కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మేము చేసిన కృషి

ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మేము చేసిన కృషి

జీవిత కథ

ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మేము చేసిన కృషి

రాల్ఫ్‌ బ్రుగ్గెమైర్‌ చెప్పినది

నేను అరెస్టు చేయబడిన తర్వాత నాకు మొట్టమొదట అందింది నా స్నేహితుని ఉత్తరమే. మా అమ్మ, నా తమ్ముళ్ళు పీటర్‌, యోకెన్‌, మాన్‌ఫ్రెట్‌లను కూడా అరెస్టు చేశారని ఆయన వ్రాశాడు. దానితో మా చెల్లెళ్ళిద్దరికీ తల్లిదండ్రుల, తోబుట్టువుల నీడ లేకుండా పోయింది. తూర్పు జర్మన్‌ అధికారులు మా కుటుంబాన్ని ఎందుకలా హింసించారు? ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మాకు ఏమి సహాయం చేసింది?

రెం డవ ప్రపంచ యుద్ధంవల్ల మాకు ప్రశాంతమైన బాల్యమే లేకుండా పోయింది, యుద్ధం సృష్టించే బీభత్సాన్ని మేము కళ్లారా చూశాం. మా నాన్న జర్మన్‌ సైనికదళంలో చేరి యుద్ధ ఖైదీగా మరణించాడు. దాంతో ఏడాది వయసున్న పాపనుండి 16 ఏళ్ళ అబ్బాయి వరకు మొత్తం ఆరుగురు పిల్లలను పెంచే భారం మా అమ్మ బెర్టాపై పడింది.

తను హాజరయ్యే ఇవాంజిలికల్‌ చర్చీలోని బోధలవల్ల మా అమ్మ మతం విషయంలో పూర్తిగా నిరాశచెంది, ఇక దేవుని గురించి విననని నిర్ణయించుకుంది. కానీ 1949లో ఒకరోజున, కాస్త పొట్టిగా ఉండే ఇల్సీ ఫక్స్‌ అనే వివేకవంతమైన స్త్రీ దేవుని రాజ్యం గురించి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చింది. ఆమె అడిగిన ప్రశ్నలు, ఆమె తర్కం మా అమ్మలో ఉత్సుకతను రేపాయి. బైబిలు అధ్యయనం మా అమ్మకు నిరీక్షణనిచ్చింది.

అబ్బాయిలమైన మేము మొదట్లో ఆమె చెప్పిన విషయాల్ని సందేహించాము. నాజీలు, ఆ తర్వాత కమ్యూనిస్టులు గొప్పగొప్ప వాగ్దానాలు చేశారు కానీ వేటినీ నెరవేర్చలేదు. ఎలాంటి కొత్త వాగ్దానాలైనా మాకు నమ్మశక్యంగా అనిపించేవికావు. అయితే, యుద్ధ సన్నాహాలకు సహకరించనందుకు నిర్బంధ శిబిరాల్లో వేయబడిన కొందరు సాక్షుల గురించి తెలుసుకున్నప్పుడు మేమెంతగానో ప్రభావితులమయ్యాం. ఆ తర్వాతి సంవత్సరమే మా అమ్మ, పీటర్‌, నేను బాప్తిస్మం తీసుకున్నాం.

మా చిన్న తమ్ముడైన మాన్‌ఫ్రెట్‌ కూడా బాప్తిస్మం తీసుకున్నాడు కానీ సత్యం అతని హృదయంలో వేళ్ళూనలేదని స్పష్టమయ్యింది. కమ్యూనిస్టులు 1950లో మా పనిని నిషేధించిన సమయంలో, క్రూరత్వానికి పేరుమోసిన స్టాజీ గూఢచారి పోలీసులు అతణ్ణి ఒత్తిడి చేసినప్పుడు మా కూటాలు ఎక్కడ నిర్వహించబడేవో చెప్పేశాడు. దాని మూలంగానే ఆ తర్వాత మా అమ్మ, తమ్ముళ్లు అరెస్టు చేయబడ్డారు.

