కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా మహా దినము సమీపమాయెను”

“యెహోవా మహా దినము సమీపమాయెను”

“యెహోవా మహా దినము సమీపమాయెను”

“యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” ​—⁠జెఫన్యా 1:​14.

ఆనందంతో వెలిగిపోతున్న అమ్మాయి తన పెళ్లిరోజు ఎప్పుడొస్తుందా అని ఉత్సాహంగా నిరీక్షిస్తుంది. గర్భిణీ స్త్రీ పుట్టబోయే బిడ్డకోసం వాత్సల్యపూరితంగా ఎదురుచూస్తుంది. అలసిపోయిన ఉద్యోగి తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సెలవు రోజు ఎప్పుడొస్తుందా అని ప్రగాఢంగా కోరుకుంటాడు. వీటిలో ఏది సాధారణంగా కనిపిస్తోంది? వారంతా ఓ ప్రత్యేక దినం కోసం అంటే తమ జీవితాల్ని ప్రభావితం చేయగల దినంకోసం నిరీక్షిస్తున్నారు. వారి భావోద్వేగాలు ప్రగాఢంగావున్నా అవి చాలా భిన్నంగా ఉంటాయి. వారు వేచివున్న దినం చివరకు వస్తుంది, అది వచ్చినప్పుడు దానికి సిద్ధపడి ఉండాలని వారు ఆశిస్తారు.

2 అదే విధంగా నేడు నిజ క్రైస్తవులు ఒక ప్రత్యేక దిన రాకడకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అది ‘యెహోవా మహా దినము.’ (యెషయా 13:9; యోవేలు 2:1; 2 పేతురు 3:​11, 12) రాబోయే ఆ “యెహోవా దినము” అంటే ఏమిటి, అది రావడం మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంతేకాక, దాని రాకడకోసం మనం సిద్ధంగా ఉన్నామని మనమెలా చూపించవచ్చు? మనమీ ప్రశ్నలకు ఇప్పుడే జవాబులు వెదకడం ఆవశ్యకం, ఎందుకంటే అందుబాటులోవున్న రుజువు బైబిల్లోని ఈ క్రింది మాటల సత్యత్వాన్ని సూచిస్తోంది: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.”​—⁠జెఫన్యా 1:​14.

“యెహోవా మహా దినము”

3 “యెహోవా మహా దినము” అంటే ఏమిటి? లేఖనాలన్నింటిలో “యెహోవా దినము” యెహోవా తన శత్రువులపై తీర్పు అమలుచేసి తన ఘనమైన నామాన్ని మహిమపరచుకున్న ప్రత్యేక సమయాలను సూచిస్తోంది. యూదా యెరూషలేముల్లోని అవిశ్వాస ప్రజలతోపాటు, బబులోను, ఐగుప్తు దేశాల క్రూర నివాసులపై యెహోవా తీర్పులు అమలు చేయబడినప్పుడు వారందరూ ‘యెహోవా దినాలను’ ఎదుర్కొన్నారు. (యెషయా 2:​1, 10-12; 13:​1-6; యిర్మీయా 46:​7-10) అయితే ‘యెహోవా మహా దినము’ భవిష్యత్తులో రానుంది. అది యెహోవా నామాన్ని అవమానపరచినవారిపై ఆయన విధించిన తీర్పు అమలుచేయబడే “దినము”గా ఉంటుంది. అది ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను” నాశనంతో మొదలై, మిగతా దుష్ట విధానం అర్మగిద్దోను యుద్ధంలో నిర్మూలం చేయబడడంతో ముగుస్తుంది.​—⁠ప్రకటన 16:​14, 16; 17:​5, 15-17; 19:​11-21.

4 మానవులు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా వారిలో అధికశాతంమంది వేగంగా సమీపిస్తున్న ఆ దినం విషయంలో భయపడాలి. ఎందుకు? జెఫన్యా ప్రవక్త ద్వారా యెహోవా దానికిలా జవాబిస్తున్నాడు: “ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ము దినము.” నిజంగా భయంకరము! అంతేకాక, ఆ ప్రవక్త ఇంకా ఇలా అంటున్నాడు: “జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను.”​—⁠జెఫన్యా 1:​15, 17.

