కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

కానాలో జరిగిన వివాహ విందులో యేసు తన తల్లితో మాట్లాడిన పద్ధతి అమర్యాదకరంగా లేదా నిర్దయగా ఉందా?​—యోహాను 2:​4, NW.

బాప్తిస్మం తీసుకున్న కొద్దిరోజులకే యేసు, ఆయన శిష్యులు కానాలో జరుగుతున్న వివాహ విందుకు ఆహ్వానించబడ్డారు. ఆయన తల్లికూడా ఆ వివాహ విందుకు వచ్చింది. ఆ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ యేసుతో “వారికి ద్రాక్షారసము లేదని” చెప్పింది. యేసు దానికి జవాబిస్తూ తన తల్లితో ఇలా అన్నాడు: “అమ్మా, [‘ఓ స్త్రీ,’ NW] నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదు.”​—⁠యోహాను 2:​1-4.

నేడు, ఎవరైనా తన తల్లిని “స్త్రీ” అని సంబోధిస్తూ, “నాతో నీకేమి పని” అంటూ మాట్లాడడం అమర్యాదకరంగానేకాక, అవమానకరంగా కూడా పరిగణించబడుతుంది. కానీ యేసుపై అలాంటి ఆరోపణలు మోపితే ఆ సందర్భపు సాంస్కృతిక, భాషాసంబంధ అంశాలను అలక్ష్యం చేయడమే అవుతుంది. బైబిలు కాలాల్లోని ఈ మాటల వాడుకను అర్థం చేసుకోవడం సహాయకరంగా ఉంటుంది.

“స్త్రీ” అనే పదాన్ని గురించి వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ఇలా చెబుతోంది: “స్త్రీని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆ పదం మందలింపును లేదా నిర్దయను కాదుగానీ, ఆప్యాయతను లేదా గౌరవాన్ని సూచిస్తుంది.” ఈ అభిప్రాయంతో ఇతర గ్రంథాలు కూడా ఏకీభవిస్తున్నాయి. ఉదాహరణకు, ది ఏంకర్‌ బైబిల్‌ ఇలా చెబుతోంది: “అది కసురుకునే లేదా అమర్యాదకరమైన పదం కాదు లేక ప్రేమ లేకపోవడాన్ని సూచించదు . . . యేసు సాధారణంగా, స్త్రీలను అలా గౌరవప్రదంగా సంబోధించేవాడు.” ఇక్కడ ఉపయోగించబడిన ఆ పదం “భిన్నార్థంతో అమర్యాదకు” ఉపయోగించింది కాదని ద న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ థియోలజీ వివరిస్తోంది. ఆ పదాన్ని అలా ఉపయోగించడం “ఏ మాత్రం అగౌరవాన్ని చూపించదు లేదా కించపరచదు” అని గెర్హార్డ్‌ కిట్టెల్‌ యొక్క థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ చెబుతోంది. అందువల్ల, యేసు తన తల్లిని “ఓ స్త్రీ” అని సంబోధించినప్పుడు ఆయన దురుసుగా లేదా నిర్దయగా మాట్లాడాడనే నిర్ధారణకు మనం రాకూడదు.​—⁠మత్తయి 15:​28, NW; లూకా 13:​12, NW; యోహాను 4:​21, NW; 19:​26, NW; 20:​13, 15, NW.

‘నాతో నీకేమి పని’ అనే పదబంధం విషయమేమిటి? ఇది బైబిల్లో చాలాసార్లు కనిపించే యూదుల సాధారణ జాతీయం అన్నట్లు స్పష్టమౌతోంది. ఉదాహరణకు, షిమీని చంపకుండా అబీషైను ఆపుచేస్తూ దావీదు ఇలా అనడం గురించి 2 సమూయేలు 16:⁠10లో మనం చదువుతాం: “సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? [‘సెరూయా కుమారులైన ఓ మనుష్యులారా, నాతో మీకేమి పని?’ NW] వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవి[చ్చెను].” అదే విధంగా, సారెపతు విధవరాలు తన కుమారుడు చనిపోవడం చూసి ఏలీయాతో, “దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? [‘ఓ దైవజనుడా నాతో నీకేమి పని?’ NW] నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితి[వి]” అని 1 రాజులు 17:18లో అనడం మనం చదువుతాం.

