కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి

మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి

మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [‘యెహోవాను,’ NW] ప్రేమింపవలెను.”​—⁠మత్తయి 22:37.

ఆప్రశ్న, యేసు కాలంలోని పరిసయ్యుల్లో అత్యంత వివాదాస్పదమైనదని స్పష్టమవుతోంది. మోషే ధర్మశాస్త్రంలోని దాదాపు 600 నియమాల్లో అత్యంత ప్రాముఖ్యమైన నియమమేది? బలులకు సంబంధించిన నియమమా? పాపక్షమాపణ కోసమేకాక, కృతజ్ఞతలు చెల్లించడం కోసం కూడా దేవునికి బలులు అర్పించబడేవి. లేక సున్నతికి సంబంధించిన నియమం అత్యంత ప్రాముఖ్యమా? సున్నతి అబ్రాహాముతో యెహోవా చేసిన నిబంధనకు సూచనగావుంది కాబట్టి, అది కూడా ప్రాముఖ్యమైనదే.​—⁠ఆదికాండము 17:​9-13.

2 మరోవైపు, దేవుడిచ్చిన నియమాల్లో కొన్ని తక్కువ ప్రాముఖ్యమన్నట్లు అనిపించినా ప్రతీ నియమం ప్రాముఖ్యమైనదే కాబట్టి, ఏ ఆజ్ఞనైనా వేరేవాటికన్నా ఎక్కువచేసి మాట్లాడడం తప్పని మితవాదులు తర్కించివుంటారని స్పష్టమవుతోంది. ఆ వివాదాస్పద ప్రశ్నను పరిసయ్యులు, యేసును అడగాలనుకున్నారు. ఆయన తన సత్యత్వానికి నష్టం వాటిల్ల చేసేదేదైనా చెబుతాడని వారనుకున్నారు. వారిలో ఒకడు ఆయన దగ్గరకొచ్చి ఇలా అడిగాడు: “ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?”​—⁠మత్తయి 22:​34-36.

3 యేసు ఇచ్చిన జవాబు నేడు మనకోసం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తానిచ్చిన జవాబులో ఆయన, సత్యారాధన విషయంలో ఎల్లప్పుడూ ఏది ప్రాముఖ్యమైనదిగా ఉండేదో, ఎల్లప్పుడూ ఏది ప్రాముఖ్యంగా ఉంటుందో దాన్ని సంగ్రహంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 6:5ను ఉల్లేఖిస్తూ యేసు ఇలా చెప్పాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [‘యెహోవాను,’ NW] ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.” ఆ పరిసయ్యుడు యేసును ఒక ఆజ్ఞ గురించే అడిగినప్పటికీ, యేసు మరో ఆజ్ఞ గురించి కూడా చెప్పాడు. లేవీయకాండము 19:⁠18ని ఉల్లేఖిస్తూ ఆయనిలా చెప్పాడు: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” ఆ తర్వాత యేసు ఈ రెండు ఆజ్ఞలు సత్యారాధన సారమని సూచించాడు. క్రమసంఖ్యలో ఏ నియమాలు ప్రాముఖ్యమైనవో ఆయన నోటితో చెప్పించాలనే ప్రయత్నాన్ని వమ్ముచేస్తూ ఆయనిలా ముగించాడు: “ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.” (మత్తయి 22:​37-40) ఈ రెండు ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞను మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనమెందుకు దేవుణ్ణి ప్రేమించాలి? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం? అలాంటి ప్రేమను మనమెలా వృద్ధి చేసుకోవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం ఆవశ్యకం, ఎందుకంటే యెహోవాను సంతోషపెట్టేందుకు మనమాయనను పూర్ణహృదయంతో, ఆత్మతో, మనసుతో ప్రేమించాలి.

ప్రేమ యొక్క ప్రాముఖ్యత

4 యేసును ప్రశ్నించిన ఆ పరిసయ్యుడు తాను పొందిన జవాబునుబట్టి కలవరపడినట్లు లేదా ఆశ్చర్యపడినట్లు కనిపించలేదు. అనేకులు దేవునిపట్ల ప్రేమ కనబర్చకపోయినా, సత్యారాధనలో ఆ ప్రేమ అత్యావశ్యక అంశమని ఆయనకు తెలుసు. సమాజమందిరాల్లో వాడుకగా షేమాను బిగ్గరగా వల్లిస్తారు అంటే తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తారు, ఈ హీబ్రూ ప్రార్థనలో యేసు ఉల్లేఖించిన ద్వితీయోపదేశకాండము 6:4-9లోని మాటలు కూడా ఉంటాయి. మార్కులోని సమాంతర వృత్తాంతంలో ఆ పరిసయ్యుడు తర్వాత యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికము.”​—⁠మార్కు 12:​32, 33.

