కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెలా విజయవంతులు కావచ్చు?

మీరెలా విజయవంతులు కావచ్చు?

మీరెలా విజయవంతులు కావచ్చు?

త ల్లిదండ్రులెలా తమ పిల్లలపట్ల శ్రద్ధవహిస్తూ, వారు విజయవంతులవాలని కోరుకుంటారో, అలాగే మన పరలోక తండ్రి కూడా మనపట్ల శ్రద్ధవహిస్తూ, మనం విజయవంతులవాలని కోరుకుంటున్నాడు. మనపట్ల వాత్సల్యపూరిత శ్రద్ధను కనబరుస్తూ ఆయన జయాపజయాల గురించి మనకెంతో చెబుతున్నాడు. వాస్తవానికి, దేవుడు చెబుతున్నదానికి అవధానమిచ్చే వ్యక్తిని గురించి మాట్లాడుతూ బైబిలు నమ్మకంగా ఇలా చెబుతోంది: “అతడు చేయునదంతయు సఫలమగును.”​—⁠కీర్తన 1:⁠3.

అదే నిజమైతే, చాలామంది ఎందుకు విజయవంతులుగా, సంతోషకరంగా, సంతృప్తికరంగా జీవించలేకపోతున్నారు? ఈ కీర్తనను నిశితంగా పరిశీలించడం మనకు జవాబివ్వడమేకాక, మనం కూడా ఎలా విజయవంతులుగా ఉండవచ్చో చూపిస్తుంది.

“దుష్టుల ఆలోచన”

“దుష్టుల ఆలోచన” చొప్పున నడవడంలోని ప్రమాదం గురించి కీర్తనకర్త హెచ్చరిస్తున్నాడు. (కీర్తన 1:⁠1) అపవాదియైన సాతానే ప్రధాన ‘దుష్టుడు.’ (మత్తయి 6:​13) అతడు “ఈ లోకాధికారి” అని, “లోకమంతయు దుష్టుని యందున్నదని” లేఖనాలు మనకు చెబుతున్నాయి. (యోహాను 16:​9-11; 1 యోహాను 5:​19) అందువల్ల, లోకంలో అందుబాటులోవున్న ఉపదేశంలో ఎక్కువభాగం ఆ దుష్టుని ఆలోచనలను ప్రతిబింబిస్తుందంటే అందులో ఆశ్చర్యం లేదు.

దుష్టులు ఏ విధమైన సలహాలిస్తారు? సాధారణంగా, దుష్టులు దేవుణ్ణి తృణీకరిస్తారు. (కీర్తన 10:​13) దేవుని నిర్లక్ష్యంచేసే లేదా అవమానపరిచే వారి ఉపదేశం విస్తృతంగా అందుబాటులోవుంది. ఆధునిక సమాజం ‘శరీరాశను నేత్రాశను జీవపుడంబాన్ని’ ప్రోత్సహిస్తోంది. (1 యోహాను 2:​16) ప్రసార మాధ్యమాలు “జీవితాన్ని పూర్తిగా అనుభవించండి” అనే లౌకిక తత్వసంబంధ వ్యాపార ప్రకటనలతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగావున్న కంపెనీలు, ప్రజలకు అవసరమున్నా, లేకపోయినా వినియోగదారులు తమ ఉత్పత్తులను కొనేలా మభ్యపెట్టేందుకు సంవత్సరానికి దాదాపు 50 వేల కోట్ల (యు. ఎస్‌.) డాలర్లు ఖర్చుచేస్తున్నాయి. ఈ విధమైన ప్రచారం ప్రజల కొనుగోలు అలవాట్లను మార్చడంకన్నా ఇంకా ఎక్కువే చేసింది. అది విజయానికి సంబంధించిన ప్రపంచ దృక్కోణాన్నే తప్పుదోవ పట్టించింది.