నిషేధం క్రింద సేవ చేయడం

మా దేశంలో సాహిత్యాలు నిషేధించబడిన కారణంగా మేము తూర్పు జర్మనీలోకి వాటిని దొంగచాటుగా తీసుకొని రావాల్సి వచ్చేది. సాహిత్యాలు నిషేధించబడని బెర్లిన్‌లోని పశ్చిమ ప్రాంతం నుండి నేను సాహిత్యాలు తీసుకుని, సరిహద్దుకు ఈవైపునున్న మా దేశంలోకి చేరవేసేవాడిని. నేను ఒకటికన్నా ఎక్కువసార్లు పోలీసుల నుండి తప్పించుకున్నాను, కానీ చివరకు 1950 నవంబరులో పట్టుబడ్డాను.

స్టాజీ నన్ను కిటికీలు లేని, భూగర్భ బందిఖానాలో పెట్టింది. పగలు నిద్రపోనిచ్చేవారు కాదు, రాత్రుళ్ళు నన్ను ప్రశ్నలతో వేధించేవారు, కొన్నిసార్లు కొట్టేవారు కూడా. 1951వ సంవత్సరం మార్చిలో, న్యాయస్థానంలో నా కేసు విచారణకు మా అమ్మ, పీటర్‌, యోకెన్‌ హాజరయ్యేవరకు నాకు నా కుటుంబం గురించి ఎలాంటి సమాచారమూ అందలేదు. నాకు ఆరేళ్ళు జైలుశిక్ష విధించబడింది.

నా కేసు విచారణ జరిగిన ఆరు రోజులకు పీటర్‌, యోకెన్‌, అమ్మ అరెస్టయ్యారు. ఆ తర్వాత తోటి విశ్వాసి ఒకామె 11 సంవత్సరాల మా చెల్లి హాన్నాలోరా బాధ్యత తీసుకుంది, మా పెద్దమ్మ 7 ఏళ్ల సబీనాను తీసుకువెళ్లింది. స్టాజీ గార్డులు మా అమ్మను, తమ్ముళ్లను ప్రమాదకరమైన నేరస్థుల్లా పరిగణిస్తూ, వారి దగ్గరున్న వస్తువులన్నీ చివరకు బూటు లేసుల్ని కూడా తీసేసుకున్నారు. వారిని విచారిస్తున్నంత సేపూ వారు నిలబడే ఉండాల్సి వచ్చేది. వారికి కూడా ఆరు సంవత్సరాల చొప్పున శిక్ష విధించబడింది.

నేను, సాక్షులైన ఇంకొందరు ఖైదీలు 1953లో మిలటరీ విమానాశ్రయం కట్టడానికి నియమించబడినప్పుడు, మేము నిరాకరించాం. అధికారులు మమ్మల్ని 21 రోజులపాటు విడివిడిగా ఖైదు చేశారు, అంటే మాకు పనిగానీ, ఉత్తరాలుగానీ ఇవ్వబడవు, చాలా తక్కువ ఆహారం ఇవ్వబడుతుంది. కొందరు క్రైస్తవ సహోదరీలు తమకు దొరికే కాస్త ఆహారంలో కొంచెం దాచి చాటుగా తెచ్చి మాకిచ్చేవారు. అలా నాకు పరిచయమైన సహోదరీల్లో ఒకరైన ఆనీ 1956లో విడుదలైంది. నేను 1957లో విడుదలైన తర్వాత ఆమెను పెళ్ళి చేసుకున్నాను. మా పెళ్లైన ఒక సంవత్సరానికి మాకు రూత్‌ పుట్టింది. పీటర్‌, యోకెన్‌, హాన్నాలోరా ఇంచుమించు అదే సమయంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు.