5 ధర్మశాస్త్రం ప్రకారం సర్వాంగ హోమములు, బలులు అవసరమైనా, దేవుడు తన సేవకుల ప్రేమపూర్వక హృదయ స్థితినే అత్యంత విలువైనదిగా పరిగణిస్తాడు. తప్పుడు ఉద్దేశంతో అర్పించే వేలాది పొట్టేళ్లకన్నా, దేవునిపట్ల ప్రేమతో, భక్తితో అర్పించే చిన్న పిచ్చుకే ఆయనకు ఎంతో విలువైనది. (మీకా 6:​6-8) యెరూషలేము దేవాలయంలో యేసు గమనించిన బీద విధవరాలి వృత్తాంతాన్ని గుర్తుచేసుకోండి. కానుకలపెట్టెలో ఆమెవేసిన రెండు కాసులు ఒక పిచ్చుకను కొనడానికి కూడా సరిపోవు. అయినప్పటికీ, యెహోవాపట్ల హృదయపూర్వక ప్రేమతో ఇవ్వబడిన ఆ కానుక, ఆయన దృష్టిలో, ధనవంతులు తమ దగ్గర మిగిలిపోయే దానిలోనుండి ఇచ్చే భారీ విరాళాలకన్నా మరింతో విలువైనదిగా ఉంటుంది. (మార్కు 12:​41-44) మన పరిస్థితులు ఎలావున్నా మనమివ్వగల దానినే అంటే ఆయనపట్ల మనకున్న ప్రేమను యెహోవా అత్యంత విలువైనదిగా పరిగణిస్తాడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమో కదా!

6 సత్యారాధనలో ప్రేమకున్న ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.” (1 కొరింథీయులు 13:​1-3) కాబట్టి మన ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే ప్రేమ అత్యంత ప్రాముఖ్యం. అయితే యెహోవాపట్ల మన ప్రేమను ఎలా చూపించవచ్చు?

యెహోవాపట్ల మన ప్రేమను చూపించే విధానం

7 ప్రేమ, భావావేశమని దానిపై మనకు ఏ మాత్రం నియంత్రణ లేదని కొందరు నమ్ముతారు, అందుకే ప్రేమలో పడడం గురించి ప్రజలు మాట్లాడతారు. అయితే నిజమైన ప్రేమ అంటే మనలో కలిగే భావావేశం మాత్రమే కాదు. అది మానసిక భావం కాదుగానీ క్రియాత్మక లక్షణమని నిర్వచించబడింది. ప్రేమను బైబిలు ‘సర్వోత్తమ మార్గమని,’ అది మనం పెంపొందించుకోవడానికి ‘ప్రయాసపడవలసిన’ లక్షణమని సూచిస్తోంది. (1 కొరింథీయులు 12:​31; 14:⁠1) క్రైస్తవులు “మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను” ప్రేమించాలని ప్రోత్సహించబడ్డారు.​—⁠1 యోహాను 3:​18.

8 దేవునికి ఇష్టమైనది చేసేందుకేకాక, మాటల ద్వారా, క్రియల ద్వారా ఆయన సర్వాధిపత్యానికి మద్దతిస్తూ దానిని సమర్థించేందుకు కూడా ఆయనపట్ల మనకున్న ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది. లోకాన్ని, దాని భక్తిహీన క్రియల్ని ప్రేమించకుండా ఉండేందుకు అది మనల్ని పురికొల్పుతుంది. (1 యోహాను 2:​15, 16) దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకుంటారు. (కీర్తన 97:​10) దేవుణ్ణి ప్రేమించడంలో పొరుగువారిని ప్రేమించడం కూడా ఇమిడివుంది, ఈ అంశాన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలాగే దేవునిపట్ల ప్రేమ విధేయతను కోరుతుంది. బైబిలు ఇలా చెబుతోంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.”​—⁠1 యోహాను 5:⁠3.

