“నీవు నిశ్చయముగా సంతోషింపవలెను”
“నీవు నిశ్చయముగా సంతోషింపవలెను”
“యెహోవాకు . . . పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.” —ద్వితీయోపదేశకాండము 16:15.
ఆదాముహవ్వలు తమ సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా సాతాను వారిని నడిపించినప్పుడు, అతడు రెండు అతి ప్రాముఖ్యమైన వివాదాంశాలను లేవనెత్తాడు. మొదట, అతను యెహోవా సత్యత్వాన్ని, ఆయన పరిపాలనా విధానపు హక్కును సవాలుచేశాడు. రెండవది, మానవులు కేవలం స్వార్థంతోనే దేవుణ్ణి సేవిస్తారని మాట్లాడాడు. ఈ రెండవ వివాదాంశం యోబు కాలంలో సవివరంగా వెలుగులోకి వచ్చింది. (ఆదికాండము 3:1-6; యోబు 1:9, 10; 2:4, 5) అయినప్పటికీ, యెహోవా ఆ పరిస్థితితో వ్యవహరించేందుకు సత్వరమే చర్య తీసుకున్నాడు. ఆదాముహవ్వలు ఇంకా ఏదెను వనంలో ఉన్నప్పుడే, ఆ వివాదాంశాలను తానెలా పరిష్కరిస్తాననేది యెహోవా ముందుగానే చెప్పాడు. ఆయన రాబోయే “సంతానము” గురించి ముందుగానే చెప్పాడు, ఆ సంతానం తన మడిమెమీద కొట్టబడిన తర్వాత సాతాను నాశనమయ్యేలా అతని తలను చితకత్రొక్కుతాడు.—ఆదికాండము 3:15.
2 కాలం గడిచేకొద్దీ యెహోవా ఆ ప్రవచనాన్ని మరింత విశదపరుస్తూ, చివరికది నిశ్చయంగా నెరవేరుతుందని చూపించాడు. ఉదాహరణకు, దేవుడు ఆ “సంతానము” అబ్రాహాము వంశంలో జన్మిస్తాడని చెప్పాడు. (ఆదికాండము 22:15-18) అబ్రాహాము మనవడైన యాకోబు ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూలపురుషుడయ్యాడు. సా.శ.పూ. 1513లో ఆ గోత్రాలు ఒక జనాంగమైనప్పుడు, యెహోవా వారికి వివిధ వార్షిక పండుగలు ఇమిడివున్న ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ పండుగలు “రాబోవువాటి ఛాయ” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (కొలొస్సయులు 2:16, 17; హెబ్రీయులు 10:1) వాటిలో సంతానం విషయంలో యెహోవా సంకల్ప నెరవేర్పుకు సంబంధించిన పూర్వఛాయలున్నాయి. ఆ పండుగలను ఆచరించడం ఇశ్రాయేలులో అత్యధిక ఆనందాన్ని తీసుకొచ్చాయి. వాటిని క్లుప్తంగా పరిశీలించడం యెహోవా వాగ్దానాల సత్యత్వంపై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.
సంతానం ప్రత్యక్షమవడం
3 యెహోవా చెప్పిన ఆ తొలి ప్రవచనం తర్వాత 4,000కన్నా ఎక్కువ సంవత్సరాలకు ఆ వాగ్దత్త సంతానం ప్రత్యక్షమయ్యాడు. ఆయన యేసు. (గలతీయులు 3:16) పరిపూర్ణ పురుషునిగా యేసు మరణంవరకు తన యథార్థతను కాపాడుకొని సాతాను ఆరోపణలు అబద్ధాలని నిరూపించాడు. అంతేకాక, యేసు పాపరహితుడు కాబట్టి, ఆయన మరణం అమూల్యమైన బలిగా ఉంది. ఆ బలిద్వారా యేసు ఆదాముహవ్వల నమ్మకమైన పిల్లలకు పాపమరణాల నుండి విడుదలను అందజేశాడు. హింసాకొయ్యపై యేసు మరణించడంవల్ల, వాగ్దత్త సంతానాన్ని ‘మడిమె మీద కొట్టినట్లయింది.’—హెబ్రీయులు 9:11-14.
