కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఇమిడివున్న ఒక వివాదాంశం

మీరు ఇమిడివున్న ఒక వివాదాంశం

మీరు ఇమిడివున్న ఒక వివాదాంశం

మీ కుటుంబంలోగానీ మీ స్నేహితుల్లోగానీ మీతో చనువుగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? మీరు కేవలం స్వార్థపూరిత ఉద్దేశాలతోనే ఆ సంబంధాన్ని నెలకొల్పుకున్నారని ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే మీకెలా అనిపిస్తుంది? మీ మనసు నొచ్చుకోదా, బహుశా మీకు కోపం కూడా రావచ్చు కదా? యెహోవా దేవునితో సన్నిహిత సంబంధంవున్న వారందరిపై అపవాదియైన సాతాను ఆ నిందే మోపుతున్నాడు.

సాతాను మొదటి మానవజత అయిన ఆదాముహవ్వలను దేవుని నియమాన్ని ధిక్కరించేలా చేసి, దేవునికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటులో తనతో చేతులుకలిపేలా చేయడంలో విజయం సాధించినప్పుడు ఏమి జరిగిందో ఆలోచించండి. అలా జరగడం మానవులు తమకు ప్రయోజనకరంగా ఉన్నంతవరకే యెహోవాకు విధేయులుగా ఉంటారని దానర్థమా? (ఆదికాండము 3:​1-6) ఆదాము దేవునికి దూరమైన దాదాపు 2,500 సంవత్సరాల తర్వాత సాతాను మళ్లీ అదే వివాదాంశాన్ని లేవదీశాడు, కానీ ఈసారి అతడు యోబు అనే వ్యక్తి విషయంలో దాన్ని ప్రస్తావించాడు. అపవాది వేసిన నింద మనం ఇమిడివున్న వివాదాంశాన్ని స్పష్టం చేస్తుంది కాబట్టి, మనం ఆ బైబిలు వృత్తాంతాన్ని శ్రద్ధగా పరిశీలిద్దాం.

“నేనెంతమాత్రమును యథార్థతను విడువను”

యోబు “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.” అయితే, సాతాను యోబు యథార్థతను తప్పుబట్టాడు. “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా” అని అతడు యెహోవాను ప్రశ్నించాడు. యోబును సంరక్షిస్తూ, ఆశీర్వదించడం ద్వారా యెహోవా ఆయన విశ్వసనీయతను కొన్నాడని అపవాది ఇటు దేవుణ్ణి, అటు యోబును నిందించాడు. “అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని” సాతాను దేవుణ్ణి సవాలు చేశాడు.​—⁠యోబు 1:​8-11.

ఆ వాదనలు తప్పని రుజువుచేయడానికి యోబును పరీక్షించడానికి యెహోవా సాతానును అనుమతించాడు. యోబు దేవుని సేవను పరిత్యజించేలా చేసే ప్రయత్నంలో అపవాది ఆ నమ్మకస్థునిపై వరుసగా విపత్తులను తీసుకువచ్చాడు. యోబుకున్న పాడిపశువులన్నీ దోచుకోబడ్డాయి లేదా నాశనమయ్యాయి, ఆయన సేవకులు హతమార్చబడ్డారు, ఆయన పిల్లలు మరణించారు. (యోబు 1:​12-19) కానీ, సాతాను విజయం సాధించాడా? నిస్సందేహంగా సాధించలేదు! తన కష్టాలకు అపవాదే కారణమని తెలియకపోయినా “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అని యోబు అన్నాడు.​—⁠యోబు 1:​21.

ఆ తర్వాత సాతాను యెహోవా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతడితో ఇలా చెప్పాడు: “నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను [యోబు] ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు.” (యోబు 2:​1-3) యోబు యథార్థతకు సంబంధించినదే ఆ ప్రాముఖ్యమైన వివాదాంశం. యథార్థంగా ఉండడంలో దేవునికి అచంచలమైన నమ్మకాన్ని కనబరచడం, నీతిని అంటిపెట్టుకుని ఉండడం ఇమిడివుంది. యథార్థతకు సంబంధించిన వివాదాంశంలో యోబు అప్పటివరకు నెగ్గుతూనే వచ్చాడు. కానీ, అపవాది అంతటితోనే ఆగిపోలేదు.

