కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు జననం అదెలా సమాధానాన్ని తీసుకువస్తుంది?

యేసు జననం అదెలా సమాధానాన్ని తీసుకువస్తుంది?

యేసు జననం అదెలా సమాధానాన్ని తీసుకువస్తుంది?

‘సు ద్భావంగల మనుష్యుల మధ్య సమాధానము’ అనే ప్రకటన, యేసు జననానికి సంబంధించిన ప్రవచనాల్లో కేవలం ఒకటి మాత్రమే. ఆశ్చర్యచకితులైన గొర్రెల కాపరులకు దేవదూతలు అలా ప్రకటించడమేకాక, ఆ పరలోక వార్తాహరులు మరియకు ఆమె భర్త అయిన యోసేపుకు యేసు గురించి దైవప్రేరేపిత ప్రకటనలు కూడా చేశారు. ఆ సందేశాలను పరిశీలించడం, యేసు జననానికి సంబంధించి విశాల దృక్పథాన్ని సంపాదించుకునేందుకు, మనుష్యుల మధ్య సమాధానం ఉంటుందని దేవదూతలు చేసిన వాగ్దానానికున్న నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది.

యేసు జననానికి ముందు, అంటే మరియ గర్భవతి కాకముందే, బైబిల్లో గబ్రియేలుగా పేర్కొనబడిన ఒక దేవదూత ఆమె దగ్గరికి వస్తాడు. “దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు” అని ఆ దేవదూత పలకరిస్తాడు. మీరు ఊహించగలిగినట్లే, ఆమె ఆ మాటలకు ఎంతో కలవరపడుతుంది, బహుశా కొద్దిగా భయపడివుండవచ్చు కూడా. ఆ మాటలకున్న భావమేమిటి?

గబ్రియేలు ఇలా వివరించాడు: “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” తాను పురుషునితో సంబంధంలేని ఒక కన్యక కాబట్టి, అది ఎలా సాధ్యమని మరియ అడుగుతుంది. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఆమెకు శిశువు పుడతాడని గబ్రియేలు చెబుతాడు. ఆ కుమారుడు సాధారణ శిశువు కాదు.​—⁠లూకా 1:​28-35.

ప్రవచించబడిన రాజు

గబ్రియేలు మాటలు, తాను కనబోయే కుమారుని గురించి ప్రాచీన ప్రవచనాలు వివరించాయని మరియ గ్రహించేందుకు సహాయం చేసివుండవచ్చు. ఆమె మాత్రమే కాదు నిజానికి లేఖనాలు పరిచయమున్న ఏ యూదుడైనా, మరియ కుమారునికి “ఆయన తండ్రియైన దావీదు సింహాసనము” యెహోవా ఇస్తాడనే దూత సందేశం వింటే ఇశ్రాయేలు రాజైన దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం గురించి ఆలోచిస్తారు.

యెహోవా నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు ఇలా చెప్పాడు: “నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును.” (2 సమూయేలు 7:​4, 16) యెహోవా దావీదు గురించి ఇలా చెప్పాడు: “శాశ్వతకాలమువరకు అతని సంతానమును, ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని సంతానము శాశ్వతముగా ఉండు[ను], అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండు[ను].” (కీర్తన 89:​20, 29, 35, 36) కాబట్టి, మరియనే కాదు యోసేపు కూడా దావీదు సంతానంలో జన్మించడం కాకతాళీయంకాదు.

దావీదు వంశంలో వచ్చే రాజకుమారుని గురించి హీబ్రూ లేఖనాల్లో ఉన్నది కేవలం ఈ ప్రవచనాలు మాత్రమే కాదు. యెషయా పలికిన ఈ ప్రవచనం కూడా మరియకు తెలిసివుండవచ్చు: “మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.”​—⁠యెషయా 9:​6, 7.

కాబట్టి, గబ్రియేలు దూత, మరియకు అద్భుతరీతిలో ఒక శిశువు జన్మిస్తాడనే దానికన్నా ఎక్కువే చెప్పాడు. ఆమె కుమారుడు, దావీదు రాజు రాజ్యవారసుడవుతాడని అంటే, దేవుడు నియమించిన రాజ్యానికి శాశ్వతమైన నిత్య వారసుడు అవుతాడని కూడా చెప్పాడు. యేసు భవిష్యత్‌ పాత్ర గురించి గబ్రియేలు చెప్పిన ప్రవచనాలు మనందరికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది.

యోసేపు తనకు కాబోయే భార్య గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు ఆయన తమ వివాహ నిశ్చితార్థాన్ని రద్దుచేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన తనకు కాబోయే భార్యతో ఎన్నడూ లైంగిక సంబంధం పెట్టుకోలేదు కాబట్టి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని ఆయనకు తెలుసు. మరియ తనకు గర్భం ఎలా వచ్చిందనే దాని గురించి ఇచ్చిన వివరణను నమ్మడం యోసేపుకు ఎంత కష్టమై ఉంటుందో మీరు ఊహించవచ్చు. సువార్త వృత్తాంతం ఇలా నివేదిస్తోంది: “ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై​—⁠దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.”​—⁠మత్తయి 1:​20, 21.