5 అయితే లక్షలాదిమంది యెహోవా దినపు రాకడకోసం కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. ఎందుకు? అది వారికి రక్షణను, విడుదలను తీసుకొచ్చేదేకాక, ఆ దినాన యెహోవా సర్వోన్నతునిగా హెచ్చించబడి, ఆయన మహిమాన్విత నామం పరిశుద్ధపర్చబడుతుందని వారికి తెలుసు. (యోవేలు 3:​16, 17; జెఫన్యా 3:​12-17) ఆ దినం గురించి భయపడడం లేక ఆతృతగా ఎదురుచూడడం అనేది ఎక్కువగా ప్రజలు నేడు తమ జీవితాల్లో ఏమిచేస్తున్నారనే దానిమీదే ఆధారపడివుంటుంది. సమీపిస్తున్న ఆ దినాన్ని మీరెలా దృష్టిస్తున్నారు? మీరు దానికోసం సిద్ధంగా ఉన్నారా? యెహోవా దినం కనుచూపుమేరలో ఉందనే వాస్తవం ఇప్పుడు మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తోందా?

‘అపహాసకులు అపహసిస్తారు’

6 పరిస్థితి ఇంత అత్యవసరంగావున్నా, భూనివాసుల్లో అధికశాతంమంది సమీపిస్తున్న ఆ ‘యెహోవా దినాన్ని’ అంతగా పట్టించుకోవడం లేదు. దాని రాకను గురించి హెచ్చరిస్తున్న ప్రజలను వారు అపహసిస్తున్నారు. ఇది నిజ క్రైస్తవులకు ఆశ్చర్యం కలిగించదు. అపొస్తలుడైన పేతురు వ్రాసిన ఈ హెచ్చరికను వారు గుర్తుతెచ్చుకుంటారు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు​—⁠ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.”​—⁠2 పేతురు 3:​3, 4.

7 అలాంటి ప్రతికూల ఆలోచనను ఎదిరిస్తూ అత్యవసర భావాన్ని కాపాడుకునేందుకు మనకేది సహాయం చేస్తుంది? పేతురు ఇలా చెబుతున్నాడు: “పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకముచేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.” (2 పేతురు 3:​1, 2) మనం ప్రవచన హెచ్చరికలకు అవధానమివ్వడం స్పష్టమైన మన ఆలోచనాశక్తిని లేదా ‘నిర్మలమైన మన మనసులను రేపుటకు’ మనకు సహాయం చేస్తుంది. బహుశా మనమీ జ్ఞాపికలను పదేపదే వినివుండవచ్చు, అయితే క్రితమెన్నటికన్నా ఇప్పుడు ఈ హెచ్చరికలకు మరింత అవధానమిస్తూ ఉండడం అత్యంత ఆవశ్యకం.​—⁠యెషయా 34:​1-4; లూకా 21:​34-36.

8 కొందరెందుకు ఈ జ్ఞాపికలను లక్ష్యపెట్టరు? పేతురు ఇంకా ఇలా చెబుతున్నాడు: “ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.” (2 పేతురు 3:​5, 6) అవును, యెహోవా దినపు రాకడను ఇష్టపడని వారున్నారు. తమ సాధారణ జీవితాలకు అంతరాయం కలగడం వారికిష్టం లేదు. తమ స్వార్థపూరిత జీవనశైలి విషయంలో యెహోవాకు లెక్క అప్పగించడం వారికిష్టం లేదు. పేతురు చెబుతున్నట్లుగా, వారు “తమ స్వకీయ దురాశలచొప్పున” జీవిస్తున్నారు.

