కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రకటన 7:3లో ప్రస్తావించబడిన ముద్రించబడడం అంటే ఏమిటి?

ప్రకటన 7:​1-3 ఇలా చెబుతోంది: “భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత​—⁠మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.”

ఆ “నాలుగు దిక్కుల వాయువులను” విడిచిపెట్టినప్పుడు, “మహాశ్రమలు” సంభవించడంతోపాటు అబద్ధమతం, మిగిలిన దుష్ట ప్రపంచం నాశనం చేయబడతాయి. (ప్రకటన 7:​14) “మా దేవుని దాసులు” అంటే ఈ భూమ్మీది క్రీస్తు అభిషిక్త సహోదరులు. (1 పేతురు 2:​9, 16) కాబట్టి, మహాశ్రమలు విరుచుకుపడే సమయానికి క్రీస్తు సహోదరులను ముద్రించడం పూర్తవుతుందని ఈ ప్రవచనం సూచిస్తోంది. అయితే, అభిషిక్తులను ముద్రించే మొదటిదశ ఒకటుందని ఇతర బైబిలు వచనాలు సూచిస్తున్నాయి. అందుకే మనం కొన్నిసార్లు మొదటగా ముద్రించబడడం, చివరిగా ముద్రించబడడం అని మాట్లాడతాం. ఈ రెండింటి మధ్యవున్న తేడా ఏమిటి?

‘ముద్రించబడడం’ అనే మాటకున్న అర్థాన్ని మనం పరిశీలిద్దాం. ప్రాచీనకాలాల్లో, ఒక దస్తావేజుపై గుర్తువేసేందుకు ముద్రను ఉపయోగించేవారు. ముద్ర అనే పదం వేయబడిన గుర్తును కూడా సూచించవచ్చు. ఆ కాలంలో దస్తావేజుతో లేదా ఇతర వస్తువులతోపాటు దాని వాస్తవికతను లేదా యాజమాన్య హక్కును సూచించేందుకు ముద్రవేసిన గుర్తును కూడా పంపించేవారు.​—⁠1 రాజులు 21:⁠8; యోబు 14:​17.

పరిశుద్ధాత్మను ముద్రకు పోలుస్తూ పౌలు ఇలా అన్నాడు: “మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లు మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.” (2 కొరింథీయులు 1:​21, 22) కాబట్టి, ఈ క్రైస్తవులు తనవారని సూచించడానికి యెహోవా తన పరిశుద్ధాత్మచేత వారిని అభిషేకిస్తాడు.

అయితే, అభిషిక్తులను ముద్రించడంలో రెండు దశలున్నాయి. మొదటిదశ రెండు విషయాల్లో అంటే (1) సంకల్పం విషయంలో, (2) సమయం విషయంలో చివరిదశకు భిన్నంగా ఉంటుంది. మొదటిగా ముద్రించబడడం అభిషిక్త క్రైస్తవుల సంఖ్యకు క్రొత్త సభ్యుణ్ణి ఎంపిక చేసేందుకు పనిచేస్తుంది. చివరిగా ముద్రించబడడం అనేది ఎంపిక చేయబడి, ముద్రించబడిన వ్యక్తి తన విశ్వసనీయతను సంపూర్ణంగా ప్రదర్శించాడని ధృవీకరించేందుకు పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే, అలా చివరిగా ముద్రించబడినప్పుడు ఆ అభిషిక్తుడు పరీక్షించబడి, నమ్మకమైన ‘దేవుని దాసుడనే’ నిర్ధారణకు గుర్తుగా ఆయన ‘నొసట’ శాశ్వతంగా ముద్రవేయబడుతుంది. ప్రకటన 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ముద్రవేయబడడం, ముద్రించబడడంలోని ఈ చివరిదశను సూచిస్తుంది.​—⁠ప్రకటన 7:⁠3.