9 దేవుని ప్రేమించడమంటే ఏమిటో యేసు పరిపూర్ణంగా ప్రదర్శించాడు. తన పరలోక గృహాన్ని విడిచిపెట్టి మానవునిగా భూమ్మీద జీవించేందుకు ప్రేమ ఆయనను పురికొల్పింది. తన క్రియల ద్వారా, బోధల ద్వారా తన తండ్రిని మహిమపర్చేందుకు అది ఆయనను ప్రేరేపించింది. “మరణము పొందునంతగా విధేయత” చూపేందుకు ప్రేమ ఆయనను పురికొల్పింది. (ఫిలిప్పీయులు 2:⁠8) ఆయన ప్రేమకు వ్యక్తీకరణైన ఆ విధేయత నమ్మకమైనవారు దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానం కలిగి ఉండే అవకాశాన్నిచ్చింది. పౌలు ఇలా వ్రాశాడు: “ఏలయనగా ఒక మనుష్యుని [ఆదాము] అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని [క్రీస్తుయేసు] విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.”​—⁠రోమీయులు 5:​19.

10 దేవునికి విధేయులుగా ఉండడం ద్వారా మనం కూడా యేసులాగే మన ప్రేమను ప్రదర్శిస్తాం. “మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ” అని యేసు ప్రియ అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (2 యోహాను 6) యెహోవాను నిజంగా ప్రేమించేవారు ఆయన నిర్దేశాన్ని కోరుకుంటారు. తాము విజయవంతంగా తమ మార్గాన్ని ఏర్పర్చుకోలేమని గుర్తిస్తూ వారు దేవుని జ్ఞానంపై ఆధారపడి, ఆయన ప్రేమపూర్వక నిర్దేశానికి లోబడతారు. (యిర్మీయా 10:​23) వారు దేవుని చిత్తం చేయాలనే ప్రగాఢమైన కోరికతో ‘ఆసక్తిగా’ దేవుని సందేశాన్ని అంగీకరించిన ప్రాచీన బెరయ వాసుల్లా ఘనులైవుంటారు. (అపొస్తలుల కార్యములు 17:​10, 11) వారు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధించారు, అలా అర్థం చేసుకోవడం తమ భావి విధేయతా క్రియల్లో తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు వారికి సహాయం చేసింది.

11 యేసు చెప్పినట్లుగా దేవునిపట్ల ప్రేమలో మన పూర్ణహృదయం, వివేకం, ఆత్మ, బలం ఇమిడివున్నాయి. (మార్కు 12:​30) అలాంటి ప్రేమ మన భావాలు, కోరికలు, అంతరంగ ఆలోచనలు చేరియున్న హృదయం నుండి వస్తుంది, అలాగే మనం యెహోవాను సంతోషపెట్టాలని ప్రగాఢంగా కోరుకుంటాం. మనం మన వివేకంతో అంటే మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి కూడా ప్రేమిస్తాం. మనది మూఢభక్తి కాదు; మనం యెహోవాను అంటే ఆయన లక్షణాల్ని, ప్రమాణాల్ని, సంకల్పాలను తెలుసుకున్నాం. ఆయనను సేవించేందుకు, ఆయనను స్తుతించేందుకు మనం మన ఆత్మను అంటే మనకున్న సమస్తాన్ని, మనకున్న జీవాన్ని ఉపయోగిస్తాం. అలాగే మనకున్న బలాన్ని కూడా అందుకోసం ఉపయోగిస్తాం.

మనమెందుకు యెహోవాను ప్రేమించాలి?

12 యెహోవాను ప్రేమించేందుకు ఒక కారణమేమిటంటే, మనమాయన లక్షణాలను ప్రతిబింబించాలని ఆయన కోరుతున్నాడు. దేవుడే ప్రేమకు ఆధారంగా, సర్వోన్నత ఆదర్శంగా ఉన్నాడు. “దేవుడు ప్రేమాస్వరూపి” అని ప్రేరేపిత అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 4:⁠8) మానవులు దేవుని స్వరూపంలో చేయబడ్డారు; మనం ప్రేమించేందుకు రూపొందించబడ్డాం. వాస్తవానికి, యెహోవా సర్వాధిపత్యం ప్రేమపై ఆధారపడివుంది. దేవుడు తన నీతియుక్త పరిపాలనా విధానాన్ని ప్రేమించి, దానిని ఇష్టపడిన కారణంగా తనను సేవించేవారే తన ప్రజలుగా ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి సమస్త సృష్టిలో శాంతిసామరస్యాలకు ప్రేమ ఆవశ్యకం.