9 ఈ అపహాసకులు, గతంలో యెహోవా మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడనే విషయాన్ని “బుద్ధిపూర్వకముగా” నిర్లక్ష్యం చేసేందుకే ఇష్టపడతారు. యేసుక్రీస్తు, అపొస్తలుడైన పేతురు అలాంటి రెండు సంఘటనలను అంటే “నోవహు దినములను,” “లోతు దినములను” పేర్కొన్నారు. (లూకా 17:​26-30; 2 పేతురు 2:​5-9) జలప్రళయానికి ముందు, నోవహు ఇచ్చిన హెచ్చరికను ప్రజలు లక్ష్యపెట్టలేదు. అదే విధంగా, సొదొమ గొమొఱ్ఱాల నాశనానికి ముందు లోతు అల్లుళ్ల దృష్టికి ఆయన “ఎగతాళి చేయువానివలె” కనిపించాడు.​—⁠ఆదికాండము 19:​14.

10 నేటి పరిస్థితి కూడా అలాగేవుంది. అయితే లక్ష్యపెట్టనివారిపట్ల యెహోవా స్పందన ఎలావుందో గమనించండి: “మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై​—⁠యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.” (జెఫన్యా 1:​12, 13) ప్రజలు తమ “సాధారణ” దైనందిన కార్యక్రమాల్లో కొనసాగవచ్చు, అయితే వారి కష్టాన్నిబట్టి వారెలాంటి శాశ్వత ప్రయోజనమూ పొందలేరు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా దినం ఆకస్మికంగా వస్తుంది, వారు దాచుకున్న వస్తుసంపదలేవీ వారిని కాపాడలేవు.​—⁠జెఫన్యా 1:​18.

“దానికొరకు కనిపెట్టుము”

11 మన చుట్టూవున్న దుష్టలోకానికి భిన్నంగా మనం ప్రవక్తయైన హబక్కూకు వ్రాసిన ఈ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:⁠3) మన అపరిపూర్ణ దృక్కోణం నుండి చూస్తే అది ఆలస్యమౌతున్నట్లు అనిపించినా, యెహోవా ఆలస్యం చేయడని మనం గుర్తుంచుకోవాలి. ఆయన దినం మానవులు ఊహించని ఘడియలో, నియమిత సమయానికి ఖచ్చితంగా వస్తుంది.​—⁠మార్కు 13:​33; 2 పేతురు 3:​9, 10.

12 యెహోవా దినాన్ని కనిపెట్టుకునివుండవలసిన ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, యేసు తన అనుచరుల్లో కొందరు సహితం అత్యవసర భావాన్ని కోల్పోతారని హెచ్చరించాడు. వారి గురించి ఆయన ముందుగానే ఇలా చెప్పాడు: “దుష్టుడైన యొక దాసుడు​—⁠నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికిం[చును].” (మత్తయి 24:​48-51) ఆ దాసునికి భిన్నంగా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి విశ్వసనీయంగా అత్యవసర భావాన్ని కాపాడుకుంటోంది. దాసుని తరగతి మెలకువగావుండి, సిద్ధంగా ఉన్నట్లు నిరూపించుకుంది. యేసు ఆ దాసుణ్ణి ఈ భూమ్మీది “తన యావదాస్తిమీద” నియమించాడు.​—⁠మత్తయి 24:​42-47.

అత్యవసర భావంయొక్క అవసరత

13 మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఖచ్చితంగా తమ అత్యవసర భావాన్ని కాపాడుకోవాలి. యెరూషలేము “దండ్లచేత చుట్టబడుట” చూసినప్పుడు ఆ నగరం నుండి పారిపోయేందుకు వారు తక్షణమే చర్య తీసుకోవాలి. (లూకా 21:​20, 21) సా.శ. 66లో దండ్లు యెరూషలేమును చుట్టుముట్టాయి. ఆ కాలంలోని క్రైస్తవులు అత్యవసర భావాన్ని కలిగివుండలసిన అవసరతను యేసు ఎలా నొక్కిచెప్పాడో గమనించండి: “మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు.” (మత్తయి 24:​17, 18) యెరూషలేము ఇంకా నాలుగు సంవత్సరాలపాటు నిలిచివుందనే చారిత్రక వాస్తవం దృష్ట్యా, సా.శ. 66లోనే ఆ క్రైస్తవులు యేసు మాటలను అంత అత్యవసరంగా ఎందుకు లక్ష్యపెట్టాలి?