నేను విడుదలైన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత నన్ను మళ్ళీ అరెస్టు చేశారు. ఒక స్టాజీ అధికారి నన్నొక గూఢచారిగా చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. “బ్రుగ్గెమైర్‌గారు, దయచేసి సరిగ్గా ఆలోచించండి. జైల్లో ఉండడమంటే ఏమిటో మీకు తెలియనిది కాదు, మీరు మళ్ళీ ఆ కష్టాలను అనుభవించడం మాకు ఇష్టంలేదు. మీరు సాక్షిగానే ఉండవచ్చు, మీ అధ్యయనాలను కొనసాగించుకోవచ్చు, బైబిలు గురించి మీకు కావల్సినంత మాట్లాడుకోవచ్చు. మాకు కేవలం సమాచారం అందిస్తే చాలు. మీ భార్య గురించి, మీ చిన్న కూతురు గురించి ఆలోచించండి.” అతను ఆ చివరి వాక్యం అన్నప్పుడు నా గుండె పిండేసినట్టయ్యింది. కానీ, నేను జైలులో ఉండగా, నాకన్నా బాగా యెహోవా నా కుటుంబ అవసరాలను తీర్చగలడని నాకు తెలుసు, ఆయన అలా చేశాడు కూడా!

ఆనీ పగలంతా పని చేసేలా, రూత్‌ను వారంలో వేరేవాళ్లు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆమెను బలవంతపెట్టారు. ఆనీ దానికి ఒప్పుకోకుండా, రూత్‌ను పగలు తానే చూసుకుంటూ రాత్రుళ్ళు పనిచేసేది. మా ఆధ్యాత్మిక సహోదరులు వారిపట్ల ఎంతో శ్రద్ధ కనపరిచి, నా భార్యకు ఎన్ని వస్తువులిచ్చారంటే ఆమె వాటిని ఇతరులతో కూడా పంచుకోగలిగింది. నేను దాదాపు ఆరు సంవత్సరాలు ఖైదీగా గడిపాను.

జైల్లో ఉండగా మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాం?

నేను రెండవసారి జైలుకు వెళ్ళినప్పుడు, నన్ను వేసిన జైలుగదిలోని సాక్షులు కొత్తగా ఏ సాహిత్యాలు ప్రచురించబడ్డాయో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. వారికి ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగేలా, నేను బయట ఉన్నప్పుడు కావలికోట పత్రికను శ్రద్ధగా చదివి, క్రమంగా కూటాలకు హాజరైనందుకు నేనెంత సంతోషించానో!

మేము గార్డులను బైబిలు కోసం అడిగినప్పుడు, “యెహోవాసాక్షులకు బైబిలు ఇవ్వడం అంటే జైల్లో ఉన్న దొంగ పారిపోవడానికి పరికరాలు ఇచ్చినంత ప్రమాదకరం” అని వారన్నారు. ప్రతీరోజు, సారథ్యం వహించే సహోదరులు చర్చించడానికి ఒక బైబిలు వచనాన్ని ఎంపిక చేసేవారు. రోజూ మేము పెరట్లో నడవాల్సిన అరగంటలో మాకు లభించే వ్యాయామం లేదా స్వచ్ఛమైన గాలికన్నా ఆ రోజు బైబిలు వచనం నుండి దొరికే ప్రయోజనంపైనే మాకు మరింత ఆసక్తి ఉండేది. ప్రతీ ఒక్కరూ 15 అడుగుల ఎడంతో నడుస్తూ మౌనంగా ఉండాల్సి వచ్చినా అందరికీ వచనం చేరవేయడానికి పద్ధతులు కనిపెట్టేవాళ్ళం. మా గదులకు తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్లు విన్నదాన్ని అందరితో పంచుకుని, ఆ తర్వాత దినపు బైబిలు చర్చ నిర్వహించేవాళ్లం.