4 సా.శ. 33 నీసాను 14న యేసు మరణించాడు. * ఇశ్రాయేలులో నీసాను 14న పస్కా పండుగను అత్యానందంగా జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం ఆ రోజున, కుటుంబాలన్నీ నిర్దోషమైన గొర్రెపిల్ల మాంసంతో వండిన భోజనం ఆరగిస్తాయి. ఆ విధంగా వారు, సా.శ.పూ. 1513, నీసాను 14న మృత్యుదూత ఐగుప్తీయుల తొలి సంతతిని సంహరించినప్పుడు ఇశ్రాయేలీయుల తొలి సంతానం తప్పించబడడంలో ఆ గొర్రెపిల్ల రక్తం పోషించిన పాత్రను గుర్తుచేసుకునేవారు. (నిర్గమకాండము 12:1-14) ఆ పస్కా పశువు యేసుకు ముంగుర్తుగా ఉంది, ఆయన గురించి అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.” (1 కొరింథీయులు 5:7) పస్కా పశువు రక్తంలాగే యేసు చిందించిన రక్తం అనేకులకు రక్షణనిస్తుంది.—యోహాను 3:16, 36.
‘నిద్రించినవారిలో ప్రథమఫలము’
5 యేసు తన బలి విలువను తండ్రికి సమర్పించేందుకు మూడవ రోజున తిరిగి బ్రతికించబడ్డాడు. (హెబ్రీయులు 9:24) ఆయన పునరుత్థానం మరో పండుగలో పూర్వఛాయగా చూపించబడింది. నీసాను 14 తర్వాతి రోజున పులియని రొట్టెల పండుగ ఆరంభమయ్యేది. ఇశ్రాయేలీయులు ఆ మరుసటి రోజున అంటే నీసాను 16న, ఇశ్రాయేలులో మొదటి పంటయైన, యవల పంటలోని ప్రథమ పనలను తీసుకొచ్చి యెహోవా ఎదుట అల్లాడించేందుకు యాజకునికి ఇచ్చేవారు. (లేవీయకాండము 23:6-14) సా.శ. 33లో అదే రోజున తన ‘నమ్మకమైన సత్యసాక్షిని’ శాశ్వతంగా లేకుండా చేసేందుకు సాతాను చేసిన దుష్ట ప్రయత్నాలను యెహోవా అడ్డుకోవడం ఎంత సముచితమో కదా! యెహోవా, సా.శ. 33 నీసాను 16న యేసును మృతుల్లోనుండి అమర్త్యమైన ఆత్మసంబంధ జీవానికి పునరుత్థానం చేశాడు.—ప్రకటన 3:14; 1 పేతురు 3:18.
6 యేసు ‘నిద్రించినవారిలో ప్రథమఫలముగా మృతులలోనుండి లేపబడిన’ వాడయ్యాడు. (1 కొరింథీయులు 15:20) అంతకుముందు లేపబడినవారికి భిన్నంగా యేసు ఆ తర్వాత తిరిగి మరణించలేదు. బదులుగా, ఆయన పరలోకానికివెళ్లి యెహోవా కుడిపార్శ్వమున కూర్చుండి, యెహోవా పరలోక రాజ్యానికి రాజుగా నియమించబడేవరకు వేచివున్నాడు. (కీర్తన 110:1; అపొస్తలుల కార్యములు 2:32, 33; హెబ్రీయులు 10:12, 13) రాజుగా నియమించబడిన దగ్గరనుండి ఇప్పుడు యేసు, గొప్ప శత్రువైన సాతాను తలను శాశ్వతంగా చితకత్రొక్కి, అతని సంతానాన్ని నాశనంచేసే స్థానంలో ఉన్నాడు.—ప్రకటన 11:15, 18; 20:1-3, 10.
అబ్రాహాము సంతానంలోని ఇతర సభ్యులు
7 ఏదెనులో వాగ్దానం చేయబడిన సంతానం యేసు, ఆయన ద్వారానే యెహోవా ‘అపవాది క్రియలను లయపరుస్తాడు.’ (1 యోహాను 3:8) అయితే, అబ్రాహాముతో యెహోవా మాట్లాడినప్పుడు, అబ్రాహాము ‘సంతానములో’ ఒకరికన్నా ఎక్కువమంది ఉంటారని ఆయన సూచించాడు. ఆ సంతానం “ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను” ఉంటుంది. (ఆదికాండము 22:17) ఆ ‘సంతానంలోని’ ఇతర సభ్యుల ఉనికికి మరో ఆనందదాయకమైన పండుగ పూర్వఛాయగా ఉంది. నీసాను 16 తర్వాత 50 రోజులకు ఇశ్రాయేలీయులు వారముల పండుగ జరుపుకునేవారు. దీని గురించి ధర్మశాస్త్రం ఇలా చెబుతోంది: “ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.” *—లేవీయకాండము 23:16, 17, 20.
