కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు

యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు

యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు

“మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.”​—⁠లూకా 11:​12, 13.

‘నా అంతట నేనే దీన్ని ఎదుర్కోలేను. కేవలం పరిశుద్ధాత్మ సహాయంతోనే నేను ఈ పరీక్షను తట్టుకోగలను!’ మీరెప్పుడైనా అలాంటి హృదయపూర్వక మనోభావాలను వ్యక్తపరిచారా? చాలామంది క్రైస్తవులు అలా వ్యక్తపరిచారు. మీకు ప్రమాదకరమైన వ్యాధి సోకిందని తెలిసినప్పుడు మీరలా వ్యక్తం చేసివుండవచ్చు. లేదా మీ వివాహ భాగస్వామి మరణించినప్పుడు అలా వ్యక్తం చేసివుండవచ్చు. లేదా ఎప్పుడూ సరదాగా ఆనందంగావుండే మీ సహజ స్వభావంపై ఇప్పుడు కృంగుదలనే మేఘాలు కమ్మివుండవచ్చు. జీవితంలో అత్యంత వేదనభరితమైన సమయాల్లో, యెహోవా పరిశుద్ధాత్మ అనుగ్రహించిన “బలాధిక్యము” కారణంగానే మీరింకా తట్టుకుని నిలబడగలుగుతున్నట్లు భావించి ఉండవచ్చు.​—⁠2 కొరింథీయులు 4:​7-9; కీర్తన 40:​1, 2.

2 నిజ క్రైస్తవులు, నేటి భక్తిహీన లోకంలో పెరుగుతున్న ఒత్తిడిని, వ్యతిరేకతను తాళుకోవాలి. (1 యోహాను 5:​19) అంతేకాక, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవా[రిపై]” దుర్మార్గంగా యుద్ధం చేస్తున్న అపవాదియైన సాతాను క్రీస్తు అనుచరులను ముట్టడిస్తున్నాడు. (ప్రకటన 12:​12, 17) కాబట్టి మనకు దేవుని ఆత్మ మద్దతు క్రితమెన్నటికన్నా ఇప్పుడు మరింత ఎక్కువ అవసరమనడంలో ఆశ్చర్యం లేదు. మనకు దేవుని పరిశుద్ధాత్మ ఎడతెగక సమృద్ధిగా లభించాలంటే మనమేమి చేయవచ్చు? పరీక్షా సమయాల్లో మనకవసరమైన బలాన్ని ఇచ్చేందుకు యెహోవా సుముఖంగా ఉన్నాడని మనమెందుకు రూఢీగా నమ్మవచ్చు? వీటికి జవాబులను మనం యేసు చెప్పిన రెండు ఉపమానాల్లో కనుగొనవచ్చు.

పట్టుదలతో ప్రార్థించండి

3 ఒకసారి, యేసు శిష్యుల్లో ఒకరు ఆయననిలా వేడుకున్నాడు: ‘ప్రభువా, మాకు ప్రార్థనచేయ నేర్పుము.’ (లూకా 11:⁠1) దానికి జవాబుగా యేసు తన శిష్యులకు ప్రార్థనకు సంబంధించిన రెండు ఉపమానాలు చెప్పాడు. మొదటిది ఇంట్లో అతిథివున్న వ్యక్తి గురించినది, రెండోది కుమారుడు కోరేది వినే తండ్రిని గురించినది. ఈ రెండు ఉపమానాల్ని మనం పరిశీలిద్దాం.

4 యేసు ఇలా చెప్పాడు: “మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్థరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి​—⁠స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనే యుండి​—⁠నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.” ఆ తర్వాత యేసు ఈ ఉపమానం ప్రార్థనకు ఎలా అన్వయిస్తుందో చెబుతూ ఇలా వివరించాడు: “అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.”​—⁠లూకా 11:​5-10.