తర్వాత, సాతాను మానవజాతి అంతటినీ ప్రభావితం చేసే అతి ప్రాముఖ్యమైన వాదనచేశాడు. అపవాది యెహోవాతో, “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును” అని అన్నాడు. (యోబు 2:​4, 5) యోబు పేరును ఉపయోగించేబదులు మానవులందరికీ వర్తించేలా “నరుడు” అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా అపవాది ప్రతీ మానవుని యథార్థతను సవాలు చేశాడు. నిజానికి అతడు, ‘ఒక మానవుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు. నాకు అవకాశమిస్తే నేను ఎవరినైనా దేవుని నుండి దూరం చేయగలను’ అని వాదించాడు. మరి అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమయాల్లోనూ దేవునికి యథార్థంగా ఏ మానవుడూ ఉండలేడా?

యోబును తీవ్రమైన వ్యాధికి గురిచేయడానికి యెహోవా అపవాదిని అనుమతించాడు. యోబు ఎంతగా బాధననుభవించాడంటే, తన జీవితం అంతమైపోవాలని ఆయన ప్రార్థించాడు. (యోబు 2:⁠7; 14:​13) అయినప్పటికీ, యోబు “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని అన్నాడు. (యోబు 27:⁠5) తను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టే యోబు అలా అన్నాడు, ఆయన నిర్ణయాన్ని ఏదీ మార్చలేదు. యోబు తననుతాను యథార్థపరునిగా నిరూపించుకున్నాడు. “యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను” అని బైబిలు చెబుతోంది. (యోబు 42:​10-17) యోబులాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా? చరిత్ర ఏమి వెల్లడిచేసింది?

సవాలు ఎలా త్రిప్పికొట్టబడింది

బైబిలు పుస్తకమైన హెబ్రీయులు 11వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు, క్రీస్తుపూర్వ కాలాల్లో జీవించిన అనేకమంది నమ్మకమైన స్త్రీపురుషుల పేర్లతోపాటు నోవహు, అబ్రాహాము, శారా, మోషేల గురించి కూడా పేర్కొన్నాడు. ఆ తర్వాత అపొస్తలుడు ఇలా అన్నాడు: “[ఇతరుల]గూర్చియు వివరించుటకు సమయము చాలదు.” (హెబ్రీయులు 11:​32) దేవునికి నమ్మకంగా ఉన్న ఆ సేవకులు ఎంత ఎక్కువగా ఉన్నారంటే, పౌలు వారిని ఆకాశంలో విస్తరించివున్న మేఘాలతో పోలుస్తూ వారిని ‘మేఘమువలె ఉన్న గొప్ప సాక్షి సమూహం’ అని పేర్కొన్నాడు. (హెబ్రీయులు 12:⁠1) అవును, గడిచిన శతాబ్దాలన్నింటిలో గొప్ప సంఖ్యలో ప్రజలు తాము యెహోవా దేవునికి యథార్థంగా ఉండాలని స్వేచ్ఛాచిత్తంతో నిర్ణయించుకున్నారు.​—⁠యెహోషువ 24:​15.

తాను మానవుల్ని యెహోవా నుండి దూరం చేయగలనని సాతాను చేసిన వాదనకు దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తు తిరుగులేని జవాబిచ్చాడు. హింసాకొయ్యపై బాధాకరమైన మరణాన్ని అనుభవించినా ఆయన దేవునిపట్ల తన యథార్థతను విడువలేదు. ఆయన తన ఆఖరిశ్వాస విడుస్తూ, బిగ్గరగా ఇలా కేకవేశాడు: “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.”​—⁠లూకా 23:​46.

మానవులందరూ సత్య దేవుణ్ణి సేవించడం ఆపేసేలా చేయడంలో అపవాది విఫలమయ్యాడని చరిత్ర స్పష్టంగా వెల్లడిచేసింది. గొప్ప సంఖ్యలో ప్రజలు యెహోవా గురించి, ఆయనను ‘పూర్ణహృదయముతో పూర్ణాత్మతో పూర్ణమనస్సుతో ప్రేమించడం’ గురించి తెలుసుకున్నారు. (మత్తయి 22:​37) వారు యెహోవాపట్ల చూపించిన అచంచలమైన యథార్థత, మానవ యథార్థత గురించి సాతాను లేవదీసిన వివాదాంశం తప్పని నిరూపించింది. మీరు కూడా వ్యక్తిగతంగా యథార్థత చూపించడం ద్వారా అపవాది తప్పని రుజువుచేయవచ్చు.