8 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఈ వారముల పండుగను పెంతెకొస్తు అని పిలిచేవారు (ఇది “యాభయ్యవ” అనే అర్థమున్న గ్రీకుపదం నుండి వచ్చింది). సా.శ. 33 పెంతెకొస్తు దినాన గొప్ప ప్రధానయాజకుడు, పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తు, యెరూషలేములో కూడుకున్న రోమీయులు 8:15-17) వారు ‘దేవుని ఇశ్రాయేలుగా’ ఒక క్రొత్త జనాంగమయ్యారు. (గలతీయులు 6:16) అభిషిక్తుల చిన్నగుంపుతో ఆరంభమైన ఆ జనాంగంలో చివరకు 1,44,000 మంది ఉంటారు.—ప్రకటన 7:1-4.
120 మంది శిష్యుల చిన్నగుంపుపై పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆ విధంగా ఆ శిష్యులు దేవుని అభిషిక్త కుమారులుగా, యేసుక్రీస్తు సహోదరులయ్యారు. (9 ప్రతీ పెంతెకొస్తునాడు యెహోవా ఎదుట అల్లాడించే ఆ రెండు పులిసిన రొట్టెలు అభిషిక్త క్రైస్తవుల సంఘానికి పూర్వఛాయగా ఉన్నాయి. అవి పులిసిన రొట్టెలై ఉండడం అభిషిక్త క్రైస్తవులు తమలో ఇంకా వారసత్వంగా పాపమనే పులుపు కలిగివుంటారని చూపించింది. అయినప్పటికీ, వారు యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవాను సమీపించవచ్చు. (రోమీయులు 5:1, 2) రెండు రొట్టెలు ఎందుకు? అది ఆ అభిషిక్త దేవుని కుమారులు చివరకు రెండు గుంపుల నుండి అంటే మొదట సహజ యూదుల నుండి ఆ తర్వాత అన్యజనుల నుండి తీసుకోబడతారని సూచించి ఉండవచ్చు.—గలతీయులు 3:26-29; ఎఫెసీయులు 2:13-18.
10 పెంతెకొస్తునాడు గోధుమ పంటలోని ప్రథమఫలాలతో చేయబడిన రెండు రొట్టెలు అర్పించబడేవి. తత్సమానంగా ఆ ఆత్మజనిత క్రైస్తవులు ఆయన ‘సృష్టించినవాటిలో ప్రథమఫలము’ అని పిలవబడ్డారు. (యాకోబు 1:18) యేసు చిందించిన రక్తం ఆధారంగా పాపాలు క్షమించబడినవారిలో వారు మొదటివారు, అందువల్లే వారికి పరలోకంలో అమర్త్యమైన జీవం అనుగ్రహించబడడం సాధ్యమవుతుంది, అక్కడవారు యేసుతోపాటు ఆయన రాజ్యంలో పరిపాలిస్తారు. (1 కొరింథీయులు 15:53; ఫిలిప్పీయులు 3:20, 21; ప్రకటన 20:6) పరలోక కుమారులుగా వారు త్వరలోనే ‘ఇనుపదండముతో [జనములను] ఏలుతూ,’ ‘సాతాను తమ కాళ్లక్రింద చితుక త్రొక్కబడడం’ చూస్తారు. (ప్రకటన 2:26-27; రోమీయులు 16:20) అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “వీరు . . . గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.”—ప్రకటన 14:4.