ఆ కుమారుడు ఎలా “తన ప్రజలను వారి పాపములనుండి . . . రక్షించును” అనే మాటను యోసేపు ఎంతవరకు అర్థం చేసుకున్నాడో బైబిలు చెప్పడంలేదు. అయినా, తల్లికాబోయే మరియ ఎలాంటి తప్పు చేయలేదని యోసేపుకు నమ్మకం కలిగించేందుకు ఆ సందేశం చాలు. ఆయన దేవదూత చెప్పినట్లు మరియను తన ఇంటికి తీసుకువెళ్లాడు, అలా తీసుకువెళ్లడం వివాహం చేసుకోవడంతో సమానం.

ఇతర లేఖనాల్లో ఉన్న సమాచారం సహాయంతో, ఆ దేవదూత చెప్పిన మాటల భావమేమిటో మనం అర్థం చేసుకోవచ్చు. మానవచరిత్ర ఆరంభంలో తిరుగుబాటుదారుడైన ఒక దేవదూత యెహోవా సర్వాధిపత్యాన్ని సవాలు చేశాడు. ఈ తిరుగుబాటుదారుడు అనేక ఇతర వాదనలతోపాటు దేవుని పరిపాలనా విధానం అన్యాయమైనదని, పరీక్షలు ఎదురైతే ఏ మానవుడూ యెహోవాపట్ల తన యథార్థతను కాపాడుకోలేడనే సవాలు కూడా చేశాడని హీబ్రూ లేఖనాలు వివరిస్తున్నాయి. (ఆదికాండము 3:​2-5; యోబు 1:​6-12) ఆదాము తన యథార్థతను కాపాడుకోలేదు. అతని పాపంవల్ల మానవులందరూ పాపాన్ని వారసత్వంగా పొందారు, ఆ పాపానికి ప్రతిఫలం మరణం. (రోమీయులు 5:​12; 6:​23) అయితే యేసు మానవ తండ్రి మూలంగా జన్మించలేదు కాబట్టి, పాపంలేకుండా పుట్టాడు. ఆదాము కోల్పోయిన జీవితానికి ఖచ్చితంగా సరిసమానమైన తన పరిపూర్ణ మానవ జీవితాన్ని ఇష్టపూర్వకంగా విమోచన క్రయధనంగా అర్పించడం ద్వారా యేసు మానవులను తమ పాపాల నుండి రక్షించి నిత్యమూ జీవించే అవకాశాన్నివ్వగలిగాడు.​—⁠1 తిమోతి 2:​3-6; తీతు 3:​6, 7; 1 యోహాను 2:​25.

పాపపు ప్రభావాలను తొలగిస్తే ఏమి జరుగుతుందో యేసు తన భూపరిచర్యకాలంలో ముందుగానే చూపించాడు. ఆయన అన్నిరకాల రోగాల నుండి ప్రజలకు విముక్తి కలిగించడమే కాక మరణించినవారిని పునరుత్థానం కూడా చేశాడు. (మత్తయి 4:​23; యోహాను 11:​1-44) ఆ అద్భుతాలు భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యాలకు ముంగుర్తుగా ఉన్నాయి. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [నా] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”​—⁠యోహాను 5:​28, 29.

యేసు జననం, ప్రత్యేకంగా ఆయన మరణం మనకెందుకు చాలా ప్రాముఖ్యమైనవో భవిష్యత్‌ పునరుత్థానం గురించిన ఆ వాగ్దానం వివరిస్తుంది. “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే” దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించాడని యోహాను 3:​17 చెబుతోంది. ఈ అద్భుతమైన వార్త, యేసు పుట్టిన రాత్రి తమ మందలను కాస్తున్న గొర్రెల కాపరులకు ఇవ్వబడిన సందేశాన్ని గుర్తుచేస్తుంది.

“సంతోషకరమైన సువర్తమానము”

దేవదూతలు ‘రక్షకుడైన ప్రభువైన క్రీస్తు’ జననం గురించి చెప్పిన వార్త మానవజాతికి నిజంగా “సంతోషకరమైన సువర్తమానము.” (లూకా 2:​10, 11) ఆ శిశువు, దేవుని ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ, గొప్ప ప్రవక్త, పరిపాలకుడు అవుతాడు. (ద్వితీయోపదేశకాండము 18:​18; మీకా 5:⁠2) భూమ్మీద ఆయన జీవితం, మరణం “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ” అని దేవదూతలు చెప్పగలిగేలా యెహోవా విశ్వ సర్వాధిపత్యాన్ని నిరూపించడంలో అతి ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.​—⁠లూకా 2:​14.

ఎంతో తీవ్రమైన పరీక్ష ఎదురైనా మానవులు యెహోవాకు నమ్మకంగా ఉండడం సాధ్యమేనని, బైబిల్లో “కడపటి ఆదాము” అని పిలువబడిన యేసు నిరూపించాడు. (1 కొరింథీయులు 15:​45) అలా సాతాను దుష్ట అబద్ధికుడని ఆయన నిరూపించాడు. అందుకే, పరలోకంలోని నమ్మకస్థులైన దేవదూతలు ఆనందించారు.

