కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గిలియడ్‌ పట్టభద్రులు హృదయాన్ని స్పృశించే ఉపదేశాన్ని పొందారు

గిలియడ్‌ పట్టభద్రులు హృదయాన్ని స్పృశించే ఉపదేశాన్ని పొందారు

గిలియడ్‌ పట్టభద్రులు హృదయాన్ని స్పృశించే ఉపదేశాన్ని పొందారు

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌, 121వ తరగతి స్నాతకోత్సవం 2006 సెప్టెంబరు 9న న్యూయార్క్‌లోని, ప్యాటర్సన్‌లోవున్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో జరిగింది. ఆ కార్యక్రమం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన జెఫ్రీ జాక్సన్‌ అక్కడున్న 56 మంది విద్యార్థుల్ని, వివిధ దేశాలనుండి వచ్చిన 6,366 మంది ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన, “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము” అని చెబుతున్న కీర్తన 86:⁠11వ లేఖనం గురించి మాట్లాడారు. ఆ వచనంలో నొక్కిచెప్పబడిన మూడు అంశాలను సహోదరుడు జాక్సన్‌ పేర్కొన్నారు. “మొదటి వాక్యం ఉపదేశాన్నిచ్చేది; రెండవది అన్వయించుకోవాల్సినది; మూడవది ప్రేరణనిచ్చేది. మిషనరీలైన మీరు మీ నియామకాలకు వెళ్లబోతుండగా ఆ మూడు విషయాలు మీకు ప్రత్యేకంగా ప్రాముఖ్యమైనవి” అని ఆయన వారితో అన్నారు. ఆ తర్వాత, ఆ మూడు విషయాలను నొక్కిచెప్పే ప్రసంగాలను, ఇంటర్వ్యూలను ఆయన పరిచయం చేశారు.

హృదయాన్ని స్పృశించే ఉపదేశం

ప్రధాన కార్యాలయ సిబ్బందిలో సభ్యునిగా ఉన్న విలియమ్‌ మాలెన్ఫాంట్‌, “అతి శ్రేష్ఠమైన జీవితం” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మార్త సహోదరియైన మరియ మాదిరివైపు అవధానాన్ని మళ్ళించారు. ఒక సందర్భంలో యేసు వారి ఇంటిని సందర్శించినప్పుడు మరియ ఆయన చెప్పేవాటికే ప్రాధాన్యతనిచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని వినడానికే ఎంచుకుంది. అప్పుడు యేసు మార్తతో, “మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు” అని అన్నాడు. (లూకా 10:​38-42) ప్రసంగీకుడు విద్యార్థులతో, “కాస్త దాని గురించి ఆలోచించండి, మరియ తాను ఉత్తమమైనదాన్ని ఎంచుకుంది కాబట్టే, తాను యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పిన అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వ్యక్తిగతంగా విన్నాననే విషయాన్ని ఆమె ఎప్పటికీ మరచిపోదు.” విద్యార్థులు చేసుకున్న మంచి ఆధ్యాత్మిక ఎంపికల విషయంలో వారిని ప్రశంసించిన తర్వాత ఆయన వారితో, “మీ ఎంపిక మీకు అతి శ్రేష్ఠమైన జీవితాన్నిచ్చింది” అని అన్నారు.

ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్‌ రోమీయులు 13:⁠14పై ఆధారపడిన “ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుడి” అనే అంశంపై మాట్లాడారు. మనమెలా ధరించుకోగలం? ‘యేసుక్రీస్తును ధరించుకోవడంలో’ ప్రభువు జీవిత విధానాన్ని అనుకరించడం ఇమిడివుంది అని సహోదరుడు మారిస్‌ చెప్పారు. అంటే యేసు మాదిరిని, ఆయన స్వభావాన్ని అనుకరించడమని దానర్థం. “యేసుకు ప్రజలపట్ల యథార్థమైన ఆసక్తి ఉందని ఇతరులు గ్రహించగలిగేవారు కాబట్టి వారు ఆయన సమక్షంలో సేదదీర్పు పొందేవారు” అని ఆ ప్రసంగీకుడు చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎఫెసీయులు 3:⁠15-18 వచనాలు చెబుతున్నట్లుగా విద్యార్థులు గిలియడ్‌ కోర్సుల్లో సత్యం యొక్క ‘వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించేంతటి’ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నారో వివరించారు. అయితే, 19వ వచనం తెలియజేస్తున్నట్లుగా వారు “జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను” తెలుసుకోవాలని ఆయన వారికి గుర్తుచేశారు. సహోదరుడు మారిస్‌ విద్యార్థులతో మాట్లాడుతూ, “మీరు వ్యక్తిగతంగా అధ్యయనం చేయడంలో కొనసాగుతుండగా, క్రీస్తు చూపిన ప్రేమపూర్వక దయను ఎలా అనుకరించవచ్చో, వాస్తవికంగా ఎలా ‘ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవచ్చో’ ఆలోచించండి” అని ఉద్బోధించారు.

