కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తువిరోధిని ఎందుకు గుర్తించాలి?

క్రీస్తువిరోధిని ఎందుకు గుర్తించాలి?

క్రీస్తువిరోధిని ఎందుకు గుర్తించాలి?

“క్రీస్తువిరోధి వచ్చునని వింటిరి” అని చాలాకాలం క్రితం ప్రేరేపితుడైన అపొస్తలుడు రాశాడు. (1 యోహాను 2:​18) ఆ మాటలు ఎంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయో కదా! శతాబ్దాలుగా, ప్రజలు ఆ మాటలకున్న భావం గురించి ఆలోచించారు. క్రీస్తువిరోధి ఎవరు? అతను ఎప్పుడు వస్తాడు? అతను వచ్చినప్పుడు ఏమి చేస్తాడు?

క్రీ స్తువిరోధి అని ఆరోపించబడినవారి పట్టిక చాలా పెద్దగా ఉంది. గతంలో “క్రీస్తువిరోధి”గా ముద్రవేయబడినవారిలో యూదులు, క్యాథలిక్‌ పోప్‌ అధికార వ్యవస్థతో పాటు, రోమా చక్రవర్తులు కూడా ఉన్నారు. ఉదాహరణకు, చర్చి తరఫున మతయుద్ధాల్లో పాల్గొనకూడదని చక్రవర్తి ఫ్రెడ్రిక్‌ II (1194-1250) నిర్ణయించుకున్నప్పుడు, పోప్‌ గ్రెగరీ IX ఆయనను క్రీస్తువిరోధిగా పేర్కొని చర్చి నుండి బహిష్కరించాడు. గ్రెగరీ వారసుడు ఇన్నోసెంట్‌ IV ఆయనను మళ్లీ బహిష్కరించాడు. ఫ్రెడ్రిక్‌ దానికి ప్రతిస్పందనగా, ఇన్నోసెంట్‌ను క్రీస్తువిరోధిగా ప్రకటించాడు.

బైబిలు రచయితల్లో అపొస్తలుడైన యోహాను మాత్రమే “క్రీస్తువిరోధి” అనే పదాన్ని ఉపయోగించాడు. ఆయన రాసిన రెండు పత్రికల్లో ఆ పదం ఐదుసార్లు కనిపిస్తుంది, అది ఏక వచనంలోనూ, బహువచనంలోను ఉంది. ఆ పదం ఉన్న లేఖనాలు తర్వాతి పేజీలో ఉన్న బాక్సులో పేర్కొనబడ్డాయి. క్రీస్తువిరోధి అబద్ధికుడని, మోసగాడని, క్రీస్తుతో, దేవునితో ఒక వ్యక్తికున్న సంబంధాన్ని నాశనం చేయాలనే దృఢనిశ్చయంతో అతడు ఉన్నాడని ఆ లేఖనాల నుండి మనం గ్రహించవచ్చు. అందుకే, అపొస్తలుడు తన తోటిక్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.”​—⁠1 యోహాను 4:⁠1.

యేసు కూడా మోసగాళ్ల గురించి లేక అబద్ధ ప్రవక్తల గురించి ఇలా హెచ్చరించాడు: “వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన [లేక, క్రియలవలన] మీరు వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:​15, 16) అలంకారార్థ క్రీస్తువిరోధి గురించి యేసు కూడా తన అనుచరులను హెచ్చరిస్తున్నాడా? హానికరమైన ఆ మోసగాణ్ణి ఎలా గుర్తించవచ్చు వంటి అంశాలను మనం పరిశీలిద్దాం.