విడుదలను నొక్కిచెప్పిన రోజు
11 ఏతనీము (ఆ తర్వాత తిష్రీ అని పిలువబడిన) * నెలలోని పదియవ రోజున, ఇశ్రాయేలీయులు ఒక పండుగ జరుపుకునేవారు, అది యేసు విమోచన క్రయధన బలి ప్రయోజనాలు ఎలా అన్వయించబడతాయనేదానికి పూర్వఛాయగా ఉంది. ఆ రోజున అంటే ప్రాయశ్చిత్తార్థ దినాన జనాంగం మొత్తం తమ పాపాల పరిహారం కోసం బలులు అర్పించబడేందుకు సమావేశమయ్యేది.—లేవీయకాండము 16:29, 30.
12 ఆ ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రధానయాజకుడు ఒక కోడెదూడను వధించి, ఆయన దాని రక్తంలోని కొంతభాగాన్ని అతి పరిశుద్ధ స్థలంలోవున్న మందసపు కరుణాపీఠం ఎదురుగా ఏడుసార్లు ప్రోక్షించేవాడు, ఆ విధంగా ఆయన సూచనార్థకంగా యెహోవా ఎదుట రక్తాన్ని అర్పించేవాడు. ఆ అర్పణ ప్రధానయాజకుని పాపాల కోసం, ‘ఆయన ఇంటివారి’ పాపాల కోసం, అలాగే ఉపయాజకుల, లేవీయుల పాపాల కోసం అర్పించబడేది. తర్వాత, ప్రధానయాజకుడు రెండు మేకలను తీసుకొని, వాటిలో ఒక దానిని ఆయన ‘ప్రజల’ పాపాల నిమిత్తం వధించేవాడు. దాని రక్తంలోని కొంతభాగాన్ని అతి పరిశుద్ధ స్థలంలోని కరుణాపీఠం ఎదురుగా ప్రోక్షించాలి. ఆ తర్వాత ప్రధానయాజకుడు రెండవ మేక తలపై తన చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపాలను ఒప్పుకుని, ఆ జనాంగపు పాపాలన్నింటిని సూచనార్థకంగా భరించేలా ఆ మేకను అరణ్యంలోకి తోలేసేవాడు.—లేవీయకాండము 16:3-16, 21, 22.
13 ఆ క్రియలు పూర్వఛాయగా చూపించినట్లుగా, గొప్ప ప్రధానయాజకుడైన యేసు, పాప క్షమాపణ అనుగ్రహించబడేలా తన రక్తంయొక్క విలువను ఉపయోగిస్తాడు. మొదటిగా ఆ రక్తంయొక్క విలువ 1,44,000 అభిషిక్త క్రైస్తవుల ‘ఆత్మసంబంధ మందిరానికి’ అన్వయించబడి, వారు నీతిమంతులుగా ప్రకటించబడి యెహోవా ఎదుట పరిశుభ్ర స్థానాన్ని కలిగివుంటారు. (1 పేతురు 2:5; 1 కొరింథీయులు 6:11) కోడెదూడను బలిగా అర్పించడం దీనికి పూర్వఛాయగా ఉంది. ఆ విధంగా పరలోక స్వాస్థ్యం పొందే అవకాశం వారికి ఇవ్వబడింది. రెండవదిగా, మేక బలి సూచించినట్లుగా క్రీస్తును విశ్వసించే లక్షలాదిమందికి యేసు రక్తంయొక్క విలువ అన్వయించబడుతుంది. వీరు భూమిపై నిత్యజీవంతో ఆశీర్వదించబడతారు, ఈ స్వాస్థ్యాన్నే ఆదాముహవ్వలు పోగొట్టుకున్నారు. (కీర్తన 37:10, 11) బ్రతికున్న మేక సూచనార్థకంగా ఇశ్రాయేలీయుల పాపాల్ని భరిస్తూ అరణ్యంలోకి వెళ్లిపోయినట్లే, యేసు తాను చిందించిన రక్తం ఆధారంగా మానవాళి పాపాల్ని భరించాడు.—యెషయా 53:4, 5.
యెహోవా ఎదుట ఆనందించడం
14 ప్రాయశ్చిత్తార్థ దినం తర్వాత ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగ జరుపుకునేవారు, అది యూదుల క్యాలెండరులో అత్యంత ఆనందదాయకమైన పండుగ. (లేవీయకాండము ) ఆ పండుగ ఏతనీము నెలలో 15 నుండి 21 వరకు జరిగి, ఆ నెలలో 22వ దినాన సర్వసమాజం సమావేశమవడంతో ముగిసేది. అది ఫలసంగ్రహ ముగింపును సూచిస్తూ, దేవుని అపారమైన మంచితనానికి కృతజ్ఞతలు చెల్లించే సమయంగా ఉండేది. అందుకే ఆ పండుగ ఆచరించేవారితో యెహోవా ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక . . . నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.” ( 23:34-43ద్వితీయోపదేశకాండము 16:15) అదెంత సంతోషదాయకమైన సమయమో కదా!