కానీ, ఒక గూఢచారి మా గురించి చెప్పేయడంతో నన్ను ఒంటరిగా ఖైదుచేశారు. అప్పటికల్లా నేను వందలాది లేఖనాలను కంఠతా పట్టినందుకు నేనెంతో ఆనందించాను! నేను ఖాళీగా ఉన్న ఆ రోజుల్లో విభిన్న బైబిలు అంశాల గురించి ధ్యానించాను. ఆ తర్వాత నన్ను మరో జైలుకు బదిలీ చేశారు. అక్కడి గార్డు నన్ను మరో ఇద్దరు సాక్షులున్న గదిలో పెట్టడమేకాక, మరింత సంతోషకరంగా మాకు బైబిలు కూడా ఇచ్చాడు. ఆరు నెలలు ఒంటరిగా ఖైదులో గడిపిన తర్వాత మళ్ళీ తోటి విశ్వాసులతో బైబిలు అంశాలను చర్చించగల్గినందుకు నేనెంతో సంతోషించాను.

నా తమ్ముడు పీటర్‌ వేరే జైలులో ఉన్నప్పుడు సహించడానికి తనకు ఏది సహాయం చేసిందో వర్ణిస్తూ, “నేను నూతనలోకంలో జీవితం గురించి ఊహించుకుంటూ, ఎప్పుడూ బైబిల్లోని విషయాల గురించి ఆలోచించేవాడిని. బైబిలు ప్రశ్నలు అడగడం ద్వారా, లేఖనాల్లో పరీక్షలు పెట్టుకోవడం ద్వారా సాక్షులందరం ఒకరినొకరం బలపర్చుకునేవాళ్లం. జీవితం అంత సాఫీగా సాగలేదు. కొన్నిసార్లు మాలో 11 మందిని సుమారు 12 చదరపు మీటర్ల స్థలంలోనే బంధించేవారు. మేము అక్కడే తినడం, పడుకోవడం, స్నానం చేయడమేకాక కాలకృత్యాలు కూడా తీర్చుకోవాల్సి వచ్చేది. మా మనసులు భయంతో, జుగుప్సతో నిండిపోయేవి” అని చెప్పాడు.

మరో తమ్ముడు యోకెన్‌, తాను ఖైదులో ఉన్నప్పటి అనుభవం గుర్తుచేసుకుంటూ, “మన పాటల పుస్తకంలో నాకు గుర్తున్న పాటలు పాడేవాడ్ని. ప్రతీరోజు నేను కంఠస్థం చేసుకున్న ఒక లేఖనం గురించి ధ్యానించేవాడిని. నేను విడుదలైన తర్వాత కూడా క్రమంగా ఆధ్యాత్మిక ఉపదేశాన్ని తీసుకోవడంలో కొనసాగాను. ప్రతీరోజు మా కుటుంబమంతా బైబిలు వచనాన్ని చదివేవాళ్ళం. అన్ని కూటాలకూ సిద్ధపడేవాళ్ళం కూడా” అని అన్నాడు.

అమ్మ జైలునుండి విడుదలవడం

రెండు సంవత్సరాలకన్నా కొంచెం ఎక్కువకాలం నిర్బంధం తర్వాత అమ్మను విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె హాన్నాలోరా, సబీనాలతో బైబిలు అధ్యయనం చేయడంలో, వారి విశ్వాసానికి మంచి పునాది వేయడంలో తన సమయాన్ని వెచ్చించింది. స్కూల్లో వారికి దేవునిపై విశ్వాసం విషయంలో ఎదురయ్యే వివాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమె నేర్పింది. హాన్నాలోరా ఇలా అంది: “మాకు స్కూల్లో ఏమి జరిగినా పట్టించుకునేవాళ్ళం కాదు ఎందుకంటే మేము ఇంట్లో ఒకరినొకరం ప్రోత్సహించుకునేవాళ్లం. బలమైన మా కుటుంబ బాంధవ్యాలతో పోలిస్తే మాకు ఎదురైన కష్టాలు అంత పెద్దవి కావు.”

