కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి

యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి

యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి

“యెహోవా శిక్షను తృణీకరింపవద్దు.”​—⁠సామెతలు 3:​11.

దేవుడిచ్చే శిక్షను లేదా క్రమశిక్షణను అంగీకరించేందుకు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను మనలో ప్రతీ ఒక్కరికీ మంచి కారణాన్నిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నా కుమారుడా, యెహోవా శిక్షను [‘క్రమశిక్షణను,’ NW] తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.” (సామెతలు 3:​11, 12) అవును, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే, మీకు క్రమశిక్షణ ఇస్తున్నాడు.

2 ‘క్రమశిక్షణ’ గద్దింపును, దిద్దుబాటును, ఉపదేశాన్ని, విద్యను సూచిస్తుంది. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 12:​11) దైవిక క్రమశిక్షణను అంగీకరించి, అన్వయించుకోవడం నీతి మార్గాన్ని అనుసరించేందుకు మీకు సహాయం చేసి, పరిశుద్ధ దేవుడైన యెహోవాకు మిమ్మల్ని సన్నిహితం చేయగలదు. (కీర్తన 99:⁠5) ఆ దిద్దుబాటు తోటి విశ్వాసుల ద్వారా, క్రైస్తవ కూటాల్లో తెలుసుకున్న విషయాల ద్వారా, దేవుని వాక్యంలో, ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ సాహిత్యాల్లో మీరుచేసే అధ్యయనం ద్వారా రావచ్చు. (లూకా 12:​42-44) దిద్దుబాటు అవసరమైన అంశం అలా మీ దృష్టికి తీసుకురాబడినప్పుడు మీరెంత కృతజ్ఞత చూపిస్తారో కదా! అయితే ఘోరమైన పాపం చేసినప్పుడు ఎలాంటి క్రమశిక్షణ అవసరం కావచ్చు?

కొందరెందుకు బహిష్కరించబడతారు?

3 దేవుని సేవకులు బైబిలును, క్రైస్తవ సాహిత్యాలను అధ్యయనం చేస్తారు. వారి కూటాల్లో, సమావేశాల్లో యెహోవా ప్రమాణాలు చర్చించబడతాయి. కాబట్టి యెహోవా తమనుండి ఏమి కోరుతున్నాడో క్రైస్తవులకు తెలుసు. సంఘ సభ్యుడు పశ్చాత్తాపపడకుండా ఘోరమైన పాపం చేసినప్పుడు మాత్రమే ఆయన బహిష్కరించబడతాడు.

4 బహిష్కరణకు సంబంధించిన ఒక లేఖనాధార ఉదాహరణను పరిశీలించండి. కొరింథు సంఘంలో ‘ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడు, అలాంటి జారత్వం అన్యజనులలోనైనా జరగదు,’ ఆ విషయాన్ని ఆ సంఘం చూసీచూడనట్లు ఊరుకుంది. ‘ఆత్మ రక్షించబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను’ అని పౌలు ఆ కొరింథీయులను పురికొల్పాడు. (1 కొరింథీయులు 5:​1-5) పాపి బహిష్కరించబడి, సాతానుకు అప్పగించబడినప్పుడు, అతను మళ్లీ అపవాది లోకంలో భాగస్థుడౌతాడు. (1 యోహాను 5:​19) అతణ్ణి బహిష్కరించడం సంఘం నుండి చెడు ప్రభావాన్ని తొలగించడమేకాక, సంఘంలోని దైవిక ‘ఆత్మను’ లేదా మంచి స్వభావాన్ని కాపాడుతుంది.​—⁠2 తిమోతి 4:​22; 1 కొరింథీయులు 5:​11-13.

5 ఎంతోకాలం గడవకముందే ఆ తప్పిదస్థుణ్ణి తిరిగి చేర్చుకొమ్మని పౌలు కొరింథులోని క్రైస్తవులను కోరాడు. ఎందుకు? ఎందుకంటే, వారిని ‘సాతాను మోసపరచకూడదని’ అపొస్తలుడు చెప్పాడు. ఆ పాపి పశ్చాత్తాపపడి, పరిశుభ్రమైన జీవితం గడుపుతుండవచ్చు. (2 కొరింథీయులు 2:​8-11) కొరింథీయులు పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తిని తిరిగి చేర్చుకోకపోతే, వారు అపవాది కోరుకుంటున్నంత కఠినంగా, క్షమించనివారిగా ఉండేలా సాతాను వారిని మోసగిస్తాడు. బహుశా వారు పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా ‘క్షమించి ఆదరించి’ ఉంటారు.​—⁠2 కొరింథీయులు 2:​5-7.

