కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచవ్యాప్త ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే విద్యార్థులున్న ఒక పాఠశాల

ప్రపంచవ్యాప్త ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే విద్యార్థులున్న ఒక పాఠశాల

ప్రపంచవ్యాప్త ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే విద్యార్థులున్న ఒక పాఠశాల

రెండు వందలకన్నా ఎక్కువ దేశాల్లో 98,000కన్నా ఎక్కువగావున్న యెహోవాసాక్షుల సంఘాల్లో వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలు దేవునిచేత బోధించబడుతున్నారు. వారి ప్రధాన పాఠ్యపుస్తకం బైబిలు. ఆయా వ్యక్తులు దేవుని చిత్తమేమిటో తెలుసుకోవడంతోపాటు ఆ చిత్తానికి అనుగుణంగా ఎలా జీవించాలో తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేందుకు సహాయం చేయడమే ఆ విద్యకున్న లక్ష్యం. ఆ విద్యనభ్యసించేవారు ఎంతో ప్రయోజనం పొందుతారు. శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడుతూ వారు నేర్చుకున్న విషయాలను ఇతరులతో కూడా పంచుకుంటారు.​—⁠మత్తయి 28:​19, 20.

తమ సంఘాల్లో నిరంతరం కొనసాగే ఆ బోధనా కార్యక్రమంతోపాటు యెహోవాసాక్షులు అనేక ప్రత్యేక పాఠశాలలను స్థాపించారు. వాటిలో ఒకటి పరిచర్యా శిక్షణ పాఠశాల. అది 1987 అక్టోబరులో అమెరికాలోని, పెన్సిల్వేనియాలో ఉన్న పిట్స్‌బర్గ్‌లో ప్రారంభించబడింది. మొదటి తరగతికి ఇంగ్లీషు మాట్లాడే 24 మంది విద్యార్థులు హాజరయ్యారు. అప్పటినుండి ఆ కోర్సు 21 భాషల్లో, 43 దేశాల్లో నిర్వహించబడుతోంది. ఇప్పటివరకు 90 కన్నా ఎక్కువ దేశాలనుండి అవివాహిత పెద్దలు, పరిచర్య సేవకులు దానికి హాజరయ్యారు. ఎనిమిది వారాల కోర్సు ముగిసిన తర్వాత, విద్యార్థులు స్వదేశంలో లేక విదేశాల్లో అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు నియమించబడతారు. 2005వ సంవత్సరం ముగిసేసరికి దాదాపు 22,000 కన్నా ఎక్కవమంది క్రైస్తవ సహోదరులు ఆ కోర్సును పూర్తి చేశారు. రాజ్య సంబంధ విషయాలను అభివృద్ధి చేయడానికి, ఇతరులకు ప్రయోజనాలు చేకూర్చడానికి వారు చేసే వినమ్ర ప్రయత్నాలు మెండుగా ఆశీర్వదించబడ్డాయి.​—⁠సామెతలు 10:⁠22; 1 పేతురు 5:⁠5.

హాజరవడానికి ఏర్పాట్లు చేసుకోవడం

పరిచర్యా శిక్షణ పాఠశాల హాజరుకావడానికి చాలామంది విద్యార్థులు తమ ఉద్యోగస్థలం నుండి సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అదొక సవాలుగా మారవచ్చు. హవాయ్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు క్రైస్తవ సహోదరులు ఈ పాఠశాలకు ఆహ్వానించబడినప్పుడు తమ ఉద్యోగస్థలంలో సెలవు అడగాల్సి వచ్చింది. యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో, వారు దానికి ఎందుకు హాజరవ్వాలనుకుంటున్నారో, దాన్నుండి వారెలా ప్రయోజనం పొందుతారో తెలియజేస్తూ తమ సెలవుపత్రాలు ఇచ్చారు. వారిద్దరికీ సెలవు దొరికింది.

అనేక సందర్భాల్లో, తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని సెలవు కోసం అడిగిన సాక్షులకు చెప్పబడింది. తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చినా, యెహోవా సంస్థ నుండి శిక్షణ పొందాలనే వారు నిర్ణయించుకున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత, కొందరిని తిరిగి ఉద్యోగంలో చేరమని వారి పైఅధికారులు వారిని ఆహ్వానించారు. పాఠశాలకు హాజరవ్వాలని వారు చూపించే అలాంటి దృఢనిశ్చయాన్ని ఇలా వర్ణించవచ్చు: మీ కోరికను యజమానికి తెలియజేయండి, యెహోవా సహాయం కోసం ప్రార్థించండి, మిగతా విషయాలు యెహోవాను నిర్దేశించనివ్వండి.​—⁠కీర్తన 37:⁠5.

