యూదా నిర్మానుష్యంగా ఉందా?
యూదా నిర్మానుష్యంగా ఉందా?
యూదా రాజ్యాన్ని బబులోనీయులు నాశనం చేస్తారని, చెరలో ఉన్న యూదులు తిరిగివచ్చేంతవరకు అది నిర్మానుష్యంగా ఉంటుందని బైబిలు ప్రవచించింది. (యిర్మీయా 25:8-11) చెర నుండి తిరిగివచ్చిన మొదటి గుంపు స్వదేశానికి వచ్చి దాదాపు 75 సంవత్సరాలు గడిచిన తర్వాత రాయబడిన ప్రేరేపిత చారిత్రక వృత్తాంతం, ఆ ప్రవచనం నెరవేరిందని నమ్మేందుకు బలమైన కారణాన్ని ఇస్తుంది. బబులోను రాజు “ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని . . . బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి” అని అది పేర్కొంటోంది. “దేశము పాడుగానున్న . . . కాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను” అని యూదా రాజ్యం గురించి నివేదించబడింది. (2 దినవృత్తాంతములు 36:20, 21) ఆ మాటలను సమర్థించే పురావస్తు రుజువులు ఏవైనా ఉన్నాయా?
బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ అనే పత్రికలో, హీబ్రూ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా పురావస్తుశాస్త్రానికి ప్రొఫెసర్‌గా ఉన్న ఎఫ్రాయిమ్ స్టర్న్ ఇలా అన్నాడు: “ప్రాచీన ఇశ్రాయేలులోని అనేక ప్రాంతాలను అటు అష్షూరీయులు, ఇటు బబులోనీయులు నాశనం చేశారు, అయితే వారు వాటిని నాశనం చేసిన తర్వాత సంభవించిన పరిణామాల గురించి పురావస్తుశాస్త్రం అందించే రుజువులు రెండు భిన్నమైన కథనాలు చెబుతున్నాయి.” ఆయనిలా వివరిస్తున్నాడు: “అష్షూరీయులు పాలస్తీనాను స్వాధీనం చేసుకున్నారనడానికి వారు స్పష్టమైన రుజువులు మిగిల్చినా, బబులోనీయులు ఆ ప్రాంతాన్ని నాశనం చేసిన తర్వాత, వారు దానిని ఆక్రమించుకున్నారనడానికి ఆశ్చర్యకరంగా చారిత్రక రుజువులు లేవు . . . ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పడ్డాయని తెలియజేసే రుజువులు పర్షియా కాలంవరకు లేవు . . . ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పడ్డాయని సూచించే రుజువే లేదు. ఆ మధ్యకాలంలో, బబులోనీయులు నాశనం చేసిన ఏ పట్టణంలో కూడా తిరిగి నివాసాలు ఏర్పడలేదు.”
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లారెన్స్ ఇ. స్టాజర్ ఆయనతో అంగీకరిస్తున్నాడు. “ఫిలిష్తియ ప్రాంతమంతటిలో, ఆ తర్వాత యూదా ప్రాంతమంతటిలో” బబులోను రాజు అనుసరించిన “పూర్తిగా నాశనం చేయడమనే విధానం యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా బంజరు భూమిగా మార్చింది” అని ఆయన అంటున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “చెరనుండి స్వదేశానికి తిరిగివచ్చిన అనేకమంది యూదులు నివసించిన యెరూషలేములో, యూదాలో . . . బబులోనీయుల తర్వాత వచ్చిన పర్షియా రాజైన కోరెషు పాలనా కాలంవరకు పురావస్తు వృత్తాంతం తిరిగి ప్రారంభంకాలేదు.”
అవును, యూదా నిర్మానుష్యంగా ఉండడం గురించిన యెహోవా వాక్యం నెరవేరింది. యెహోవా దేవుడు ప్రవచించేవి ఎల్లప్పుడూ నెరవేరతాయి. (యెషయా 55:10, 11) మనం యెహోవామీద, ఆయన వాక్యమైన బైబిల్లో నమోదుచేయబడిన వాగ్దానాలమీద మన పూర్తి నమ్మకముంచవచ్చు.—2 తిమోతి 3:16.