13 యెహోవాను ప్రేమించేందుకు మరో కారణం, ఆయన మనకోసం చేసినదానిపట్ల మనకున్న కృతజ్ఞత. యేసు యూదులతో, ‘మీ దేవుడైన ప్రభువును [“యెహోవాను,” NW] ప్రేమింపవలెను’ అని చెప్పాడని గుర్తుచేసుకోండి. వారు తమకు దూరంగావున్న, తమకు తెలియని దేవుణ్ణి ప్రేమించాలని కోరబడలేదు. వారు తమపట్ల ప్రేమను వెల్లడిచేసిన దేవుణ్ణి ప్రేమించాలి. యెహోవా వారి దేవుడు. ఆయనే వారిని ఐగుప్తు నుండి వాగ్దానదేశానికి తీసుకువచ్చాడు, వారిని కాపాడి, పోషించి, సంరక్షించి, ప్రేమతో వారికి క్రమశిక్షణ ఇచ్చిన దేవుడు. మరి నేడు, మనం నిత్యజీవం పొందేలా తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇచ్చిన యెహోవాయే మన దేవుడు. తిరిగి మనమాయనను ప్రేమించాలని యెహోవా ఆశించడం ఎంత న్యాయమో కదా! మన ప్రేమ స్పందించేదై ఉంది; మనల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించాలని మనం కోరబడ్డాం. ‘మొదట మనలను ప్రేమించిన’ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం.​—⁠1 యోహాను 4:​19.

14 మానవాళిపట్ల యెహోవాకున్న ప్రేమ తన పిల్లలపట్ల ప్రేమగల తండ్రికున్న ప్రేమలాంటిదే. అపరిపూర్ణులైనప్పటికీ, ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల శ్రద్ధ చూపేందుకు వస్తుపరంగా, మరితర విధాలుగా ఎన్నో త్యాగాలు చేసి అనేక సంవత్సరాలు ప్రయాసపడతారు. తల్లిదండ్రులు తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, వర్ధిల్లాలని కోరుకుంటారు కాబట్టే, వారికి ఉపదేశిస్తారు, వారిని ప్రోత్సహిస్తారు, వారికి మద్దతిస్తారు, వారిని క్రమశిక్షణలో పెడతారు. తల్లిదండ్రులు తిరిగి తమ పిల్లలనుండి ఏమి ఆశిస్తారు? వారు తమ పిల్లలు తమను ప్రేమించాలని, వారి మేలుకోసం తాము నేర్పించినవి గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తారు. అలాగే పరిపూర్ణుడైన మన పరలోకపు తండ్రి మనకోసం చేసిన వాటన్నింటిపట్ల మనం ప్రేమపూర్వక కృతజ్ఞత చూపించాలని ఆశించడం న్యాయం కాదా?

దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకోవడం

15 మనం దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరం వినలేదు. (యోహాను 1:​18) అయినప్పటికీ, ఆయన తనతో ప్రేమపూర్వక సంబంధం కలిగివుండమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (యాకోబు 4:⁠8) మనమెలా ఆయనతో సంబంధం కలిగివుండగలం? ఎవరినైనా ప్రేమించడానికి తీసుకోవలసిన మొదటి చర్య ఆ వ్యక్తిని గురించి జ్ఞానం సంపాదించుకోవాలి; మనకు తెలియని వ్యక్తిపట్ల ప్రగాఢ అనురాగం ఏర్పర్చుకోవడం కష్టం. మనమాయన గురించి తెలుసుకునేందుకు యెహోవా తన వాక్యమైన బైబిలును అనుగ్రహించాడు. అందుకే యెహోవా బైబిలును క్రమంగా చదవమని తన సంస్థ ద్వారా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. దేవుని గురించి ఆయన లక్షణాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, అలాగే వేలాది సంవత్సరాలుగా తన ప్రజలతో ఆయన వ్యవహరించిన విధానం గురించి బైబిలే మనకు బోధిస్తుంది. అలాంటి వృత్తాంతాలను మనం ధ్యానిస్తుండగా ఆయనపట్ల మన అవగాహన, ప్రేమ వృద్ధౌతాయి.​—⁠రోమీయులు 15:⁠4.