గిలియడ్‌ ఉపదేశకులనుంచి ఆఖరి ఉపదేశం

ఆ తర్వాత, గిలియడ్‌ ఉపదేశకుడు వాలెస్‌ లివరెన్స్‌ సామెతలు 4:⁠7పై ఆధారపడిన ప్రసంగాన్నిచ్చారు. దైవిక జ్ఞానం అత్యంత ప్రాముఖ్యమైనదే అయినా మనం ‘బుద్ధి సంపాదించుకోవడం’ కూడా అవసరమనీ, విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే మనం నేర్చుకున్న వేర్వేరు విషయాలను కలిపి చూసి, అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడివున్నాయో గ్రహించడం ఇమిడివుందని ఆయన చెప్పారు. బుద్ధి సంపాదించుకోవడం మనకు సంతోషాన్నిస్తుందని ప్రసంగీకుడు తెలిపారు. ఉదాహరణకు నెహెమ్యా కాలంలో, లేవీయులు “ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును” తెలియజేస్తూ “దానికి అర్థము” చెప్పారు. ఆ తర్వాత ప్రజలు ‘తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించారుకాబట్టి, ‘సంభ్రమపడ్డారు.’ (నెహెమ్యా 8:​7, 8, 12) “దేవుని ఆత్మద్వారా ప్రేరేపించబడిన వాక్యం అర్థం చేసుకున్నప్పుడు ఊహించనంత సంతోషం మీకు కలుగుతుంది” అని చెబుతూ సహోదరుడు లివరెన్స్‌ ముగించారు.

మార్క్‌ న్యూమర్‌ అనే మరో గిలియడ్‌ ఉపదేశకుడు, “మీ అసలైన శత్రువు ఎవరు” అనే అంశంపై ప్రసంగించారు. యుద్ధాల్లో అనేకమంది సైనికులు ప్రమాదవశాత్తు తమ సైన్యం చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతారు. “మనం ఇమిడివున్న ఆధ్యాత్మిక యుద్ధం మాటేమిటి” అని ఆయన అడిగారు. “మనం అజాగ్రత్తగా ఉంటే మన అసలైన శత్రువెవరో గుర్తుపట్టకుండా మన సైన్యానికి చెందినవారినే గాయపరిచే అవకాశం ఉంది.” అసూయవల్ల కొందరు అసలు శత్రువెవరో గుర్తుపట్టలేకపోవచ్చు. రాజైన సౌలుకు అసలు శత్రువులు ఫిలిష్తీయులైనా, అతను అసూయతో తోటి ఆరాధకుడైన దావీదును చంపడానికి ప్రయత్నించాడు. (1 సమూయేలు 18:​7-9; 23:​27, 28) ప్రసంగీకుడు కొనసాగిస్తూ ఇలా అన్నారు: “మీకన్నా ఎన్నోవిధాల్లో నైపుణ్యవంతంగా ఉన్న మిషనరీతో కలిసి పనిచేయాల్సివస్తే మీరేమి చేస్తారు? మీరు మీ తోటి సైనికుణ్ణి విమర్శనాత్మక మాటలతో గాయపరుస్తారా లేక ఇతరులు మీకన్నా అనేక విధాలుగా శ్రేష్ఠులనే విషయాన్ని స్నేహపూర్వకంగా అంగీకరిస్తారా? అని అడిగారు. ఇతరుల అపరిపూర్ణతలపట్ల కాస్త అసహనం కనపర్చడం కూడా వారిని గాయపరిచేందుకు దారితీయవచ్చు. “మీరు ఇతరుల అపరిపూర్ణతలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మీరు మీ అసలు శత్రువు ఎవరో కనిపెట్టలేకపోవచ్చు. అసలు శత్రువైన సాతానుకు వ్యతిరేకంగా పోరాడండి.”

సంతోషకరమైన అనుభవాలు, ఉపదేశాత్మక ఇంటర్వ్యూలు

“సువార్తికుని పనిచేయుము” అనే తర్వాతి ప్రసంగాన్ని గిలియడ్‌ ఉపదేశకుడైన లారెన్స్‌ బొవెన్‌ ఇచ్చారు, అందులో ఆయన ఇంటర్వ్యూలు, అనుభవాలను చేర్చారు. నూతనలోక అనువాదము రెఫరెన్సులతో కూడినది (ఆంగ్లం)లో 2 తిమోతి 4:​5లో ఇవ్వబడిన ఒక అధస్సూచి ‘మిషనరీ’ పనిచేయమని చెబుతోందని ఆయన వివరించారు. “గిలియడ్‌ పాఠశాలలో తర్ఫీదు పొందిన మిషనరీగా మీ ప్రధాన కర్తవ్యం సువార్తను వ్యాపింపజేయడమే, ఈ తరగతి విద్యార్థులు కూడా ప్రజలు ఉన్నచోట్ల సువార్తను ప్రకటించారు” అని కూడా ఆయన వివరించారు. మంచి అనుభవాల్లో కొన్ని పునర్నటించబడ్డాయి.

ఆ తర్వాత కార్యక్రమంలో జరిగిన రెండు భాగాలను మైఖెల్‌ బర్నెట్‌, స్కాట్‌ షాఫ్నర్‌ అనే ఇద్దరు బెతెల్‌ కుటుంబ సభ్యులు నిర్వహించారు. వారు ఆస్ట్రేలియా, ఉగాండా, కొరియా, బార్బడోస్‌ నుంచి వచ్చిన బ్రాంచి కమిటీ సభ్యుల్ని ఇంటర్వ్యూ చేశారు. కమిటీ సభ్యులు చేసిన వ్యాఖ్యానాలు మిషనరీలకు తగిన వసతి, ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లవంటి అవసరాలపట్ల శ్రద్ధ తీసుకోవడానికి ఎంత కృషి అవసరమైందో వెల్లడించాయి. సఫలీకృత మిషనరీలు స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి సుముఖంగా ఉంటారని ఆ కమిటీ సభ్యులు నొక్కిచెప్పారు.

ఉత్తేజపరిచే, పురికొల్పే ముగింపు

“దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అనే ఆ కార్యక్రమపు ముఖ్యాంశ ప్రసంగాన్ని ఎంతోకాలంగా పరిపాలక సభలో సభ్యునిగా ఉన్న జాన్‌ ఇ. బార్‌ ఇచ్చారు. ప్రకటన 14:​6, 7లో, “మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు​—⁠‘మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను’” అని వ్రాయబడివున్న మాటలను ఆయన వివరించారు.

ఆ దూతను గురించిన మూడు విషయాలను జ్ఞాపకముంచుకోమని సహోదరుడు బార్‌ విద్యార్థులను ప్రోత్సహించారు. మొదటిగా ఆ దూత, క్రీస్తు ఇప్పుడు సంపూర్ణ రాజ్యాధికారంతో పరిపాలిస్తున్నాడనే నిత్యసువార్త ప్రకటించాలి. “మనం ఆయన 1914లో సింహాసనాసీనుడయ్యాడని పూర్తి నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఆ సువార్త భూవ్యాప్తంగా ప్రకటించబడాలి” అని ఆ ప్రసంగీకుడు అన్నారు. రెండవదిగా, ఆ దూత ‘దేవునికి భయపడండి’ అని చెప్పాడు. పట్టభద్రులు తమ బైబిలు విద్యార్థులు దేవునిపట్ల భక్తిని పెంపొందించుకునేందుకు, ఆయనకు దుఃఖం కలిగించేదేదీ చేయకుండా ఉండేందుకు సహాయం చేయాలి” అని ప్రసంగీకుడు వివరించారు. మూడవదిగా, ఆ దూత ‘దేవుణ్ణి మహిమపరచండి’ అని ఆజ్ఞాపించాడు. “మనం మన కీర్తి కోసం కాదుగానీ దేవుణ్ణి ఘనపర్చడం కోసమే సేవచేస్తున్నాం అనే విషయాన్ని ఎన్నటికీ మరచిపోకండి” అని ఆయన విద్యార్థులను ఉద్బోధించారు. ఆ తర్వాత, “తీర్పుతీర్చు గడియ” గురించి చర్చిస్తూ, “అంతిమ తీర్పు జరగడానికి కొంతకాలం మాత్రమే మిగిలింది. ఆలస్యం కాకముందే మన క్షేత్రంలో ఇంకా అనేకమంది సువార్త వినాల్సివుంది” అని సహోదరుడు బార్‌ చెప్పారు.

వారి చెవుల్లో ఈ మాటలు మారుమ్రోగుతుండగా, పట్టభద్రులకు వారి పట్టాలు ఇవ్వబడ్డాయి, వారు భూవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు నియమించబడ్డారు. ఆ ఆనందాయకమైన రోజు ఇవ్వబడిన ప్రేరణాత్మకమైన ఉపదేశం పట్టభద్రుల హృదయాలను, హాజరైనవారందరి హృదయాలను స్పృశించింది.

[17వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 6

నియమించబడిన దేశాల సంఖ్య: 25

విద్యార్థుల సంఖ్య: 56

సగటు వయసు: 35.1

సత్యంలో సగటు సంవత్సరాలు: 18.3

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు 13.9

[18వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 121వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు పేర్కొనబడ్డాయి.

(1) ఫాక్స్‌, వై.; కోనికీ, డి.; విల్కిన్‌సన్‌, ఎస్‌.; కొవొమోటో, ఎస్‌.; కొన్సోలాన్డీ, జి.; మోయోన్‌, సి. (2) సాంటియాగో, ఎన్‌.; క్లాన్సీ, ఆర్‌.; ఫిషర్‌, ఎమ్‌.; డి ఆబ్రా, ఎల్‌.; డేవిస్‌, ఇ. (3) హువాన్‌, జె.; హాఫ్‌మెన్‌, డి.; రిడ్జ్‌వే, ఎల్‌.; ఇబ్రాహీమ్‌, జె.; డాబల్‌ష్టీన్‌, ఎ.; బాకాబక్‌, ఎమ్‌. (4) పాటెర్స్‌, ఎమ్‌.; జోన్స్‌, సి.; ఫోర్డ్‌, ఎస్‌.; పార్రా, ఎస్‌.; రాత్రాక్‌, డి.; టాట్లో, ఎమ్‌.; పెరేజ్‌, ఇ. (5) డి ఆబ్రా, ఎఫ్‌.; కొవొమోటో, ఎస్‌.; ఐవిస్‌, ఎస్‌.; బోర్డో, జె.; హువాన్‌, జె.; విల్కిన్‌సన్‌, డి. (6) ఫాక్స్‌, ఎ.; బకాబక్‌, జె.; సికౌస్కీ, పి.; ఫోర్యా, సి.; మోయోన్‌, ఎస్‌.; కొన్సోలాన్డీ, ఇ.; రిడ్జ్‌వే, డబ్ల్యూ. (7) పార్రా, బి.; పెరేజ్‌, బి.; టాట్లో, పి.; సాంటియాగో, ఎమ్‌.; ఇబ్రాహీమ్‌, వై.; కోనికీ, సి. (8) బోర్డో, సి.; సికౌస్కీ, బి.; ఐవిస్‌, కె.; ఫోర్డ్‌, ఎ.; రాత్రాక్‌, జె.; హాఫ్‌మెన్‌, డి.; డేవిస్‌, ఎమ్‌.; (9) పాటెర్స్‌, సి.; డాబల్‌ష్టీన్‌, సి.; జోన్స్‌, కె.; క్లాన్సీ, ఎస్‌.; ఫిషర్‌, జె.; ఫోర్యా, ఎస్‌.