ఫలితంగా, చాలామంది కొన్ని సంవత్సరాల క్రితమైతే కేవలం కలలుగన్న వస్తువులు ప్రస్తుతం తమ దగ్గరున్నా, మరిన్ని వస్తువులకోసం ఇంకా తహతహలాడుతున్నారు. ఆ వస్తువులు లేకపోతే మీరు సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరనేదే అందులోని భావం. కానీ అవి తప్పుడు ఆలోచనలు, అవి “తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”​—⁠1 యోహాను 2:​16.

మనల్ని నిజంగా విజయవంతుల్ని చేసేదేమిటో మన సృష్టికర్తకు తెలుసు. ఆయన సలహా ‘దుష్టుల ఆలోచనకు’ భిన్నంగా ఉంటుంది. కాబట్టి విజయవంతులయ్యేందుకు ఇటు లోకసంబంధ మార్గంలో నడుస్తూనే అటు దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించడం ఒకే సమయంలో రెండు పడవలపై ప్రయాణించేందుకు ప్రయత్నించడంలాగే ఉంటుంది. అది అసాధ్యం. అందుకని బైబిలు మనల్నిలా హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు: ‘మీరు ఈ లోక ప్రమాణాలను అనుసరించకండి’!​—⁠రోమీయులు 12:​2, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితము.

లోకం మిమ్మల్ని మలచనివ్వకండి

సాతాను ప్రభావం క్రిందున్న లోకం మన సంక్షేమంపై ఆసక్తివున్నట్లు కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. సాతాను స్వార్థంతో తన పనికోసం మొదటి స్త్రీయైన హవ్వను మోసగించాడని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఆదామును పాపమార్గంలోకి లాగేందుకు హవ్వను ఉపయోగించుకున్నాడు. నేడు, సాతాను తన దుష్ట ఉపదేశాన్ని అందించేందుకు మానవులను కూడా ఉపయోగిస్తున్నాడు.

ఉదాహరణకు, ముందరి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన డేవిడ్‌ అదనపు గంటలు పనిచేయాలి, వ్యాపారం నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయాలి. “నేను సోమవారం ఉదయం వెళ్ళి, మళ్లీ గురువారం సాయంత్రానికే తిరిగివస్తాను” అని డేవిడ్‌ చెబుతున్నాడు. లోకంలో విజయవంతులుగా ఉండాలంటే, అలాంటి త్యాగాలు చేయడం అవసరమని గ్రహించిన సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, “నీ కుటుంబం కోసం ఈ ఉద్యోగంలోనే కొనసాగు” అని డేవిడ్‌ను ప్రోత్సహించారు. ఆయన స్థిరపడేంతవరకు కేవలం కొన్ని సంవత్సరాలే అలాంటి దినచర్యను అనుసరించాలని వారు తర్కించారు. డేవిడ్‌ ఇలా చెబుతున్నాడు: “నేను మరింత డబ్బు సంపాదించగలను, అంటే నేను మరింత విజయవంతంగా ఉండగలను కాబట్టి, నా కుటుంబానికి అది శ్రేయస్కరమని వారు వాదించారు. నేను కుటుంబంతో లేకపోయినా నేను నిజానికి కుటుంబానికి ఎంతో ఇస్తున్న వ్యక్తిగా ఉంటానని నా స్నేహితులు నన్ను ఒప్పించారు.” డేవిడ్‌లాగే చాలామంది తమ ప్రియమైనవారికి అవసరమని తమకనిపించే సమస్తాన్ని అందించేందుకు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి సలహాను అనుసరించడం విజయవంతుల్ని చేస్తుందా? ఒక కుటుంబానికి నిజంగా అవసరమైనదేమిటి?

వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో డేవిడ్‌ అదేమిటో తెలుసుకున్నాడు. “మా పాప ఏంజిలికాతో నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, తనిలా అంది: ‘డాడీ, మీరు మాతోపాటే ఇంటిదగ్గర ఉండొచ్చుగా?’ ఆ మాట చాలా బాధ కలిగించింది” అని డేవిడ్‌ చెబుతున్నాడు. రాజీనామా ఇవ్వాలనే తన అభీష్టాన్ని ఆయన కూతురు మాటలు బలపర్చాయి. డేవిడ్‌ తన కుటుంబానికి నిజంగా అవసరమైనది ఇవ్వాలని, అంటే తను వారి దగ్గరవుంటూ, తన సమయం, అవధానం వారికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు.