16 యెహోవాపట్ల మనకున్న ప్రేమలో ఎదిగేందుకు ఒక ప్రాముఖ్యమైన మార్గం యేసు జీవితాన్ని, పరిచర్యను ధ్యానించడం. నిజానికి యేసు తన తండ్రిని ఎంత పరిపూర్ణంగా ప్రతిబింబించాడంటే ఆయనిలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:⁠9) ఓ విధవరాలి ఒక్కగానొక్క కుమారుణ్ణి తిరిగి బ్రతికించడంలో యేసు చూపిన కనికరాన్నిబట్టి మీరు కదిలించబడలేదా? (లూకా 7:​11-15) దేవుని కుమారుడు, జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి వినయంగా తన శిష్యుల కాళ్లు కడిగాడని తెలుసుకోవడం ఆకట్టుకోవడం లేదా? (యోహాను 13:​3-5) ఆయన మానవులందరికన్నా జ్ఞానవంతుడు, గొప్పవాడైనప్పటికీ, పిల్లలతోసహా అందరూ సమీపించగలిగేలా ఉన్నాడని తెలుసుకోవడం మిమ్మల్ని పురికొల్పడం లేదా? (మార్కు 10:​13, 14) ఈ విషయాలను మనం కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానిస్తుండగా, “మీరాయనను [యేసును] చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు” అని పేతురు ఏ క్రైస్తవుల గురించి వ్రాశాడో మనం కూడా వారిలాగే తయారౌతాం. (1 పేతురు 1:⁠8) యేసుపట్ల మన ప్రేమ బలోపేతమౌతుండగా, యెహోవాపట్ల కూడా మన ప్రేమ బలోపేతమౌతుంది.

17 మనం జీవితాన్ని ఆనందంగా గడిపేలా ఆయన ప్రేమతో సమృద్ధిగా చేసిన ఏర్పాట్లను అంటే అందమైన సృష్టిని, వైవిధ్యభరితమైన రుచికరమైన ఆహార పదార్థాలను, మంచి స్నేహితుల వాత్సల్యపూరిత సహవాసంతోపాటు మనకు సంతోషాన్ని సంతృప్తినిచ్చే మరెన్నో ఆహ్లాదకరమైన సంగతులను ధ్యానించడం దేవునిపట్ల మన ప్రేమను వృద్ధిచేసుకునే మరో మార్గం. (అపొస్తలుల కార్యములు 14:​17) మన దేవుని గురించి మనమెంత ఎక్కువ తెలుసుకుంటామో, ఆయన అపరిమితమైన మంచితనంపట్ల, ఔదార్యంపట్ల అంతగా కృతజ్ఞత కలిగివుండే మరెన్నో కారణాలు మనకుంటాయి. వ్యక్తిగతంగా యెహోవా మీ కోసం చేసిన వాటన్నింటి గురించి ఆలోచించండి. మన ప్రేమకు ఆయన అర్హుడనే సంగతిని మీరంగీకరించరా?

18 దేవుడు అనుగ్రహించిన అనేక వరాల్లో ఒకటి, ఏ సమయంలోనైనా ఆయనకు ప్రార్థించే అవకాశాన్ని మనం కలిగివుండడం, “ప్రార్థన ఆలకించువాడు” మన ప్రార్థన వింటాడని మనకు తెలుసు. (కీర్తన 65:⁠2) పరిపాలించే, తీర్పుతీర్చే అధికారాన్ని యెహోవా తన ప్రియకుమారునికి ఇచ్చాడు. అయితే ప్రార్థనలు వినే పనిని ఆయన తన కుమారునితోసహా మరెవరికీ అప్పగించలేదు. ఆయన వ్యక్తిగతంగా మన ప్రార్థనలు వింటాడు. ఆ విధంగా యెహోవా చూపించే ప్రేమపూర్వక, వ్యక్తిగత శ్రద్ధ మనల్ని ఆయనకు సన్నిహితుల్ని చేస్తుంది.

19 మానవాళికోసం ఆయన దాచివుంచిన వాటిని పరిశీలించడం కూడా మనల్ని యెహోవాకు సన్నిహితం చేస్తుంది. వ్యాధిని, దుఃఖాన్ని, మరణాన్ని తీసివేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. (ప్రకటన 21:​3, 4) మానవులు పరిపూర్ణతకు తీసుకురాబడిన తర్వాత ఇక ఎవరూ కృంగుదలను, నిరుత్సాహాన్ని లేదా విషాదాన్ని చవిచూడరు. ఆకలి, బీదరికం, యుద్ధం ఉండవు. (కీర్తన 46:⁠9; 72:​16) భూమి పరదైసుగా మార్చబడుతుంది. (లూకా 23:​43) ఈ ఆశీర్వాదాలు తీసుకొచ్చే బాధ్యత తనపై ఉందని కాదుగానీ మనల్ని ప్రేమిస్తున్నందువల్లే ఆయన వాటిని తీసుకొస్తాడు.

