కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రిస్మస్‌ ఎటు వెళ్తోంది?

క్రిస్మస్‌ ఎటు వెళ్తోంది?

క్రిస్మస్‌ ఎటు వెళ్తోంది?

ప ది సంవత్సరాల క్రితం ఇదే నెలలో, యు. ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ పత్రిక “క్రిస్మస్‌ కోసం అన్వేషణ” అనే కవర్‌స్టోరీని ప్రచురించింది. క్రిస్మస్‌ “మరింత పవిత్రంగా, వాణిజ్యానికి చోటివ్వనిదిగా” మారుతుందా లేదా అనే అంశంపై ఆ ఆర్టికల్‌ దృష్టి కేంద్రీకరించింది. నిజంగానే అలా జరుగుతోందా?

అలా జరగాలని మనమెందుకు ఎదురుచూడకూడదో చెప్పే కారణాలు ఆ ఆర్టికల్‌లో ఇవ్వబడ్డాయి. అదిలా పేర్కొంది: “కాన్‌స్టంటైన్‌ . . . రోముకు చక్రవర్తిగావున్న నాల్గవ శతాబ్దంవరకు క్రీస్తు జన్మదినాన్ని అధికారికంగా ఆచరించిన దాఖలాలు లేవు.” అంటే, “యేసు ఎప్పుడు జన్మించాడో ఎవరికీ తెలియదు అనడానికి అది పాక్షిక ఆధారంగా” ఉందని అది చూపిస్తుంది. “సువార్తలు యేసు పుట్టిన ఖచ్చితమైన నెల లేదా రోజు గురించేకాదు, సంవత్సరం గురించి కూడా ఏమీ చెప్పడం లేదు.” టెక్సాస్‌లోని విశ్వవిద్యాలయ చరిత్రకారుని ప్రకారం, “క్రిస్మస్‌ను ఆచరించే విషయంలో ప్రాచీన క్రైస్తవులు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.”

“డిసెంబరు 25వ తేదీని చర్చీ క్రిస్మస్‌ దినంగా ఎందుకు నిర్ణయించింది” అనే విషయాన్ని “కల్పితం” అనే ఉపశీర్షిక క్రింద ఆ ఆర్టికల్‌ చర్చించింది. అదిలా ఒప్పుకుంటోంది: “సాటర్నేలియా లేదా ఇతర అన్య దేవతల పండుగలకు ‘క్రైస్తవత్వపు రంగు పులిమి’ క్రిస్మస్‌ పండుగను వాడుకలోకి తెచ్చారనే విషయం అందరికీ తెలిసిందే.” “డిసెంబరు నెలాఖరులో ప్రజలు సాధారణంగా జరుపుకునే పండుగ రోజునే క్రిస్మస్‌ ఆచరణను వాడుకలోకి తీసుకొనిరావడం ద్వారా రక్షకుని జన్మదినం మరింత విస్తృతంగా జరపబడేలా చర్చీ నాయకులు చూశారు.” 19వ శతాబ్దపు మధ్యలో బహుమతులు కొనడం, ఇవ్వడంపైకి దృష్టిమళ్లింది. “క్రిస్మస్‌ రోజున బహుమతులిచ్చే సంప్రదాయం రెప్పపాటులో ధనార్జనకు మూలంగా మారడంతో, వర్తకులు వాణిజ్య ప్రకటనలు చేసే సంస్థలవారు క్రిస్మస్‌ పండుగకాలాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.”

అందుకే, క్రిస్మస్‌ పవిత్ర క్రైస్తవత్వం నుండి దూరంగా వెళ్తుందనే చెప్పాలి. ఆధునిక క్రిస్మస్‌ “వైభవోపేతమైన వ్యాపారంగా” తయారైంది, అయితే యేసు జన్మదినాన్ని ఆచరించాలని నిజ క్రైస్తవులకు ఎన్నడూ ఆజ్ఞాపించబడలేదు. బదులుగా, మరణ పునరుత్థానాల ద్వారా క్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధనాన్ని బైబిలు నొక్కిచెబుతోంది. (మత్తయి 20:​28) ఆయన ఇచ్చిన బలి మాత్రమే నేడు, అలాగే భవిష్యత్తులో కూడా అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది.