కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరమగీతము పుస్తకంలోని ముఖ్యాంశాలు

పరమగీతము పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

పరమగీతము పుస్తకంలోని ముఖ్యాంశాలు

“బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.” “అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.” “సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై[న] . . . ఈమె ఎవరు?” (పరమగీతము 2:​2, 3; 6:​10) బైబిలు పుస్తకమైన పరమగీతములోని ఈ వచనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా! ఈ పుస్తకంలోని కావ్యగీతమంతా ఎంతో భావగర్భితంగా, రసరమ్యంగా ఉంది కాబట్టే, అది “పరమగీతము” అని పిలువబడింది.​—⁠పరమగీతము 1:⁠1.

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను తన 40 ఏళ్ళ పాలనలోని తొలిభాగంలో అంటే దాదాపు సా.శ.పూ. 1020లో కూర్చిన ఈ కావ్యగీతం, గొఱ్ఱెలు కాసుకునే అబ్బాయికి, పల్లెపడుచు అయిన షూలమ్మీతీకి సంబంధించిన ప్రణయ గాధ. ఈ కావ్యగీతంలో ప్రస్తావించబడిన ఇతరుల్లో ఆ పడుచు యొక్క తల్లి, సహోదరులు, “యెరూషలేము కుమార్తెలు [రాజపరివారంలోని స్త్రీలు],” “సీయోను కుమార్తెలు [యెరూషలేము స్త్రీలు]” ఉన్నారు. (పరమగీతము 1:⁠5; 3:​11) పరమగీతములోని వక్తలందరినీ గుర్తించడం బైబిలు పాఠకులకు కష్టమే, అయితే వారు ఏమి చెబుతున్నారు, వారికి ఏమి చెప్పబడుతోంది అనేవి పరిశీలించడం ద్వారా వారిని గుర్తించడం సాధ్యమవుతుంది.

దేవుని వాక్యంలో భాగంగా, పరమగీతములోని సందేశం రెండు కారణాలనుబట్టి గొప్ప విలువను కలిగివుంది. (హెబ్రీయులు 4:​12) మొదటిగా, ఒక పురుషునికి స్త్రీకి మధ్య ఉండే నిజమైన ప్రేమ అంటే ఏమిటో అది మనకు బోధిస్తుంది. రెండవదిగా, అది యేసుక్రీస్తుకు అభిషిక్త క్రైస్తవుల సంఘానికి మధ్యవున్న ప్రేమను సోదాహరణంగా తెలియజేస్తుంది.​—⁠2 కొరింథీయులు 11:⁠2; ఎఫెసీయులు 5:​25-31.

నాలో ‘ప్రేమను లేపడానికి’ ప్రయత్నించకండి

(పరమగీతము 1:1-3:⁠5)

“నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.” (పరమగీతము 1:⁠2) పరమగీతములోని సంభాషణ, సొలొమోను రాజు గుడారంలోకి తీసుకురాబడిన సామాన్యురాలైన పల్లెపడుచు పలికిన ఈ మాటలతో ప్రారంభమవుతుంది. ఆమె అక్కడికెలా వచ్చింది?

“నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి” అని ఆమె చెబుతోంది. ఆమె ప్రేమిస్తున్న గొఱ్ఱెలకాపరి వసంత రుతువులోని ఒక మనోహరమైన రోజున తనతో వాహ్యాళికి రమ్మని ఆమెను పిలిచినందుకు ఆమె సహోదరులకు ఆమె మీద కోపం వచ్చింది. ఆమెను వెళ్ళకుండా ఆపడానికి వారు, “ద్రాక్షతోటలను చెరుపు నక్కలను” పట్టుకునే పనిని ఆమెకు అప్పగించారు. ఈ పనివల్ల ఆమె సొలొమోను గుడారానికి దగ్గరగా వెళ్ళవలసి వస్తుంది. ఆమె “లోయలోని చెట్ల” దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అందాన్ని గమనించినవారు ఆమెను గుడారంలోకి తీసుకువస్తారు.​—⁠పరమగీతము 1:⁠6; 2:​10-15; 6:​11.

