కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ‘న్యాయము తీరుస్తాడు’

యెహోవా ‘న్యాయము తీరుస్తాడు’

యెహోవా ‘న్యాయము తీరుస్తాడు’

“దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?”​—⁠లూకా 18:7.

ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు అనేక సంవత్సరాలపాటు యెహోవాను నమ్మకంగా సేవించిన క్రైస్తవ సహోదర సహోదరీల సాంగత్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రియమైనవారిలో కొందరు వ్యక్తిగతంగా మీకు తెలుసా? అనేక సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకొని ఎప్పుడో ఒకసారి తప్ప, క్రమం తప్పకుండా రాజ్యమందిరంలోని కూటాలకు వస్తున్న వృద్ధ సహోదరి ఒకరు మీకు తెలిసివుండవచ్చు. లేదా అనేక దశాబ్దాలుగా ప్రతీవారం సంఘ క్షేత్ర పరిచర్య కార్యక్రమానికి యథార్థంగా మద్దతిచ్చే వృద్ధ సహోదరుని గురించి మీరు ఆలోచించవచ్చు. నిజమే, వీరిలో చాలామంది నమ్మకస్థులు ఇప్పటికే హార్‌మెగిద్దోను వచ్చేసి ఉండాల్సిందని భావించివుంటారు. కానీ వాస్తవమేమిటంటే, ఈ అన్యాయపు లోకం ఇంకా ఉనికిలో ఉండడం యెహోవా వాగ్దానాల్లోని వారి నమ్మకాన్ని గానీ ‘అంతమువరకు సహించాలనే’ వారి నిర్ణయాన్ని గానీ బలహీనపర్చలేదు. (మత్తయి 24:​13) అలాంటి యెహోవా విశ్వసనీయ సేవకులు చూపించిన ప్రగాఢ విశ్వాసం సంఘమంతటికీ నిజంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.​—⁠కీర్తన 147:​11.

2 అయితే మనం కొన్నిసార్లు దీనికి వ్యతిరేకమైన పరిస్థితిని గమనించవచ్చు. కొందరు సాక్షులు అనేక సంవత్సరాలుగా పరిచర్యలో భాగంవహించారు, అయితే కాలప్రవాహంలో యెహోవాపై వారి విశ్వాసం సన్నగిల్లడంతో, క్రైస్తవ సంఘంతో సహవసించడం మానేశారు. అలాంటి సహవాసులు యెహోవాను విడిచిపెట్టడం మనకు బాధ కలిగించినా, అలా ‘తప్పిపోయిన ప్రతీ గొఱ్ఱె’ తిరిగి మందకు చేరుకునేలా సహాయం చేయాలని మనం మనసారా కోరుకుంటాం. (కీర్తన 119:​176; రోమీయులు 15:⁠1) అయితే పరస్పర విరుద్ధమైన ఈ రెండు విధానాలు అంటే కొందరు నమ్మకంగా ఉండడం, మరికొందరు విశ్వాసాన్ని కోల్పోవడం ప్రశ్నలను లేవదీస్తాయి. కొందరు తమ విశ్వాసాన్ని కోల్పోతుండగా అనేకమంది సాక్షులు యెహోవా వాగ్దానాలపై విశ్వాసముంచేలా వారికేది సహాయం చేస్తోంది? “యెహోవా మహా దినము” సమీపిస్తుందనే మన నమ్మకం స్థిరంగా ఉండేలా చూసుకునేందుకు మనం వ్యక్తిగతంగా ఏమి చేయవచ్చు? (జెఫన్యా 1:​14) లూకా సువార్తలోని ఒక ఉపమానాన్ని మనం పరిశీలిద్దాం.

“మనుష్యకుమారుడు వచ్చు” కాలంలో జీవిస్తున్నవారికి ఒక హెచ్చరిక

3 లూకా 18వ అధ్యాయంలో మనం, ఒక విధవరాలు, న్యాయాధిపతి గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని చూస్తాం. ఇది ముందరి ఆర్టికల్‌లో చర్చించిన పట్టుదల చూపించిన అతిథేయి గురించిన ఉపమానం లాంటిదే. (లూకా 11:​5-13) అయితే విధవరాలు, న్యాయాధిపతి గురించిన ఉపమానం ఉన్న బైబిలు భాగం యొక్క సందర్భం ప్రత్యేకంగా, 1914లో ఆరంభమైన, “మనుష్యకుమారుడు” రాజ్యాధికారంతో “వచ్చు” కాలంలో జీవిస్తున్నవారికి అన్వయిస్తుందని చూపిస్తోంది.​—⁠లూకా 18:⁠8. *