6 బహిష్కరణ ద్వారా ఏమి నెరవేర్చబడుతుంది? అది యెహోవా పరిశుద్ధ నామానికి నిందరాకుండా చేసి, ఆయన ప్రజల మంచిపేరును కాపాడుతుంది. (1 పేతురు 1:​14-16) పశ్చాత్తాపం చూపించని తప్పిదస్థుణ్ణి సంఘం నుండి తొలగించడం దేవుని ప్రమాణాలను సమర్థించి, సంఘ ఆధ్యాత్మిక పరిశుభ్రతను కాపాడుతుంది. అలాగే అది పశ్చాత్తాపపడని వ్యక్తి తానుచేసిన పాపమెంత ఘోరమైనదో గ్రహించడానికి కూడా సహాయం చేస్తుంది.

పశ్చాత్తాపం అత్యంత ప్రాముఖ్యం

7 ఘోరమైన పాపం చేసిన చాలామంది నిజంగా పశ్చాత్తాపపడిన కారణంగా వారు సంఘం నుండి బహిష్కరించబడలేదు. అయితే నిజమైన పశ్చాత్తాపం చూపించడం అంత సులభం కాదు. 32వ కీర్తన కూర్చిన ఇశ్రాయేలు రాజైన దావీదు విషయమే తీసుకోండి. దావీదు బహుశా బత్షెబ విషయంలో తానుచేసిన ఘోరమైన పాపాలను కొద్దికాలం ఒప్పుకోలేదని ఆ కీర్తన వెల్లడిచేస్తోంది. తన పాపాల గురించిన బాధ వేసవికాలపు వేడి, చెట్టు తేమను ఎండిపోయేలా చేసినట్లే, తన పాపాల గురించిన బాధ ఆయనలో నిస్సత్తువను కలిగించింది. దావీదు శారీరకంగా, మానసికంగా బాధననుభవించాడు, అయితే ఆయన ‘తన అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు, యెహోవా ఆయన పాపదోషమును పరిహరించాడు.’ (కీర్తన 32:​3-5) అప్పుడు దావీదు ఇలా పాడాడు: ‘యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ధన్యుడు.’ (కీర్తన 32:​1, 2) దేవుని కనికరాన్ని పొందడమెంత అద్భుతమో కదా!

8 కాబట్టి, పాపి కనికరించబడాలంటే ఆయన పశ్చాత్తాపపడాలనేది స్పష్టం. అయితే అవమానంగా భావించడం లేదా తన పాపం తెలిసిపోతుందని భయపడడం పశ్చాత్తాపం కాదు. పశ్చాత్తాపపడడం అంటే చెడు ప్రవర్తన విషయంలో దుఃఖపడి, మనసు మార్చుకోవడమని అర్థం. పశ్చాత్తాపపడుతున్న వ్యక్తి ‘విరిగి నలిగిన హృదయంతో’ వీలైతే ‘తప్పు దిద్దుకునేందుకు’ ఇష్టపడతాడు.​—⁠కీర్తన 51:17; 2 కొరింథీయులు 7:​11, NW.

9 క్రైస్తవ సంఘంలోకి తిరిగి చేర్చుకోబడేందుకు పశ్చాత్తాపం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. బహిష్కరించబడిన వ్యక్తిని కొద్దికాలం గడిచిన తర్వాత యాంత్రికంగా సంఘంలోకి తిరిగి అంగీకరించరు. అతను తిరిగి చేర్చుకోబడేందుకు ముందు అతని హృదయ స్థితి పూర్తిగా మారాలి. అతడు తాను ఘోరమైన పాపం చేశానని, యెహోవాకు, సంఘానికి చెడ్డపేరు తెచ్చానని గ్రహించాలి. ఆ పాపి పశ్చాత్తాపపడి, క్షమాపణకోసం మనఃపూర్వకంగా ప్రార్థించి, దేవుని నీతి ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలి. తిరిగి చేర్చుకొమ్మని అడిగేటప్పుడు, తాను పశ్చాత్తాపపడినట్లు, “మారుమనస్సునకు తగిన క్రియలు” చేస్తున్నట్లు రుజువుచేయాలి.​—⁠అపొస్తలుల కార్యములు 26:​20.

తప్పు ఎందుకు ఒప్పుకోవాలి?

