కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన పొరుగువారిని ప్రేమించడంలో ఏమి ఇమిడివుంది?

మన పొరుగువారిని ప్రేమించడంలో ఏమి ఇమిడివుంది?

మన పొరుగువారిని ప్రేమించడంలో ఏమి ఇమిడివుంది?

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.”​—⁠మత్తయి 22:​39.

తనను ఆరాధించేవారినుండి యెహోవా ఏమి కోరుతున్నాడు? సరళమైన కొన్ని పదాలతోనే యేసు విషయాన్ని సంగ్రహంగా చెబుతూ, యెహోవాను పూర్ణహృదయంతో, ఆత్మతో, మనసుతో, బలముతో ప్రేమించడం ముఖ్యమైన ఆజ్ఞ అని ఆయన అన్నాడు. (మత్తయి 22:​37; మార్కు 12:​30) మనం ముందరి ఆర్టికల్‌లో చూసినట్లుగా, దేవుణ్ణి ప్రేమించడంలో ఆయన మనపట్ల చూపించిన ప్రేమకు ప్రతిస్పందిస్తూ ఆయనకు విధేయులమై ఆయన ఆజ్ఞలు పాటించడం ఇమిడివుందని మనం చూశాం. దేవుని ప్రేమించేవారికి ఆయన చిత్తం చేయడం భారం కాదు; అది వారికి సంతోషాన్నిస్తుంది.​—⁠కీర్తన 40:⁠8; 1 యోహాను 5:2, 3.

2 “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను” రెండవ ముఖ్యమైన ఆజ్ఞ మొదటి దానికి ముడిపడివుందని యేసు చెప్పాడు. (మత్తయి 22:​39) మనమిప్పుడు ఈ ఆజ్ఞకే అవధానమిస్తున్నాం, దానికొక ప్రాముఖ్యమైన కారణముంది. మనం జీవిస్తున్న కాలాలు స్వార్థపూరితమైన, వక్రీకరించబడిన ప్రేమకు పేరుగాంచాయి. “అంత్యదినముల” గురించిన తన ప్రేరేపిత వర్ణనలో అపొస్తలుడైన పౌలు, ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదుగానీ తమనుతాము, ధనాన్ని, సుఖాలను ప్రేమిస్తారని వ్రాశాడు. చాలామంది “అనురాగరహితులు”గా ఉంటారు. (2 తిమోతి 3:1-4) యేసుక్రీస్తు ఇలా ప్రవచించాడు: “అనేకులు . . . యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. . . . అనేకుల ప్రేమ చల్లారును.”​—⁠మత్తయి 24:​10, 12.

3 అయితే ప్రతీ ఒక్కరి ప్రేమ చల్లారిపోతుందని యేసు చెప్పలేదని గమనించండి. యెహోవాపట్ల చూపించాల్సిన, ఆయన కోరేటువంటి ప్రేమను కనబర్చేవారు ఎల్లప్పుడూ ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. యెహోవాను నిజంగా ప్రేమించేవారు ఇతరులను ఆయన చూసినట్లే చూసేందుకు కృషిచేస్తారు. అలాగైతే మనం ప్రేమించాల్సిన మన పొరుగువారెవరు? మన పొరుగువారిపట్ల మనమెలా ప్రేమను చూపించాలి? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు లేఖనాలు మనకు సహాయం చేయగలవు.

నా పొరుగువారెవరు?

4 నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలనే రెండవ ముఖ్యమైన ఆజ్ఞను గురించి పరిసయ్యునికి చెప్పినప్పుడు, యేసు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఓ ప్రత్యేక నియమాన్ని సూచిస్తున్నాడు. అది లేవీయకాండము 19:⁠18లో వ్రాయబడింది. అదే అధ్యాయంలో, తమ తోటి ఇశ్రాయేలీయులతోపాటు ఇతరులను కూడా తమ పొరుగువారిగా దృష్టించాలని యూదులకు చెప్పబడింది. 34వ వచనం ఇలా చెబుతోంది: “మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి.” కాబట్టి వారు యూదులు కానివారిని, ప్రత్యేకంగా యూదామత ప్రవిష్టులను ప్రేమించాలి.