4 ఆ ఉపమానాన్ని చెప్పడానికి ముందు యేసు, తాను రాజ్యాధికారాన్ని చేపట్టాడనడానికి రుజువు “ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి ఆకాశము క్రింద మరియొక దిక్కునకు” ప్రకాశించు రీతిలో అందరూ గ్రహించేలా ఉంటుందని చెప్పాడు. (లూకా 17:​24; 21:​10, 29-33) అయినా “అంత్యకాలములో” జీవిస్తున్న అనేకులు ఆ స్పష్టమైన రుజువును ఏ మాత్రం పట్టించుకోరు. (దానియేలు 12:⁠4) ఎందుకు? నోవహు కాలంలోని, లోతు కాలంలోని ప్రజలు యెహోవా హెచ్చరికల్ని ఎందుకు పట్టించుకోలేదో అదే కారణంతో వీరు కూడా పట్టించుకోరు. ఆ కాలాల్లోని ప్రజలు ‘తాము నాశనం చేయబడే దినంవరకు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి.’ (లూకా 17:​26-29) వారు తమ సాధారణ కార్యకలాపాల్లో పూర్తిగా మునిగిపోయి దేవుని చిత్తానికి చెవియొగ్గని కారణంగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. (మత్తయి 24:​39) అదే విధంగా నేడు, ప్రజలు తమ దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయి ఈ భక్తిహీన లోకాంతం సమీపించిందనే రుజువును చూడలేకపోతున్నారు.​—⁠లూకా 17:​30.

5 తన అనుచరులు సాతాను లోకంచేత, చివరకు తాము విడిచిపెట్టిన వాటికోసం “తిరిగి” వెళ్లేంతగా పరధ్యానంలోపడే అవకాశముందని యేసు ఆందోళన చెందాడు. (లూకా 17:​22, 31) కొంతమంది క్రైస్తవుల విషయంలో అలాగే జరిగింది. అలాంటివారు అనేక సంవత్సరాలపాటు ఈ దుష్ట విధానాన్ని అంతమొందించే యెహోవా దినంకోసం ఆశగా ఎదురుచూశారు. అయితే, వారనుకున్న సమయానికి హార్‌మెగిద్దోను రాకపోయేసరికి వారు నిరుత్సాహపడ్డారు. యెహోవా తీర్పుదినం సమీపంలో ఉందనే వారి నమ్మకం బలహీనపడింది. వారు పరిచర్యలో వెనకబడి, ఆధ్యాత్మిక విషయాలకు సమయం లేనంతగా క్రమేణా లౌకిక విషయాల్లో మునిగిపోయారు. (లూకా 8:​11, 13, 14) కొద్దికాలానికే వారు తాము విడిచిపెట్టిన వాటికోసం ‘తిరిగి’ వెళ్లిపోయారు​—⁠అదెంత విచారకరం!

‘నిత్యము ప్రార్థించవలసిన’ అవసరం

6 యెహోవా వాగ్దానాల నెరవేర్పుపై మనకున్న ప్రగాఢ విశ్వాసం బలహీనపడకుండా చూసుకునేందుకు మనమేమి చేయవచ్చు? (హెబ్రీయులు 3:​13, 14) సాతాను దుష్ట లోకంవైపు తిరగొద్దని తన శిష్యులను హెచ్చరించిన వెంటనే యేసు ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు.

7 యేసు, “వారు విసుకక నిత్యము ప్రార్థన చేయచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెనని” లూకా నివేదిస్తున్నాడు. యేసు ఇలా చెప్పాడు: “దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి​—⁠నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు​—⁠నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను.”

8 యేసు ఆ ఉపమానం చెప్పి, దానిని ఇలా అన్వయించాడు: “అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?”​—⁠లూకా 18:​1-8.