15 ఆ పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు ఏడురోజులపాటు పర్ణశాలల్లో నివసించేవారు. అలా వారు తాము ఒకప్పుడు అరణ్యంలో పర్ణశాలల్లో నివసించామని గుర్తుచేసుకునేవారు. ఆ పండుగ వారికి తండ్రిగా యెహోవా వారిపట్ల చూపించిన శ్రద్ధను ధ్యానించే అవకాశాన్ని సమృద్ధిగా ఇచ్చింది. (ద్వితీయోపదేశకాండము 8:15, 16) ధనవంతులు, బీదలు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన పర్ణశాలల్లో నివసించేవారు కాబట్టి, ఆ పండుగ చూపించినట్టుగా తామందరూ సమానమేనని ఇశ్రాయేలీయులు గుర్తుచేయబడేవారు.—నెహెమ్యా 8:14-16.
16 పర్ణశాలల పండుగ నిజానికి కోతకు సంబంధించి ఆనందంగా చేసుకునే ఫలసంగ్రహపు పండుగ. అది యేసుక్రీస్తును విశ్వసించేవారిని సంతోషంగా సమకూర్చేపనికి పూర్వఛాయగా ఉంది. సా.శ. 33 పెంతెకొస్తునాడు, అంటే యేసు 120 మంది శిష్యులు అభిషేకించబడి ‘పరిశుద్ధయాజకుల్లో’ భాగమైనప్పుడు ఆ సమకూర్పు ఆరంభమైంది. ఇశ్రాయేలీయులు కొన్నిరోజులు పర్ణశాలల్లో నివసించినట్లే, అభిషిక్తులకు తాము ఈ భక్తిహీన లోకంలో కేవలం ‘యాత్రికులుగా’ ఉన్నామని తెలుసు. వారిది పరలోక నిరీక్షణ. (1 పేతురు 2:5, 11) 1,44,000 మందిలోని చివరి సభ్యులు సమకూర్చబడినప్పుడు, అభిషిక్త క్రైస్తవులను సమకూర్చే పని ఈ “అంత్యదినములలో” ముగింపుకొస్తుంది.—2 తిమోతి 3:1.
17 ఈ ప్రాచీన పండుగలో 70 కోడెదూడలు అర్పించబడేవన్నది గమనించదగిన విషయం. (సంఖ్యాకాండము 29:12-34) ఈ 70 అనే సంఖ్య, 7ను 10తో హెచ్చవేస్తే వస్తుంది, ఈ సంఖ్యలు బైబిల్లో పరలోకసంబంధమైన, భూసంబంధమైన పరిపూర్ణతను సూచిస్తాయి. కాబట్టి యేసు బలి, నోవహు వంశానికిచెందిన 70 కుటుంబాల నుండి ఉద్భవించిన మానవాళిలోని నమ్మకస్థులందరికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. (ఆదికాండము 10:1-29) దానికి అనుగుణంగా, మనకాలంలో ఆ సమకూర్పు పని విస్తరించి సమస్త దేశాల్లో యేసును విశ్వసిస్తూ పరదైసు భూమిపై జీవించే నిరీక్షణగల వ్యక్తులందరినీ సమకూరుస్తోంది.
18 ఈ ఆధునిక దిన సమకూర్పును అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు. మొదట ఆయన, 1,44,000 మందిలోని చివరి సభ్యులు ముద్రవేయబడడం గురించిన ప్రకటన విన్నాడు. ఆ తర్వాత ఆయన, “యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” “ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని” యెహోవా ఎదుట, యేసు ఎదుట నిలబడి ఉండడాన్ని చూశాడు. వీరు “మహాశ్రమలనుండి” నూతనలోకంలోకి ప్రవేశిస్తారు. వీరు కూడా ఇప్పుడు ఈ పాతవిధానంలో తాత్కాలిక యాత్రికులుగా ఉండి, “గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించు” కాలం కోసం నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో “దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 7:1-10, 14-17) గొప్పసమూహంతోపాటు పునరుత్థానం చేయబడిన నమ్మకస్థులకు కూడా నిత్యజీవం అనుగ్రహించబడినప్పుడు, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా అంతం తర్వాత సాదృశ్యంగావున్న ఆ పర్ణశాలల పండుగ దాని ముగింపుకు చేరుకుంటుంది.—ప్రకటన 20:5.
