కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తువిరోధి నిజస్వరూపం బహిర్గతమైంది

క్రీస్తువిరోధి నిజస్వరూపం బహిర్గతమైంది

 క్రీస్తువిరోధి నిజస్వరూపం బహిర్గతమైంది

ఒక భయంకరమైన తెగులు మీ ప్రాంతంలో ప్రబలుతోందని మీకు తెలిస్తే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? మీరు బహుశా మీ రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ అంటువ్యాధిగల ప్రజలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక భావంలో కూడా మనం అలాగే చేయాలి. క్రీస్తువిరోధి ‘ఇదివరకే లోకంలో ఉన్నాడని’ లేఖనాలు చెబుతున్నాయి. (1 యోహాను 4:⁠3) మనకు ఆ “అంటువ్యాధి” సోకకుండా ఉండాలంటే మనం దానిని “వ్యాపింపజేసేవారిని” గుర్తించి వారికి దూరంగా ఉండాలి. సంతోషకరమైన విషయమేమిటంటే, క్రీస్తువిరోధి గురించి బైబిలు ఎంతో సమాచారాన్ని అందిస్తోంది.

క్రీస్తువిరోధి అనే పదం విస్తృతభావంలో, క్రీస్తును లేక ఆయన ప్రతినిధులను వ్యతిరేకించే లేదా తామే క్రీస్తులమని లేక ఆయన ప్రతినిధులమని తప్పుగా చెప్పుకునే వారందరికీ వర్తిస్తుంది. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి [లేక క్రీస్తువిరోధి]; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.”​—⁠లూకా 11:​23.

యేసు మరణించి పరలోకానికి పునరుత్థానమై 60 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిన తర్వాత యోహాను క్రీస్తువిరోధి గురించి రాశాడు. కాబట్టి, క్రీస్తువిరోధి కార్యకలాపాలు భూమ్మీదున్న యేసు నమ్మకమైన అనుచరులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ద్వారా వాటిని అర్థం చేసుకోవాలి.​—⁠మత్తయి 25:​40, 45.

క్రీస్తువిరోధి క్రీస్తు అనుచరులకూ విరోధి

లోకం వారిని ద్వేషిస్తుందని యేసు తన అనుచరులను హెచ్చరించాడు. ఆయన ఇలా చెప్పాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు.”​—⁠మత్తయి 24:​9, 11.

“[యేసు] నామము నిమిత్తము” ఆయన శిష్యులు హింసించబడతారు కాబట్టి, హింసించేవారు స్పష్టంగా క్రీస్తుకు విరోధులు. ఒకప్పుడు క్రైస్తవులుగా ఉన్న కొందరు “అబద్ధ ప్రవక్తలు” కూడా క్రీస్తువిరోధులే. (2 యోహాను 7, 8) ఈ “అనేకులైన క్రీస్తువిరోధులు . . . మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు” అని యోహాను రాశాడు.​—⁠1 యోహాను 2:​18, 19.

యేసు, యోహాను చెప్పిన మాటలు, క్రీస్తువిరోధి అనే మాట కేవలం ఒక వ్యక్తిని మాత్రమే సూచించడంలేదు గానీ అనేకమందిని సూచిస్తోందని స్పష్టంచేస్తున్నాయి. అంతేకాక, వారు అబద్ధ ప్రవక్తలు కాబట్టి, వారి ప్రధాన లక్ష్యాల్లో మతసంబంధంగా మోసం చేయడం ఒకటి. దానికి వారు ఉపయోగించే కొన్ని పద్ధతులు ఏమిటి?

మతసంబంధ అబద్ధాలను వ్యాప్తిచేయడం

హుమెనైయు, ఫిలేతు వంటి మతభ్రష్టుల బోధల విషయంలో జాగ్రత్తగా ఉండమని, “కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును” అని అపొస్తలుడైన పౌలు తన తోటి పనివాడైన తిమోతిని హెచ్చరించాడు. పౌలు ఇంకా ఇలా అన్నాడు: “వారు​—⁠పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.” (2 తిమోతి 2:​16-18) పునరుత్థానం సూచనార్థకమైనదని, ఆధ్యాత్మిక భావంలో క్రైస్తవులు ఎప్పుడో పునరుత్థానం చేయబడ్డారని హుమెనైయు, ఫిలేతు బోధించినట్లు స్పష్టమౌతోంది. నిజమే, ఒక వ్యక్తి యేసు నిజమైన శిష్యునిగా మారడంవల్ల దేవుని దృష్టిలో జీవంలోకి వస్తాడని పౌలు స్వయంగా స్పష్టంచేశాడు. (ఎఫెసీయులు 2:​1-5) అయితే, హుమెనైయు, ఫిలేతుల బోధ, దేవుని రాజ్య పరిపాలనలో యేసు వాగ్దానం చేసిన మృతుల అక్షరార్థ పునరుత్థానాన్ని ఉపేక్షించింది.​—⁠యోహాను 5:​28, 29.