‘నాకు న్యాయము తీర్చుము’

9 తేటగావున్న ఈ ఉపమానంలోని ప్రధానాంశం స్పష్టంగావుంది. ఆ ఉపమానంలోని ఇద్దరు పాత్రధారులు, అలాగే యేసు కూడా దానిని ప్రస్తావించారు. ఆ విధవరాలు ఇలా వేడుకుంది: ‘నాకు న్యాయము తీర్చుము.’ ఆ న్యాయాధిపతి ఇలా అన్నాడు: ‘ఆమెకు న్యాయము తీర్తును.’ యేసు ఇలా అడిగాడు: ‘దేవుడు న్యాయము తీర్చడా?’ యెహోవాను గురించి యేసు ఇలా అన్నాడు: “ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును.” (లూకా 18:​3, 5, 7, 8) దేవుడు ప్రత్యేకంగా ఎప్పుడు ‘న్యాయము తీరుస్తాడు’?

10 మొదటి శతాబ్దంలో న్యాయము తీర్చే దినములు లేదా “ప్రతిదండన దినములు” యెరూషలేము, దానిలోని దేవాలయం నాశనం చేయబడిన సా.శ. 70లో వచ్చాయి. (లూకా 21:​22) నేటి దేవుని ప్రజలకు, “యెహోవా మహా దినమున” న్యాయం తీర్చబడుతుంది. (జెఫన్యా 1:​14; మత్తయి 24:​21) ఆ సమయంలో “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని [యేసుక్రీస్తు] ప్రతిదండన చేయునప్పుడు” యెహోవా తన ప్రజలను “శ్రమపరచువారికి శ్రమ” తీసుకొస్తాడు.​—⁠2 థెస్సలొనీకయులు 1:​6-8; రోమీయులు 12:​19.

11 అయితే, యెహోవా “త్వరగా” న్యాయం తీరుస్తాడని యేసు ఇచ్చిన అభయాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? “[యెహోవా] దీర్ఘశాంతము చూపుచున్నా,” సమయం వచ్చినప్పుడు ఆయన త్వరగా న్యాయం జరిగిస్తాడని దేవుని వాక్యం చూపిస్తోంది. (లూకా 18:​7, 8; 2 పేతురు 3:​9, 10) నోవహు కాలంలో జలప్రళయం సంభవించినప్పుడు, దుష్టులు సత్వరమే నాశనం చేయబడ్డారు. అలాగే లోతు కాలంలో ఆకాశం నుండి అగ్ని కురిసినప్పుడు, దుష్టులు నశించారు. యేసు ఇలా అన్నాడు: “ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” (లూకా 17:​27-30) మళ్లీ, దుష్టులు “ఆకస్మిక నాశనము” అనుభవిస్తారు. (1 థెస్సలొనీకయులు 5:​2, 3) న్యాయము తీర్చవలసిన సమయమొచ్చినప్పుడు సాతాను లోకం ఉనికిలో ఉండడాన్ని యెహోవా అదనంగా ఒక్కరోజు కూడా అనుమతించడని మనం సంపూర్ణంగా నమ్మవచ్చు.

‘ఆయన న్యాయము తీర్చును’

12 విధవరాలు, న్యాయాధిపతి గురించిన యేసు ఉపమానం మరితర ప్రాముఖ్యమైన సత్యాలను నొక్కిచెబుతోంది. ఆ ఉపమానాన్ని అన్వయిస్తూ యేసు ఇలా చెప్పాడు: “అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన . . . వారికి న్యాయము తీర్చడా?” దేవుడు కూడా విశ్వాసులపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తాడన్నట్లు యేసు యెహోవాను ఆ న్యాయాధిపతితో పోల్చడం లేదు. బదులుగా దేవునికి, ఆ న్యాయాధిపతికి మధ్యగల తేడాను నొక్కిచెబుతూ యేసు తన అనుచరులకు యెహోవాను గురించి ఒక పాఠం చెబుతున్నాడు. వారి మధ్యవున్న తారతమ్యాన్ని చూపించగల కొన్ని మార్గాలేమిటి?

