కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజాయితీగా ఉండడం ప్రయోజనాలను చేకూరుస్తుంది

నిజాయితీగా ఉండడం ప్రయోజనాలను చేకూరుస్తుంది

నిజాయితీగా ఉండడం ప్రయోజనాలను చేకూరుస్తుంది

ఏదెను తోటలోనే మోసం ప్రారంభమైంది. అయితే, ఇప్పటికీ అనేక సంస్కృతులు, సమాజాలు నిజాయితీని అమూల్యమైనదిగా ఎంచి, అబద్ధాలాడడాన్ని మోసాన్ని హానికరమైనవిగా అనైతికమైనవిగా పరిగణిస్తాయి. నమ్మకమైన వ్యక్తిగా పరిగణించబడడం నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ ఆధునిక సమాజంలో జీవించాలంటే మోసం చేయడం అవసరమని భావించే ప్రజలు అంతకంతకూ ఎక్కువవుతున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నిజాయితీని పెంపొందించుకోవడం ప్రయోజనకరమేనా? ఏది నిజాయితీగా ప్రవర్తించడమో, ఏది మోసమో మీరెలా తీర్మానిస్తారు?

దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం మన సంభాషణలో, మన జీవన విధానంలో నిజాయితీగా ఉండాలి. “ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఉద్బోధించాడు. (ఎఫెసీయులు 4:​25) “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు[న్నాము]” అని కూడా పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 13:​18) మనం ఇతరుల మెప్పును పొందడానికే నిజాయితీగా ప్రవర్తించము. మన సృష్టికర్తపై గౌరవం, ఆయనను సంతోషపెట్టాలనే కోరిక మనకు ఉన్నాయి కాబట్టి నిజాయితీగా ఉంటాం.

వేషధారులుగా ఉండకండి

చాలా దేశాల్లోని ప్రజలు, జీవితంలో ప్రయోజనాలు పొందడానికి తమ అసలు గుర్తింపును దాచిపెడుతుంటారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడానికి లేదా తమకు అర్హతలు లేని ఉద్యోగాన్ని లేదా పదవిని పొందడానికి వారు దొంగ దస్తావేజులను, పట్టాలను, గుర్తింపు కార్డులను సృష్టిస్తారు. తమ పిల్లలు మరిన్ని సంవత్సరాలు స్కూల్లో చదివేందుకు వీలుగా కొందరు తల్లిదండ్రులు వారి బర్త్‌ సర్టిఫికెట్‌లను తప్పుగా వ్రాయిస్తారు.

కానీ మనం దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే మోసం చేయకూడదు. యెహోవా ‘సత్యదేవుడు’ అని, ఆయనతో సన్నిహితంగా ఉండేవారు నిజాయితీగా ఉండాలని ఆయన కోరుతున్నాడని బైబిలు చెబుతోంది. (కీర్తన 31:⁠5) మనం యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోవాలంటే, మనం “పనికిమాలినవారిని” లేదా సత్యాన్ని అనుసరించనివారిని, “వేషధారులను” అనుకరించకూడదు.​—⁠కీర్తన 26:⁠4.

తమ తప్పులకు శిక్షపడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ప్రజలు సాధారణంగా సత్యాన్ని దాచిపెడుతుంటారు. చివరకు క్రైస్తవ సంఘంలో ఉన్న వ్యక్తి కూడా అలా చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక సంఘంలోని ఒక యౌవనస్థుడు, తాను ఘోరమైన తప్పిదాలు చేశానని పెద్దల ముందు ఒప్పుకున్నాడు. కానీ, అతను దొంగతనం చేశాడనడానికి ఆధారాలున్నా అతను దాన్ని మాత్రం ఒప్పుకోలేదు. కొంతకాలానికి అది వెలుగులోకి వచ్చి అతను సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. అతను నిజాయితీతో ప్రవర్తించి, యెహోవాతో తనకున్న అమూల్యమైన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి సహాయాన్ని తీసుకొనివుంటే మరింత జ్ఞానయుక్తంగా ఉండేది కాదా? “నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము; ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షిం[చును]” అని బైబిలు చెబుతోంది.​—⁠హెబ్రీయులు 12:​4, 5.