“యెహోవాచేత ఉపదేశము నొందుదురు”

ఆ పాఠశాలలో నిర్వహించబడే ఎనిమిది వారాల కోర్సులో బైబిలును క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఇమిడివుంది. యెహోవా ప్రజలు దేవుని చిత్తాన్ని చేయడానికి ఎలా సంస్థీకరించబడ్డారో, పరిచర్యలో, సంఘ కూటాల్లో, సమావేశాల్లో బైబిలును మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో విద్యార్థులు నేర్చుకుంటారు.

పట్టభద్రుడైన ఒక వ్యక్తి పాఠశాలపట్ల కృతజ్ఞతతో, ఇంకా హాజరవని ఓ విద్యార్థికి ఇలా వ్రాశాడు: “నేను చెప్పేది నమ్ము, నువ్వు నీ జీవితంలోనే అత్యంత ఉత్తమ విద్యా కోర్సుకు హాజరవబోతున్నావు. మీరు ‘యెహోవాచేత ఉపదేశము నొందుదురు’ అనే లేఖనం నిజంగా మరింత అర్థవంతంగా అనిపిస్తుంది. మనం క్రీస్తుయేసు అడుగుజాడలను మరింత దగ్గరగా అనుకరించేలా ఆ కోర్సు మన హృదయాన్ని వ్యక్తిత్వాన్ని మలచి మెరుగుపరుస్తుంది. ఇది నీ జీవితంలోనే అత్యంత మధురమైన అనుభవంగా మిగిలిపోతుంది.”​—⁠యెషయా 54:​13

సువార్తికులు, కాపరులు, బోధకులు

పరిచర్యా శిక్షణ పాఠశాల విద్యార్థులు ప్రస్తుతం 117 దేశాల్లో సేవచేస్తున్నారు. అట్లాంటిక్‌, కరీబియన్‌, పసిఫిక్‌ ప్రాంతాల్లోని ద్వీపాలతోపాటు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలున్న అనేక దేశాల్లో వారు సేవచేస్తున్నారు. ఆ విద్యార్థులు పొందిన చక్కని శిక్షణ వారి ప్రకటనాపనిలో, కాపుదలలో, బోధనా కార్యక్రమాల్లో కనిపిస్తుందని బ్రాంచి కార్యాలయాలు నివేదిస్తున్నాయి. క్షేత్ర పరిచర్యలో బైబిలును మరింత నైపుణ్యవంతంగా ఉపయోగించేందుకు వారికివ్వబడిన శిక్షణ దోహదపడుతుంది. (2 తిమోతి 2:​15) గృహస్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు వారు తరచూ లేఖనముల నుండి తర్కించడం * (ఆంగ్లం) పుస్తకాన్ని ఉపయోగించడమేకాక ఇతర రాజ్య ప్రచారకులు కూడా అలాగే చేసేందుకు వారికి శిక్షణనిస్తారు. ఆ విద్యార్థులకున్న ఉత్సాహం అందరినీ ప్రభావితం చేస్తుంది, వారి కార్యకలాపాలు సంఘాలను బలపరుస్తాయి.

సంఘ పెద్దలకు, ఇతరుల ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ వహిస్తూ ‘మందను కాసే’ ఆధిక్యత ఉంది. (1 పేతురు 5:​2, 3) ఒక పెద్ద ఆ ఏర్పాటు గురించి మాట్లాడుతూ, “దేవుని మందను కాసే బాధ్యతను నిర్వర్తించడంలో మాకు సహాయం చేసేందుకు బ్రాంచి కార్యాలయం చక్కని శిక్షణ పొందిన సహోదరులను పంపిస్తున్నందుకు మేము కృతజ్ఞులం” అని అన్నాడు. సుదూర ప్రాచ్య దేశంలోని బ్రాంచి కార్యాలయం అదేవిధంగా వ్యాఖ్యానించింది: “ఆ విద్యార్థులు ఎంతో కనికరం కలవారు. వారు కష్టపడి పనిచేస్తూ సంఘ సభ్యుల గౌరవాన్ని చూరగొంటారు. వారి వినయం, ఆప్యాయత, ఉత్సాహాన్ని అందరూ గుర్తించడమేకాక ఎంతగానో గౌరవిస్తారు. వారు ఇష్టపూర్వకంగా త్యాగాలు చేసి, కాపరులు అవసరమైన సంఘాలకు ఆనందంగా వెళ్తారు.” (ఫిలిప్పీయులు 2:⁠4) అలాంటి పురుషులు తమ తోటి విశ్వాసులను బలపరుస్తారు కాబట్టి, వారు ప్రశంసార్హులు.​—⁠1 కొరింథీయులు 16:​17, 18.