13 యేసు ఉపమానంలోని న్యాయాధిపతి ‘అన్యాయస్థుడు,’ కానీ దేవుడు ‘న్యాయమునుబట్టి తీర్పు తీరుస్తాడు.’ (కీర్తన 7:​11; 33:⁠5) ఆ న్యాయాధిపతికి విధవరాలిపట్ల వ్యక్తిగతంగా ఎలాంటి శ్రద్ధాలేదు, కానీ యెహోవాకు ప్రతీ వ్యక్తిపట్ల ఆసక్తి ఉంది. (2 దినవృత్తాంతములు 6:​29, 30) ఆ న్యాయాధిపతి విధవరాలికి సహాయం చేసేందుకు సుముఖత ప్రదర్శించలేదు, కానీ యెహోవా తనను సేవించేవారికి సహాయం చేసేందుకు ఇష్టపడడమేకాక, అత్యాకాంక్షతో కూడా ఉన్నాడు. (యెషయా 30:​18, 19) పాఠమేమిటి? అన్యాయస్థుడైన న్యాయాధిపతే విధవరాలి విన్నపాలు విని ఆమెకు న్యాయం తీరిస్తే, యెహోవా తన ప్రజల ప్రార్థనలను మరెంతో ఎక్కువగా ఆలకించి, వారికి తప్పకుండా న్యాయం తీరుస్తాడు.​—⁠సామెతలు 15:​29.

14 కాబట్టి దేవుని తీర్పుదినం వస్తుందనే విషయంలో విశ్వాసాన్ని కోల్పోయేవారు పెద్ద తప్పే చేస్తున్నారు. ఎందుకు? “యెహోవా మహా దినము” సమీపించడం గురించిన తమ స్థిర విశ్వాసాన్ని కోల్పోవడం ద్వారా, వారు నిజానికి యెహోవా తన వాగ్దానాలు నమ్మకంగా నిలబెట్టుకుంటాడని నమ్మవచ్చా అని ప్రశ్నించేవారిగా ఉంటారు. అయితే దేవుని నమ్మకత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. (యోబు 9:​12) ప్రాముఖ్యమైన ప్రశ్నేమిటంటే, మనం వ్యక్తిగతంగా నమ్మకంగా నిలిచివుంటామా? విధవరాలు, న్యాయాధిపతి గురించిన ఉపమానం ముగింపులో యేసు సరిగ్గా ఈ విషయాన్నే లేవనెత్తాడు.

“ఆయన భూమిమీద ఆ విశ్వాసము కనుగొనునా?”

15 యేసు ఆసక్తికరమైన ఈ ప్రశ్న వేశాడు: “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద ఆ విశ్వాసము కనుగొనునా?” (లూకా 18:⁠8, అధస్సూచి) ఇక్కడ యేసు పేర్కొన్న “ఆ విశ్వాసము” అనే మాట సాధారణ విశ్వాసాన్ని కాదుగానీ ఓ ప్రత్యేకమైన విశ్వాసాన్ని అంటే ఆ విధవరాలు ప్రదర్శించినలాంటి విశ్వాసాన్ని పేర్కొంటున్నాడు. యేసు తన ప్రశ్నకు జవాబివ్వలేదు. శిష్యులు తమ విశ్వాసం అలాంటి ప్రత్యేక తరహా విశ్వాసమో కాదో వారే ఆలోచించుకునేందుకు ఆయన ఆ ప్రశ్న అడిగాడు. అది వారు విడిచిపెట్టిన వాటికోసం తిరిగి వెళ్లే ప్రమాదంలో చిక్కుకునేలా క్రమేణా బలహీనపడుతోందా? లేక ఆ విధవరాలు కనబరిచినలాంటి విశ్వాసాన్నే కలిగివున్నారా? నేడు మనం కూడా ఇలా ప్రశ్నించుకోవాలి, ‘“మనుష్యకుమారుడు” నా హృదయంలో ఎలాంటి విశ్వాసాన్ని కనుగొంటాడు?’

16 యెహోవా న్యాయము తీర్చేవారిలో మనముండాలంటే, ఆ విధవరాలి విధానాన్నే మనమూ అనుసరించాలి. ఆమెకు ఎలాంటి విశ్వాసముంది? ఆమె పట్టుదలతో “[ఆ న్యాయాధిపతి] యొద్దకు వెళ్లి​—⁠‘నాకు న్యాయము తీర్చుమని’” అడుగుతూ తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఆ విధవరాలు ఒక అన్యాయస్థుని నుండి న్యాయం పొందడానికి పట్టుదలతో ప్రయత్నించింది. అదే విధంగా, దేవుని సేవకులు నేడు తాము ఎదురుచూసిన దానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నా, యెహోవా న్యాయం తీరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. అంతేకాక, పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా, అవును ‘దివారాత్రులు యెహోవాకు మొరపెట్టుకోవడం’ ద్వారా దేవుని వాగ్దానాల్లో తమకు నమ్మకముందని వారు చూపిస్తున్నారు. (లూకా 18:⁠7) అవును, ఒక క్రైస్తవుడు న్యాయం తీర్చమని అడగడం మానేస్తే, ఆయనకు యెహోవా తన సేవకుల పక్షాన చర్య తీసుకోవడంపై నమ్మకం లేదని చూపిస్తాడు.

