జీవితాన్ని, ప్రజలను ప్రేమించిన వ్యక్తి
జీవితాన్ని , ప్రజలను ప్రేమించిన వ్యక్తి
ఎంతోకాలంగా యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యునిగా సేవచేసిన డానియల్ సిడ్లిక్, భూమిపై యెహోవాకు తాను చేస్తున్న సేవను 2006, ఏప్రిల్ 18 మంగళవారంనాడు ముగించారు. అప్పటికి ఆయన వయసు 87 సంవత్సరాలు, అందులో దాదాపు 60 సంవత్సరాలు ఆయన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న బెతెల్ కుటుంబంలో సభ్యునిగా సేవచేశారు.
ఆయనకు సన్నిహితులు ఆయనను సహోదరుడు డాన్ అని పిలిచేవారు. ఆయన 1946లో బెతెల్‌కు వచ్చారు. అంతకుముందు ఆయన కాలిఫోర్నియాలో ప్రత్యేక పయినీరుగా సేవచేశారు, తన క్రైస్తవ తటస్థత కారణంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొంతకాలం జైల్లో కూడా గడిపారు. ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు కావలికోట జూన్ 1, 1985 సంచికలో “దేవా, నీ స్నేహం ఎంత అమూల్యమైనది!” అనే శీర్షికతో ఉన్న ఆయన జీవిత కథలో సవివరంగా వర్ణించబడ్డాయి.
అందరికీ ఆయన వినయస్థునిగా, స్నేహశీలిగా తెలుసు. ఆయన బెతెల్ కుటుంబంలో ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు, “సజీవుడు, సత్యవంతుడు అయిన దేవుణ్ణి సేవించడానికి మరోరోజు లభించడం ఎంత సంతోషకరమో కదా” అనే ఆయన ప్రారంభ మాటలు ఆయనకున్న ఆశావహ దృక్పథాన్ని, జీవితంపట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేసేవి. అంతేకాక, బహిరంగ ప్రసంగాలిస్తున్నప్పుడు ఇతరులు కూడా అదే దృక్పథాన్ని అలవర్చుకునేందుకు సహాయం చేయడానికి, “యెహోవా దేవుడుగాగల జనులు ధన్యులు,” “యెహోవా ఆనందాన్ని ప్రతిఫలింపజేయడం,” “దేవుని ఆత్మను ఆర్పకండి,” “మేలైనది రానైయుంది” లాంటి అంశాలపై ప్రసంగించేవారు.
సహోదరుడు సిడ్లిక్ 1970లో ఇంగ్లాండ్‌కు చెందిన మారీనా హడ్సన్‌ను వివాహం చేసుకున్నారు, ఆయన ఆమెను “దేవుడు అనుగ్రహించిన సహకారి” అని వర్ణించేవారు. దంపతులుగా వారు 35కన్నా ఎక్కువ సంవత్సరాలు యెహోవా సేవ చేశారు.
బెతెల్‌లో గడిపిన సంవత్సరాల్లో ఆయన ప్రింటరీ, రైటింగ్ డిపార్ట్‌మెంట్ వంటివాటితో సహా వివిధ విభాగాల్లో సేవచేశారు. డబ్ల్యూ.బి.బి.ఆర్. రేడియో స్టేషన్‌లో కూడా పనిచేశారు. ఆ తర్వాత, 1974 నవంబరులో ఆయన పరిపాలక సభకు నియమించబడి, పర్సనల్ కమిటీ, రైటింగ్ కమిటీల్లో పనిచేశారు.
సహోదరుడు సిడ్లిక్ 30కన్నా ఎక్కువ సంవత్సరాలు పర్సనల్ కమిటీలో చేసిన సేవలో ప్రజలపట్ల ఆయనకున్న ప్రగాఢమైన ప్రేమ బహిర్గతమయ్యింది. యెహోవాను సేవించే అమూల్యమైన ఆధిక్యతపై ఎల్లప్పుడూ అవధానం నిలుపుతూ తన కంచు కంఠంతో ఎంతోమందిని ప్రోత్సహించారు. నిజమైన సంతోషం బాహ్య కారకాలపై కాదుగానీ యెహోవాతో మనకున్న సంబంధంపై, జీవితంపట్ల మనకున్న వైఖరిపై ఆధారపడి ఉంటుందని ఆయన పదేపదే నొక్కిచెప్పేవారు.
బెతెల్ కుటుంబం ఆయన లేని లోటును ఎంతగానో అనుభవిస్తున్నా, జీవితాన్ని, ప్రజలను ప్రేమించిన వ్యక్తిగా ఆయన ఉంచిన మాదిరి వారిని ఇప్పటికీ ప్రభావితం చేస్తుంది. ప్రకటన 14:13లో, “ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు . . . నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు” అని చెప్పబడినవారిలో ఆయన కూడా ఉన్నారని మేము నమ్ముతున్నాం.