5 పట్టుదల చూపించిన ఆ వ్యక్తిని గురించి స్పష్టంగా చెప్పబడిన ఆ ఉపమానం మనం ప్రార్థించేటప్పుడు మన మనోవైఖరి ఎలావుండాలో చూపిస్తోంది. ఆ వ్యక్తి “సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటవలన” తనకు అవసరమైనది పొందుతాడని యేసు చెప్పినట్లు గమనించండి. (లూకా 11:⁠8) “సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట” అనే పదబంధం బైబిల్లో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. సిగ్గుమాలి అనేమాట తరచూ ప్రతికూల లక్షణాన్ని సూచిస్తుంది. అయితే ఒక మంచి కారణం నిమిత్తం సిగ్గుమాలి అడగడం లేదా పట్టుదల ప్రదర్శించడం మెచ్చుకోదగిన లక్షణంగా ఉండగలదు. ఉపమానంలోని అతిథేయి విషయంలో అదే జరిగింది. ఆయన తనకు అవసరమైన దానికోసం సిగ్గుమాలి మాటిమాటికి అడిగేందుకు సంకోచించలేదు. యేసు ఆ అతిథేయిని మనకొక దృష్టాంతంగా ఉపయోగిస్తున్నాడు కాబట్టి, మనం కూడా పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం తదేకంగా ‘అడుగుతూ, వెదకుతూ, తడుతూ’ ఉండాలని యెహోవా కోరుతున్నాడు. అందుకు ప్రత్యుత్తరంగా ఆయన “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.”

6 మనం పట్టుదలతో ఎలా ప్రార్థించాలనేదేకాక, మనమలా ఎందుకు ప్రార్థించాలో కూడా యేసు వివరిస్తున్నాడు. ఆ పాఠాన్ని స్పష్టంగా గ్రహించేందుకు, పట్టుదల ప్రదర్శించిన అతిథేయిని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని విన్నవారు ఆతిథ్యమిచ్చే అలవాటును ఎలా దృష్టించారో మనం పరిశీలించాలి. బైబిలు కాలాల్లో సందర్శకులపట్ల శ్రద్ధ చూపించడాన్ని ప్రజలు, ప్రత్యేకంగా దేవుని సేవకులు చాలా ప్రాముఖ్యమైన అలవాటుగా పరిగణించేవారని లేఖనాల్లోని అనేక వృత్తాంతాలు చూపిస్తున్నాయి. (ఆదికాండము 18:​2-5; హెబ్రీయులు 13:⁠2) ఆతిథ్యం ఇవ్వలేకపోవడం అవమానకరంగా ఉండేది. (లూకా 7:​36-38, 44-46) దీనిని మనసులో ఉంచుకొని యేసు ఉపమానాన్ని మనం మళ్లీ పరిశీలిద్దాం.

7 ఉపమానంలోని అతిథేయి ఇంటికి అర్థరాత్రి ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ అతిథేయి తన ఇంటికివచ్చిన అతిథికి ఆహారం పెట్టాలనుకుంటాడు గానీ, ఆయన దగ్గర “అతనికి పెట్టుటకు ఏమియు లేదు.” ఆయన దృష్టిలో అది అత్యవసర పరిస్థితి! ఎలాగైనాసరే అతనికోసం రొట్టెలు సంపాదించాలి. అందువల్ల ఆయన తన స్నేహితుని ఇంటికివెళ్లి సిగ్గుమాలి అతణ్ణి నిద్రలేపుతాడు. “స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము” అని ఆయన బయటనుండి అడిగాడు. ఆయన తనకు కావల్సింది దొరికేవరకు పట్టువదలక అలా అడుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే, తనదగ్గర రొట్టెలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన సరైన అతిథేయిగా ఉండగలడు.

ఎక్కువ అవసరమైనప్పుడు ఎక్కువ అడగడం

8 మనం పట్టుదలతో ప్రార్థించడానికి కారణం ఏమిటని ఈ ఉపమానం చూపిస్తోంది? ఆ వ్యక్తి మాటిమాటికి అడగడానికి కారణం, అతిథేయిగా తన కర్తవ్యం నిర్వహించడానికి తన దగ్గర రొట్టెలు ఉండడం అత్యావశ్యకమని ఆయన భావించాడు. (యెషయా 58:​5-7) రొట్టెలు తన దగ్గర లేకుండా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించలేడు. అదే విధంగా, నిజ క్రైస్తవులముగా మనం మన పరిచర్యను నెరవేర్చేందుకు దేవుని ఆత్మను కలిగివుండడం అత్యావశ్యకమని గ్రహిస్తాం కాబట్టి, ఆ ఆత్మకోసం మనం తదేకంగా ప్రార్థిస్తాం. (జెకర్యా 4:⁠6) అది లేకపోతే మనం విఫలమౌతాం. (మత్తయి 26:​41) ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోగల ప్రాముఖ్యమైన పాఠాన్ని మీరు చూస్తున్నారా? మనం దేవుని ఆత్మను మనకు అత్యవసరమైనదానిగా దృష్టించినప్పుడు, దానికోసం అడిగేందుకు మనం మరింత పట్టుదలను ప్రదర్శించే అవకాశముంది.