నాస్టిక్స్‌ (అతీంద్రియ జ్ఞానవాదులు) అనే గుంపు కొంతకాలం తర్వాత, సూచనార్థక పునరుత్థానం మాత్రమే ఉందనే నమ్మకాలను వ్యాప్తిలోకి తీసుకువచ్చింది. వారు జ్ఞానాన్ని (గ్రీకులో నోసిస్‌) మానవాతీత పద్ధతిలో సంపాదించవచ్చని నమ్ముతూ, మతభ్రష్ట క్రైస్తవత్వాన్ని గ్రీకు తత్త్వంతో, ప్రాచ్యదేశపు గుప్తవాదంతో మిళితం చేశారు. ఉదాహరణకు, భౌతిక విషయాలన్నీ చెడ్డవనీ, అందుకే యేసు శరీరధారిగా రాలేదనీ, కేవలం మానవ శరీరం ధరించివున్నట్లు మాత్రమే కనిపించివుండవచ్చనీ వారు నమ్మారు. మనం ముందు గమనించినట్లు, అపొస్తలుడైన యోహాను ఖచ్చితంగా ఇలాంటి బోధల గురించే హెచ్చరించాడు.​—⁠1 యోహాను 4:​2, 3; 2 యోహాను 7.

శతాబ్దాల తర్వాత క్రీస్తువిరోధి అల్లిన మరో అబద్ధం, పరిశుద్ధ త్రిత్వమని పిలవబడే సిద్ధాంతమే, యేసు సర్వశక్తిగల దేవుడనేకాక ఆయన దేవుని కుమారుడని కూడా ఆ సిద్ధాంతం వాదిస్తుంది. ద చర్చ్‌ ఆఫ్‌ ద త్రీ సెంచరీస్‌ అనే తన పుస్తకంలో డాక్టర్‌ ఆల్వన్‌ లామ్సన్‌ పేర్కొన్నట్లుగా, త్రిత్వ సిద్ధాంతం “యూదా, క్రైస్తవ లేఖనాలకు అసలు సంబంధమేలేని మూలం నుండి పుట్టుకొచ్చింది; అది ప్లేటో సిద్ధాంతాన్ని ఆమోదించిన ఫాదర్ల ద్వారా వృద్ధిచెంది క్రైస్తవత్వంలో చేర్చబడింది.” “ప్లేటో సిద్ధాంతాన్ని ఆమోదించిన ఆ ఫాదర్లు” ఎవరు? వారు అన్యుడు, గ్రీకు తత్వవేత్తైన ప్లేటో బోధలకు ఆకర్షించబడిన మతభ్రష్ట గురువులు.

ఆ సిద్ధాంతం దేవుణ్ణి మర్మంగా చిత్రీకరించి, కుమారునితో ఆయనకున్న సంబంధాన్ని అస్పష్టం చేసింది కాబట్టి, క్రీస్తువిరోధి త్రిత్వ సిద్ధాంతాన్ని క్రైస్తవత్వంలోకి ఎంతో యుక్తిగా చేర్చాడు అని చెప్పవచ్చు. (యోహాను 14:​28; 15:​10; కొలొస్సయులు 1:​15) దేవుడు మర్మమైతే, లేఖనాలు ప్రోత్సహిస్తున్నట్లుగా ఒక వ్యక్తి ‘దేవునికి సన్నిహితం’ ఎలా కాగలడు?​—⁠యాకోబు 4:⁠8, NW.

బైబిలు ప్రాథమిక మూలపాఠంలో దేవుని పేరైన యెహోవా 7,000 కన్నా ఎక్కువసార్లు ఉన్నా, అనేక బైబిలు అనువాదకులు తమ అనువాదాల నుండి ఆ పేరును తీసివేసి మరింత గందరగోళాన్ని సృష్టించారు! సర్వశక్తిమంతుణ్ణి కేవలం మర్మంగా మార్చడానికి ప్రయత్నించడంతో ఊరుకోక, పేరులేని మర్మంగా మార్చడానికి ప్రయత్నించడం మన సృష్టికర్తపట్ల, ఆయన ప్రేరేపిత వాక్యంపట్ల పూర్తి అగౌరవాన్ని కనబరచడమే అవుతుంది. (ప్రకటన 22:​18, 19) అంతేకాక, దైవిక నామానికి బదులు ప్రభువు, దేవుడు వంటి పదాలను ఉపయోగించడం యేసు మాదిరి ప్రార్థనను ఉల్లంఘించడమే అవుతుంది, ఆ ప్రార్థనలో కొంతభాగం ఇలా ఉంది: “నీ నామము పరిశుద్ధపరచబడు గాక.”​—⁠మత్తయి 6:⁠9.