5 అయితే యేసు కాలంలోని యూదా నాయకుల అభిప్రాయం మరోలా ఉంది. “స్నేహితుడు,” “పొరుగువాడు” అనే మాటలు యూదులకు మాత్రమే వర్తిస్తాయని కొందరు బోధించారు. యూదులు కానివారు ద్వేషించబడేవారు. అలాంటి బోధకులు, దేవుని ఆరాధకులు భక్తిహీనులను తృణీకరించాలని తర్కించారు. “అలాంటి వాతావరణంలో ద్వేషం నశించడానికి బదులు అది విపరీతంగా పెచ్చరిల్లింది” అని ఒక గ్రంథం చెబుతోంది.

6 కొండమీది ప్రసంగంలో యేసు, ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరిని ప్రేమించాలో సూచించాడు. ఆయనిలా అన్నాడు: “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:​43-45) ఇక్కడ యేసు రెండు అంశాలను ప్రస్తావించాడు. మొదటిది, యెహోవా మంచివారి విషయంలో చెడ్డవారి విషయంలో ఔదార్యాన్ని, దయను చూపిస్తున్నాడు. రెండవది, మనమాయన మాదిరిని అనుసరించాలి.

7 మరో సందర్భంలో ధర్మశాస్త్రోపదేశకుడైన ఒక యూదుడు, “నా పొరుగువాడెవడని” యేసును అడిగాడు. దానికి జవాబుగా యేసు ఒక ఉపమానం చెప్తూ, దొంగల బారినపడి సమస్తాన్ని పోగొట్టుకొని కొరప్రాణంతో పడివున్న యూదుణ్ణి ఒక సమరయుడు చూడడం గురించి మాట్లాడాడు. సాధారణంగా సమరయులను యూదులు ఈసడించుకున్నా, ఈ సమరయుడు మాత్రం ఆ వ్యక్తి గాయాలకు కట్లుకట్టి, అతను కోలుకునేందుకు వీలుగా ఒక పూటకూళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. దీనిలో ఏ పాఠముంది? పొరుగువారిపట్ల మన ప్రేమ తెగకు, జాతికి లేదా మతానికి అతీతంగా ఇతర ప్రజలకు విస్తరించాలి.​—⁠లూకా 10:25, 29, 30, 33-37.

పొరుగువారిని ప్రేమించడంలో ఏమి ఇమిడివుంది?

8 దేవునిపట్ల ప్రేమలాగే పొరుగువారిపట్ల ప్రేమ కేవలం ఒక భావావేశం కాదు; దానిలో క్రియాశీలత ఇమిడివుంది. తమలాగే తమ పొరుగువారిని ప్రేమించాలని దేవుని ప్రజలను కోరిన లేవీయకాండము 19వ అధ్యాయంలోని ఆజ్ఞకు సంబంధించిన సందర్భాన్ని ఇంకాస్త పరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు తమ పంటను కష్టాల్లోవున్నవారితో పరదేశులతో పంచుకోవాలని ఆజ్ఞాపించబడినట్లు మనమక్కడ చదువుతాం. దొంగతనానికి, మోసానికి లేదా దగా చేయడానికి తావులేదు. న్యాయపరమైన విషయాల్లో ఇశ్రాయేలీయులు పక్షపాతం చూపించకూడదు. అవసరమైనప్పుడు వారు గద్దించినా, “నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు” అని వారికి స్పష్టంగా చెప్పబడింది. ఇవి, వీటితోపాటు మరెన్నో ఆజ్ఞలు ఈ మాటల్లో క్లుప్తీకరించబడ్డాయి: “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను.”​—⁠లేవీయకాండము 19:9-11, 15, 17, 18.