9 ఈ పాఠాన్ని నేటి పరిస్థితులకు అన్వయించి చెప్పాలంటే, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అర్థరాత్రి అస్వస్థతకు గురయ్యారనుకుందాం. మీకు సహాయపడేందుకు వెళ్లి వైద్యుణ్ణి నిద్రలేపుతారా? ఆ రోగికి కలిగిన అస్వస్థత చిన్నపాటిదైతే మీరాయనను లేపరు. ఒకవేళ ఆయనకు గుండెపోటువస్తే వైద్యుణ్ణి పిలుచుకొని రావడానికి మీరు ఏమాత్రం తటపటాయించరు. ఎందుకు? ఎందుకంటే మీరు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిపుణుని సహాయం నిశ్చయంగా అవసరమని మీరు గ్రహిస్తారు. సహాయం అడగకపోతే ప్రాణానికే ముప్పు రావచ్చు. అదే విధంగా, నిజ క్రైస్తవులు సూచనార్థక అత్యవసర పరిస్థితిని ఎడతెగక ఎదుర్కొంటున్నారు. నిజానికి సాతాను “గర్జించు సింహమువలె” మనల్ని మ్రింగడానికి ప్రయత్నిస్తున్నాడు. (1 పేతురు 5:⁠8) మనం ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండేందుకు దేవుని ఆత్మ సహాయం మనకు నిశ్చయంగా అవసరం. దేవుని సహాయం అడగకుండా ఉండడం ప్రాణానికే ముప్పు తీసుకురాగలదు. కాబట్టి, మనం పట్టుదలతో దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోసం పదేపదే అడుగుతాం. (ఎఫెసీయులు 3:​14-16) అలా చేయడం ద్వారా మాత్రమే మనం ‘అంతంవరకు సహించేందుకు’ అవసరమైన శక్తిని కాపాడుకుంటాం.​—⁠మత్తయి 10:​22; 24:​13.

10 అందువల్ల కొన్నిసార్లు మనల్నిమనం ‘నేనెంత పట్టుదలతో ప్రార్థిస్తున్నాను’ అని ప్రశ్నించుకోవడం ప్రాముఖ్యం. దేవుని సహాయం మనకవసరమనే విషయాన్ని మనం పూర్తిగా గ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ కోసం మనంచేసే ప్రార్థనలు మరింత పట్టుదలతో చేసేవిగా ఉంటాయి.

నమ్మకంగా ప్రార్థించేందుకు మనల్ని ఏది పురికొల్పుతుంది?

11 పట్టుదల చూపించిన అతిథేయిని గురించిన యేసు ఉపమానం, ప్రార్థించే వ్యక్తి అంటే విశ్వాసి యొక్క మనోవైఖరిని నొక్కిచెప్పింది. తర్వాతి ఉపమానం ప్రార్థన ఆలకించే యెహోవా దేవుని మనోవైఖరిని నొక్కిచెబుతోంది. యేసు ఇలా అడిగాడు: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా?” యేసు దాని అన్యయింపును కొనసాగిస్తూ ఇలా అన్నాడు: “కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.”​—⁠లూకా 11:​11-13.