14 రోమా సైన్యం సా.శ. 70వ సంవత్సరం వరకు యెరూషలేమును నాశనం చేయకపోయినా, ఆ నాలుగు సంవత్సరాలు శాంతియుతంగా ఏమీలేవు. అవి కష్టాల్నే తీసుకొచ్చాయి! ఆ సంవత్సరాల్లో హింస, రక్తపాతం విపరీతంగా చోటుచేసుకున్నాయి. యెరూషలేములో నెలకొన్న పరిస్థితిని ఒక చరిత్రకారుడు, “ఘోరమైన క్రూరత్వంతోపాటు, రక్తపుటేరులు ప్రవహించిన భీకరమైన అంతర్యుద్ధం” జరిగిన కాలంగా వర్ణించాడు. కోటగోడల్ని దుర్భేద్యం చేసేందుకు, ఆయుధాలు చేపట్టేందుకు, సైన్యంలో పనిచేసేందుకు యౌవనులు చేర్చుకోబడ్డారు. వారు ప్రతీరోజు సైనిక కవాతులు నిర్వహించేవారు. తీవ్రభావాలను బలపర్చనివారు విశ్వాసఘాతకులుగా దృష్టించబడేవారు. క్రైస్తవులు ఒకవేళ ఆ పట్టణంలో ఉండిపోతే, వారు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండేవారే.​—⁠మత్తయి 26:​52; మార్కు 12:​17.

15 యెరూషలేములోని వారేకాదు, “యూదయలో ఉండువారు” సహితం పారిపోవాలని యేసు చెప్పాడని మనం గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే, రోమా దళాలు యెరూషలేము నుండి వెనక్కితగ్గిన కొద్దినెలల్లోనే మళ్లీ తమ సైనిక కార్యకలాపాలు మొదలుపెట్టాయి. మొదట, వారు సా.శ. 67లో గలిలయను లోబర్చుకొని, మరుసటి సంవత్సరానికల్లా ఓ పద్ధతి ప్రకారం యూదయను జయించారు. అందువల్ల దేశమంతటా విపరీతమైన దైన్యస్థితి అలుముకొంది. అలాగే ఏ యూదునికైనా యెరూషలేము నుండి తప్పించుకోవడమే అత్యంత కష్టభరితంగా తయారైంది. పట్టణ ముఖద్వారాల దగ్గర కాపలా పెరగడమేకాక, తప్పించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తిని రోమన్ల పక్షపువాడిగా పరిగణించేవారు.

16 ఈ వాస్తవాలన్నింటిని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, యేసు పరిస్థితియొక్క అత్యవసర భావాన్ని ఎందుకు నొక్కిచెప్పాడో మనం అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవులు వస్తుపరమైన సంపదలచేత దారి మళ్లించబడే బదులు, త్యాగాలు చేసేందుకు సుముఖంగా ఉండాలి. యేసు హెచ్చరికను లక్ష్యపెట్టేందుకు వారు ‘తమకు కలిగినదంతయు విడిచిపెట్టడానికి’ ఇష్టపడాలి. (లూకా 14:​33) యేసు మాటలకు చెవియొగ్గి యొర్దాను ఆవలివైపుకు పారిపోయినవారు రక్షించబడ్డారు.

