ మీరు ఘోరమైన పాపం చేసినప్పుడు, యెహోవా ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను చేసిన ప్రార్థననుండి మీరు ఓదార్పు పొందవచ్చు. సొలొమోను దేవునికి ఇలా ప్రార్థించాడు: “ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి . . . వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగినవాడవు.”​—⁠2 దినవృత్తాంతములు 6:​29-31.

24 అవును, దేవునికి మన హృదయం తెలుసు, ఆయన క్షమిస్తాడు. సామెతలు 28:⁠13 ఇలా చెబుతోంది: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని, దానిని విడిచిపెట్టడం ద్వారా ఒక వ్యక్తి దేవుని కనికరాన్ని పొందవచ్చు. అయితే మీరు ఆధ్యాత్మికంగా బలహీన స్థితిలో ఉన్నట్లయితే, దేవుని ప్రేమలో నిలిచివుండేలా మరింకేది కూడా మీకు సహాయం చేయగలదు?

మీరెలా జవాబిస్తారు?

• దేవుని ప్రేమలో మనమెలా నిలిచివుండవచ్చు?

• దేవునిపట్ల, క్రీస్తుపట్ల ఉన్న ప్రేమ పాపపు మార్గాన్ని తిరస్కరించేలా మనకెలా సహాయం చేస్తుంది?

• ఇతరులపట్ల యథార్థమైన ప్రేమ లైంగిక దుష్ర్పవర్తనకు పాల్పడకుండా మనల్ని ఎందుకు అడ్డగిస్తుంది?

• తప్పుడు ప్రవర్తనను విసర్జించేందుకు కొన్ని మార్గాలు ఏవి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మీరు దేవుని ప్రేమలో ఎలా నిలిచివుండవచ్చు?

3. కొందరెందుకు ఇక యెహోవాసాక్షులుగా లేరు?

4. దేవునిపట్ల విధేయత ఎంత ప్రాముఖ్యం?

5. యెహోవాపట్ల మీకున్న ప్రేమ మీరేమి చేసేందుకు మిమ్మల్ని పురికొల్పుతుంది?

6. మీరు ఉద్దేశపూర్వకంగా పాపంచేస్తే ఏమి జరిగే అవకాశముంది?

7, 8. యేసు ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం పాపాన్ని విసర్జించేందుకు ఒక వ్యక్తికి ఎలా సహాయం చేయగలదు?

9. ఒక వ్యక్తి పాపాన్ని కొనసాగిస్తూవుంటే పరిశుద్ధాత్మ విషయంలో ఏమి జరిగే అవకాశముంది?

10. పాపాన్ని అభ్యసించాలనే తలంపును ఎందుకు తిరస్కరించాలి?

11, 12. ప్రేమ, గౌరవం ఒక వ్యక్తిని లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడకుండా ఏయే విధాలుగా అడ్డుకుంటాయి?

13. దుర్నీతిపరుడు ఏ విధంగా ‘విలువైనవాటిని’ నాశనం చేస్తాడు?

14. తప్పుచేయడానికి సంబంధించి, సామెతలు 6:30-35 నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

15. “వాతవేయబడిన మనస్సాక్షి” పరిస్థితి ఎలావుంటుంది?

16. శుద్ధమైన మనస్సాక్షిని కలిగివుండడం ఎందుకంత ప్రాముఖ్యం?

17. ‘యెహోవాను పూర్ణమనస్సుతో అనుసరించడం’ ఎందుకు ప్రయోజనకరం?

18. యెహోవాపట్ల మీకున్న భయం మీ ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది?

19. దేవుని వాక్యంనుండి మీరు నేర్చుకుంటున్న విషయాల్ని మీరెందుకు ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టాలి?

20. దురాశను మనమెందుకు విసర్జించాలి?

21, 22. పాపం చేయకుండా ఉండేందుకు ఒక క్రైస్తవుడు ఎలా నివారణా చర్యలు తీసుకోవచ్చు?

23, 24. రెండవ దినవృత్తాంతములు 6:​29, 30 మరియు సామెతలు 28:⁠13 నుండి ఎలాంటి ఆదరణను పొందవచ్చు?

[21వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రేమలో ఎలా నిలిచివుండాలో యూదా మనకు చూపిస్తున్నాడు

[23వ పేజీలోని చిత్రం]

వివాహ విచ్ఛిత్తి నిర్దోషియైన భాగస్వామికి, పిల్లలకు తీవ్రవేదన కలిగిస్తుంది

[24వ పేజీలోని చిత్రం]

కాలేబులాగే మీరు కూడా ‘పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించేందుకు’ తీర్మానించుకున్నారా?

[25వ పేజీలోని చిత్రం]

శోధనను ఎదిరించేందుకు సహాయం కోసం క్రమంగా ప్రార్థించండి