మీరేమి చేయాలి?

“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అనేదే దేవుని చిత్తం. (1 తిమోతి 2:⁠4) మీరు ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? బైబిలు అధ్యయనం చేస్తూ, ‘అద్వితీయ సత్యదేవుడు, ఆయన పంపిన యేసుక్రీస్తు’ గురించిన జ్ఞానం సంపాదించుకునేందుకు సమయం తీసుకోండి.​—⁠యోహాను 17:⁠3.

దేవుణ్ణి సేవించడంలో మానవుల ఉద్దేశాలను ప్రశ్నించడం ద్వారా సాతాను మానవుల యథార్థతను సవాలు చేశాడు. మీరు సంపాదించుకున్న జ్ఞానం మీ ఉద్దేశాలను ప్రభావితం చేయాలంటే అది మీ హృదయాన్ని చేరుకోవాలి. అలా జరగాలంటే మీరు కేవలం బైబిల్లోని సమాచారాన్ని సంపాదించుకుంటే సరిపోదు. మీరు నేర్చుకున్నదాని గురించి ధ్యానించడం అలవాటు చేసుకోండి. (కీర్తన 143:⁠5) బైబిలు లేదా బైబిలు సంబంధిత ప్రచురణను చదువుతున్నప్పుడు, ‘ఇది నాకు యెహోవా గురించి ఏమి బోధిస్తుంది? దేవుని ఏ లక్షణాలు ఇందులో వ్యక్తమవుతున్నాయి? నేను నా జీవితంలోని ఏ అంశాల్లో వాటిని ప్రదర్శించాలి? దేవుడు వేటిని ఆమోదిస్తాడు, వేటిని ఆమోదించడు? దేవుని గురించి నాకున్న దృక్పథాన్ని అదెలా ప్రభావితం చేస్తోంది?’ లాంటి ప్రశ్నలను ధ్యానించడానికి సమయం తీసుకోండి. అలా ఆలోచించడం ద్వారా సృష్టికర్తపట్ల ప్రేమ, కృతజ్ఞతలతో మీ హృదయం నిండుకుంటుంది.

దేవునిపట్ల యథార్థత చూపించడమనేది కేవలం మత నమ్మకాలకే పరిమితం కాదు. (1 రాజులు 9:⁠4) యెహోవాపట్ల మీ యథార్థతను కాపాడుకోవాలంటే మీరు మీ జీవితంలోని అన్ని రంగాల్లో నైతిక యథార్థతను కనబరచాలి. అయితే, యథార్థతను కాపాడుకోవడంవల్ల మీరు ఏ విధంగానూ నష్టపోరు. “సంతోషంగా ఉండే దేవుడు” అయిన యెహోవా, మీరు మీ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుతున్నాడు. (1 తిమోతి 1:11, NW) నైతికంగా పవిత్రంగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని, దేవుని ఆమోదాన్ని అనుభవించడానికి మీరు ఎలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలో పరిశీలించండి.

లైంగిక దుర్నీతికి దూరంగా ఉండండి

యెహోవా తన వాక్యమైన బైబిల్లో తనే స్వయంగా వివాహానికి సంబంధించిన ప్రమాణాన్ని ఏర్పరిచాడు. “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 2:​21-24) వివాహిత దంపతులు ‘ఏక శరీరమయ్యారు’ కాబట్టి, వారు లైంగిక సంబంధాలను వారిరువురికే పరిమితం చేసుకోవడం ద్వారా దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవిస్తారు. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 13:⁠4) వివాహ “పానుపు” అనే పదం, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీపురుషుల మధ్యవుండే లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. వారిద్దరిలో ఎవరైనా వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు అది వ్యభిచారం చేసినట్లే అవుతుంది, అలా చేయడం దేవుని కఠిన తీర్పుకు దారితీస్తుంది.​—⁠మలాకీ 3:⁠5.

వివాహానికి ముందు లైంగిక సంబంధాలను పెట్టుకోవడం సరైనదేనా? అది కూడా యెహోవా ఏర్పర్చిన నైతిక ప్రమాణాలకు విరుద్ధమైనదే. “మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము” అని బైబిలు చెబుతోంది. (1 థెస్సలొనీకయులు 4:⁠3) సలింగ సంయోగం, రక్తసంబంధులతో లైంగిక దుర్నీతి, జంతు సంయోగం వంటివి కూడా దేవుని దృష్టిలో పాపాలే. (లేవీయకాండము 18:​6, 23; రోమీయులు 1:​26, 27) దేవుణ్ణి ప్రీతిపర్చాలనీ, సంతోషకరమైన జీవితం గడపాలనీ కోరుకునే ఎవరైనా అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉండాలి.