ఈ పడుచు తన ప్రియమైన గొఱ్ఱెలకాపరిపట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తుండగా, రాజపరివారపు స్త్రీలు ఆమెతో “మందల యడుగుజాడలనుబట్టి” పోయి, ఆయన కోసం చూడమని చెబుతారు. కానీ సొలొమోను ఆమె వెళ్ళడానికి అనుమతించడు. ఆమె అందంపట్ల తన ప్రశంసను వ్యక్తంచేస్తూ ఆయన, ఆమెకు “వెండి పువ్వులుగల బంగారు సరములు” చేయిస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే ఆ అమ్మాయి దానికేమీ సంతోషించదు. గొఱ్ఱెలకాపరి సొలొమోను గుడారంలోకి వచ్చి ఆమెను చూసి, “నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి” అని అంటాడు. ఆ పడుచు రాజపరివారపు స్త్రీలతో ఇలా ప్రమాణం చేయించుకుంది: “[నాలో] ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.”​—⁠పరమగీతము 1:​8-11, 15; 2:​7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; 3:⁠5.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​2, 3​—⁠గొఱ్ఱెలకాపరి ప్రేమగా పలికిన మాటలను గుర్తు తెచ్చుకోవడం ద్రాక్షారసములా, ఆయన పేరు పరిమళతైలములా ఎందుకున్నాయి? ద్రాక్షారసము ఒకరి హృదయాన్ని సంతోషపరచినట్లు, తలపై తైలము పోయబడడం ఉపశమనం కలిగించినట్లు, ఆ అబ్బాయి ప్రేమను గుర్తు తెచ్చుకోవడం, ఆయన పేరు ఆ కన్యకను బలపర్చి, ఆమెకు ఓదార్పునిచ్చాయి. (కీర్తన 23:⁠5; 104:​15) అలాగే నిజ క్రైస్తవులు, ప్రాముఖ్యంగా అభిషిక్తులు యేసుక్రీస్తు తమపట్ల చూపించిన ప్రేమ గురించి ఆలోచించడం ద్వారా బలాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతారు.

1:5​—⁠ఆ పల్లెపడుచు తన నలుపును “కేదారువారి గుడారముల”తో ఎందుకు పోల్చుకుంది? మేక వెండ్రుకలతో చేయబడిన బట్టలు ఎన్నో విధాలుగా ఉపయోగపడేవి. (సంఖ్యాకాండము 31:​20) ఉదాహరణకు, ‘మేకవెండ్రుకలతో చేయబడిన తెరలు,’ “మందిరముపైని గుడారముగా” వేయడానికి ఉపయోగించబడ్డాయి. (నిర్గమకాండము 26:⁠7) నేటికీ ఎడారివాసుల గుడారాలు అలాగే చేయబడుతున్నాయి, కేదారువారి గుడారాలు కూడా బహుశా నల్లని మేకవెండ్రుకలతో చేయబడి ఉండవచ్చు.

1:15​—⁠“నీ కన్నులు గువ్వ కండ్లు” అన్నప్పుడు గొఱ్ఱెలకాపరి ఉద్దేశమేమిటి? తన సహచరి కండ్లు గువ్వ కండ్లంత మృదువుగా, సున్నితంగా ఉన్నాయని అంటున్నాడు.

2:⁠7; 3:5​—⁠ఆ కన్యక రాజపరివారపు స్త్రీలచేత, “పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు” ఎందుకు ప్రమాణం చేయించుకుంది? ఇఱ్ఱులు, లేళ్లు తమ సొగసుకు, అందానికి పేరుపొందాయి. ఒక విధంగా, కన్యకయైన షూలమ్మీతీ తనలో ప్రేమను రేకెత్తించడానికి ప్రయత్నించవద్దని సొగసైన, అందమైన ప్రతిదాన్నిబట్టి రాజపరివారపు స్త్రీలచేత ప్రమాణం చేయించుకుంటోంది.

మనకు పాఠాలు:

1:⁠2; 2:⁠6. కోర్ట్‌షిప్‌ సమయంలో ఒకరిపట్ల ఒకరు స్వచ్ఛమైన రీతిలో తమ ప్రేమను వ్యక్తం చేయడం సముచితంగా ఉండవచ్చు. అలా ప్రేమను వ్యక్తంచేయడం నిజమైన ప్రేమతో జరగాలే గానీ అపరిశుభ్రమైన మోహంతో కాదు, ఎందుకంటే అది లైంగిక దుర్నీతికి పాల్పడేలా చేయవచ్చు.​—⁠గలతీయులు 5:​19.