19 ప్రాచీన యూదుల పండుగల అర్థాన్ని ధ్యానిస్తుండగా మనం కూడా ‘నిశ్చయముగా సంతోషించవచ్చు.’ పూర్వం ఏదెనులో తానుచెప్పిన ప్రవచన నెరవేర్పుకు సంబంధించి యెహోవా దయచేసిన పూర్వఛాయలను పరిశీలించడం ఉల్లాసకరమైనదేకాక, వాటి అసలు నెరవేర్పు క్రమేణా నెరవేరడాన్ని చూడడం ఉత్తేజకరం కూడా. ఆ సంతానం ప్రత్యక్షమయ్యాడనీ, ఆయన తన మడిమెమీద కొట్టబడ్డాడనీ నేడు మనకు తెలుసు. ఆయనిప్పుడు పరలోక రాజు. అంతేకాక, 1,44,000 మందిలో ఇప్పటికే అధికశాతం మంది మరణంవరకు తమ యథార్థతను నిరూపించుకున్నారు. ఇంకా ఏమి చేయబడవలసివుంది? ఎంత త్వరగా ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరుతుంది? ఇవి తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.
[అధస్సూచీలు]
^ పేరా 7 నీసాను మన ప్రస్తుత క్యాలెండరులోని మార్చి/ఏప్రిల్ నెలల్లో వస్తుంది.
^ పేరా 12 రెండు పులిసిన రొట్టెలను అల్లాడించే ఈ అర్పణలో, యాజకుడు ఆ రొట్టెలను తన అరచేతుల్లో పెట్టుకొని, చేతులు పైకెత్తి వాటిని ఇరువైపులకు అల్లాడిస్తాడు. ఈ విధంగా అల్లాడించడం బలియర్పితమైనవి యెహోవాకు సమర్పించడాన్ని సూచించింది.—యెహోవాసాక్షులు ప్రచురించిన అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 2, 528వ పేజీ చూడండి.
^ పేరా 17 ఏతనీము లేదా తిష్రీ మన ప్రస్తుత క్యాలెండరులో సెప్టెంబరు/అక్టోబరు నెలలో వస్తుంది.
మీరు వివరించగలరా?
• పస్కాపశువు దేనికి పూర్వఛాయగా ఉంది?
• పెంతెకొస్తు పండుగ ఏ సమకూర్పుకు పూర్వఛాయగా ఉంది?
• ప్రాయశ్చిత్తార్థ దినంయొక్క ఏ అంశాలు యేసు విమోచన క్రయధన బలి అన్వయించబడిన విధానాన్ని సూచించాయి?
• పర్ణశాలల పండుగ ఏ విధంగా క్రైస్తవులను సమకూర్చే పనికి పూర్వఛాయగా ఉంది?
[అధ్యయన ప్రశ్నలు]
1. (ఎ) సాతాను ఏ వివాదాంశాలు లేవనెత్తాడు? (బి) ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన తర్వాత యెహోవా ముందుగానే ఏమిచెప్పాడు?
2. ఆదికాండము 3:15లో వ్రాయబడిన ప్రవచనాన్ని తాను నెరవేర్చే విధానాన్ని యెహోవా ఎలా విశదపర్చాడు?
3. వాగ్దత్త సంతానము ఎవరు, ఆయన మడిమె మీద ఎలా కొట్టబడింది?
4. యేసు బలి పూర్వఛాయగా ఎలా చూపించబడింది?
5, 6. (ఎ) యేసు ఎప్పుడు పునరుత్థానం చేయబడ్డాడు, ధర్మశాస్త్రంలో ఆ సంఘటన ఎలా పూర్వఛాయగా చూపించబడింది? (బి) యేసు పునరుత్థానం ఆదికాండము 3:15 నెరవేర్పును ఎలా సాధ్యపరిచింది?