అయితే మనం “యేసు పుట్టిన రాత్రి దేవదూతలు చెప్పిన ప్రవచనం ఎప్పటికైనా నెరవేరుతుందనడానికి వాస్తవిక నిరీక్షణ ఏమైనా ఉందా?” అనే ప్రశ్నను తిరిగి పరిశీలిద్దాం. అవును, అనేదే దానికి జవాబు! పరదైసు పరిస్థితులు పునరుద్ధరించబడడం ఇమిడివున్న, భూమిపట్ల దేవునికున్న సంకల్పం నెరవేరాలంటే ఈ భూమ్మీద సమాధానకరమైన పరిస్థితి ఏర్పడాలి. అలాంటి పరిస్థితి భూవ్యాప్తంగా ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ప్రేమ, విశ్వసనీయత ద్వారా పురికొల్పబడతారు. కాబట్టి, యెహోవా సంకల్పం నెరవేరాలంటే ఆయన సర్వాధిపత్యాన్ని విరోధించేవారందరూ నిర్మూలించబడాలి. యెహోవా ప్రమాణాలు చెడ్డవనే వాదనలో సాతాను పక్షం వహించేవారెవరికైనా అది శుభవార్త కాదు. అతని పక్షాన ఉండేవారు నాశనం చేయబడతారు.​—⁠కీర్తన 37:​11; సామెతలు 2:​21, 22.

మానవులందరూ సమాధానంతో, సుహృద్భావంతో ఉంటారని దేవదూతలు గొర్రెల కాపరులకు చెప్పలేదని గమనించండి. బదులుగా, ‘సుహృద్భావంగల మనుష్యుల మధ్య సమాధానము’ అని వారు ప్రకటించారు. దేవుడు ఆమోదించినవారి మధ్య, ఆయన దయవున్నవారి మధ్య సమాధానం ఉంటుందని దానర్థం. యెహోవాపట్ల నిజమైన విశ్వాసాన్ని కనబరచేవారు యేసు నమ్మకమైన అనుచరులుగా మారి, ఆయనను అనుకరిస్తారు. అలాంటి స్త్రీపురుషులు సంవత్సరంలో కేవలం కొద్దిరోజులు కాదుగానీ, ప్రతీరోజు ఇతరులపట్ల ఉదారస్వభావాన్ని, స్నేహభావాన్ని కనబరచేందుకు ఇష్టపడతారు.

ఏడాది పొడుగునా క్రిస్మస్‌ స్ఫూర్తిని కనబరచాలా?

యేసు ప్రకటించిన సువార్త అనేకమంది జీవితాలను ప్రభావితం చేసింది. అనేకమంది క్రైస్తవ సూత్రాలను తమ జీవితంలోని ప్రతీ రంగంలో అనుసరిస్తున్నారు. ఒకప్పుడు స్వార్థాన్నే ఎక్కువగా కనబరచినవారు, తాము ఎదుర్కొనే పరిస్థితుల్లో యేసు ఉంటే ఆయన ఏమి చేసివుండేవాడు అని ఆలోచించడం మొదలుపెట్టారు. సంపదలమీద, సుఖాలమీద తమ జీవితాలను కేంద్రీకృతం చేసుకున్న కొందరు ఆధ్యాత్మిక విలువల ప్రాముఖ్యతను, వాటిని తమ పొరుగువారితో పంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు. అలా చేసేవారు ఏడాది పొడుగునా ఉదారస్వభావం, స్నేహభావం చూపించడానికి ప్రయత్నిస్తారు. మీరు నిజక్రైస్తవుల నుండి ఆశించేది అదే కాదా?

దేవదూతలు సమాధానానికి సంబంధించి ఇచ్చిన సందేశానికి ఉన్న ప్రాముఖ్యత గురించి, దాని భావం గురించి యథార్థవంతులందరూ కాసేపు ధ్యానించి ఆ ధ్యానానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే లోకంలోని పరిస్థితులు తప్పకుండా భిన్నంగా ఉండేవి.

యేసు జననానికి సంబంధించిన ప్రవచనాలు, దేవుని దయవున్నవారు నిజమైన సమాధానాన్ని నిరంతరం అనుభవించవచ్చనే భరోసాను ఇస్తున్నాయి. మీరు కోరుకునేది అదే కాదా? యేసు జననమప్పుడు సమాధానము గురించి దేవదూతలు చేసిన అద్భుతకరమైన ప్రవచనాత్మక ప్రకటన తప్పక నెరవేరుతుందనే నమ్మకంతో మనం ఉండవచ్చు. సమాధానం క్రిస్మస్‌ జరుపుకునే కాలంలో చెప్పబడే వట్టిమాటల్లా కాకుండా శాశ్వతంగా ఉంటుంది.

[7వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ స్ఫూర్తిని ఏడాది పొడుగునా కనబర్చవచ్చు, అలా కనబర్చాలి కూడా