9 ఇశ్రాయేలీయులు ఇతరులను ప్రేమించవలసివున్నా, వారు అబద్ధ దేవతలను ఆరాధించేవారికి దూరంగా ఉండాలి. చెడుసహవాసాలవల్ల కలిగే ప్రమాదాల గురించి, పర్యవసానాల గురించి యెహోవా వారిని హెచ్చరించాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు వెళ్లగొట్టవలసిన జనాంగాల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు; అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొ[నును].”​—⁠ద్వితీయోపదేశకాండము 7:​3, 4.

10 అదే విధంగా క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బలహీనపర్చే వారితో సంబంధాలు ఏర్పర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. (1 కొరింథీయులు 15:​33) మనమిలా హెచ్చరించబడ్డాం: మీరు క్రైస్తవ సంఘంలో భాగంకాని “అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.” (2 కొరింథీయులు 6:​14) అంతేకాక, క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలని ఉపదేశించబడ్డారు. (1 కొరింథీయులు 7:​39) అలాగని, యెహోవాపై మనకున్న నమ్మకాన్ని పంచుకోనివారిని మనమెన్నడూ ఈసడించుకోకూడదు. క్రీస్తు పాపుల కోసం చనిపోయాడు, ఒకప్పుడు దుష్టకార్యాలు చేసిన అనేకులు తమ మార్గాలను మార్చుకొని దేవునితో సమాధానపడ్డారు.​—⁠రోమీయులు 5:⁠8; 1 కొరింథీయులు 6:​9-11.

11 యెహోవా దేవుని సేవించనివారిపట్ల ప్రేమ చూపించే విషయంలో ఆయనను అనుకరించడంకన్నా ఉత్తమమైనది మరొకటి లేదు. దేవుడు దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నా, చెడు మార్గాలను విసర్జించి నిత్యజీవంపొందే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ఆయన అందరిపట్ల తన కృపను చూపిస్తున్నాడు. (యెహెజ్కేలు 18:​23) “అందరు మారుమనస్సు పొందవలెనని” యెహోవా కోరుతున్నాడు. (2 పేతురు 3:⁠9) ఆయన “మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమోతి 2:⁠4) అందుకే యేసు ప్రకటిస్తూ, బోధిస్తూ “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:​19, 20) ఈ పనిలో భాగం వహించడం ద్వారా మనం దేవునిపట్ల, పొరుగువారిపట్ల, అవును మన శత్రువులపట్ల కూడా ప్రేమను ప్రదర్శిస్తాం!

మన క్రైస్తవ సహోదరులపట్ల ప్రేమ

12 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:​10) క్రైస్తవులమైన మనపై విశ్వాస గృహానికి చేరినవారిని అంటే మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలను ప్రేమించే బాధ్యత ఉంది. ఈ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది? ఈ అంశాన్ని నొక్కిచెబుతూ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు . . . ఎవడైనను​—⁠నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 3:15; 4:​20) అవి తీవ్రమైన మాటలు. “నరహంతకుడు,” “అబద్ధికుడు” అనే మాటల్ని యేసుక్రీస్తు అపవాదియైన సాతానుకు అన్వయించాడు. (యోహాను 8:​44) ఆ మాటలు మనకు వర్తించాలని మనం ఎన్నడూ కోరుకోం!

13 నిజ క్రైస్తవులు ‘ఒకరి నొకరు ప్రేమించాలని దేవుని చేతనే నేర్పబడ్డారు.’ (1 థెస్సలొనీకయులు 4:⁠9) మనం “మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” (1 యోహాను 3:​18) మన “ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను.” (రోమీయులు 12:⁠9) ప్రేమ మత్సరాన్ని, డంబాన్ని, అహంభావాన్ని, స్వార్థాన్ని ప్రదర్శించేందుకు కాదుగానీ దయను, కనికరాన్ని, క్షమాపణను, దీర్ఘశాంతాన్ని కనబర్చేందుకు మనల్ని పురికొల్పుతుంది. (1 కొరింథీయులు 13:​4, 5; ఎఫెసీయులు 4:​32) ‘ఒకనికొకడు దాసులై ఉండేందుకు’ అది మనల్ని ప్రేరేపిస్తుంది. (గలతీయులు 5:​13) యేసు తన శిష్యులను ఎలా ప్రేమించాడో అలాగే వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలని వారికి చెప్పాడు. (యోహాను 13:​34) కాబట్టి ఒక క్రైస్తవుడు అవసరమైతే తోటి విశ్వాసుల కోసం తన ప్రాణాన్ని అర్పించేందుకైనా సుముఖంగా ఉండాలి.