వివాహానికి ముందు లైంగికతను ప్రేరేపించేలా ప్రవర్తించడం మాటేమిటి? అలా చేయడం యెహోవాకు కోపం తెప్పిస్తుంది. (గలతీయులు 5:​19) ఒక వ్యక్తి అనైతిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. యేసు ఇలా అన్నాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:​28) పత్రికల్లో, వీడియోల్లో లేదా ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను చూడడం, పుస్తకాల్లో లైంగిక కృత్యాల గురించిన కథనాలను చదవడం, అశ్లీల సాహిత్యం ఉన్న పాటలు వినడం లాంటివాటికి కూడా ఆ మాటలు అన్వయిస్తాయి. అలాంటివాటికి దూరంగా ఉండడం దేవుణ్ణి సంతోషపరిచి, మన జీవితంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

కేవలం సరదా కోసం ఇతరులలో లైంగికేచ్ఛను రేకెత్తించడం లేక వారు మీ పట్ల లైంగికంగా ఆకర్షితులయ్యేలా ప్రవర్తించడం గురించి ఏమిటి? వివాహిత పురుషుడుగానీ స్త్రీగానీ తమ జత కాని మరో వ్యక్తిపట్ల అలా ప్రవర్తించడం బైబిలు సూత్రాలకు విరుద్ధమైనది, అలా చేయడం యెహోవాను అగౌరవపరిచినట్లు అవుతుంది. (ఎఫెసీయులు 5:​28-33) కేవలం సరదా కోసం అవివాహితులు ఇతరులు తమవైపు లైంగికంగా ఆకర్షితులయ్యేలా చేయడం ఎంత తప్పో కదా! అలాంటి ప్రవర్తనను అవతలి వ్యక్తి ఊహించినదానికన్నా ఎక్కువ గంభీరంగా తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అది వారికెంత మనోవేదనను కలిగిస్తుందో ఆలోచించండి. గంభీరమైన మరో విషయమేమిటంటే, అలా ప్రవర్తించడం జారత్వానికి, వ్యభిచారానికి నడిపించగలదు. దానికి భిన్నంగా, మీరు ఇతరులపట్ల సభ్యతగా ప్రవర్తించినట్లయితే ఆ వ్యక్తి ఆత్మగౌరవం పెరుగుతుంది.​—⁠1 తిమోతి 5:1, 2.

జీవితంలోని ఇతర రంగాల్లో దేవుణ్ణి సంతోషపెట్టడం

అనేక దేశాల్లో మద్యపానీయాలు సులభంగా లభిస్తాయి. వాటిని సేవించడం తప్పా? ద్రాక్షారసం, బీరు లేదా ఇతర మద్యపానీయాలను మితంగా త్రాగడం లేఖనాల్లో ఖండించబడలేదు. (కీర్తన 104:⁠15; 1 తిమోతి 5:​23) అయితే, మితిమీరి త్రాగడం, త్రాగుబోతుతనం దేవుని దృష్టిలో తప్పు. (1 కొరింథీయులు 5:​11-13) మీరు మితిమీరి త్రాగడంవల్ల మీ ఆరోగ్యం చెడిపోవాలనీ, మీ కుటుంబ జీవితం విచ్ఛిన్నం కావాలని మీరు నిశ్చయంగా కోరుకోరు.​—⁠సామెతలు 23:​20, 21, 29-35.

యెహోవా ‘సత్యదేవుడు.’ (కీర్తన 31:⁠5) దేవుడు “అబద్ధమాడజాలని” వాడని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 6:​17, 18) ఒకవేళ మీరు దేవుని ఆమోదాన్ని కోరుకుంటే మీరు అబద్ధమాడరు. (సామెతలు 6:​16-19; కొలొస్సయులు 3:​9, 10) “ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని బైబిలు క్రైస్తవులను ఉద్బోధిస్తోంది.​—⁠ఎఫెసీయులు 4:​25.