12 కుమారుడు అడిగినప్పుడు తండ్రి స్పందించడం గురించిన ఈ ఉదాహరణ ద్వారా, తనకు ప్రార్థించేవారిపట్ల యెహోవా మనోభావమెలా ఉంటుందో యేసు బయల్పరిచాడు. (లూకా 10:​22) మొదట, ఈ రెండు ఉపమానాలకు మధ్యవున్న తారతమ్యాన్ని గమనించండి. మొదటి ఉపమానంలో సహాయం అడిగిన వ్యక్తికి సహాయం చేసేందుకు ముందుకురాని వ్యక్తికి భిన్నంగా, యెహోవా తన పిల్లవాడు అడిగింది ఇచ్చేందుకు సుముఖంగా ఉండే ప్రేమగల మానవ తండ్రిలా ఉన్నాడు. (కీర్తన 50:​15) మానవ తండ్రికి పరలోకపు తండ్రికి మధ్యవున్న తేడాను పేర్కొంటూ మనపట్ల యెహోవాకున్న సుముఖతను యేసు మరింతగా వెల్లడిచేశాడు. మానవతండ్రి వారసత్వ పాపం కారణంగా ‘చెడ్డవాడైనా’ తన కుమారునికి మంచి ఈవినిస్తూ ఉంటే, దయాళుడైన మన పరలోకపు తండ్రి తన ఆరాధకుల కుటుంబానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని మనమెంతగా ఆశించవచ్చో కదా అని ఆయనన్నాడు.​—⁠యాకోబు 1:​17.

13 దీనిలో మనకే పాఠముంది? మనం పరిశుద్ధాత్మ కోసం మన పరలోకపు తండ్రిని అడిగినప్పుడు మనం చేసిన మనవిని అంగీకరించేందుకు ఆయన మరెంతో సుముఖంగా ఉన్నాడని మనం ధైర్యంగా ఉండవచ్చు. (1 యోహాను 5:​14) మనం మాటిమాటికి ఆయనకు ప్రార్థించినా, ఆయన “నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది” అని ఎన్నటికీ అనడు. (లూకా 11:⁠7) బదులుగా యేసు ఇలా చెప్పాడు: “అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.” (లూకా 11:​9, 10) అవును, మనం “మొఱ్ఱపెట్టునపుడు” యెహోవా మనకు ‘ఉత్తరమిస్తాడు.’​—⁠కీర్తన 20:​9; 145:​18.

14 శ్రద్ధ చూపించే తండ్రిని గురించి యేసు చెప్పిన ఉపమానం, ఏ మానవ తండ్రి మంచితనంకన్నా యెహోవా మంచితనం మరెంతో గొప్పదని కూడా నొక్కిచెబుతోంది. కాబట్టి, మనకు పరీక్షలు ఎదురైనప్పుడు అవి మనమీద దేవునికున్న కోపం కారణంగానే వస్తున్నాయని మనలో ఎవరూ భావించకూడదు. మనమలా ఆలోచించాలని మన ప్రధాన శత్రువైన సాతాను ఆశిస్తాడు. (యోబు 4:​1, 7, 8; యోహాను 8:​44) అలాంటి స్వీయారోపణా భావాలకు లేఖనాధారమేమీ లేదు. యెహోవా మనల్ని “కీడువిషయమై” శోధించడు. (యాకోబు 1:​13) ఆయన మనల్ని పాములాంటి లేదా తేలులాంటి పరీక్షకు అప్పగించడు. మన పరలోకపు తండ్రి ‘తన్ను అడుగువారికి మంచి యీవులను’ అనుగ్రహిస్తాడు. (మత్తయి 7:​10, 11; లూకా 11:​12, 13) యెహోవా మంచితనాన్ని, మనకు సహాయం చేయాలనే ఆయన సుముఖతను మనమెంతగా అర్థం చేసుకుంటామో, అంత ఎక్కువ నమ్మకంతో ఆయనకు ప్రార్థించేందుకు మనం పురికొల్పబడతాం. మనమలా ప్రార్థించినప్పుడు మనం కూడా కీర్తనకర్త వ్యక్తపర్చిన ఈ మనోభావాలనే వ్యక్తపర్చగలుగుతాం: “నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు; ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు.”​—⁠కీర్తన 10:​17; 66:​19.

పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా ఉండే విధానం

15 యేసు తన మరణానికి ముందు తన ఉపమానాల్లో ఇచ్చిన అభయాన్నే తిరిగి ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను . . . మీకనుగ్రహించును.” (యోహాను 14:​16) ఆ విధంగా యేసు ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్మ మనకాలంతోపాటు రాబోయే కాలాల్లో తన అనుచరులతో ఉంటుందని వాగ్దానం చేశాడు. నేడు అలాంటి మద్దతును మనమాస్వాదించే ఒక విశేషమైన విధానమేమిటి? వివిధ పరీక్షలను సహించేందుకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. ఎలా? స్వయంగా పరీక్షలను ఎదుర్కొన్న అపొస్తలుడైన పౌలు, పరిశుద్ధాత్మ తనకెలా సహాయం చేసిందో కొరింథులోని క్రైస్తవులకు వ్రాసిన పత్రికలో వివరించాడు. ఆయన వ్రాసిన దాన్ని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.