1:⁠6; 2:​10-15. షూలమ్మీతీ సహోదరులు తమ సహోదరి తన ప్రియునితో కలిసి ఏకాంతంగా ఉండే పర్వత ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతించలేదు, దానికి కారణం ఆమె నైతికత లేనిదని కాదు, లేక ఆమెకు చెడు ఉద్దేశాలున్నాయని కాదు. బదులుగా, శోధనకు దారితీయగల పరిస్థితిలో ఆమె చిక్కుకోకూడదని వారు ఆ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. కోర్టింగ్‌ చేస్తున్న జంటలకు పాఠమేమిటంటే, వాళ్ళు ఏకాంతంగా ఉండే స్థలాలకు వెళ్ళకూడదు.

2:​1-3, 8, 9. కన్యకయైన షూలమ్మీతీ అందమైనదే అయినా, ఆమె తనను తాను “షారోను పొలములో పూయు [సాధారణ] పుష్పము”గా దృష్టించుకుంది. ఆమె అందం, యెహోవాపట్ల ఆమెకున్న విశ్వసనీయత కారణంగా గొఱ్ఱెలకాపరి ఆమెను “బలురక్కసి చెట్లలో వల్లిపద్మము” వంటిదని భావించాడు. ఆయన గురించి ఏమి చెప్పవచ్చు? ఆయన సుందరుడు కాబట్టి, ఆయన ఆమెకు “ఇఱ్ఱి” వలే కనిపించాడు. ఆయన యెహోవాపట్ల దైవభయం, దైవభక్తిగల ఆధ్యాత్మిక వ్యక్తి అయ్యుండవచ్చు. “అడవి వృక్షములలో [నీడను, ఫలాలను ఇచ్చే] జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు” అని ఆమె చెబుతోంది. వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిలో విశ్వాసం, దైవభక్తి ఉండడం కోరదగిన లక్షణాలు కావా?

2:⁠7; 3:⁠5. పల్లెపడుచుకు సొలొమోనుపట్ల ఏ మాత్రం ప్రణయాకర్షణ కలుగలేదు. గొఱ్ఱెలకాపరిపట్ల తప్ప మరెవరిపట్లా తనలో ప్రేమను రేకెత్తించవద్దని ఆమె రాజపరివారపు స్త్రీలతో ప్రమాణము చేయించుకుంది. ఎవరంటే వారిపట్ల ప్రణయభావాన్ని ఏర్పరచుకోవడం సాధ్యం కాదు, అది సముచితమూ కాదు. వివాహం చేసుకోవాలనుకుంటున్న అవివాహిత క్రైస్తవులు నమ్మకమైన యెహోవా సేవకులను వివాహం చేసుకోవడం గురించి మాత్రమే ఆలోచించాలి.​—⁠1 కొరింథీయులు 7:​39.

“షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది?”

(పరమగీతము 3:6-8:⁠4)

“ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా” ఏదో వస్తోంది. (పరమగీతము 3:⁠6) చూడడానికి బయటకు వెళ్ళినప్పుడు యెరూషలేము స్త్రీలకు ఏమి కనిపించింది? సొలొమోను, ఆయన సేవకులు నగరానికి తిరిగివస్తున్నారు! రాజు, కన్యకయైన షూలమ్మీతీని తనతోపాటు తీసుకువచ్చాడు.

ఆ గొఱ్ఱెలకాపరి ఆ కన్యకను అనుసరించి వచ్చి, త్వరలోనే ఆమెను కలుసుకున్నాడు. ఆమెను తాను గాఢంగా ప్రేమిస్తున్నానని ఆయన ఆమెకు హామీ ఇచ్చినప్పుడు, ఆ నగరం నుండి బయటపడాలనే తన కోరికను వ్యక్తంచేస్తూ ఆమె ఇలా అంటోంది: “ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.” ఆమె ‘తన ఉద్యానవనమునకు వేంచేసి తనకిష్టమైన ఫలములను భుజించమని’ గొఱ్ఱెలకాపరిని ఆహ్వానిస్తుంది. “నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని” అని ఆయన జవాబిస్తాడు. యెరూషలేము స్త్రీలు వారితో ఇలా అంటారు: “సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.”​—⁠పరమగీతము 4:​6, 16; 5:⁠1.