సంఘంలో ఆధిక్యత పొందాలనుకుంటున్న ఒక సహోదరుడు కొన్ని సందర్భాల్లో తన వ్యక్తిగత సమస్యలను లేదా గతంలో తను చేసిన తప్పిదాలను దాచిపెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, ప్రత్యేక సేవాధిక్యతకు సంబంధించిన దరఖాస్తు నింపుతున్నప్పుడు కొన్ని వివరాలు అతణ్ణి అనర్హుడిని చేస్తాయేమో అనే ఆలోచనతో అతను ఆరోగ్యం, నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలకు పూర్తి వివరాలు వ్రాయకపోవచ్చు. ‘నేను అబద్ధమేమీ చెప్పడంలేదు’ అని అతను భావించవచ్చు, కానీ అతను నిజంగా ఇతరులతో దాపరికం లేకుండా, నిజాయితీగా ఉన్నాడా? “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును” అని సామెతలు 3:⁠32లో చెప్పబడిన విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలి.

నిజాయితీగా ఉండడం అంటే ముందుగా మనం మనతో నిజాయితీగా ఉండాలి. సరైనదాన్ని, సత్యాన్ని వదిలేసి మనం తరచూ మనకు నచ్చినదాన్నే నమ్ముతాం. మన తప్పులకు ఇతరుల్ని నిందించడం ఎంత సులభమో కదా! ఉదాహరణకు, సౌలు రాజు ఇతరులపై నింద మోపడం ద్వారా తన అవిధేయతను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ కారణంగానే, యెహోవా అతనిని రాజుగా ఉండకుండా విసర్జించాడు. (1 సమూయేలు 15:​20-23) “నా దోషము కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని​—⁠యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు” అని యెహోవాకు ప్రార్థించిన దావీదు రాజుకు సౌలుకు ఎంత తేడా ఉందో కదా.​—⁠కీర్తన 32:⁠5.

నిజాయితీగా ఉండడం ఆశీర్వాదాలను తెస్తుంది

మీరు నిజాయితీగా ఉన్నా, లేకపోయినా అది ఇతరులు మీ గురించి ఏర్పర్చుకునే అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక్కసారైనా మోసం చేశారని తెలిస్తే ప్రజలకు మీమీదున్న నమ్మకం పోతుంది, అలా జరిగితే దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. మరోవైపు, సత్యసంధంగా, నిజాయితీగా ఉన్నప్పుడు మీరు యథార్థపరునిగా, నమ్మదగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. యెహోవాసాక్షులు అలాంటి పేరే సంపాదించుకున్నారు. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

తన ఉద్యోగస్థుల్లో అనేకులు కంపెనీని మోసం చేస్తున్నారని గ్రహించిన ఒక కంపెనీ డైరెక్టర్‌ పోలీసుల సహాయాన్ని కోరాడు. అయితే, అరెస్టు చేయబడినవారిలో యెహోవాసాక్షియైన ఒక ఉద్యోగి ఉన్నాడని తెలిసిన వెంటనే ఆయనను విడుదల చేయించడానికి ఆ డైరెక్టర్‌ పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యక్తి నిజాయితీగా పనిచేసే వ్యక్తి అనీ, నిర్దోషి అనీ ఆ డైరెక్టర్‌కి తెలుసు కాబట్టే అలా చేశాడు. ఇతరులు ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు కానీ ఆ సాక్షి తన ఉద్యోగం కోల్పోలేదు. ఆయన ప్రవర్తన యెహోవా నామానికి ఘనత తెచ్చినందుకు ఆయన తోటి సాక్షులు ఎంతో సంతోషించారు.