క్రీస్తువిరోధులు దేవుని రాజ్యాన్ని తిరస్కరిస్తారు

క్రీస్తువిరోధులు ప్రత్యేకంగా “అంత్యదినములలో” అంటే మనం జీవిస్తున్న కాలంలో చురుకుగా పనిచేస్తున్నారు. (2 తిమోతి 3:⁠1) త్వరలో భూమంతటినీ పరిపాలించే పరలోక ప్రభుత్వమైన దేవుని రాజ్యానికి రాజుగా యేసు పోషించే పాత్ర విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడమే నేటి మోసగాళ్ల ప్రధాన లక్ష్యం.​—⁠దానియేలు 7:​13, 14; ప్రకటన 11:​15.

ఉదాహరణకు, కొందరు మతనాయకులు, దేవుని రాజ్యం మానవుల హృదయ పరిస్థితిని సూచిస్తుందనే లేఖనాధారంలేని దృక్కోణాన్ని బోధిస్తున్నారు. (దానియేలు 2:​44) మరికొందరు, యేసు మానవ ప్రభుత్వాల ద్వారా, సంస్థల ద్వారా పనిచేస్తున్నాడని వాదిస్తున్నారు. అయినా, యేసు ఇలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.” (యోహాను 18:​36) క్రీస్తు కాదుగానీ సాతానే “ఈ లోకాధికారి,” “ఈ యుగ సంబంధమైన దేవత.” (యోహాను 14:​30; 2 కొరింథీయులు 4:⁠4) యేసు త్వరలో మానవ ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి భూమిని పరిపాలించే ఏకైక పరిపాలకునిగా ఎందుకుంటాడో పైన పేర్కొనబడిన విషయాలనుబట్టి అర్థం చేసుకోవచ్చు. (కీర్తన 2:​2, 6-9; ప్రకటన 19:​11-21) ప్రజలు “నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే ప్రభువు ప్రార్థనను వల్లిస్తున్నప్పుడు వారు అలా జరగాలనే ప్రార్థిస్తారు.​—⁠మత్తయి 6:⁠9, 10.

అనేకమంది మత నాయకులు ఈ లోక రాజకీయ వ్యవస్థలకు మద్దతిస్తున్నారు కాబట్టే, వారు దేవుని రాజ్య సత్యాన్ని ప్రకటించేవారిని వ్యతిరేకించడమేకాక, వారిని హింసించారు కూడా. ఆసక్తికరమైన విషయమేమిటంటే, బైబిల్లోని ప్రకటన గ్రంథము, “పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లిన” “మహా బబులోను” అనే సూచనార్థక వేశ్య గురించి ప్రస్తావిస్తోంది. (ప్రకటన 17:​4-6) అది భూమ్మీద పరిపాలిస్తున్న “రాజులకు” లేక రాజకీయ పరిపాలకులకు మద్దతిస్తూ, అలా ఆధ్యాత్మిక వ్యభిచారం జరిగిస్తూ ప్రతిఫలంగా వారి అనుగ్రహాన్ని పొందుతోంది. ప్రపంచ అబద్ధ మతాలే ఆ సూచనార్థక స్త్రీ. అది క్రీస్తువిరోధుల్లో అధిక భాగాన్ని సూచిస్తోంది.​—⁠ప్రకటన 18:​2, 3; యాకోబు 4:⁠4.

జనులకు వినసొంపైన వాటిని క్రీస్తువిరోధి బోధిస్తున్నాడు

అనేకమంది నామకార్థ క్రైస్తవులు బైబిలు సత్యాన్ని తిరస్కరించడమే కాక, జనసమ్మతమైన నైతికతను ఆమోదించేందుకు ప్రవర్తన విషయంలో బైబిలు బోధిస్తున్న ప్రమాణాలను గాలికొదిలేశారు. ఆ పరిణామం గురించి దేవుని వాక్యం ముందుగానే ఇలా చెబుతోంది: “జనులు [దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకునేవారు] హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” (2 తిమోతి 4:​3, 4) ఆ మత వంచకులైన బోధకులు “క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పని వారు” అని కూడా వర్ణించబడ్డారు. బైబిలు ఇంకా ఇలా చెబుతోంది: “వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.”​—⁠2 కొరింథీయులు 11:​13-15.

