కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమ చూపించడంలో మీ హృదయాలను విశాలపరచుకోగలరా?

ప్రేమ చూపించడంలో మీ హృదయాలను విశాలపరచుకోగలరా?

ప్రేమ చూపించడంలో మీ హృదయాలను విశాలపరచుకోగలరా?

ఓడ కొట్టుకొనిపోకుండా ఆపే లంగరుకుండే గొలుసు తీవ్ర తాకిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. ఆ గొలుసులోని కొక్కెములు సరిగ్గా అతికించబడి, బలంగా ఉంటేనే అది తాకిడిని తట్టుకోగలదు. లేకపోతే ఆ గొలుసు తెగిపోయే ప్రమాదం ఉంది.

క్రైస్తవ సంఘం విషయంలో కూడా అదే నిజమని చెప్పవచ్చు. ఒక సంఘం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాని సభ్యులు ఐక్యంగా ఉండాలి. వారిని ఏది ఐక్యంగా ఉంచుతుంది? ఐకమత్యానికి అతిగొప్ప ప్రేరకమైన ప్రేమే అలా ఉంచుతుంది. అందుకే యేసుక్రీస్తు తన శిష్యులతో, “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి, నిజ క్రైస్తవులకు ఉండే ప్రేమ కేవలం స్నేహం లేదా పరస్పర గౌరవంకన్నా ఎంతో ఉన్నతమైంది. వారు స్వయంత్యాగపూరిత ప్రేమను పెంపొందించుకుంటారు.​—⁠యోహాను 13:​34, 35.

మన తోటివిశ్వాసులను విలువైనవారిగా పరిగణించడం

అనేక సంఘాల్లో వివిధ వయసులకు, జాతులకు, దేశాలకు, సంస్కృతులకు, భాషలకు, సామాజిక నేపథ్యాలకు చెందిన ప్రజలు ఉంటారు. ప్రతీ సభ్యునికి స్వంత ఇష్టాయిష్టాలు, ఆశలు, ఆందోళనలు ఉంటాయి, అంతేకాక సాధారణంగా అందరికీ తమతమ వ్యక్తిగత సమస్యలు అంటే క్షీణిస్తున్న ఆరోగ్యం లేదా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వైవిధ్యం క్రైస్తవ ఐక్యతకు అవరోధంగా మారవచ్చు. అయితే, ప్రేమ చూపించడంలో మన హృదయాలను విశాలపరచుకునేందుకు, సమైక్యంగా ఉండేందుకు మనకు ఏది సహాయం చేయగలదు? సంఘంలో అందరినీ యథార్థతతో విలువైనవారిగా పరిగణించడం మనం ఒకరిపట్ల ఒకరం ప్రేమను ప్రగాఢం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.

అయితే, ఇతరులను విలువైనవారిగా పరిగణించడంలో ఏమి ఇమిడివుంది? మనం మన తోటివిశ్వాసులను విలువైనవారిగా పరిగణిస్తే, వారి అవసరాలను గుర్తిస్తాం, వారిని ప్రగాఢంగా గౌరవిస్తాం, వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తాం, వారు మనతోపాటు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉంటాం. అలా చేసినప్పుడు మనకు వారిపై ఉన్న ప్రేమ అధికమౌతుంది. ఆ క్రైస్తవ ప్రేమను సాధ్యమైనంత ఎక్కువగా ఎలా చూపించవచ్చో తెలుసుకోవడానికి అపొస్తలుడైన పౌలు కొరింథులోవున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాసినదాన్ని పరిశీలించడం మనకు సహాయం చేస్తుంది.

కొరింథీయుల “అంతఃకరణమే సంకుచితమై” ఉంది

పౌలు కొరింథీయులకు తన మొదటి పత్రికను సా.శ. 55లో, రెండవ పత్రికను ఆ తర్వాతి సంవత్సరంలో వ్రాశాడు. కొరింథు సంఘంలోని కొందరు తమ తోటి విశ్వాసులను విలువైనవారిగా పరిగణించడంలేదని ఆయన వ్రాసిన మాటలు సూచిస్తున్నాయి. వారి పరిస్థితిని పౌలు ఇలా వర్ణిస్తున్నాడు: “ఓ కొరింథీయులారా, అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడియున్నది. మీ యెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.” (2 కొరింథీయులు 6:​11, 12) వారి “అంతఃకరణము సంకుచితమై” ఉందని పౌలు వర్ణించినప్పుడు ఆయన ఏమి చెప్పాలనుకున్నాడు?

వారు తమ హృదయాల్లో సంకుచితంగా, ఉదారత లేనివారిగా ఉన్నారని పౌలు చెబుతున్నాడు. పౌలుపట్ల కొరింథీయుల ప్రేమ “ఆధారాలులేని సందేహాలవల్ల . . . దెబ్బతిన్న ఆత్మాభిమానంవల్ల అడ్డగించబడిందని” ఒక బైబిలు విద్వాంసుడు అభిప్రాయపడుతున్నాడు.