10 పాపం చేసిన కొందరు ఇలా తర్కించవచ్చు: ‘చేసిన పాపం గురించి ఎవరికైనా చెబితే, కలవరపెట్టే ప్రశ్నలకు నేను జవాబు చెప్పవలసి ఉండడమేకాక, నేను బహుశా బహిష్కరించబడవచ్చు. నేను మౌనంగావుంటే, ఆ పరిస్థితిని తప్పించుకోవచ్చు, పైగా సంఘంలో ఆ సంగతి ఎవరికీ ఎప్పటికీ తెలియదు.’ అలాంటి ఆలోచన కొన్ని ప్రాముఖ్యమైన అంశాల్ని పరిగణలోకి తీసుకోవడంలో తప్పిపోతుంది. ఆ అంశాలేమిటి?

11 యెహోవా ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును.’ అయినప్పటికీ, ఆయన తన ప్రజలను “మితముగా” లేక సముచిత స్థాయిలో సరిదిద్దుతాడు. (నిర్గమకాండము 34:​6, 7; యిర్మీయా 30:​11) మీరు ఘోరమైన పాపంచేసి, ఆ పాపాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తే మీరు దేవుని కనికరాన్ని ఎలా పొందుతారు? యెహోవాకు ఆ విషయం తెలుసు, ఆయన తప్పును కేవలం చూసీచూడనట్లు ఉండడు.​—⁠సామెతలు 15:⁠3; హబక్కూకు 1:​13.

12 మీరు ఘోరమైన పాపం చేసినప్పుడు, దాన్ని ఒప్పుకోవడం తిరిగి మంచి మనస్సాక్షిని పొందేందుకు మీకు సహాయం చేయగలదు. (1 తిమోతి 1:​18-20) అయితే పాపాన్ని ఒప్పుకోకపోవడంవల్ల మనస్సాక్షి చెడిపోయి ఇంకా ఎక్కువ పాపం చేసేందుకు దారితీయవచ్చు. మీరు చేసిన పాపం మరో వ్యక్తికి లేదా సంఘానికి వ్యతిరేకంగా చేసినది మాత్రమే కాదని గుర్తుంచుకోండి. అది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం. కీర్తనకర్త ఇలా ఆలపించాడు: ‘యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను, దుష్టులను పరిశీలించును.’​—⁠కీర్తన 11:​4, 5.

13 ఘోరమైన పాపాన్ని దాచిపెట్టి పరిశుభ్రమైన క్రైస్తవ సంఘంలో కొనసాగేందుకు ప్రయత్నించేవారిని యెహోవా ఆశీర్వదించడు. (యాకోబు 4:⁠6) కాబట్టి మీరు పాపంలో పడిపోయి సరైనది చేసేందుకు ఇష్టపడితే, నిజాయితీగా ఒప్పుకునేందుకు వెనుదీయకండి. లేనట్లయితే, ప్రత్యేకంగా అలాంటి గంభీరమైన విషయాలకు సంబంధించిన ఉపదేశాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు మీ మనస్సాక్షి అపరాధభావంతో నిండిపోతుంది. రాజైన సౌలు విషయంలో చేసినట్లే, యెహోవా మీ నుండి తన ఆత్మను వెనక్కి తీసుకుంటే అప్పుడేమిటి? (1 సమూయేలు 16:​14) దేవుని ఆత్మ తీసివేయబడినప్పుడు మీరు ఇంకా ఘోరమైన పాపంలో పడిపోయే అవకాశముంది.

నమ్మకమైన మీ సహోదరులను విశ్వసించండి

14 కాబట్టి పశ్చాత్తాపపడుతున్న తప్పిదస్థుడు ఏమిచేయాలి? “అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు [‘యెహోవా,’ NW] నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును.” (యాకోబు 5:​14, 15) ఒక వ్యక్తి “మారుమనస్సుకు తగిన ఫలము” ఫలించేందుకు పెద్దలతో మాట్లాడడం ఒక మార్గం. (మత్తయి 3:⁠7) విశ్వాసపాత్రులైన, దయగల ఈ పురుషులు ‘ఆయన కోసం ప్రార్థించి యెహోవా నామమున ఆయనకు నూనె రాస్తారు.’ ఉపశమనమిచ్చే నూనెలాగే వారిచ్చే బైబిలు ఉపదేశం నిజంగా పశ్చాత్తాపపడుతున్న వ్యక్తికి ఉపశమనమిస్తుంది.​—⁠యిర్మీయా 8:​22.