జూదమాడడాన్ని కూడా మనం విడనాడాలి. అది చాలా ప్రజాదరణ పొందినదైనా, అది ఇతరుల నష్టాన్ని సొమ్ము చేసుకోవడంతో ముడిపడివుంది కాబట్టి, అది ఒక రకమైన పేరాశ. “దుర్లాభము నపేక్షించువారిని” యెహోవా ఆమోదించడు. (1 తిమోతి 3:⁠8) మీరు యెహోవాను సంతోషపెట్టాలనుకుంటే, మీరు లాటరీలు, మట్కా జూదం, లేదా గుర్రెపు పందెం లాంటి ఏ విధమైన జూదంలోనైనా పాల్గొనరు. అలాంటి వాటికి దూరంగా ఉన్నప్పుడు మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీ చేతిలో సరిపడా డబ్బు ఉంటుందని మీరు కనుగొంటారు.

దొంగతనం, అంటే మీది కాని వస్తువును తీసుకోవడం మరో రకమైన పేరాశే. “దొంగిలకూడదు” అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 20:⁠15) మీకు తెలిసి కూడా దొంగిలించబడిన వస్తువుల్ని కొనడం, అనుమతి లేకుండా వస్తువుల్ని తీసుకోవడం తప్పు. “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను” అని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 4:​27, 28) యెహోవాను ప్రేమించేవారు తమ ఉద్యోగస్థలంలో సమయాన్ని వృథా చేసే బదులు నిజాయితీగా పనిచేస్తారు. వారన్ని ‘విషయాలలోను యోగ్యముగా ప్రవర్తించాలని’ లేదా నిజాయితీగా ప్రవర్తించాలని కోరుకుంటారు. (హెబ్రీయులు 13:​18) అంతేకాక, మంచి మనస్సాక్షి ఒక వ్యక్తికి మనశ్శాంతినిస్తుంది.

కోపోద్రేకంతో ప్రవర్తించేవారిని దేవుడు ఎలా దృష్టిస్తాడు? “కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము” అని బైబిలు హెచ్చరిస్తోంది. (సామెతలు 22:​24) అదుపుచేసుకోలేని కోపం సాధారణంగా దౌర్జన్య కార్యాలకు పాల్పడేలా చేస్తుంది. (ఆదికాండము 4:​5-8) పగతీర్చుకునే విషయం గురించి బైబిలు ఇలా చెబుతోంది: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి​—⁠పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని [యెహోవా] చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” (రోమీయులు 12:​17-19) మనం అలాంటి ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు మన జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది, తత్ఫలితంగా మన సంతోషం రెట్టింపవుతుంది.

మీరు విజయం సాధించవచ్చు

మీరు బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఒత్తిడివున్నా, దేవునిపట్ల మీ యథార్థతను కాపాడుకోవడంలో మీరు విజయం సాధించగలరా? ఖచ్చితంగా సాధించగలరు. యథార్థతకు సంబంధించిన వివాదాంశంలో సాతానును తప్పని రుజువుచేయడంలో మీరు విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడని గ్రహించండి. ఎందుకంటే, ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”​—⁠సామెతలు 27:​11.

యెహోవా దృష్టిలో సరైనదాన్ని చేయడానికి శక్తినివ్వమని మీరు ఆయనకు ప్రార్థించవచ్చు. (ఫిలిప్పీయులు 4:​6, 7, 13) కాబట్టి, మీరు దేవుని వాక్యమైన బైబిలు గురించి మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కృతనిశ్చయతతో ప్రయాసపడండి. బైబిలు నుండి మీరు నేర్చుకున్న విషయాలపై కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించడం దేవునిపట్ల మీకున్న ప్రేమను ప్రగాఢం చేసుకోవడానికి, ఆయనను సంతోషపెట్టడానికి మిమ్మల్ని పురికొల్పుతుంది. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని 1 యోహాను 5:3 చెబుతోంది. బైబిలును అధ్యయనం చేయడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు మీకు సహాయం చేయడానికి సంతోషిస్తారు. మీరు స్థానికంగా ఉన్న సాక్షులను సంప్రదించడానికి ఆహ్వానించబడుతున్నారు లేదా మీరు ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయవచ్చు.

[4వ పేజీలోని చిత్రం]

పరీక్షలు ఎదురైనా యోబు నమ్మకంగానే ఉన్నాడు

[7వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం గురించిన జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా దేవుని దృష్టిలో సరైనదాన్ని చేయాలనే మీ తీర్మానం బలపడుతుంది