ఈ బైబిలు ఉదాహరణల నుండి మనం ‘నాతో నీకేమి పని’ అనే పదబంధం తరచూ అమర్యాదను లేదా అహంభావాన్ని చూపించడానికి కాదుగానీ ప్రతిపాదించిన లేదా సూచించిన పనిని చేసేందుకు లేదా భిన్న దృక్కోణాన్ని లేక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు నిరాకరించడానికే ఉపయోగించబడింది. కాబట్టి మరియతో యేసు పలికిన మాటల గురించి ఏమి చెప్పవచ్చు?

“వారికి ద్రాక్షారసము లేదని” మరియ యేసుకు చెప్పినప్పుడు, ఆమె కేవలం ఆయనకు ఆ విషయాన్ని మాత్రమే వివరించడంలేదు, బదులుగా ఆమె ఏదైనా చేయమని ఆయనకు సూచిస్తోంది. మరియ యుక్తిగా చేసిన ఆ సూచనను నిరాకరించడానికి యేసు ఆ సాధారణ జాతీయాన్ని ఉపయోగించాడు, అలాగే “నా సమయమింకను రాలేదు” అని ఆ తర్వాత పలికిన మాటలు ఆయనలా నిరాకరించడానికిగల కారణాన్ని అర్థం చేసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది.

యేసు సా.శ. 29లో బాప్తిస్మం తీసుకొని అభిషేకించబడిన దగ్గరనుండి వాగ్దత్త మెస్సీయగా, చివరకు తన మరణానికి, పునరుత్థానానికి, మహిమనొందడానికి దారితీసే యథార్థతా మార్గంలో పయనించడమే యెహోవా చిత్తమని ఆయనకు బాగా తెలుసు. “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని” ఆయన చెప్పాడు. (మత్తయి 20:​28) తన మరణ సమయం సమీపించినప్పుడు యేసు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నాడు: “గడియ వచ్చియున్నది.” (యోహాను 12:​1, 23; 13:⁠1) అందువల్ల, యేసు తాను మరణించే ముందు రాత్రి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము.” (యోహాను 17:​1, 2) చివరకు గెత్సేమనేలో ఆయనను పట్టుకునేందుకు ప్రజలు మూకుమ్మడిగా వచ్చినప్పుడు యేసు అపొస్తలులను నిద్రలేపి వారితో ఇలా అన్నాడు: “గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు.”​—⁠మార్కు 14:​41.

అయితే యేసు అప్పుడే మెస్సీయగా తన పరిచర్యను ఆరంభించాడు, కాబట్టి కానాలో వివాహ విందు జరిగిన సమయానికి ఆయన “గడియ” ఇంకా రాలేదు. తండ్రి నిర్దేశించిన సమయంలో, పద్ధతిలో ఆయన చిత్తం చేయడమే యేసు ప్రాథమిక ఉద్దేశం, అలా తాను నిర్ణయించుకున్న విధానంలో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఈ విషయాన్ని తన తల్లికి తెలియజేయడంలో యేసు స్థిరంగావున్నా ఆయన ఏ మాత్రం అమర్యాదగా లేక నిర్దయగా మాట్లాడలేదు. మరియ కలవరపడలేదు లేదా కుమారుడు తనను అవమానపర్చాడని అనుకోలేదు. నిజానికి, యేసు మాటల అర్థాన్ని గ్రహించిన మరియ అక్కడి వివాహపు పరిచారకులతో, “ఆయన మీతో చెప్పునది చేయుడని” చెప్పింది. యేసు తన తల్లి మాటలను నిర్లక్ష్యం చేయడానికి బదులు, నీటిని శ్రేష్ఠమైన ద్రాక్షారసంగా మారుస్తూ మెస్సీయగా తన మొదటి అద్భుతం చేశాడు, ఆ విధంగా ఆయన తన తండ్రి చిత్తం చేయడంలో, తల్లి ఆందోళనను గుర్తించడంలో చక్కని సమతుల్యాన్ని ప్రదర్శించాడు.​—⁠యోహాను 2:​5-11.

[31వ పేజీలోని చిత్రం]

యేసు తన తల్లితో మాట్లాడినప్పుడు దయగానే అయినా స్థిరంగా మాట్లాడాడు