17 ఆ విధవరాలి ప్రత్యేక పరిస్థితులు మనం పట్టుదలతో ప్రార్థించేందుకు అదనపు కారణాలు మనకున్నాయని చూపిస్తున్నాయి. ఆమె పరిస్థితికీ మన పరిస్థితికీ మధ్యగల కొన్ని తేడాలను పరిశీలించండి. ఎవరూ ప్రోత్సహించకపోయినా ఆ విధవరాలు విడువక పదేపదే ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళ్లింది, కానీ దేవుని వాక్యం “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని మనకెంతో ప్రోత్సాహాన్నిస్తోంది. (రోమీయులు 12:​12) తన విన్నపాలు మన్నించబడతాయనే ఏ హామీ ఆ విధవరాలికి లేదు, కానీ న్యాయం తీరుస్తానని యెహోవా మనకు అభయమిచ్చాడు. తన ప్రవక్త ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:⁠3; కీర్తన 97:​10) విధవరాలి విన్నపానికి మద్దతుగా మాట్లాడేందుకు ఆమెకు ఏ సహాయకుడూ లేడు. కానీ మనకు శక్తిమంతుడైన సహాయకునిగా యేసు ఉన్నాడు, ఈయన “దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనముకూడ చేయువాడు[నై]” ఉన్నాడు. (రోమీయులు 8:​34; హెబ్రీయులు 7:​25) కాబట్టి, ఆ విధవరాలు తన కష్ట పరిస్థితిలోనూ తనకు న్యాయం జరుగుతుందన్న ఆశతో న్యాయాధిపతిని వేడుకున్నప్పుడు, యెహోవా తీర్పుదినం తప్పకుండా వస్తుందని మనం మరెంత ఎక్కువగా విశ్వసించాలో కదా!

18 మన ప్రార్థనకు, విశ్వాసానికి దగ్గరి సంబంధముందని, పట్టుదలతో మనం చేసే ప్రార్థనలు మన విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రభావాలను అడ్డగిస్తాయని విధవరాలి ఉపమానం మనకు బోధిస్తోంది. అంటే బయటికి ఆకట్టుకునేలా ప్రార్థించడం విశ్వాసరాహిత్యాన్ని నివారిస్తుందని దానర్థం కాదు. (మత్తయి 6:​7, 8) మనం దేవునిపై పూర్తిగా ఆధారపడి ఉన్నామని గ్రహించిన కారణంగా ప్రార్థించేందుకు మనం పురికొల్పబడినప్పుడు మన ప్రార్థనలు మనల్ని దేవునికి సన్నిహితుల్నిచేసి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. రక్షణకు విశ్వాసం అవసరం కాబట్టి, తన శిష్యులు “విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె[నని]” వారిని ప్రోత్సహించడం అవసరమని యేసు పరిగణించడంలో ఆశ్చర్యం లేదు. (లూకా 18:⁠1; 2 థెస్సలొనీకయులు 3:​13) నిజమే, “యెహోవా మహా దినము” రావడం మన ప్రార్థనలపై ఆధారపడిలేదు, అది మనం ప్రార్థించినా, ప్రార్థించకపోయినా రాకమానదు. కానీ వ్యక్తిగతంగా మనకు న్యాయం తీర్చబడి దేవుని యుద్ధాన్ని తప్పించుకుంటామా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనకున్న విశ్వాసంపై మనం ప్రార్థనాపూర్వకంగా అనుసరించే విధానంపై ఆధారపడి ఉంటుంది.

19 యేసు ఇలా అడగడాన్ని మనం గుర్తుచేసుకోవచ్చు: ‘మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద ఆ విశ్వాసమును కనుగొనునా?’ ఆసక్తికరమైన ఆయన ప్రశ్నకు జవాబు ఏమిటి? నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నమ్మకమైన యెహోవా సేవకులు తమకలాంటి విశ్వాసముందని తమ ప్రార్థనలు, సహనం, పట్టుదల ద్వారా నిరూపించడం ఎంత సంతోషకరమో కదా! అందుకే యేసు ప్రశ్నకు గట్టిగా అవునని చెప్పవచ్చు. అవును, సాతాను లోకం ప్రస్తుతం మనకెంత అన్యాయం చేసినా, దేవుడు ‘తాను ఏర్పరచుకొనినవారికి న్యాయము తీరుస్తాడని’ మనం బలంగా నమ్ముతాం.