14 ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య ప్రేమవుండాలి. వివాహబంధమెంత సన్నిహితమైనదంటే, పౌలు ఇలా వ్రాశాడు: ‘పురుషులు తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు.’ ఆయనింకా ఇలా అన్నాడు: “తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.” (ఎఫెసీయులు 5:​28) పౌలు ఈ ఉపదేశాన్నే ఐదు వచనాల తర్వాత మళ్లీ ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. తన భార్యను ప్రేమించే భర్త, మలాకీ కాలంలో తమ భాగస్వామిపట్ల విశ్వాసఘాతుకంగా ప్రవర్తించిన ఇశ్రాయేలీయులను అనుకరించడు. (మలాకీ 2:​14) ఆయన తన భార్యను అపురూపంగా చూసుకుంటాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లే ఆయన ఆమెను ప్రేమిస్తాడు. అదే విధంగా, తన భర్తను గౌరవించేలా ప్రేమ భార్యను ప్రేరేపిస్తుంది.​—⁠ఎఫెసీయులు 5:​25, 29-33.

15 ఈ విధమైన ప్రేమ నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నమనేది స్పష్టం. యేసు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:​35) మనలో ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ మనం ప్రేమించే, గౌరవించే దేవునికి ప్రజలను సన్నిహితం చేస్తుంది. ఉదాహరణకు, ఒక సాక్షి కుటుంబం గురించిన ఈ నివేదిక మొజాంబిక్‌ నుండి వస్తోంది. “అలా జరగడం మేమెన్నడూ చూడలేదు. ఓ మధ్యాహ్నం బలమైన గాలులతోపాటు విపరీతమైన వర్షం కురవడం, వడగండ్లు పడడం మొదలైంది. ఆ బలమైన గాలులకు వెదురుబద్దలతో నిర్మించిన మా పాక కూలిపోయింది, పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మా ఇంటిని తిరిగి నిర్మించేందుకు చుట్టుప్రక్కల సంఘాల్లోని మా సహోదరులు వచ్చి సహాయం చేసినప్పుడు, ఆశ్చర్యానికి లోనైన మా పొరుగువారు ‘మీది చాలా మంచి మతం. మా చర్చీ నుండి మాకు ఇలాంటి సహాయం ఎన్నడూ అందలేదు’ అని అన్నారు. మేము బైబిలు తెరిచి వారికి యోహాను 13:34, 35 చూపించాం. మా పొరుగువారిలో చాలామంది ఇప్పుడు బైబిలు అధ్యయనం చేస్తున్నారు.”

ఆయా వ్యక్తులపట్ల ప్రేమ

16 మన పొరుగువారినందరినీ ఒక గుంపుగా ప్రేమించడం కష్టమేమీ కాదు. అయితే ఆయా వ్యక్తులను ప్రేమించడం కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు, తమ పొరుగువారిపట్ల కొందరికున్న ప్రేమ ఏదో ధర్మాదాయ సంస్థకు విరాళం ఇవ్వడంకన్నా మించివుండదు. నిజానికి, మనపట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించని తోటి ఉద్యోగిని, మన ఇంటి ప్రక్కనే నివసించే పెడసరపు మనిషిని లేదా మనల్ని నిరాశపర్చే స్నేహితుణ్ణి ప్రేమించడంకన్నా మా పొరుగువారిని ప్రేమిస్తున్నామని చెప్పడం చాలా సులభం.