మంచి ప్రవర్తనను ఇతరులు ఖచ్చితంగా గమనిస్తారు. ఆఫ్రికాకు చెందిన ఒక సమాజంలో, పెద్ద డ్రైనేజీ గుంటపై కట్టబడిన వంతెన కొయ్యపలకలను ఎవరో దొంగిలించడంతో దానికి రిపేరు చేయాల్సి వచ్చింది. వాటిని తిరిగి కొని అమర్చడానికి స్థానిక ప్రజలు డబ్బు పోగుచేయాలనుకున్నారు. కానీ ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంచాలనే ప్రశ్న ఎదురైంది. ఒక యెహోవాసాక్షికే ఇవ్వాలని వారందరూ కలసికట్టుగా నిర్ణయించారు.

ఒక ఆఫ్రికా దేశంలో రాజకీయపరమైన, జాతిపరమైన అలజడి చెలరేగినప్పుడు, ఒక అంతర్జాతీయ కంపెనీలో అక్కౌంటెంటుగా పనిచేస్తున్న సాక్షి ప్రాణం ఆపదలో పడింది. అప్పుడు ఆ కంపెనీ ఆయనను వేరే చోటికి బదిలీ చేసింది. ఆ అలజడి సద్దుమణిగేంతవరకు అంటే చాలా నెలల వరకు ఆయన వేరే దేశంలో ఉండేలా ఆ కంపెనీ తన సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసింది. ఎందుకు? ఎందుకంటే ఆయన ముందు ఒకసారి కంపెనీని మోసం చేయాలనే పథకం వేసినవారితో పాలుపంచుకోవడానికి నిరాకరించాడు కాబట్టి. ఆయన తన నిజాయితీకి పేరు తెచ్చుకున్నాడని అక్కడి అధికారులకు తెలుసు. ఆయన ముందెప్పుడైనా మోసం చేశాడని తెలిసి ఉంటే వారు ఆ ఉద్యోగస్థునికి సహాయం చేయడానికి సుముఖంగా ఉండేవారా?

“యథార్థవర్తను[నిగా]” ఉండే “నీతిమంతుని” గురించి సామెతలు 20:⁠7 చెబుతోంది. నిజాయితీపరుడు యథార్థంగా ఉంటాడు. ఆయన తన తోటివారిని ఎన్నటికీ మోసం చేయడు. ఇతరులు మీతో అలాగే వ్యవహరించాలని మీరు కోరుకోరా? సత్యారాధనలో నిజాయితీగా ఉండడం ప్రాముఖ్యం. అలా చేయడం ద్వారా మనం దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తాం. నిజాయితీగా ఉండడం ద్వారా, “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని యేసు వ్యక్తం చేసిన సూత్రానికి అనుగుణంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడుతున్నామని చూపిస్తాం.​—⁠మత్తయి 7:⁠12; 22:​36-39.

అన్ని సమయాల్లోనూ నిజాయితీగా ఉండాలంటే ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కానీ అలా చేయడం ద్వారా లభించే మంచి మనస్సాక్షి వాటన్నిటినీ మించినది. నిజాయితీగా నీతియుక్తంగా ఉండడంవల్ల సకాలంలో గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. నిజానికి, యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండడం వెలకట్టలేనిది. ప్రజల మెప్పును పొందడానికో లేదా చట్టవిరుద్ధమైన ప్రయోజనాలు పొందడానికో మోసం చేసి మనం యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేసుకోవడమెందుకు? మనకెలాంటి సవాలు ఎదురైనా, “గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు” అనే కీర్తనకర్త మాటలను నమ్మవచ్చు.​—⁠కీర్తన 40:⁠4.

[18వ పేజీలోని చిత్రాలు]

నిజ క్రైస్తవులు దొంగ దస్తావేజులను కొనరు లేదా ఉపయోగించరు