15 మన కాపరియైన యెహోవా సా.శ.పూ. 537లో బబులోను చెరనుండి యూదులను, సా.శ. 1919లో “మహా బబులోను” నుండి ఆధ్యాత్మిక ఇశ్రాయేలును విడిపించినప్పుడు ఆయనెంత ప్రేమపూర్వక మాదిరినుంచాడో కదా! (ప్రకటన 17:​3-5; గలతీయులు 6:​16) అలా ఆయన తానుచేసిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు: “నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును . . . తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును.”​—⁠యెహెజ్కేలు 34:​15, 16.

16 యెహోవా తన సూచనార్థక గొర్రెలను మేపుతూ, సురక్షితంగా పరుండజేస్తూ, తప్పిపోయిన వాటిని వెదకుచున్నాడు. అదే విధంగా క్రైస్తవ కాపరులు దేవుని మంద ఆధ్యాత్మికంగా చక్కగా పోషించబడి, సురక్షితంగా ఉండేలా చూస్తారు. పెద్దలు సంఘానికి దూరమైన గొర్రెలను వెదకుతారు. ‘గాయపడిన దానికి’ దేవుడు ‘కట్టు కట్టినట్లే,’ పైవిచారణకర్తలు కూడా ఇతరుల మాటలవల్లో లేదా తమ సొంత క్రియలవల్లో గాయపడిన గొర్రెలకు ‘కట్టు కడతారు.’ ‘దుర్బలముగా ఉన్నదానిని’ దేవుడు ‘బలపరిచినట్లే,’ పెద్దలు బహుశా వ్యక్తిగత తప్పువల్ల ఆధ్యాత్మికంగా రోగులైన వారికి సహాయం చేస్తారు.

కాపరులెలా సహాయమందిస్తారు?

17 పెద్దలు ఈ ఉపదేశానికి సంతోషంగా కట్టుబడతారు: “భయముతో . . . కరుణించుడి.” (యూదా 23) లైంగిక దుర్నీతికి పాల్పడి కొందరు క్రైస్తవులు ఘోరంగా పాపం చేశారు. అయితే వారు నిజంగా పశ్చాత్తాపపడితే, ఆధ్యాత్మికంగా సహాయం చేసేందుకు సిద్ధంగావున్న పెద్దలు కరుణతో, ప్రేమపూర్వక నివారణ అందిస్తారని నమ్మవచ్చు. తనతోపాటు అలాంటి పురుషుల గురించి పౌలు ఇలా చెప్పాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము.” (2 కొరింథీయులు 1:​24) కాబట్టి, వారి ఆధ్యాత్మిక సహాయాన్ని అర్థించడంలో ఎన్నటికీ వెనుదీయకండి.

18 మీరు ఘోరమైన పాపం చేసినప్పుడు, మీరెందుకు పెద్దలపై నమ్మకముంచవచ్చు? ఎందుకంటే వారు ప్రాథమికంగా దేవుని మందకు కాపరులై ఉన్నారు. (1 పేతురు 5:​1-4) గాయపడి, బాధతో మూలిగే, మచ్చిక చేసుకోగల గొర్రెపిల్లను ప్రేమగల ఏ కాపరీ కొట్టడు. కాబట్టి పెద్దలు తప్పుచేసిన తోటి విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు, అది నేరానికి, శిక్షకు సంబంధించిన విషయంగాకాక, పాపానికి, సాధ్యమైతే ఆధ్యాత్మిక పునరుద్ధరణకు సంబంధించిన విషయంగా ఉంటుంది. (యాకోబు 5:​13-20) పెద్దలు నీతినిబట్టి తీర్పుతీరుస్తూ ‘మందను కనికరిస్తారు.’ (అపొస్తలుల కార్యములు 20:​29, 30; యెషయా 32:​1, 2) మిగతా క్రైస్తవులందరిలాగే పెద్దలు ‘న్యాయంగా నడుచుకుంటూ, కనికరమును ప్రేమిస్తూ, దీనమనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి.’ (మీకా 6:⁠8) “[యెహోవా] మేపు గొఱ్ఱెల” ప్రాణానికి, వాటి పవిత్ర సేవకు సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు అలాంటి లక్షణాలు అత్యావశ్యకం.​—⁠కీర్తన 100:⁠3.