17 ఆయా వ్యక్తులను ప్రేమించే విషయంలో దేవుని లక్షణాలను పరిపూర్ణంగా ప్రతిబింబించిన యేసు నుండి మనం నేర్చుకోవచ్చు. ఆయన లోకపాపాన్ని తీసివేసేందుకు ఈ భూమికి వచ్చినా, ఆయన ఆయా వ్యక్తులపట్ల అంటే ఒక వ్యాధిగ్రస్థ స్త్రీపట్ల, కుష్ఠరోగిపట్ల, ఒక చిన్నమ్మాయిపట్ల ప్రేమ చూపించాడు. (మత్తయి 9:​20-22; మార్కు 1:​40-42; 7:​26, 29, 30; యోహాను 1:​29) అదే విధంగా మనం కూడా ప్రతీరోజు మనకు తారసపడే వ్యక్తులతో వ్యవహరించే విధానంలో మన పొరుగు వ్యక్తిపట్ల ప్రేమను చూపిస్తాం.

18 అయితే పొరుగువారిపట్ల ఉన్న ప్రేమ దేవునిపట్ల ఉన్న ప్రేమకు ముడిపడి ఉందనే విషయాన్ని మనమెన్నటికీ మర్చిపోకూడదు. యేసు బీదలకు సహాయం చేసినా, రోగులను స్వస్థపరచినా, ఆకలిగొన్నవారికి ఆహారమిచ్చినా, ఈ పనులన్నింటితోపాటు జనసమూహాలకు బోధించడంలో ఆయన ఉద్దేశం ప్రజలు యెహోవాతో సమాధానపడేందుకు వారికి సహాయం చేయడమే. (2 కొరింథీయులు 5:​19) యేసు తాను ప్రేమించిన దేవునికి ప్రాతినిథ్యం వహిస్తూ, ఆయనను ప్రతిబింబిస్తున్నాననే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకుండా, సమస్తం దేవుని మహిమార్థమే చేశాడు. (1 కొరింథీయులు 10:​31) యేసు మాదిరిని అనుకరించడం ద్వారా మనం కూడా పొరుగువారిని యథార్థంగా ప్రేమిస్తూ, అదే సమయంలో దుష్ట మానవలోక సంబంధులం కాకుండా ఉంటాం.

మనలాగే మన పొరుగువారిని ప్రేమించే విధానం

19 యేసు ఇలా చెప్పాడు: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” మనపట్ల మనం శ్రద్ధవహిస్తూ కొంతమేర సమతుల్యమైన ఆత్మగౌరవం కలిగివుండడం సహజమే. అదే నిజం కాకపోతే, ఆ ఆజ్ఞకు అర్థమే ఉండదు. ఈ యుక్తమైన ప్రేమ, అపొస్తలుడైన పౌలు 2 తిమోతి 3:2లో పేర్కొన్న స్వార్థపూరిత ప్రేమ ఒకటి కాదు. బదులుగా ఆ ప్రేమ సముచితమైన ఆత్మాభిమానమై ఉంది. దీనిని ఒక బైబిలు విద్వాంసుడు, “‘నేను ఉత్తముడను’ అనే లేక ‘నేను అథముణ్ణి’ అనే భావనలేని సమతుల్యమైన స్వప్రీతి” అని వర్ణించాడు.

20 మనలాగే ఇతరుల్ని ప్రేమించడమంటే ఇతరులు మనల్ని ఎలా చూడాలని కోరుకుంటామో అలా ఇతరులను చూడడమని, ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో అలా ఇతరులతో వ్యవహరించడమని అర్థం. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:​12) ఇతరులు మనకు గతంలో చేసినవాటిని గుర్తుపెట్టుకొని ఆ పిమ్మట వాటినే తిరిగి ఇమ్మని యేసు చెప్పలేదని గమనించండి. బదులుగా, ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని మనం కోరుకుంటామో ఆలోచించి ఆ ప్రకారమే ప్రవర్తించాలి. యేసు తన మాటలను స్నేహితులకు, సహోదరులకు మాత్రమే పరిమితం చేయలేదని కూడా గమనించండి. బహుశా మనం కలిసే ప్రతీ వ్యక్తి విషయంలో, ప్రజలందరి విషయంలో అలా ప్రవర్తించాలని సూచించేందుకు, ఆయన “మనుష్యులు” అనే మాటను ఉపయోగించాడు.