హాన్నాలోరా ఇంకా ఇలా చెప్పింది: “మేము జైల్లో ఉన్న మా సహోదరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా అందించేవాళ్ళం. మేము మైనం పూసిన కాగితంపై కావలికోట పూర్తి సంచికను చిన్నచిన్న అక్షరాల్లో వ్రాసేవాళ్లం. ఆ తర్వాత వాటిని తడి అంటుకోని కాగితంలో చుట్టి ఎండిన పండ్లలో పెట్టి వాళ్లకు నెలసరి పార్సిల్స్‌లో పంపించేవాళ్లం. ఆ పండ్లు ‘ఎంతో రుచిగా’ ఉన్నాయని మాకు కబురందినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. మేము మా పనిలో ఎంతగా మునిగిపోయామంటే, ఆ సమయమంతా ఎంతో ఆహ్లాదకరంగా గడిచిందనే చెప్పాలి.”

నిషేధం క్రింద జీవించడం

తూర్పు జర్మనీలో మన పని నిషేధించబడిన ఐదు సంవత్సరాల్లో జీవితం ఎలా ఉందో వర్ణిస్తూ పీటర్‌, “మేము సహోదరుల ఇళ్లలో చిన్న గుంపులుగా కలుసుకునేవాళ్లం, అందరూ ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో వచ్చి వెళ్ళేవారు. ప్రతీ కూటంలో, తర్వాతి కూటానికి ఏర్పాట్లు చేసుకునేవాళ్లం. మేము తరచూ చేతి సంజ్ఞలను, వ్రాత ప్రతులను ఉపయోగించి సమాచారాన్ని పంచుకునేవాళ్లం ఎందుకంటే మేము మాట్లాడుకునే విషయాలను స్టాజీ దొంగచాటుగా వినే ప్రమాదం పొంచివుండేది” అని చెప్పాడు.

హాన్నాలోరా ఇంకా వివరిస్తూ, “కొన్నిసార్లు మాకు సమావేశ కార్యక్రమాల రికార్డింగులు పంపించబడేవి. అప్పుడు మేము మహదానందంతో కూడుకునేవాళ్లం. ఎన్నో గంటల ఆ బైబిలు ఉపదేశాన్ని వినడానికి మా చిన్న గుంపులో అందరం ఒకచోట కలుసుకొనేవాళ్లం. మేము ప్రసంగీకులను చూడలేకపోయినా, జాగ్రత్తగా వింటూ, నోట్సు కూడా వ్రాసుకునేవాళ్లం” అని చెప్పింది.

పీటర్‌ ఇలా అన్నాడు: “మాకు బైబిలు సాహిత్యం అందించడానికి ఇతర దేశాల్లోని మన క్రైస్తవ సహోదరులు చాలా శ్రమ తీసుకున్నారు. బెర్లిన్‌ గోడ 1989లో పడద్రోయబడకముందు గడిచిన 10 సంవత్సరాల్లో వారు మా కోసం ప్రత్యేకంగా చిన్న అచ్చు ఉన్న సాహిత్యాలను ముద్రించేవారు. తూర్పు జర్మనీలోకి ఆధ్యాత్మిక ఆహారాన్ని సరఫరా చేయడానికి కొందరు తమ కార్లను, డబ్బును, చివరకు తమ స్వేచ్ఛను కూడా పణంగా పెట్టారు. ఒక రాత్రి మేము ఎదురుచూస్తున్న ఒక జంట రాలేదు. పోలీసులు సాహిత్యాన్ని కనుగొని వారి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదాలున్నా, ప్రశాంతమైన జీవితం కోసం మా పనిని ఆపేయాలని మేమెన్నడూ అనుకోలేదు.”