19 క్రైస్తవ కాపరులు పరిశుద్ధాత్మచేత నియమించబడి దానిచేత నడిపించబడేందుకు ప్రయత్నిస్తారు. తనకు తెలియకుండానే అన్నట్లు “ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల” ఆధ్యాత్మిక అర్హతగల పురుషులు “సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని” వచ్చేందుకు ప్రయత్నిస్తారు. (గలతీయులు 6:⁠1; అపొస్తలుల కార్యములు 20:​28) సాత్వికముతో, అయితే దేవుని ప్రమాణాలపట్ల స్థిరత్వంతో ఆ పెద్దలు, అనవసర బాధను తప్పిస్తూనే జాగ్రత్తగా, విరిగిన ఎముకను సరిదిద్దే శ్రద్ధగల వైద్యునిలా ఆ తప్పిదస్థుని ఆలోచనను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. (కొలొస్సయులు 3:​12) ఎలాంటి కనికరమైనా ప్రార్థనపై, లేఖనాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, పెద్దల నిర్ణయం ఆ విషయంపై దేవుని దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది.​—⁠మత్తయి 18:18.

20 పాపం అందరికీ తెలిసివుంటే లేదా నిస్సందేహంగా తెలిసిపోయే అవకాశముంటే సంఘం పేరును కాపాడేందుకు దానిలో ఒక ప్రకటన చేయబడడం సముచితంగా ఉండవచ్చు. సంఘానికి తెలియజేయవలసిన అవసరముంటే కూడా ఓ ప్రకటన చేయబడుతుంది. న్యాయబద్ధంగా గద్దించబడిన వ్యక్తి ఆధ్యాత్మికంగా పుంజుకుంటున్న సమయంలో, తాత్కాలికంగా అతని కార్యశీలతను పరిమితంచేసే గాయం నుండి కోలుకుంటున్న వ్యక్తికి అతణ్ణి పోల్చవచ్చు. పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తి కొద్దికాలం వరకు కూటాల్లో వ్యాఖ్యానించడానికి బదులు వినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయన మళ్లీ ‘విశ్వాసంలో లోపంలేని’ వ్యక్తిగా బలపడేలా అతనితో ఎవరైనా బైబిలు అధ్యయనం చేసేందుకు పెద్దలు ఏర్పాటు చేయవచ్చు. (తీతు 2:⁠2) ఇదంతా ప్రేమతోనే చేయబడుతుందేగానీ ఆ తప్పిదస్థుణ్ణి శిక్షించే ఉద్దేశంతో కాదు.

21 పెద్దలు వివిధ రీతుల్లో ఆధ్యాత్మిక సహాయం అందించవచ్చు. ఉదాహరణకు, గతంలో త్రాగుడు సమస్యవున్న సహోదరుడు ఇంట్లో ఒంటరిగావున్న సమయంలో ఒకటి రెండుసార్లు అతిగా త్రాగివుండవచ్చు. లేదా సిగరెట్టు త్రాగడం ఎప్పుడో మానేసిన వ్యక్తి బలహీన క్షణాల్లో ఒకటి రెండు సందర్భాల్లో సిగరెట్టు త్రాగాడు. అతను ప్రార్థించి దేవుడు తనను క్షమించాడని నమ్మినా, ఆ పాపం అలవాటుగా మారకుండా ఉండేందుకు ఆయనొక పెద్దనుండి సహాయాన్ని అర్థించాలి. ఒకరు లేదా ఇద్దరు పెద్దలు ఆ సమస్యతో వ్యవహరిస్తారు. అయితే ఆ పెద్ద(లు) సంఘ పైవిచారణకర్తకు తెలియజేస్తారు, ఎందుకంటే మరితర విషయాలు కూడా ఇమిడివుండవచ్చు.

ఎల్లప్పుడూ దైవిక క్రమశిక్షణను అంగీకరించండి

22 దేవుని ఆమోదాన్ని పొందేందుకు ప్రతీ క్రైస్తవుడు యెహోవా ఇచ్చే క్రమశిక్షణకు అవధానమివ్వాలి. (1 తిమోతి 5:​20) కాబట్టి మీరు లేఖనాల్ని, క్రైస్తవ సాహిత్యాలను అధ్యయనం చేసేటప్పుడు తారసపడే దిద్దుబాటును లేదా యెహోవా ప్రజల కూటాల్లో, సమావేశాల్లో మీరు వినే ఉపదేశాన్ని లక్ష్యపెట్టండి. యెహోవా చిత్తంచేసే విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. అప్పుడు దైవిక క్రమశిక్షణ ఆధ్యాత్మిక కోటగోడను అంటే పాపాన్ని అడ్డుకునే బలమైన ప్రాకారాన్ని కాపాడుకునేందుకు మీకు సహాయం చేస్తుంది.