అంతేకాక, విద్యార్థులు బహిరంగ ప్రసంగీకులుగా తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి పరిచర్యా శిక్షణ పాఠశాల ఉపదేశకులు వారికి సహాయం చేస్తారు. వారికివ్వబడిన సలహాలను, ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా చాలామంది విద్యార్థులు కొంతకాలానికి ప్రాంతీయ సమావేశాల్లో, జిల్లా సమావేశాల్లో ప్రసంగాలివ్వడానికి ఉపయోగించబడడానికి అర్హులవ్వచ్చు. విద్యార్థులు “అద్భుతమైన ప్రసంగాలిస్తారు, వారు మంచి తర్కాన్ని ఉపయోగించడం ద్వారా సమాచారాన్ని ప్రేక్షకులకు అన్వయిస్తారు” అని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త చెప్పాడు.​—⁠1 తిమోతి 4:​13.

ఒక ఆఫ్రికా దేశంలో పరిచర్యా శిక్షణ పాఠశాల నిర్వహించబడి, విద్యార్థులు క్షేత్రంలో నియమించబడిన తర్వాత సంఘ కూటాల్లోని బోధ ఎంతగానో మెరుగయ్యింది. పాఠశాలలో శిక్షణ పొందిన పెద్దలు ప్రకటనాపనిలో, కాపరిపనిలో, బోధనాపనిలో సహాయం చేస్తూ సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరుస్తారు.​—⁠ఎఫెసీయులు 4:​8, 11, 12.

సంఘ పర్యవేక్షణ మెరుగయ్యింది

అనేక ప్రాంతాల్లో పెద్దల, పరిచర్య సేవకుల అవసరం ఎక్కువగా ఉంది. ఒకవేళ పరిచర్యా శిక్షణ పాఠశాల నుండి విద్యార్థి పంపించబడనట్లయితే కొన్ని సంఘాల్లో పెద్దలు ఉండేవారే కాదు. అందుకే చాలామంది విద్యార్థులు అలాంటి అవసరం ఉన్నచోట్ల సేవచేయడానికి నియమించబడతారు.

ఆ పురుషులకు “సంస్థాపరమైన ఏర్పాట్ల గురించి బాగా తెలుసు,” వారు “తమ బాధ్యతలను గంభీరంగా పరిగణిస్తారు,” “ఇతరులు యెహోవా సంస్థ ఏర్పాట్లను అర్థం చేసుకుని, దానిని గౌరవించేందుకు వారికి సహాయం చేస్తారు,” “సంఘాల్లో ఆప్యాయత, ఆధ్యాత్మికత పెరిగేందుకు తోడ్పడతారు” అని అనేక బ్రాంచి కార్యాలయాలు చెప్పాయి. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆ పాఠశాల విద్యార్థులు తమ స్వబుద్ధిపై ఆధారపడకుండా లేక తాము జ్ఞానవంతులమని అనుకోకుండా దేవుని వాక్యంలో వ్రాయబడినదాన్ని అనుసరిస్తారు. (సామెతలు 3:​5-7) అలాంటి పురుషులు తాము నియమించబడిన సంఘాలకు ఆధ్యాత్మిక ఈవులుగా ఉంటారు.