గతంలో 1950వ సంవత్సరంలో మాకు నమ్మకద్రోహం చేసిన మా తమ్ముడు మాన్‌ఫ్రెట్‌ తిరిగి ఎలా తన విశ్వాసాన్ని సంపాదించుకుని, కాపాడుకున్నాడో వివరిస్తూ, “కొన్ని నెలలవరకు నన్ను నిర్బంధంలో ఉంచారు, ఆ తర్వాత నేను పశ్చిమ జర్మనీకి వెళ్ళిపోయి, సత్యాన్ని వదిలేశాను. నేను 1954లో తూర్పు జర్మనీకి తిరిగి వచ్చి ఆ తర్వాతి సంవత్సరంలో వివాహం చేసుకున్నాను. కొంతకాలానికి నా భార్య బైబిలు సత్యాన్ని అంగీకరించి, 1957లో బాప్తిస్మం తీసుకుంది. నా మనస్సాక్షి నన్ను వేధించడం మొదలుపెట్టింది, నా భార్య సహాయంతో నేను సంఘానికి తిరిగి వచ్చాను” అని చెప్పాడు.

“సత్యాన్ని వదిలివెళ్లక ముందు నన్నెరిగిన క్రైస్తవ సహోదరులు అసలేమీ జరగనట్లే నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. అలా ఆత్మీయమైన చిరునవ్వుతో, కౌగిలించుకుని ఆహ్వానించబడడం నిజంగా అనిర్వచనీయం. నేను తిరిగి యెహోవాకు, నా సహోదరులకు చేరువైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను” అని మాన్‌ఫ్రెట్‌ అన్నాడు.

ఆధ్యాత్మిక పోరాటం కొనసాగింది

మా కుటుంబంలోని ప్రతీ వ్యక్తి తన విశ్వాసం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. “ముందెన్నటికన్నా నేడు మనం అనేక ఆటంకాల, వస్తుపరమైన ప్రలోభాల మధ్య జీవిస్తున్నాం. నిషేధం క్రింద ఉన్న సమయంలో మాకున్న దాంట్లోనే మేము సరిపెట్టుకున్నాం. ఉదాహరణకు, కేవలం వ్యక్తిగత కారణాల కోసం వేరే అధ్యయన గుంపుకు ఎవరూ మారాలనుకోలేదు, కూటాలు చాలా దూరంలో ఉన్నాయని లేదా చాలా ఆలస్యంగా పెడుతున్నారని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కొన్నిసార్లు కూటం నుండి వెళ్ళడానికి తమ వంతు కోసం మాలో కొందరు రాత్రి 11 గంటలవరకు వేచివుండాల్సివచ్చినా, అలా అందరం కలుసుకోవడానికి సంతోషించేవాళ్లం” అని పీటర్‌ పేర్కొంటున్నాడు.

మా అమ్మ 1959లో పదహారేళ్ళ సబీనాతో పశ్చిమ జర్మనీకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. వారు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవ చేయాలనుకోవడంతో బ్రాంచి కార్యాలయం వారిని బాడెన్‌ వుట్టెన్బర్గ్‌లోని ఎల్వానన్‌కు వెళ్ళమని నిర్దేశించినప్పుడు వారు అక్కడికి వెళ్లారు. ఆరోగ్యం అనుకూలించకపోయినా మా అమ్మ చూపించిన ఉత్సాహం, సబీనా 18 ఏళ్ల వయసులోనే పయినీరు సేవ ప్రారంభించేందుకు పురికొల్పింది. సబీనాకు పెళ్ళైన తర్వాత, మా అమ్మ ప్రకటనాపనిలో మరింత చేయడానికి 58 ఏళ్ల వయసులో డ్రైవింగ్‌ నేర్చుకుంది. తను 1974లో మరణించేంతవరకు ఆ ఆధిక్యతను ఎంతో అమూల్యంగా పరిగణించింది.

