కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రిస్మస్‌ పండుగ స్ఫూర్తి ఏడాది పొడుగునా కనబర్చాలా?

క్రిస్మస్‌ పండుగ స్ఫూర్తి ఏడాది పొడుగునా కనబర్చాలా?

క్రిస్మస్‌ పండుగ స్ఫూర్తి ఏడాది పొడుగునా కనబర్చాలా?

“సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు [‘సుహృద్భావం గల మనుష్యులకు,’ NW] భూమిమీద సమాధానమును కలుగునుగాక.”​—⁠లూకా 2:​14.

రాత్రిపూట తమ మందను కాస్తున్న కాపరులకు యేసు జననం గురించి దేవదూతలు చెప్పిన ఆ మాటలు కోట్లాదిమందికి సుపరిచితమే. యేసు జన్మించాడని చర్చీలు చెప్పే క్రిస్మస్‌ పండుగ సమయంలో, అనేకమంది నామకార్థ క్రైస్తవులు తమ ప్రవర్తనను మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. దేవదూతలు చెప్పిన సందేశంలో ఆనందం, సమాధానం, సుహృద్భావం వంటి గుణాలు ప్రస్తావించబడ్డాయి, ప్రజలు క్రిస్మస్‌ పండుగ సమయంలో ఆ గుణాలను కనబరచడానికి చేసే ప్రయత్నాన్ని సాధారణంగా క్రిస్మస్‌ స్ఫూర్తి అంటారు.

మెచ్చుకోదగిన అలాంటి భావాలు క్రిస్మస్‌ పండుగ జరుపుకోనివారిని కూడా ఆకర్షిస్తాయి. ఆ పండుగ ప్రోత్సహిస్తున్నట్లు కనిపించే అలాంటి స్నేహభావాలపట్ల వారు కూడా కృతజ్ఞత కనబరుస్తారు. క్రిస్మస్‌ పండుగ సమయంలో పాఠశాలకు, పనికి సెలవు దొరికితే, విశ్రాంతి తీసుకునేందుకు, తమ కుటుంబాలతో, స్నేహితులతో సమయం గడిపేందుకు, లేక సరదాగా గడిపేందుకు ప్రజలకు అవకాశం దొరుకుతుంది. నిజమే, నిజాయితీగల అనేకమంది క్రిస్మస్‌ పండుగ సమయాన్ని ఎక్కువగా యేసుక్రీస్తును ఘనపర్చే సమయంగా దృష్టిస్తారు.

వారు క్రిస్మస్‌ పండుగకు ఎలాంటి ప్రాముఖ్యతనిచ్చినా, ఆ సెలవు కలిగించే ఎలాంటి స్నేహభావాలైన తాత్కాలికమే అని చాలామంది ఒప్పుకుంటారు. ప్రజలు తిరిగి తమ పాత ప్రవర్తనను త్వరగా కనబరుస్తారు. రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా ప్రచురించిన “ద స్పిరిట్‌ ఆఫ్‌ క్రిస్మస్‌” అనే వ్యాసం ఇలా పేర్కొంది: “చాలామంది ‘క్రైస్తవులు,’ ప్రతీ ఏడాది కొద్దివారాలు మాత్రమే ఆ పేరుకు తగ్గట్లు ప్రవర్తిస్తారు, క్రొత్త సంవత్సర వేడుకలు ముగిసేంతవరకు వారు తమ పొరుగువారిపట్ల సుహృద్భావాన్ని ఒలకబోస్తారు, ఆ తర్వాత వారు మళ్లీ తమ స్వార్థపూరిత వైఖరిని, తోటి మానవుల సంక్షేమంపట్ల ఉదాసీనతను కనబరుస్తారు.” ప్రజలు “ఏడాది పొడుగునా” క్రిస్మస్‌ స్ఫూర్తిని కనబరచకపోవడమే ఆ స్ఫూర్తిలో ఉన్న “అసలు లోపం” అని కూడా ఆ వ్యాసం చెబుతోంది.

ఆ విశ్లేషణతో మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, అది ప్రాముఖ్యమైన ప్రశ్నలను లేవదీస్తుంది. ప్రజలు ఎప్పటికైనా ఒకరిపట్ల ఒకరు ఔదార్యాన్ని, అవగాహనను కనబరుస్తూనే ఉండగలుగుతారా? యేసు పుట్టిన రాత్రి దేవదూతలు చెప్పిన సందేశం నెరవేరుతుందనడానికి వాస్తవిక నిరీక్షణ ఏమైనా ఉందా? లేక నిజమైన సమాధానం కోసం నిరీక్షించడం కేవలం కలేనా?