పౌలు వారికి ఎలాంటి ఉపదేశాన్నిచ్చాడో గమనించండి: “మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.” (2 కొరింథీయులు 6:​13) తోటి విశ్వాసులపట్ల ప్రేమ చూపించడంలో హృదయాలను విశాలపరచుకోమని పౌలు కొరింథీయులను ప్రోత్సహించాడు. అంటే, వారిని ఆశావహ దృక్పథం, ఉదార హృదయం ప్రభావితం చేయాలి కానీ అపనమ్మకం, అల్పమైన సమస్యలు కాదు.

నేడు ప్రేమ చూపించడంలో హృదయాలను విశాలపరచుకోవడం

నేడు దేవుని సత్యారాధకులు ఒకరిపట్ల మరొకరు ప్రేమ చూపించడంలో హృదయాలను విశాలపరచుకోవడానికి ఎంతగా కృషి చేస్తున్నారో చూడడం ప్రోత్సాహాన్నిస్తుంది. అలా చేయడానికి కృషి అవసరమని అంగీకరించవలసిందే. అయితే, అది కేవలం ఒక సిద్ధాంతమే కాదు. హృదయాలను విశాలపరచుకోవడమంటే బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించని ప్రజలకు భిన్నంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సాధారణంగా అలాంటి ప్రజలకు ఇతరులపట్ల కాస్తైనా గౌరవం ఉండదు. వారు ఇతరులపట్ల అనాలోచితంగా, అగౌరవంగా, కించపరిచేవిధంగా ప్రవర్తించగలరు. కాబట్టి, అలాంటి వైఖరులు మనల్ని ప్రభావితం చేసేందుకు ఎన్నడూ అనుమతించకుండా ఉందాం. కొరింథీయుల విషయంలో జరిగినట్లుగా మన ప్రేమ కూడా అపనమ్మకం చేత అణచివేయబడడం ఎంత విచారకరమో కదా! ఒక క్రైస్తవ సహోదరుని తప్పుల్ని గమనించడంలో త్వరపడుతూ, ఆయనలోని మంచి గుణాలను గుర్తించడంలో జాప్యం చేసేవారిగా ఉంటే మన ప్రేమకు అదే జరిగే అవకాశం ఉంది. ఇతరులు వేరే సంస్కృతికి చెందినవారని మనం ప్రేమ చూపించడంలో మన హృదయాలు సంకుచితం చేసుకుంటే కూడా మనం కొరింథీయులు చేసిన పొరపాటే చేస్తాం.

దానికి భిన్నంగా, ప్రేమ చూపించడంలో తన హృదయాన్ని విశాలపరచుకునే దేవుని సేవకుడు, తోటి విశ్వాసులను ఎంతో విలువైనవారిగా పరిగణిస్తాడు. వారిని ప్రగాఢంగా గౌరవిస్తూ, వారి ఆత్మాభిమానాన్ని లక్ష్యపెడతాడు, వారి అవసరాలను గుర్తిస్తాడు. ఫిర్యాదు చేయడానికి తగిన కారణాలున్నా, ఆయన క్షమించాలని కోరుకుంటూ మనసులో పగ పెట్టుకోడు. తోటి విశ్వాసుల ఉద్దేశాలను శంకించడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని చెప్పినప్పుడు యేసు సూచించిన ప్రేమను చూపించడానికి ఉదార హృదయం ఆయనకు సహాయం చేస్తుంది.​—⁠యోహాను 13:​35.

చొరవ తీసుకుని కొత్త స్నేహితులను చేసుకోండి

మనకున్న సన్నిహితులతోనే సహవసించకుండా సంఘంలో మనతో అంతగా చనువుగా ఉండని వారిని కూడా స్నేహితులుగా చేసుకునేందుకు హృదయపూర్వక ప్రేమ మనకు సహాయం చేస్తుంది. వారు ఎవరై ఉండవచ్చు? మనలో కొందరు సహోదరులు లేదా సహోదరీలు బిడియంవల్లనో లేక మరే ఇతర కారణంవల్లనో ఎక్కువమంది స్నేహితులను కలిగివుండరు. ఆరాధన విషయంలో తప్ప మరే విషయాల్లోనూ మనకూ వారికీ పొంతన లేదని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్లో పేర్కొనబడిన కొన్ని అత్యంత సన్నిహిత స్నేహాలు, బయటికి ఎంతో భిన్నంగా కనిపించే వ్యక్తుల మధ్య ఏర్పడ్డాయన్నది నిజం కాదా?

ఉదాహరణకు, రూతు నయోమిలనే తీసుకోండి, వారి వయసులు, దేశాలు, సంస్కృతులు, చివరికి మాతృభాషలు కూడా వేరు. అయినా, వారి స్నేహం ఆ బేధాలన్నింటినీ అధిగమించింది. యోనాతాను రాకుమారునిగా పెంచబడితే, దావీదు గొఱ్ఱెల కాపరిగా పెంచబడ్డాడు. వారి వయసుల్లో చాలా వ్యత్యాసం ఉన్నా, పరిశుద్ధ లేఖనాల్లో ప్రస్తావించబడిన అత్యంత సన్నిహిత స్నేహాల్లో వారి సహవాసం కూడా ఒకటి. వారి స్నేహం ఆ నలుగురికీ ఆనందాన్ని, ఆధ్యాత్మిక సహకారాన్ని అందించింది.​—⁠రూతు 1:⁠16; 4:​15; 1 సమూయేలు 18:⁠3; 2 సమూయేలు 1:​26.