మారుమూల క్షేత్రాల్లో సేవచేయడం

ప్రత్యేక పయినీర్లుగా నియమించబడిన కొందరు విద్యార్థులు మారుమూల ప్రాంతాల్లోని గుంపులు సంఘాలుగా తయారయ్యేందుకు తోడ్పడతారు. వారి సహాయానికి కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ గ్వాటిమాలలో ఒక మారుమూల ప్రాంతంలోని పెద్ద ఇలా అన్నాడు: “20 సంవత్సరాల వరకు ఈ విస్తారమైన క్షేత్ర అవసరాలపట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలా అని నేను ఆందోళన చెందేవాడిని. నేను ఆ విషయం గురించి తరచూ ప్రార్థించేవాడిని. పరిచర్యా శిక్షణ పాఠశాల నుంచి వచ్చిన సహోదరులకు ప్రసంగించడంలో, సంస్థాపరమైన విషయాల్లో మంచి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ ప్రాంతానికి ఇప్పుడు ప్రేమపూర్వక శ్రద్ధ లభించడం చూస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని.”

అక్కడక్కడున్న చిన్న గ్రామాలకు చేరుకోవడానికి పర్వత ప్రాంతాల మీదుగా ఎంతో ప్రయాణించాల్సి వచ్చే క్షేత్రాల్లో కూడా విద్యార్థులు సమర్థవంతంగా ప్రకటించడాన్ని నేర్చుకున్నారు. ఇతర ప్రచారకులు చేయలేకపోయిన క్షేత్రాల్లో కూడా వారు త్వరగా చిన్న గుంపులను స్థాపించి వ్యవస్థీకరిస్తారు. ఉదాహరణకు, నైజర్‌లోని ఒక పెద్ద తానుండే ప్రాంతంలో విద్యార్థులు చక్కని పని చేయగలరని తలంచాడు కాబట్టే ఆయన వారి సహాయాన్ని కోరాడు. ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో అవివాహిత పురుషులు ప్రత్యేక పయినీర్లుగా, ప్రాంతీయ పైవిచారణకర్తలుగా సేవచేయడం సులువుగా ఉండవచ్చు. అపొస్తలుడైన పౌలులాగే వారు కూడా ‘నదులవలన వచ్చే ఆపదలను, దొంగలవలన ఎదురయ్యే ఆపదలను, అరణ్యములో ఎదురయ్యే ఆపదలను’ వ్యక్తిగత అసౌకర్యాలను ఎదుర్కోవడమేకాక, వారు సేవ చేస్తున్న సంఘాల విషయంలో చింత కూడా వారికి ఉంటుంది.​—⁠2 కొరింథీయులు 11:​26-28.

యౌవనులకు ప్రయోజనాలు చేకూర్చడం

సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని లేఖనాలు యౌవనస్థులను ప్రోత్సహిస్తున్నాయి. (ప్రసంగి 12:⁠2) ఉత్సాహంతో పనిచేసే పరిచర్యా శిక్షణ పాఠశాల విద్యార్థులు క్రైస్తవ యౌవనస్థులకు చక్కని మాదిరులుగా ఉంటారు. అమెరికాలోని ఒక సంఘానికి ఇద్దరు విద్యార్థులు వచ్చిన తర్వాత, సంఘంలో ప్రచారకులు పరిచర్యలో గడిపే సమయం రెట్టింపైంది. అంతేకాక, క్రమ పయినీర్ల లేదా పూర్తికాల రాజ్య ప్రచారకుల సంఖ్య 2 నుండి 11కు చేరుకుంది. అనేక సంఘాల్లో అదే విధమైన అభివృద్ధి కనిపిస్తోంది.

విద్యార్థులు యౌవనులను పరిచర్యా శిక్షణ పాఠశాలకు హాజరవమని కూడా ప్రోత్సహిస్తారు. అలా ప్రోత్సహించడం ఇంకా పరిచర్య సేవకులుగా తయారవని యౌవనులు, ఆ ఆధిక్యత కోసం కావాల్సిన అర్హత సంపాదించేందుకు పురికొల్పింది. “తమ జీవితంతో ఏమి చేయాలో ఆలోచించే యౌవనులకు వారు ఆదర్శవంతంగా” ఉన్నారని పరిచర్యా శిక్షణ పాఠశాల విద్యార్థుల గురించి నెదర్లాండ్స్‌ బ్రాంచి కార్యాలయం చెబుతోంది.

వేరేభాషా సంఘాల్లో సేవచేయడం

ప్రజలకు తమ మాతృభాషలో సువార్తను ప్రకటించడానికి చేసే ప్రయత్నాలు అనేక దేశాల్లో ఊపందుకుంటున్నాయి. పరిచర్యా శిక్షణ పాఠశాల విద్యార్థులు సాధారణంగా వేరే భాషలు నేర్చుకుని, వలసవచ్చిన ప్రజలు ఎక్కువగా ఉన్న క్షేత్రాల్లో సేవచేస్తున్నారు. ఉదాహరణకు, బెల్జియంలో ఆల్బేనియన్‌, పర్షియన్‌, రష్యన్‌ భాషల్లో ప్రకటించేందుకు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉంది.

బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, మెక్సికో, అమెరికా, మరితర దేశాల్లోని వేరేభాషా సంఘాలు, గుంపులు పరిచర్యా శిక్షణ పాఠశాలనుండి పట్టభద్రులైన ప్రయాణ పైవిచారణకర్తలు, పెద్దలు, పరిచర్య సేవకుల నుండి ఎంతగానో ప్రయోజనం పొందాయి. “వేరేభాషా సంఘాలకు, గుంపులకు సహాయం చేయడంలో 200 కన్నా ఎక్కవమంది విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు” అని కొరియాలోని బ్రాంచి కార్యాలయం నివేదిస్తోంది.

ఇతర బాధ్యతల్లో వినయంగా సేవచేయడం

పరిచర్యా శిక్షణ పాఠశాలనుండి పట్టభద్రులైనవారు వేరేభాషా గుంపుల్లో, సంఘాల్లో సేవచేయడంతోపాటు పెద్దలుగా, పరిచర్య సేవకులుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా సేవచేస్తున్నారు. మరికొందరు వేరే దేశాల్లో, బహుశా బ్రాంచి కార్యాలయంలోని సేవా విభాగంలో (సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌) అత్యవసరమైన పనులను చేసే నియామకాలను స్వీకరిస్తున్నారు. నిర్మాణపనిలో నైపుణ్యాలను నేర్చుకున్నవారు రాజ్యమందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా సంఘాలు, సర్క్యూట్‌లు పెరుగుతున్న కారణంగా అనేకమంది ప్రాంతీయ పైవిచారణకర్తల అవసరం ఏర్పడుతోంది. ఆ అవసరాన్ని తీర్చడానికి పరిచర్యా శిక్షణ పాఠశాలనుండి ఎంపిక చేయబడిన విద్యార్థులకు ప్రయాణపనిలో పది వారాల శిక్షణ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత వారు క్రమ లేదా ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తలుగా సేవచేస్తారు. ప్రస్తుతం 97 దేశాల్లో దాదాపు 1,300 మంది విద్యార్థులు ప్రాంతీయ పైవిచారణకర్తలుగా సేవచేస్తున్నారు. ఒక ఆఫ్రికా దేశంలోని పైవిచారణకర్తల్లో 55 శాతం మంది పరిచర్యా శిక్షణ పాఠశాలనుండి పట్టభద్రులైనవారే ఉన్నారు. మరో ఆఫ్రికా దేశంలో 70 శాతం మంది ఉన్నారు.

ఆస్ట్రేలియా, కెనడా, యూరప్‌, సుదూర ప్రాచ్య దేశాలు, అమెరికా నుండి వందలాదిమంది విద్యార్థులు వేరేదేశాల్లో నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి పంపించబడ్డారు. ఆ విధంగా, ఆ పాఠశాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రయోజనాలను చవిచూస్తున్నారు.

యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ అంత్యదినాల్లో రాజ్య సంబంధ విషయాలను పురోభివృద్ధి చేసే సువార్తికులను, కాపరులను, బోధకులను నియమించాడు. దేవుని ప్రజల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి! అందుకే సమర్పిత పురుషులు అదనపు బాధ్యతలను స్వీకరించడానికి అర్హులయ్యే అవసరం అధికమౌతూనే ఉంది. (యెషయా 60:​22; 1 తిమోతి 3:​1, 13) పరిచర్యను మరింత విస్తృతం చేసుకోవడంలో సంసిద్ధంగా ఉండడానికి, తమకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడానికి పరిచర్యా శిక్షణ పాఠశాల పెద్దలకు, పరిచర్య సేవకులకు అవకాశాన్నిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[10వ పేజీలోని చిత్రాలు]

పరిచర్యా శిక్షణ పాఠశాల రాజ్య సంబంధ విషయాలను ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చేస్తోంది

[13వ పేజీలోని చిత్రాలు]

మీరు పరిచర్యా శిక్షణ పాఠశాలకు హాజరై ఇతరులకు ప్రయోజనాలు చేకూర్చాలని ఆశిస్తున్నారా?