మన అత్యవసర భావాన్ని కాపాడుకోవడం

17 మనం చివరి ఘడియల్లో జీవిస్తున్నామని బైబిలు ప్రవచనాలు స్పష్టంగా వెల్లడిచేస్తున్నాయి. క్రితమెన్నటికన్నా మనమిప్పుడు మన అత్యవసర భావాన్ని వృద్ధిచేసుకోవాలి. నిమ్మళంగావున్న సమయంలో సైనికుడు పరిస్థితి ఉద్రిక్తంగా, యుద్ధం ముంచుకొస్తున్నట్లు భావించడు. అయితే ఆ కారణాన్నిబట్టి అప్రమత్తంగా ఉండాలన్న అత్యవసర భావాన్ని అలక్ష్యంచేస్తే, అకస్మాత్తుగా యుద్ధానికి రమ్మని పిలుపు వచ్చినప్పుడు ఆయన సిద్ధంగా ఉండడు, దానితో పర్యవసానాలు ప్రాణాంతకంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా అది నిజం. మనం మన అత్యవసర భావాన్ని క్రమేణా పోగొట్టుకుంటే, మనపై ప్రభావం చూపించే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడమేకాక, చివరకు యెహోవా దినం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం ప్రమాదంలో చిక్కుకుంటాం. (లూకా 21:​36; 1 థెస్సలొనీకయులు 5:⁠4) ‘యెహోవాను అనుసరించకుండా’ ఎవరైనా వెనుదీస్తుంటే, వారాయనను మళ్లీ వెదకాల్సిన సమయమిదే.​—⁠జెఫన్యా 1:​3-6; 2 థెస్సలొనీకయులు 1:​8, 9.

18 “దేవుని దినపు రాకడకొరకు” కనిపెట్టుకొని ఉండమని అపొస్తలుడైన పేతురు మనల్ని హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు. మనమెలా కనిపెట్టుకొని ఉండవచ్చు? ఒక విధానమేమిటంటే, మనం “పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్తగలవా[రమై]” ఉండాలి. (2 పేతురు 3:​11, 12) అలాంటి ప్రవర్తన సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండడం యెహోవా “దేవుని దినపు రాకడకొరకు” ఆసక్తితో ఎదురుచూసేందుకు మనకు సహాయం చేస్తుంది. ‘కనిపెట్టుకొని ఉండడం’ అని అనువదించబడిన గ్రీకు పదానికి “వేగవంతం చేయడం” అని అర్థం. నిజానికి మనం యెహోవా దినం రావడానికి మిగిలివున్న సమయాన్ని వేగవంతం చేయలేం. అయితే, మనం ఆ దినపు రాకడకోసం ఎదురుచూస్తూ దేవుని సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ సమయం మరింత వేగంగా గడిచిపోతున్నట్లుగా ఉంటుంది.​—⁠1 కొరింథీయులు 15:​58.

19 అదే విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దానిలోని జ్ఞాపికలను తలపోయడం కూడా మనం ఆ దినపు “రాకడ శీఘ్రతరం చేస్తూ” ఉండేలా, అవును ‘త్వరలోనే రావాలని ఆశించేలా’ చేస్తుంది. (2 పేతురు 3:​11, 12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం; ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఈ జ్ఞాపికల్లో, యెహోవా దినపు రాకడను గురించేకాక, ‘యెహోవాకొరకు కనిపెడుతూ’ ఉండేవారిపై కుమ్మరించబడే విస్తారమైన ఆశీర్వాదాల గురించిన అనేక ప్రవచనాలున్నాయి.​—⁠జెఫన్యా 3:8.

20 జెఫన్యా ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఈ ప్రబోధానికి మనమందరం చెవియొగ్గవలసిన సమయం ఇదే: “యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”​—⁠జెఫన్యా 2:⁠2, 3.

21 కాబట్టి, 2007వ సంవత్సరానికి ఎంపిక చేయబడిన ఈ వార్షిక వచనం ఎంత సముచితమో కదా: “యెహోవా మహా దినము సమీపమాయెను.” ఆ “దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది” అని దేవుని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. (జెఫన్యా 1:​14) అది “జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:⁠3) కాబట్టి మనమా దినం కోసం ఎదురుచూస్తూనే, ఈ ప్రవచనాల నెరవేర్పు అత్యంత సమీపంగా ఉందని గ్రహించి మనం నివసిస్తున్న ఈ కాలాల్లో సదా అప్రమత్తంగా ఉందాం!