21 మన పొరుగువారిని ప్రేమించడం మనం చెడు చేయకుండా కాపాడుతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు.” (రోమీయులు 13:​9, 10) ఇతరులకు మేలుచేసే విషయాలను అన్వేషించేలా ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. తోటి మానవులను ప్రేమించడం ద్వారా, మానవుని తన స్వరూపంలో సృష్టించిన యెహోవా దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నామని మనం చూపిస్తాం.​—⁠ఆదికాండము 1:26.

మీరెలా జవాబిస్తారు?

మనమెవరిపట్ల ప్రేమ చూపించాలి, ఎందుకు?

యెహోవాను ఆరాధించనివారిని మనమెలా ప్రేమించవచ్చు?

మన సహోదరులపట్ల మనకుండవలసిన ప్రేమను బైబిలు ఎలా వర్ణిస్తోంది?

మనలాగే మన పొరుగువారిని ప్రేమించడమంటే అర్థమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?

2, 3. మన పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞకు మనమెందుకు అవధానమివ్వాలి, అలాగైతే ఏ ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?

4. లేవీయకాండము 19వ అధ్యాయం ప్రకారం, యూదులు ఎవరిని కూడా ప్రేమించాలి?

5. పొరుగువారిపట్ల ప్రేమను యూదులు ఎలా అర్థం చేసుకున్నారు?

6. పొరుగువారిని ప్రేమించే విషయం గురించి మాట్లాడినప్పుడు యేసు ఏ రెండు అంశాలను ప్రస్తావించాడు?

7. మంచి పొరుగువాడైన సమరయుని ఉపమానం నుండి మనమే పాఠం నేర్చుకుంటాం?

8. ప్రేమను చూపించడం గురించి లేవీయకాండము 19వ అధ్యాయం ఏమి చెబుతోంది?

9. ఇతర జనాంగాలకు దూరంగా ఉండమని యెహోవా ఇశ్రాయేలీయులను ఎందుకు ఆజ్ఞాపించాడు?

10. మనమే విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

11. యెహోవాను సేవించనివారిపట్ల ప్రేమ చూపించే ఉత్తమ మార్గమేమిటి, అదెందుకు ఉత్తమమైనది?

12. మన సహోదరుణ్ణి ప్రేమించడం గురించి అపొస్తలుడైన యోహాను ఏమి వ్రాశాడు?

13. తోటి విశ్వాసులపట్ల మనం ఏయే విధాలుగా ప్రేమను ప్రదర్శించవచ్చు?

14. కుటుంబంలో మనమెలా ప్రేమను కనబర్చవచ్చు?

15. క్రియాశీల సహోదర ప్రేమను గమనించిన కొందరు ఏమి చెప్పేందుకు, చేసేందుకు పురికొల్పబడ్డారు?

16. ఒక గుంపును ప్రేమించడానికి, ఆయా వ్యక్తులను ప్రేమించడానికి మధ్య తారతమ్యం ఏమిటి?

17, 18. ఆయా వ్యక్తులపట్ల యేసు ప్రేమనెలా చూపించాడు, ఆయన ఏ ఉద్దేశంతో అలాచేశాడు?

19, 20. మనలాగే మన పొరుగువారిని ప్రేమించడమంటే దానర్థమేమిటి?

21. ఇతరులను ప్రేమించడం ద్వారా మనమేమి చూపిస్తాం?

[26వ పేజీలోని చిత్రం]

‘నా పొరుగువాడెవడు?’

[29వ పేజీలోని చిత్రం]

యేసు ప్రేమ అందరికీ విస్తరిస్తుంది