నా విషయానికి వస్తే, రెండవసారి దాదాపు ఆరేళ్ళ జైలుశిక్ష ముగిసిన తర్వాత, నా కుటుంబానికి తెలియకుండా నన్ను 1965లో పశ్చిమ జర్మనీకి తరలించారు. ఆ తర్వాత నా భార్య ఆనీ, కూతురు రూత్‌ అక్కడికి వచ్చారు. ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవ చేయాలనే ఉద్దేశంతో మేము బ్రాంచి కార్యాలయాన్ని నిర్దేశం కోసం అడిగినప్పుడు, వారు మమ్మల్ని బవారియాలోని నోయెర్ట్‌లినెన్‌కు వెళ్ళమని అడిగారు. అక్కడే మా కూతురు రూత్‌, మా బాబు యోహాన్నెస్‌ పెరిగి పెద్దయ్యారు. ఆనీ పయినీరు పరిచర్య ప్రారంభించింది. ఆనీ మంచి మాదిరివల్ల రూత్‌ స్కూలు చదువు ముగించిన వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టడానికి పురికొల్పబడింది. మా పిల్లలిద్దరూ పయినీర్లనే వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి కూడా కుటుంబాలున్నాయి, మాకు ఆరుగురు ముద్దుముద్దు మనవళ్ళు, మనవరాండ్రు ఉన్నారు.

ముందుగానే రిటైరవడానికి 1987లో చేతికివచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఆనీతో కలిసి పయినీరు పరిచర్య ప్రారంభించాను. మూడు సంవత్సరాల తర్వాత, సెల్టర్స్‌లోని బ్రాంచి కార్యాలయ విస్తరణా పనిలో సహాయం చేయడానికి నన్ను అక్కడికి ఆహ్వానించారు. ఆ తర్వాత, ఒకప్పుడు పశ్చిమ జర్మనీగావున్నదానిలోని గ్లౌకోలో మొట్టమొదటి సమావేశ హాలు నిర్మించడంలో మేము సహాయం చేశాం, తర్వాతి సంవత్సరాల్లో మేము దానికి సంరక్షకులుగా కూడా పనిచేశాం. ఆరోగ్య సమస్యల కారణంగా, మేము నోయెర్ట్‌లినెన్‌ సంఘంతో సహవసిస్తున్న మా కూతురితో ఉండడానికి అక్కడికి వెళ్లాం, ఇప్పుడు అక్కడే పయినీర్లుగా సేవ చేస్తున్నాం.

నా తమ్ముళ్లు, చెల్లెళ్ళందరూ, మా కుటుంబ సభ్యుల్లో చాలామంది ప్రేమగల దేవుడైన యెహోవాను సేవించడంలో కొనసాగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సంవత్సరాలు గడుస్తుండగా, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నంతకాలం, కీర్తన 126:⁠3లో ఉన్న ఈ మాటల సత్యాన్ని అనుభవించవచ్చని మేము తెలుసుకున్నాం: “యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతిమి.”

[13వ పేజీలోని చిత్రం]

1957లో మా పెళ్ళిరోజున

[13వ పేజీలోని చిత్రం]

1948లో మా కుటుంబంతో: (ముందు, ఎడమ నుండి కుడికి) మాన్‌ఫ్రెట్‌, మా అమ్మ బెర్టా, సబీనా, హాన్నాలోరా, పీటర్‌; (వెనుక, ఎడమ నుండి కుడికి) నేను, యోకెన్‌

[15వ పేజీలోని చిత్రాలు]

పని నిషేధించబడిన సమయంలో ఉపయోగించబడిన చిన్న అచ్చు పుస్తకం, దొంగచాటుగా సంభాషణలు వినడానికి “స్టాజీ” ఉపయోగించిన యంత్రం

[చిత్రసౌజన్యం]

Forschungs- und Gedenkstätte NORMANNENSTRASSE

[16వ పేజీలోని చిత్రం]

నా తోబుట్టువులతో: (ముందు, ఎడమ నుండి కుడికి) హాన్నాలోరా, సబీనా; (వెనుక, ఎడమ నుండి కుడికి) నేను, యోకెన్‌, పీటర్‌, మాన్‌ఫ్రెట్‌