[అధస్సూచి]

^ పేరా 6 ఈ ఉపమానం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించేందుకు లూకా 17:​22-33 చదవండి. లూకా 17:​22, 24, 30లో ‘మనుష్యకుమారుని’ గురించిన ప్రస్తావనలు లూకా 18:⁠8లో లేవదీయబడిన ప్రశ్నకు జవాబిచ్చేందుకు మనకెలా సహాయం చేస్తాయో గమనించండి.

మీరు గుర్తుతెచ్చుకోగలరా?

కొంతమంది క్రైస్తవులు విశ్వాసం కోల్పోయేందుకు ఏది కారణమైంది?

యెహోవా తీర్పుదినం వస్తుందనే విషయంలో మనమెందుకు బలమైన విశ్వాసాన్ని కలిగివుండవచ్చు?

పట్టుదలతో ప్రార్థించేందుకు మనకెలాంటి కారణాలున్నాయి?

పట్టుదలతో ప్రార్థించడం మనం విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు ఎలా సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఎవరు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నారు, ఎందుకు?

2. ఏ పరిస్థితి మనకు బాధ కలిగిస్తుంది?

3. విధవరాలు, న్యాయాధిపతి గురించిన ఉపమానం నుండి ప్రత్యేకంగా ఎవరు ప్రయోజనం పొందగలరు, ఎందుకు?

4. లూకా 18వ అధ్యాయంలోని ఉపమానం చెప్పడానికి ముందు యేసు ఏమి చర్చించాడు?

5. (ఎ) యేసు ఎవరినుద్దేశించి హెచ్చరించాడు, ఎందుకు? (బి) కొందరు విశ్వాసం కోల్పోయేందుకు ఏది కారణమైంది?

6-8. (ఎ) విధవరాలు, న్యాయాధిపతి గురించిన ఉపమానాన్ని వివరించండి. (బి) యేసు ఈ ఉపమానాన్ని ఎలా అన్వయించాడు?

9. విధవరాలు, న్యాయాధిపతి గురించిన ఉపమానంలో ఏ ప్రధానాంశం నొక్కిచెప్పబడింది?

10. (ఎ) మొదటి శతాబ్దంలో ఎప్పుడు న్యాయం తీర్చబడింది? (బి) నేడు దేవుని ప్రజలకు ఎప్పుడు, ఎలా న్యాయం తీర్చబడుతుంది?

11. న్యాయమెలా “త్వరగా” తీర్చబడుతుంది?

12, 13. (ఎ) విధవరాలు, న్యాయాధిపతి గురించిన యేసు ఉపమానం ఎలా ఓ పాఠాన్ని నేర్పిస్తుంది? (బి) యెహోవా మన ప్రార్థనలను ఆలకించి, న్యాయం తీరుస్తాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు?

14. దేవుని తీర్పుదినం వస్తుందనే విషయంపై మనమెందుకు విశ్వాసం కోల్పోకూడదు?

15. (ఎ) యేసు ఏ ప్రశ్న అడిగాడు, ఎందుకు? (బి) మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

16. విధవరాలు ఎలాంటి విశ్వాసం ప్రదర్శించింది?

17. పట్టుదలతో ప్రార్థించేందుకు, యెహోవా తీర్పుదినం తప్పకుండా వస్తుందనే మన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు మనకు ఏ కారణాలున్నాయి?

18. ప్రార్థన మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది, న్యాయం పొందడానికి ఎలా సహాయం చేస్తుంది?

19. దేవుడు ‘న్యాయము తీరుస్తాడని’ బలంగా నమ్ముతున్నట్లు మనమెలా నిరూపిస్తాం?

[26వ పేజీలోని చిత్రం]

విధవరాలు, న్యాయాధిపతి గురించిన ఉపమానం దేనిని నొక్కిచెప్పింది?

[29వ పేజీలోని చిత్రాలు]

దేవుడు ‘న్యాయము తీరుస్తాడని’ నేడు లక్షలాదిమంది బలంగా నమ్ముతున్నారు