మొదటిగా ముద్రించబడడం యొక్క సమయాన్ని గురించి అపొస్తలుడైన పౌలు అభిషిక్త క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.” (ఎఫెసీయులు 1:​13, 14) అనేక సందర్భాల్లో, మొదటి శతాబ్దపు క్రైస్తవులు సువార్తను విని, క్రీస్తును విశ్వసించిన అనతికాలంలోనే ముద్రించబడ్డారని బైబిలు నివేదిక చూపిస్తోంది. (అపొస్తలుల కార్యములు 8:​15-17; 10:​44) అలా ముద్రించబడడం వారిపై దేవుని ఆమోదముందని ప్రదర్శించింది. అయితే, అది దేవుని అంతిమ ఆమోదాన్ని చూపించలేదు. ఎందుకు?

అభిషిక్త క్రైస్తవులు ‘విమోచన దినమువరకు ముద్రించబడ్డారు’ అని పౌలు చెప్పాడు. (ఎఫెసీయులు 4:​30) ఇది మొదటిగా ముద్రించబడిన తర్వాత గడిచే కాలాన్ని, సాధారణంగా అనేక సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది. అభిషిక్తులు తాము పరిశుద్ధాత్మతో ముద్రించబడిన రోజు మొదలుకొని తమ భౌతిక శరీరాల నుండి ‘విమోచించబడే దినమువరకు’ అంటే మరణమువరకు నమ్మకస్థులుగా ఉండాలి. (రోమీయులు 8:​23; ఫిలిప్పీయులు 1:​23; 2 పేతురు 1:​10) అందువల్ల, పౌలు తన జీవితపు చివరిదశలోనే ఇలా చెప్పగలిగాడు: “నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది.” (2 తిమోతి 4:​6-8) అంతేకాక, యేసు అభిషిక్త క్రైస్తవుల ఒక సంఘానికి ఇలా చెప్పాడు: “మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.”​—⁠ప్రకటన 2:​10; 17:​14.

“కిరీటము” అనేమాట మొదటిగా ముద్రించబడడానికి, చివరిగా ముద్రించబడడానికి మధ్య సమయముంటుందనే అదనపు రుజువునిస్తోంది. ఎందుకు? ప్రాచీన కాలాల్లో, పరుగుపందెంలో గెలిచిన క్రీడాకారునికి కిరీటమివ్వడం వాడుక. ఆ కిరీటాన్ని అందుకునేందుకు అతను కేవలం పరుగుపందెంలో పాల్గొనడంకన్నా ఇంకా ఎక్కువే చేయాలి. ఆయన తన పరుగును చివరివరకు కొనసాగించాలి. అదే విధంగా, అభిషిక్త క్రైస్తవులు తమ జీవితం చివరివరకు అంటే మొదట ముద్రించబడిన దగ్గరనుండి చివరగా ముద్రించబడేంతవరకు పట్టుదలతో కొనసాగినప్పుడు మాత్రమే వారికి పరలోకంలో అమర్త్యమైన జీవితమనే కిరీటం ఇవ్వబడుతుంది.​—⁠మత్తయి 10:​22; యాకోబు 1:​12.

మొదటగా ముద్రించబడిన అభిషిక్త క్రైస్తవుల శేషము ఎప్పుడు చివరిగా ముద్రించబడతారు? భూమిపై ఇంకా సజీవంగావున్నవారు మహాశ్రమలు విరుచుకుపడకముందు “తమ నొసళ్లయందు” ముద్రించబడతారు. శ్రమలు తీసుకొచ్చే ఆ నాలుగు దిక్కుల వాయువులు విడిచిపెట్టబడినప్పుడు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులలో కొందరు భౌతికంగా సజీవులుగావుండి, భూమ్మీద యెహోవాకు తాము చేస్తున్న సేవను ఇంకా ముగించవలసివున్నా, వారందరూ చివరిగా ముద్రించబడినవారై ఉంటారు.