మీరు జవాబివ్వగలరా?

• “యెహోవా మహా దినము” అంటే ఏమిటి?

• చాలామంది కాలాల అత్యవసరతను ఎందుకు పట్టించుకోరు?

• మొదటి శతాబ్దపు క్రైస్తవులు అత్యవసర భావంతో ఎందుకు చర్య తీసుకోవలసివచ్చింది?

• మన అత్యవసర భావాన్ని మనమెలా వృద్ధిచేసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) క్రైస్తవులు ఏ ప్రత్యేక దినంకోసం ఎదురుచూస్తున్నారు? (బి) మనమే ప్రశ్నలు వేసుకోవాలి, ఎందుకు?

3. “యెహోవా మహా దినము” అంటే ఏమిటి?

4. వేగంగా సమీపిస్తున్న యెహోవా దినం గురించి మానవాళి ఎందుకు భయపడాలి?

5. యెహోవా దినం గురించి లక్షలాదిమంది ఎలాంటి సానుకూల దృక్కోణం కలిగివున్నారు, ఎందుకు?

6. ‘యెహోవా దినాన్ని’ చాలామంది ఎలా దృష్టిస్తున్నారు, ఈ విషయంలో నిజ క్రైస్తవులు ఎందుకు ఆశ్చర్యపడరు?

7. అత్యవసర భావాన్ని కాపాడుకొనేందుకు మనకేది సహాయం చేస్తుంది?

8. చాలామంది బైబిలు జ్ఞాపికలను ఎందుకు లక్ష్యపెట్టరు?

9. నోవహు, లోతు దినాల్లో ప్రజలు ఎలాంటి స్వభావాన్ని కనబర్చారు?

10. లక్ష్యపెట్టనివారిపట్ల యెహోవా స్పందన ఎలావుంటుంది?

11. ఏ హెచ్చరికను మనం గుర్తుంచుకోవాలి?

12. యేసు దేనిగురించి హెచ్చరించాడు, ఇది యేసు నమ్మకమైన అనుచరుల కార్యశీలతకు ఎలా భిన్నంగావుంది?

13. అత్యవసర భావంయొక్క అవసరతను యేసు ఎలా నొక్కిచెప్పాడు?

14, 15. మొదటి శతాబ్దపు క్రైస్తవులు యెరూషలేము దండ్లచేత చుట్టబడడం చూసిన వెంటనే చర్య తీసుకోవడం ఎందుకు తప్పనిసరి?

16. ఆ కష్టకాలాన్ని తప్పించుకునేందుకు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఎలాంటి మనోవైఖరి ఉండాలి?

17. మన అత్యవసర భావాన్ని మనమెందుకు బలపర్చుకోవాలి?

18, 19. యెహోవా ‘దేవుని దినపు రాకడకొరకు కనిపెడుతూ’ ఉండేలా మనకేది సహాయం చేస్తుంది?

20. మనమే ప్రబోధానికి చెవియొగ్గాలి?

21. రెండువేల ఏడవ సంవత్సరంలో దేవుని ప్రజల తీర్మానమేమై ఉంటుంది?

[19వ పేజీలోని బ్లర్బ్‌]

2007వ సంవత్సరపు వార్షిక వచనం: “యెహోవా మహా దినము సమీపమాయెను.” ​—⁠జెఫన్యా 1:​14.

[16, 17వ పేజీలోని చిత్రాలు]

నోవహు కాలంలోలాగే, యెహోవా చర్య తీసుకున్నప్పుడు అపహాసకులు ఆశ్చర్యపోతారు

[18వ పేజీలోని చిత్రం]

“యెరూషలేము దండ్లచేత చుట్టబడుట” చూసినప్పుడు క్రైస్తవులు ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవలసి వచ్చింది