7. వారముల పండుగ అంటే ఏమిటి?
8. సా.శ. 33 పెంతెకొస్తునాడు ఏ అసాధారణ సంఘటన జరిగింది?
9, 10. అభిషిక్త క్రైస్తవుల సంఘం పెంతెకొస్తునాడు ఎలా పూర్వఛాయగా చూపించబడింది?
11, 12. (ఎ) ప్రాయశ్చిత్తార్థ దినాన ఏమి జరిగేది? (బి) కోడెదూడ, మేకల బలులనుండి ఇశ్రాయేలీయులు ఎలాంటి ప్రయోజనాలు పొందారు?
13. ప్రాయశ్చిత్తార్థ దినపు సంఘటనలు యేసు పోషించే పాత్రకెలా పూర్వఛాయగా ఉన్నాయి?
14, 15. పర్ణశాలల పండుగ సమయంలో ఏమి జరిగేది, అది ఇశ్రాయేలీయులకు దేనిని గుర్తుచేసింది?
16. పర్ణశాలల పండుగ దేనికి పూర్వఛాయగా ఉంది?
17, 18. (ఎ) యేసు బలినుండి అభిషిక్త క్రైస్తవులతోపాటు మరితరులు కూడా ప్రయోజనం పొందుతారని ఏది సూచిస్తోంది? (బి) సాదృశ్యంగావున్న పర్ణశాలల పండుగనుండి నేడు ఎవరు ప్రయోజనం పొందుతున్నారు, ఆ ఆనందభరిత పండుగ ఎప్పుడు ముగింపుకు చేరుకుంటుంది?
19. ఇశ్రాయేలులో ఆచరించబడిన పండుగలను పరిశీలించడం నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం?
[22, 23వ పేజీలోని చార్టు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సంఘటన: పూర్వఛాయ:
పస్కా పండుగ నీసాను 14 పస్కాపశువు యేసు బలి
వధించబడింది
పులియని రొట్టెల నీసాను 15 సబ్బాతు
పండుగ నీసాను 16 యవలు అర్పించబడ్డాయి యేసు పునరుత్థానం
(నీసాను 15-21)
↑
50 రోజులు
↓
వారముల సివాను 6 రెండు రొట్టెలు యేసు తన మొదటి అభిషిక్త
పండుగ అర్పించబడ్డాయి సహోదరులను యెహోవాకు
(“పెంతెకొస్తు”) సమర్పించాడు
ప్రాయశ్చిత్తార్థ తిష్రీ 10 ఒక ఎద్దు, రెండు సర్వమానవాళి కోసం యేసు
దినము మేకలు అర్పించబడ్డాయి తన రక్తంయొక్క విలువను అర్పించాడు
పర్ణశాలల తిష్రీ 15-21 ఇశ్రాయేలీయులు సంతోషంగా అభిషిక్తులను, ‘గొప్పసమూహాన్ని’
పండుగ పర్ణశాలల్లో నివసిస్తూ, సమకూర్చడం
(ఫలసంగ్రహపు పండుగ) ఫలసమృద్ధినిబట్టి
ఆనందించారు,
70 కోడెదూడలు
అర్పించబడ్డాయి
[21వ పేజీలోని చిత్రాలు]
పస్కాపశువు రక్తంలాగే యేసు చిందించిన రక్తం అనేకులకు రక్షణను అందిస్తుంది
[22వ పేజీలోని చిత్రాలు]
నీసాను 16న అర్పించబడిన యవలపంటకు సంబంధించిన ప్రథమఫలం యేసు పునరుత్థానానికి పూర్వఛాయగా ఉంది
[23వ పేజీలోని చిత్రాలు]
పెంతెకొస్తునాడు అర్పించబడిన రెండు రొట్టెలు అభిషిక్త క్రైస్తవుల సంఘానికి పూర్వఛాయగా ఉన్నాయి
[24వ పేజీలోని చిత్రాలు]
పర్ణశాలల పండుగ అభిషిక్తులను, అన్నిదేశాల్లోని ‘గొప్పసమూహాన్ని’ ఆనందంగా సమకూర్చడానికి పూర్వఛాయగా ఉంది