మీరు తుఫానులాంటి కష్టాలను తాళుకోవచ్చు
మీరు తుఫానులాంటి కష్టాలను తాళుకోవచ్చు
అపాయకరమైన ఈ కాలాల్లో, చాలామంది తుఫానులాంటి కష్టాలను అనుభవిస్తున్నారు. క్రైస్తవులకైతే దేవునిపట్ల ప్రేమ, ఆయన సూత్రాలపట్ల యథార్థతను చూపించడం తాళుకోవడానికి సహాయం చేస్తాయి. ఏ విధంగా? దీనికి సమాధానం యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలో చూడవచ్చు. ఆయన, విధేయులైన తన అనుచరులను ‘బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని’తో పోల్చాడు. యేసు ఇలా చెప్పాడు: “వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెనుగాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.”—మత్తయి 7:24, 25.
ఉపమానంలోని వ్యక్తి బుద్ధిమంతుడైనప్పటికీ వానలు, వరదలు, బీభత్సాన్ని సృష్టించే పెనుగాలిలాంటి కష్టాలను ఆయన ఎదుర్కొంటాడనే విషయాన్ని గమనించండి. కాబట్టి, యేసు తన అనుచరులు కష్టాలన్నింటినీ తప్పించుకుని, ఎలాంటి అవాంతరాలు లేకుండా సమాధానంతో, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని సూచించలేదు. (కీర్తన 34:19; యాకోబు 4:13-15) అయితే ఆయన, దేవుని నమ్మకమైన సేవకులు తుఫానువంటి కష్టాలకు, క్లిష్ట పరిస్థితులకు ముందుగానే సిద్ధపడవచ్చని, వాటితో విజయవంతంగా వ్యవహరించవచ్చని చెప్పాడు.
యేసు ఆ ఉపమానాన్ని ఇలా ప్రారంభించాడు: “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.” యేసు ఇక్కడ అక్షరార్థమైన ఇళ్ళ నిర్మాణం గురించి కాదుగానీ, క్రైస్తవ ఉద్దేశాలను, క్రియలను వృద్ధిచేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు మాటలను లక్ష్యపెట్టేవారు వివేచనను, సరైన తర్కాన్ని ఉపయోగిస్తారు. వారు నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం ద్వారా క్రీస్తు బోధలనే బండరాయిమీద వారి ఉద్దేశాలను, క్రియలను నిర్మిస్తారు. ఆసక్తికరంగా, సాదృశ్యమైన ఈ బండ పైకి కనిపించదు. ఉపమానంలోని వ్యక్తి దాన్ని చేరుకోవడానికి ‘లోతుగా త్రవ్వాల్సి’ ఉంటుంది. (లూకా 6:48) అదే విధంగా, యేసు అనుచరులు తమను దేవునికి సన్నిహితం చేయగల స్థిరమైన లక్షణాలను పెంపొందించుకోవడానికి ఎడతెగక కృషి చేస్తారు.—మత్తయి 5:5-7; 6:33.
తుఫానులాంటి కష్టాలు యేసు అనుచరుల క్రైస్తవ స్థిరత్వాన్ని పరీక్షించినప్పుడు ఏమి జరుగుతుంది? యేసు బోధలకు వారు చూపించే ఇష్టపూర్వక విధేయత, క్రైస్తవ లక్షణాలు, కష్టకాలాల్లో అత్యంత ప్రాముఖ్యంగా తుఫానులా ముంచుకొస్తున్న హార్‌మెగిద్దోను సమయంలో బలపరిచే మూలాలుగా ఉంటాయి. (మత్తయి 5:10-12; ప్రకటన 16:15, 16) అవును, క్రీస్తు బోధలను అనుసరించడంద్వారా, ఎంతోమంది తుఫానులాంటి కష్టాలను విజయవంతంగా తాళుకుంటున్నారు. మీరు కూడా తాళుకోవచ్చు.—1 పేతురు 2:21-23.