నేడు కూడా వేర్వేరు వయసులున్న లేదా విభిన్న జీవిత పరిస్థితులున్న నిజ క్రైస్తవులు సన్నిహిత స్నేహితులు అవుతున్నారు. ఉదాహరణకు, రెజీనాను తీసుకోండి, ఆమె ఇద్దరు టీనేజీ పిల్లలున్న ఒంటరి తల్లి. * ఆమె చాలా బిజీగా ఉండేది, ఇతరులతో తీరిగ్గా సమయం గడిపేందుకు వీలుండేది కాదు. హారాల్ట్‌, ఊటా పిల్లలులేని వృద్ధ దంపతులు. పైకి చూసినప్పుడు ఆ రెండు కుటుంబాలమధ్య పెద్దగా పోలిక ఉన్నట్లు కనిపించదు. కానీ హారాల్ట్‌, ఊటా దంపతులు హృదయాలను విశాలపరచుకోమనే బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకున్నారు. వారితోపాటు పరిచర్యలో కలిసి సమయం గడపడం, ఉల్లాస కార్యకలాపాల్లో ఆనందించడం లాంటి అనేక కార్యకలాపాల్లో పాల్గొనడానికి రెజీనాను, ఆమె పిల్లలను ఆహ్వానించడానికి వారు కృషి చేశారు.

మనకున్న స్నేహితులతోపాటు మరికొంతమందిని కూడా స్నేహితులుగా చేసుకోగలమా? మరో దేశానికి, సంస్కృతికి లేదా వయసుకు చెందిన తోటి విశ్వాసులకు దగ్గరవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు?

ఇతరుల అవసరాల్లో చేయూతనివ్వండి

ఇతరుల అవసరాలను గుర్తించేలా ఉదార హృదయం మనల్ని పురికొల్పుతుంది. ఎలాంటి అవసరాలు? క్రైస్తవ సంఘ సభ్యులను గమనించినప్పుడు మీకు ఆ అవసరాలేమిటో తెలుస్తాయి. యౌవనులకు నడిపింపు అవసరం, వయసు పైబడినవారికి ప్రోత్సాహం అవసరం, పూర్తికాల పరిచారకులకు ప్రశంసలు సహకారం అవసరం, నిరాశచెందిన తోటివిశ్వాసులకు తమ బాధ చెప్పుకుంటే వినేవారు అవసరం. అందరికీ అవసరాలుంటాయి. ఆ అవసరాల్లో చేయూతనిచ్చేందుకు మనం చేయగలిగినదంతా చేయాలనుకుంటాం.

హృదయాలను విశాలపరచుకోవడం అంటే ప్రత్యేక అవసరాలున్నవారిపట్ల శ్రద్ధ తీసుకోవడం కూడా ఇమిడివుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా జీవితంలో వేరే ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నవారు ఎవరైనా మీకు తెలుసా? అవసరంలో ఉన్నవారిపట్ల సానుభూతి చూపించి, వారికి చేయూతనివ్వడానికి ప్రేమ చూపించడంలో మీ హృదయాలను విశాలపరచుకోవడం, ఉదార హృదయాన్ని పెంపొందించుకోవడం మీకు సహాయం చేస్తాయి.

సమీప భవిష్యత్తు గురించిన బైబిలు ప్రవచనాలు నెరవేరబోతుండగా, వేరే ఆస్తులు, సామర్థ్యాలు, లేదా సాఫల్యాల కన్నా సంఘంలోని బలమైన ఐక్య బంధాలే ఎక్కువ విలువైనవిగా ఉంటాయి. (1 పేతురు 4:​7, 8) మనమందరం మన తోటి విశ్వాసులపట్ల ప్రేమ చూపించడంలో మన హృదయాలను విశాలపరచుకోవడం ద్వారా సంఘాన్ని ఐక్యపరిచే బంధాలను మరింత బలోపేతం చేయడానికి వ్యక్తిగతంగా తోడ్పడవచ్చు. “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ” అని తన కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలకు అనుగుణంగా నడుచుకుంటున్నందుకు యెహోవా మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడని మనం నమ్మవచ్చు.​—⁠యోహాను 15:​12.

[అధస్సూచి]

^ పేరా 17 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[10వ పేజీలోని బ్లర్బ్‌]

మన సహోదరసహోదరీలను విలువైనవారిగా పరిగణించడం అంటే, వారిని ప్రగాఢంగా గౌరవించడం, వారి ఆత్మాభిమానాన్ని లక్ష్యపెట్టడం, వారి అవసరాలను గుర్తించడం