కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేనిని విజయంగా పరిగణిస్తారు?

మీరు దేనిని విజయంగా పరిగణిస్తారు?

మీరు దేనిని విజయంగా పరిగణిస్తారు?

ఎం తో విజయవంతుడైన వాల్‌స్ట్రీట్‌ స్టాక్‌ వ్యాపారిగా కొందరు దృష్టించే జెసీ లివర్‌మోర్‌ తెలివిగా వ్యాపార నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరుగాంచాడు. ఫలితంగా ఆయన ఎంతో సంపద కూడబెట్టుకున్నాడు. ప్రత్యేకంగా చేత్తోకుట్టిన అత్యంత నాణ్యమైన సూట్లు ధరించేవాడు, 29 గదులున్న భవంతిలో నివసిస్తూ, ఒక డ్రైవర్‌ను పెట్టుకుని నల్లరంగు రోల్స్‌రాయిస్‌ కారులో తిరిగేవాడు.

డేవిడ్‌ * కూడా విజయవంతం కావాలనుకున్నాడు. ఓ పెద్ద గ్రాఫిక్స్‌ సంస్థలో ఉపాధ్యక్షునిగా, జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన ఆ కంపెనీ డివిజనల్‌ అధ్యక్షునిగా పదోన్నతిపొందే అవకాశముంది. డబ్బు, హోదా ఆయనను ఆకర్షించాయి. అయితే, డేవిడ్‌ ఆ కంపెనీ ఉద్యోగానికి రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నాడు. “నాకు మళ్ళీ అలాంటి ఆకర్షణీయమైన ఉద్యోగం దొరకదని తెలుసు” అని డేవిడ్‌ అంటున్నాడు. డేవిడ్‌ తప్పు నిర్ణయం తీసుకున్నాడని మీరనుకుంటున్నారా?

విజయవంతులు కావడంలో డబ్బు, కీర్తి లేదా ప్రతిష్ఠ సంపాదించుకోవడం ఇమిడివుందని అనేకులు నమ్ముతారు. అయితే, సంపన్నులు అంతరంగ శూన్యాన్ని అనుభవిస్తూ, జీవితంలో సంకల్పరహితులుగా ఉండవచ్చు. లివర్‌మోర్‌ పరిస్థితి అలాగేవున్నట్లు స్పష్టమౌతోంది. ఎంతో డబ్బున్నా ఆయన వేదన, విషాదం, దుఃఖం నిండిన జీవితం గడిపాడు. అతడు కృంగుదలను, వైవాహిక వైఫల్యాలను, పిల్లల కోపతాపాలను అనుభవించాడు. చివరికి, తన సంపదను చాలావరకు కోల్పోయిన లివర్‌మోర్‌, ఒకరోజు విలాసవంతమైన హోటల్‌ బార్‌లో కూర్చొని తాను పోగొట్టుకున్నవాటి గురించి విలపించాడు. మద్యంకోసం ఆర్డర్‌చేసి, తనదగ్గరున్న లెదర్‌ బైండింగ్‌ పుస్తకాన్ని తీసుకొని, అందులో తన భార్యకు వీడ్కోలు మాటలు వ్రాశాడు. త్రాగడం పూర్తిచేసి, కాస్త చీకటిగావున్న క్లోక్‌రూమ్‌లోకి వెళ్లి పిస్తోలుతో కాల్చుకుని చనిపోయాడు.

ఆత్మహత్యా కారణాలు సంక్లిష్టంగా ఉన్నాయనేది వాస్తవమైనా, ఈ అనుభవం బైబిలులోని ఈ మాటల సత్యత్వాన్ని నిరూపిస్తోంది: “ధనవంతులగుటకు అపేక్షించువారు . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”​—⁠1 తిమోతి 6:​9, 10.

డబ్బు, హోదా లేదా ప్రధానత్వం ఉంటేనే విజయం సాధించినట్లుగా పరిగణించేవారు తప్పుడు ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నారా? మిమ్మల్నిమీరు విజయవంతులమని పరిగణించుకుంటున్నారా? ఎందుకు పరిగణించుకుంటున్నారు? ఈ నిర్ణయానికి వచ్చేందుకు మీరు ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నారు? విజయం గురించిన మీ దృక్కోణాన్ని ఏది ప్రభావితం చేస్తోంది? విజయవంతులయ్యేందుకు లక్షలాదిమందికి సహాయం చేసిన నమ్మకమైన సలహాను తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది. మీరు కూడా ఎలా విజయవంతులు కావచ్చో పరిశీలిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 3 పేరు మార్చబడింది.