23 దైవిక క్రమశిక్షణను అంగీకరించడం దేవుని ప్రేమలో నిలిచివుండేందుకు మిమ్మల్ని శక్తిమంతుల్ని చేస్తుంది. నిజమే, కొందరు క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడ్డారు, కానీ మీరు మీ ‘హృదయాన్ని భద్రముగా కాపాడుకుంటూ,’ ‘జ్ఞానిలా నడుచుకుంటే’ మీకలా జరగనక్కర్లేదు. (సామెతలు 4:​23; ఎఫెసీయులు 5:​15) ఒకవేళ మీరిప్పుడు బహిష్కరించబడిన వ్యక్తిగావుంటే, మీరెందుకు తిరిగి చేర్చుకోబడే చర్యల్ని తీసుకోకూడదు? తనకు సమర్పించుకున్న వారందరూ తనను నమ్మకంగా ఆరాధిస్తూ, ‘హృదయానందంతో’ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. (ద్వితీయోపదేశకాండము 28:​47) మీరు యెహోవా క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించేవారిగా ఉంటే మీరలా నిరంతరం చేయవచ్చు.​—⁠కీర్తన 100:⁠2.

మీరెలా జవాబిస్తారు?

• కొందరెందుకు క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడతారు?

• నిజమైన పశ్చాత్తాపంలో ఏమి ఇమిడివుంది?

• ఘోరమైన పాపాన్ని ఎందుకు ఒప్పుకోవాలి?

• పశ్చాత్తాపపడిన తప్పిదస్థులకు క్రైస్తవ పెద్దలు ఏయే విధాలుగా సహాయం చేస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. దేవుడిచ్చే క్రమశిక్షణను మనమెందుకు అంగీకరించాలి?

2. ‘క్రమశిక్షణ’ ఎలా నిర్వచించబడింది, ఒక వ్యక్తికి క్రమశిక్షణ ఎలా ఇవ్వబడవచ్చు?

3. ఒక వ్యక్తి ఎప్పుడు బహిష్కరించబడతాడు?

4, 5. బహిష్కరణకు సంబంధించిన ఏ లేఖనాధార ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది, ఆ వ్యక్తిని తిరిగి చేర్చుకొనేలా సంఘమెందుకు పురికొల్పబడింది?

6. బహిష్కరణ ఏమి నెరవేర్చగలదు?

7. దావీదు తన అతిక్రమములను ఒప్పుకోకపోవడం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపించింది?

8, 9. పశ్చాత్తాపం ఎలా కనబర్చబడుతుంది, బహిష్కరించబడిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడానికి సంబంధించి అదెంత ప్రాముఖ్యం?

10, 11. పాపాన్ని దాచిపెట్టేందుకు మనమెందుకు ప్రయత్నించకూడదు?

12, 13. తప్పును దాచివుంచేందుకు ప్రయత్నించడంవల్ల ఏమి జరగవచ్చు?

14. తప్పిదస్థుడు యాకోబు 5:​14, 15లోని ఉపదేశాన్ని ఎందుకు అనుసరించాలి?

15, 16. యెహెజ్కేలు 34:​15, 16లో వ్రాయబడినట్లుగా దేవుడు ఉంచిన మాదిరిని క్రైస్తవ పెద్దలు ఎలా అనుసరిస్తారు?

17. పెద్దలనుండి ఆధ్యాత్మిక సహాయాన్ని అర్థించడంలో మనమెందుకు వెనుదీయకూడదు?

18. తప్పుచేసిన తోటి విశ్వాసులతో పెద్దలు ఎలా వ్యవహరిస్తారు?

19. పెద్దలు ఏ దృక్పథంతో ఒక వ్యక్తిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు?

20. ఫలానా వ్యక్తి గద్దించబడ్డాడని సంఘానికి ప్రకటించే అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది?

21. కొన్నిరకాల తప్పిదాలతో ఎలా వ్యవహరించవచ్చు?

22, 23. మీరెందుకు ఎల్లప్పుడూ దేవుని క్రమశిక్షణను అంగీకరిస్తూ ఉండాలి?

[26వ పేజీలోని చిత్రం]

అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు బహిష్కరణ గురించిన ఆదేశాలను ఎందుకు పంపించాడు?

[29వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాలంలోని కాపరుల్లా, క్రైస్తవ పెద్దలు గాయపడిన దేవుని గొర్రెలకు ‘కట్టు కడతారు’