16 మొదట, పౌలు తాను ‘శరీరములోని ముల్లుతో’ బహుశా ఒకానొక పరీక్షను ఎదుర్కొంటున్నట్లు తన తోటి విశ్వాసులకు దాచుకోకుండా చెప్పాడు. ఆ తర్వాత ఆయనిలా అన్నాడు: “అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును [యెహోవాను] వేడుకొంటిని.” (2 కొరింథీయులు 12:​7, 8) పౌలు తన బాధను తొలగించమని దేవుణ్ణి వేడుకున్నా, అది అలాగే ఉండిపోయింది. బహుశా మీరు కూడా నేడు అదే పరిస్థితిని ఎదుర్కోవచ్చు. పౌలులాగే మీరు కూడా ఆ పరీక్షను తొలగించమని పట్టుదలతో, నమ్మకంగా యెహోవాకు ప్రార్థించి ఉండవచ్చు. మీరలా పదేపదే ప్రార్థించినా ఆ సమస్య మీకింకా ఎదురౌతూనే ఉండవచ్చు. అంటే యెహోవా మీ ప్రార్థనలకు స్పందించడం లేదనీ, పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయడం లేదనీ దానర్థమా? ఎంతమాత్రం కాదు! (కీర్తన 10:​1, 17) అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత ఏమిచెప్పాడో గమనించండి.

17 పౌలు ప్రార్థనలకు స్పందనగా దేవుడాయనకు ఇలా చెప్పాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” అందుకు పౌలు, “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, లేక నన్ను కప్పు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును” అని అన్నాడు. (2 కొరింథీయులు 12:⁠9, అధస్సూచి; కీర్తన 147:⁠5) అలా పౌలు, క్రీస్తు ద్వారా లభించే దేవుని శక్తివంతమైన కాపుదల గుడారంలా తనపై కప్పబడి ఉండడాన్ని ఆస్వాదించాడు. నేడు యెహోవా మన ప్రార్థనలకూ అదే విధంగా జవాబిస్తున్నాడు. ఆయన తన సేవకుల మీద తన కాపుదలను గుడారంలా కప్పుతున్నాడు.

18 గుడారం వర్షం పడకుండా, గాలి వీయకుండా ఆపుజేయదు గానీ మనం వాటి తాకిడికి గురవకుండా మనకు కొంతవరకు కాపుదలనిస్తుంది. అదే విధంగా, “క్రీస్తు శక్తి” మనకు పరీక్షలు రాకుండా లేదా మనపై కష్టాలు విరుచుకుపడకుండా ఆపుజేయదు. అయితే అది ఈ లోకపు హానికరమైన శక్తులకు, దాని పరిపాలకుడైన సాతాను ముట్టడులకు వ్యతిరేకంగా మనకు ఆధ్యాత్మిక కాపుదలనిస్తుంది. (ప్రకటన 7:​9, 15, 16) కాబట్టి, ‘మీ యొద్దనుండి తొలగిపోని’ పరీక్షను మీరు ఎదుర్కొంటున్నా, యెహోవాకు మీ సంఘర్షణ తెలుసనీ, ‘మీ మొరకు’ ఆయన ప్రత్యుత్తరమిస్తాడనీ మీరు నమ్మకంతో ఉండవచ్చు. (యెషయా 30:​19; 2 కొరింథీయులు 1:​3, 4) పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”​—⁠1 కొరింథీయులు 10:​13; ఫిలిప్పీయులు 4:​6, 7.