కన్యకయైన షూలమ్మీతీ యెరూషలేము స్త్రీలకు ఒక కల గురించి చెప్పిన తర్వాత, వారితో ఇలా అంటుంది: ‘ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లితిని.’ అందుకు వాళ్లిలా అడుగుతారు: “వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?” దానికి ఆమె ఇలా సమాధానమిస్తుంది: “నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును.” (పరమగీతము 5:​2-10) సొలొమోను ఆమెను అత్యంత అధికంగా పొగిడినప్పుడు ఆమె వినయంగా ఇలా అంటుంది: “షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది?” (పరమగీతము 6:​4-13) ఆమె మనస్సు గెలుచుకోవడానికి ఇదే అదను అని భావిస్తూ రాజు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతాడు. అయితే ఆ అమ్మాయి గొఱ్ఱెలకాపరిపట్ల తనకున్న ప్రేమ విషయంలో దృఢంగా ఉంటుంది. చివరకు సొలొమోను ఆమెను ఇంటికి వెళ్ళనిస్తాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

4:⁠1; 6:5​—⁠కన్యక వెంట్రుకలు “మేకలమంద”తో ఎందుకు పోల్చబడ్డాయి? అలా పోల్చడం, ఆమె వెంట్రుకలు మెరుస్తూ నల్లని మేక బొచ్చులా ఒత్తుగా ఉన్నాయని సూచిస్తుంది.

4:⁠11​—⁠షూలమ్మీతీ ‘పెదవులు తేనియలొలకడం,’ ‘ఆమె జిహ్వక్రింద మధుక్షీరములు ఉండడం’ దేన్ని సూచిస్తుంది? నూతనలోక అనువాదం ప్రకారం ఈ వచనంలో ఆమె పెదవులు తేనెపట్టులోనుండి జాలువారే తేనెలా ఉన్నాయని చెప్పబడింది. సాధారణంగా తేనెపట్టులోనుండి జాలువారే తేనె, నిల్వవుంచిన తేనెకన్నా రుచికరంగా, మధురంగా ఉంటుంది. ఈ పోలికతోపాటు ఆ కన్యక జిహ్వక్రింద పాలుతేనెలున్నాయనే తలంపు షూలమ్మీతీ పలికిన మాటల మంచితనాన్ని, అవి ఆహ్లాదకరంగా ఉండడాన్ని నొక్కిచెబుతుంది.

5:​12​—⁠“అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి” అనే మాటల భావమేమిటి? ఆ కన్యక తన ప్రియుని అందమైన కన్నుల గురించి మాట్లాడుతోంది. బహుశా ఆమె కావ్యరూపంలో, ఆయన కళ్ల కనుపాపను దాని చుట్టూ ఉన్న తెల్లని భాగాన్ని, పాలలో స్నానం చేస్తున్న నీలం ఊదారంగు కలగలసిన రంగుల్లోని గువ్వలతో పోలుస్తున్నట్లుంది.

5:​14, 15​—⁠గొఱ్ఱెలకాపరి చేతులు కాళ్ళు ఎందుకు ఈ విధంగా వర్ణించబడ్డాయి? ఆ కన్యక గొఱ్ఱెలకాపరి వేళ్ళను స్వర్ణగోళములుగా, ఆయన గోర్లను రత్నములుగా చెబుతున్నట్లు స్పష్టమౌతోంది. ఆయన కాళ్ళు బలంగా, అందంగా ఉన్నాయి కాబట్టి, ఆమె వాటిని “చలువరాతి స్తంభములతో” పోలుస్తోంది.

6:4​—⁠ఆ కన్యక తిర్సా పట్టణానికి ఎందుకు పోల్చబడింది? ఈ కనాను పట్టణాన్ని యెహోషువ చేజిక్కించుకున్నాడు, అది సొలొమోను కాలం తర్వాత ఇశ్రాయేలు పది గోత్రాల ఉత్తర రాజ్యానికి మొదటి రాజధాని అయ్యింది. (యెహోషువ 12:​7, 24; 1 రాజులు 16:5, 6, 8, 15) “ఆ పట్టణం చాలా అందమైనదై ఉండవచ్చు, అందుకే అది ఇక్కడ ప్రస్తావించబడింది” అని ఒక గ్రంథం చెబుతోంది.

6:13​—⁠“మహనయీము నాటకం” అంటే ఏమిటి? దీన్ని “రెండు గుడారముల నాట్యం” అని కూడా అనువదించవచ్చు. యబ్బోకు రేవు దగ్గర యొర్దాను నదికి తూర్పువైపున ఈ పేరుగల నగరం నెలకొని ఉంది. (ఆదికాండము 32:​2, 22; 2 సమూయేలు 2:​29) ఈ “రెండు గుడారాల నాట్యం” అనేది, ఒక పండుగ సందర్భంగా ఆ నగరంలో జరిగే ఒక నాట్యాన్ని సూచిస్తుండవచ్చు.