20 కాబట్టి మన దేవుణ్ణి ప్రేమించేందుకు, ఆ ప్రేమను వృద్ధిచేసుకునేందుకు బలమైన కారణాలున్నాయి. మీ మార్గాలను నిర్దేశించేందుకు దేవుణ్ణి అనుమతిస్తూ ఆయనపట్ల మీ ప్రేమను ఎడతెగక వృద్ధిచేసుకుంటారా? అది మీ ఇష్టం. యెహోవాపట్ల ప్రేమను వృద్ధిచేసుకొని దానిని కాపాడుకోవడంలోని ప్రయోజనాలను మోషే గుర్తించాడు. ప్రాచీనకాల ఇశ్రాయేలీయులకు మోషే ఇలా చెప్పాడు: “నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి.”​—⁠ద్వితీయోపదేశకాండము 30:​19, 20.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• మనం యెహోవాను ప్రేమించడం ఎందుకు ప్రాముఖ్యం?

• దేవునిపట్ల మన ప్రేమను ఎలా చూపించవచ్చు?

• యెహోవాను ప్రేమించేందుకు ఎలాంటి కారణాలు మనకున్నాయి?

• దేవునిపట్ల ప్రేమను మనమెలా వృద్ధిచేసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ముఖ్యమైన ఆజ్ఞకు సంబంధించిన ప్రశ్న లేవదీయబడేందుకు ఏది కారణమై ఉండవచ్చు?

3. ముఖ్యమైన ఆజ్ఞ ఏదని యేసు చెప్పాడు?

4, 5. (ఎ) యేసు ఇచ్చిన జవాబునుబట్టి ఆ పరిసయ్యుడు ఎందుకు ఆశ్చర్యపోలేదు? (బి) హోమములు, బలులకన్నా దేవునికి మరింత విలువైనదేది?

6. ప్రేమకున్న ప్రాముఖ్యత గురించి పౌలు ఏమని వ్రాశాడు?

7, 8. యెహోవాపట్ల మన ప్రేమను మనమెలా చూపించవచ్చు?

9. దేవునిపట్ల తన ప్రేమను యేసు ఎలా ప్రదర్శించాడు?

10. దేవునిపట్ల ప్రేమలో విధేయత ఎందుకు ఇమిడివుంది?

11. మన పూర్ణహృదయంతో, వివేకంతో, ఆత్మతో, బలంతో దేవుణ్ణి ప్రేమించడమంటే అర్థమేమిటి?

12. మనమాయనను ప్రేమించాలని దేవుడెందుకు కోరుతున్నాడు?

13. (ఎ) ‘మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను’ అని ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్పబడింది? (బి) మనమాయనను ప్రేమించాలని యెహోవా ఆశించడం ఎందుకు న్యాయం?

14. యెహోవా ప్రేమ ఏ విధంగా ప్రేమగల తండ్రి ప్రేమలాంటిదే?

15. దేవునిపట్ల ప్రేమను వృద్ధిచేసుకోవడంలోని మొదటి చర్య ఏమిటి?

16. యేసు పరిచర్యను ధ్యానించడం దేవునిపట్ల మన ప్రేమను ఎలా అధికం చేస్తుంది?

17, 18. యెహోవా చేసిన ఏ ప్రేమపూర్వక ఏర్పాట్లను ధ్యానించడం ఆయనపట్ల మన ప్రేమను వృద్ధిచేయగలదు?

19. యెహోవా చేసిన ఏ వాగ్దానాలు మనల్ని ఆయనకు సన్నిహితం చేస్తాయి?

20. యెహోవాను ప్రేమించడంలోని ప్రయోజనాల గురించి మోషే ఏమి చెప్పాడు?

[20వ పేజీలోని చిత్రం]

మనమాయనపట్ల వ్యక్తపర్చగల ప్రేమను యెహోవా ఎంతో విలువైనదిగా పరిగణిస్తాడు

[23వ పేజీలోని చిత్రం]

“నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” ​—⁠యోహాను 14:​9