19 ఈ భక్తిహీన లోకపు ప్రస్తుత “అంత్యదినములు” “అపాయకరంగా” ఉన్నాయన్నది నిజమే. (2 తిమోతి 3:⁠1) అయితే దేవుని సేవకులకు ఇవి తాళజాలనంత కష్టమైనవేమీ కావు. ఎందుకు? ఎందుకంటే వారికి దేవుని పరిశుద్ధాత్మ మద్దతు, కాపుదల ఉన్నాయి, పట్టుదలతో, నమ్మకంతో అడిగే వారందరికీ యెహోవా వాటిని ఇష్టపూర్వకంగా సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి మనం ప్రతీరోజు పరిశుద్ధాత్మ కోసం ఎడతెగక ప్రార్థించేందుకు తీర్మానించుకుందాం.​—⁠కీర్తన 34:⁠6; 1 యోహాను 5:​14, 15.

మీరెలా జవాబిస్తారు?

• దేవుని పరిశుద్ధాత్మను పొందడానికి మనమేమి చేయాలి?

• పరిశుద్ధాత్మ కోసం మనం చేసే ప్రార్థనలకు యెహోవా ప్రత్యుత్తరమిస్తాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు?

• పరీక్షలను ఎదుర్కొనేలా పరిశుద్ధాత్మ మనకెలా సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. ప్రత్యేకంగా మనకెప్పుడు పరిశుద్ధాత్మ సహాయం అవసరం?

2. (ఎ) నిజ క్రైస్తవులకు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

3, 4. యేసు ఏ ఉపమానం చెప్పాడు, దానిని ఆయన ప్రార్థనకెలా అన్వయించాడు?

5. పట్టుదలతో అడిగిన వ్యక్తి గురించిన ఉపమానం ప్రార్థించేటప్పుడు మన మనోవైఖరి గురించి ఏమి బోధిస్తోంది?

6. యేసు కాలంలో ఆతిథ్యమిచ్చే అలవాటును ఎలా దృష్టించేవారు?

7. యేసు ఉపమానంలోని అతిథేయి తన స్నేహితుణ్ణి నిద్రలేపేందుకు ఎందుకు సిగ్గుపడలేదు?

8. పరిశుద్ధాత్మ కోసం పట్టుదలతో ప్రార్థించేందుకు మనల్ని ఏది పురికొల్పుతుంది?

9, 10. (ఎ) దేవుని ఆత్మ కోసం ప్రార్థించే విషయంలో మనమెందుకు పట్టుదలతో ఉండాలో సోదాహరణంగా చెప్పండి. (బి) మనల్నిమనం ఏమని ప్రశ్నించుకోవాలి, ఎందుకు?

11. తండ్రి కుమారుల ఉపమానాన్ని యేసు ప్రార్థనకు ఎలా అన్వయించాడు?

12. తండ్రి తన కుమారుడు అడిగింది ఇస్తాడనే ఉపమానం యెహోవా మన ప్రార్థనలకు స్పందించేందుకు సుముఖంగా ఉన్నాడని ఎలా నొక్కిచెబుతోంది?

13. మనం యెహోవాకు ప్రార్థించినప్పుడు ఏ విషయంలో మనం ధైర్యంగా ఉండవచ్చు?

14. పరీక్షలు ఎదుర్కొనే కొందరిని సరికాని ఏ తలంపు బాధిస్తుంది? (బి) పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు మనం ధైర్యంగా యెహోవాకు ఎందుకు ప్రార్థించవచ్చు?

15. (ఎ) పరిశుద్ధాత్మ గురించి యేసు ఏ వాగ్దానం చేశాడు? (బి) పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసే ఒక విధానమేమిటి?

16. మన పరిస్థితి కూడా ఎలా పౌలు పరిస్థితిలాగే ఉండవచ్చు?

17. పౌలు ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

18. మనమెందుకు పరీక్షలను తాళుకోగలుగుతున్నాం?

19. మీరేమి చేయడానికి తీర్మానించుకున్నారు, ఎందుకు?

[21వ పేజీలోని చిత్రం]

పట్టుదల చూపించిన అతిథేయి గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

[22వ పేజీలోని చిత్రం]

దేవుని పరిశుద్ధాత్మ కోసం మీరు పట్టుదలతో ప్రార్థిస్తున్నారా?

[23వ పేజీలోని చిత్రం]

శ్రద్ధచూపించే తండ్రికి సంబంధించిన ఉపమానం నుండి యెహోవా గురించి మనమేమి నేర్చుకుంటాం?