7:4​—⁠షూలమ్మీతీ కన్యక మెడను సొలొమోను “దంతగోపురం”తో ఎందుకు పోల్చాడు? ముందొకసారి ఆ అమ్మాయి ఈ ప్రశంసను అందుకుంది, ‘నీ కంధరము దావీదు కట్టించిన గోపురముతో సమానము.’ (పరమగీతము 4:⁠4) గోపురం పొడవుగా, సన్నగా ఉంటుంది, దంతం నున్నగా ఉంటుంది. ఆ అమ్మాయి మెడ సన్నగా, నునుపుగా ఉండడాన్ని చూసి సొలొమోను ముగ్ధుడయ్యాడు.

మనకు పాఠాలు:

4:​1-7. సొలొమోను ప్రతిపాదనలను తిరస్కరించడం ద్వారా షూలమ్మీతీ తాను అపరిపూర్ణురాలైనా తనలో నైతిక లోపం లేదని నిరూపించుకుంది. అలా ఆమె నైతిక బలం, ఆమె శారీరక అందాన్ని అధికంచేసింది. క్రైస్తవ స్త్రీల విషయంలో కూడా అది నిజమై ఉండాలి.

4:​12. చుట్టూ కంచె వేయబడిన అందమైన తోటలా, తాళం వేయబడిన ద్వారం గుండా మాత్రమే ప్రవేశించగల గోడలా, షూలమ్మీతీ తన ప్రేమానురాగాలు కేవలం తన కాబోయే భర్తకు మాత్రమే దక్కేలా చేసింది. అవివాహిత క్రైస్తవ స్త్రీ పురుషులకు ఎంత చక్కని ఉదాహరణో కదా!

“యెహోవా పుట్టించు జ్వాల”

(పరమగీతము 8:5-14)

“తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె?” అని షూలమ్మీతీ ఇంటికి తిరిగిరావడం చూసిన ఆమె సహోదరులు అడుగుతున్నారు. అంతకుముందు, వారిలో ఒకరు ఇలా అన్నారు: “అది ప్రాకారము వంటిదాయెనా? మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటమువంటిదాయెనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము.” ఇప్పుడు షూలమ్మీతీ ప్రేమ యొక్క స్థిరత్వం పరీక్షించబడి, నిరూపించబడింది కాబట్టి, ఆమె ఇలా అంటోంది: “నేను ప్రాకారమువంటిదాననైతిని, నా కుచములు దుర్గములాయెను. అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని.”​—⁠పరమగీతము 8:​5, 9, 10.

నిజమైన ప్రేమ “యెహోవా పుట్టించు జ్వాల.” ఎందుకు? ఎందుకంటే అలాంటి ప్రేమ యెహోవా నుండి ఉద్భవిస్తుంది. మనకు ప్రేమించే సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయనే. అది ఒక జ్వాల వంటిది, దాన్ని ఆర్పడం సాధ్యం కాదు. స్త్రీపురుషుల మధ్య ప్రేమ ‘మరణమంత బలమైనదిగా’ ఉండగలదని పరమగీతము రమ్యంగా వర్ణిస్తోంది.​—⁠పరమగీతము 8:⁠6.

సొలొమోను వ్రాసిన పరమగీతము యేసుక్రీస్తుకు, ఆయన పరలోక “పెండ్లికుమార్తె” సభ్యులకు మధ్య ఉన్న బంధంపై కూడా వెలుగు ప్రసరింపజేస్తుంది. (ప్రకటన 21:​2, 9) అభిషిక్త క్రైస్తవులపట్ల యేసుకున్న ప్రేమ, స్త్రీపురుషుల మధ్య ఉండే ఎలాంటి ప్రేమకన్నా అతీతమైనది. పెండ్లికుమార్తె తరగతి సభ్యులు తమ భక్తి విషయంలో అచంచలంగా ఉన్నారు. యేసు ప్రేమపూర్వకంగా “వేరే గొఱ్ఱెల” కోసం కూడా తన ప్రాణం ఇచ్చాడు. (యోహాను 10:​16) కాబట్టి సత్యారాధకులందరూ అచంచలమైన ప్రేమ, భక్తి విషయంలో షూలమ్మీతీ మాదిరిని అనుసరించవచ్చు.

[18, 19వ పేజీలోని చిత్రం]

వివాహజతలో దేనికోసం చూడాలని పరమగీతము పుస్తకం మనకు బోధిస్తోంది?