వారి క్రియల్లో ఉన్నత నైతిక ప్రమాణాలను నిర్భీతితో నిర్లక్ష్యం చేసే దుష్కామప్రవర్తన లేదా “పోకిరిచేష్టలు” ఇమిడివున్నాయి. (2 పేతురు 2:​1-3, 12-14) అనేకమంది మతనాయకులు, వారి అనుచరులు సలింగ సంయోగం, వివాహేతర లైంగిక సంబంధాలు వంటి క్రైస్తవేతర అభ్యాసాలను ఆమోదించడం లేక కనీసం వాటిని ఖండించకుండా ఉండడం మనం చూడడంలేదా? విస్తృతంగా ఆమోదించబడే అలాంటి దృక్పథాలను, జీవనశైలిని లేవీయకాండము 18:​22; రోమీయులు 1:​26, 27; 1 కొరింథీయులు 6:​9, 10; హెబ్రీయులు 13:⁠4; యూదా 7 వచనాల్లో ఉన్న బైబిలు బోధలతో పోల్చడానికి కొంత సమయం తీసుకోండి.

‘ఆయా ఆత్మలను పరీక్షించండి’

మనం ఇంతవరకు పరిశీలించినదాని ప్రకారం, మన మతసంబంధ నమ్మకాలను తేలిగ్గా తీసుకోకూడదని అపొస్తలుడైన యోహాను చెప్పిన మాటలను మనం లక్ష్యపెట్టాలి. “అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి” అని ఆయన హెచ్చరించాడు.​—⁠1 యోహాను 4:⁠1.

మొదటి శతాబ్దంలో, బెరయ పట్టణంలో జీవించిన కొంతమంది “ఘనులైన” వ్యక్తుల మంచి ఉదాహరణను పరిశీలించండి. వారు “ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అపొస్తలుల కార్యములు 17:​10, 11) అవును, బెరయవాసులు వాక్యాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించినా, తాము విని అంగీకరించే విషయాలు ఖచ్చితంగా లేఖనాధారంగా ఉన్నాయో లేదో పరిశీలించారు.

నేడు కూడా, నిజక్రైస్తవులు సముద్రకెరటాల్లా మార్పు చెందుతూ ఉండే జనసమ్మతమైన దృక్పథాలనుబట్టి ప్రభావితులుకారు గానీ బైబిలు సత్యానికి దృఢంగా హత్తుకుంటారు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు . . . ప్రార్థించుచున్నాను.’​—⁠ఫిలిప్పీయులు 1:⁠9.

మీరు ఇప్పటికీ అలా చేయనట్లయితే, బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో నేర్చుకోవడం ద్వారా ‘తెలివి, సకలవిధమైన అనుభవజ్ఞానం’ సంపాదించుకోవడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి. బెరయవాసులను అనుకరించేవారు క్రీస్తువిరోధుల ‘కల్పనావాక్యములను’బట్టి మోసగించబడరు. (2 పేతురు 2:⁠3) బదులుగా, వారు నిజమైన క్రీస్తు, ఆయన అనుచరులు బోధించే ఆధ్యాత్మిక సత్యాన్నిబట్టి విడుదలచేయబడతారు. ​—⁠యోహాను 8:​32, 36.

[4వ పేజీలోని బాక్సు/చిత్రం]

క్రీస్తువిరోధి గురించి బైబిలు ఏమి చెబుతోంది

“చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ [స్పష్టంగా ఇది అపొస్తలుల కాలం ముగిసే సమయం]. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.” ​—⁠1 యోహాను 2:​18.

“యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.” ​—⁠1 యోహాను 2:​22.

“యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు . . . క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే, యిదివరకే అది లోకములో ఉన్నది.” ​—⁠1 యోహాను 4:⁠2.

“యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు.”​—⁠2 యోహాను 7, 8.

[5వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

అనేక రూపాల్లో ఉన్న మోసగాడు

యేసుక్రీస్తు గురించి బైబిలు చెబుతున్నదానిని నిరాకరించేవారందరికీ, ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించేవారందరికీ, ఆయన అనుచరులను హింసించేవారందరికీ “క్రీస్తువిరోధి” అనే పదం వర్తిస్తుంది. క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తప్పుగా చెప్పుకునే లేక క్రీస్తు మాత్రమే తీసుకురాగల నిజమైన శాంతి, భద్రతను తాము సాధిస్తామని గర్వంగా వాగ్దానాలు గుప్పిస్తూ మెస్సీయ పాత్రను అనుచితంగా తమకు ఆపాదించుకునే వ్యక్తులకు, సంస్థలకు, దేశాలకు కూడా క్రీస్తువిరోధి అనే పదం వర్తిస్తుంది.

[చిత్రసౌజన్యం]

అగస్టీన్‌: ©SuperStock/age fotostock

[7వ పేజీలోని చిత్రం]

బెరయవాసుల్లా మనం ‘ప్రతిదినం లేఖనాలను పరిశోధించాలి’