దేవుని సలహాను అన్వయించుకోవడం విజయవంతుల్ని చేస్తుంది

ఈ లోకంలో ప్రబలంగా ఉన్న మోసకరమైన సమాచారాన్ని మీరెలా ఎదుర్కోవచ్చు? ‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే’ వ్యక్తి ధన్యుడు, విజయవంతమైనవాడు అని కీర్తనకర్త మనకు చెబుతున్నాడు.​—⁠కీర్తన 1:⁠2.

దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి యెహోషువను నాయకుడిగా నియమించినప్పుడు, ఆయనకిలా చెప్పబడింది: ‘నీవు [దేవుని వాక్యాన్ని] దివారాత్రము ధ్యానించాలి.’ అవును, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం ఆవశ్యకం, అంతేకాక యెహోషువ ‘దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయడానికి జాగ్రత్తపడాలి.’ నిజమే, బైబిలు చదవడం మాత్రమే మిమ్మల్ని విజయవంతుల్ని చేయదు. మీరు చదివింది అన్వయించుకోవాలి. యెహోషువకు ఇలా చెప్పబడింది: “నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”​—⁠యెహోషువ 1:⁠8.

చిరునవ్వు చిందిస్తున్న పాపాయి తల్లి ఒడిలో కూర్చొనివుండగా ఆ ఇద్దరూ కలిసి తమకు ఇష్టమైన కథ చదవడాన్ని ఊహించుకోండి. ఆ కథను వారు అంతకుముందు ఎన్నిసార్లు చదివినా, ఆ క్షణాలను వారు అమూల్యమైనవిగా దృష్టిస్తారు. అదే విధంగా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తికి ప్రతీరోజు బైబిలు చదవడం సంతోషకరమైన అనుభవంగా, అంటే తన పరలోక తండ్రితో ఆమోదయోగ్యంగా గడిపిన సమయంగా ఉంటుంది. యెహోవా సలహాను, నిర్దేశాన్ని అనుసరించడం ద్వారా, అలాంటి వ్యక్తి “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.”​—⁠కీర్తన 1:⁠3.

కీర్తనకర్త వర్ణించిన చెట్టు యాదృచ్ఛికంగా అక్కడ పెరగలేదు. అది జాగ్రత్తగా నీటి సౌకర్యమున్న చోట నాటబడి, రైతుచేత శ్రద్ధ తీసుకోబడింది. అదే విధంగా మన పరలోకపు తండ్రి లేఖనాల్లోని ఉపదేశం ద్వారా మన ఆలోచనను సరిదిద్ది, సవరిస్తాడు. ఫలితంగా మనం వర్ధిల్లి, దైవిక లక్షణాలను ఫలిస్తాం.

అయితే, ‘దుష్టులు ఆలాగున ఉండరు.’ నిజమే, దుష్టులు కొంతమేర వర్ధిల్లుతున్నట్లు కనిపించవచ్చు, కానీ చివరకు వారు చెడు పర్యవసానాన్ని ఎదుర్కొంటారు. వారు “న్యాయవిమర్శలో నిలువరు.” బదులుగా, “దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.”​—⁠కీర్తన 1:4-6.

కాబట్టి లోకం మీ లక్ష్యాలను, ప్రమాణాలను నిర్దేశించేందుకు అనుమతించకండి. ఈ లోకంలో విజయవంతులయ్యే నైపుణ్యం, చేవ మీకున్నా, మీ నైపుణ్యాలను ఎలా ఉపయోగిస్తారు లేదా లోకం వాటిని ఎలా వాడుకునేలా అనుమతిస్తారనే విషయంలో జాగ్రత్త వహించండి. నిరర్థకమైన సంపదలను అన్వేషించడం ఒక వ్యక్తిని ‘వాడిపోయేలా’ చేస్తుంది. మరోవైపు, దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండడం నిజమైన విజయాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది.

మీరెలా విజయవంతులు కావచ్చు?

ఒక వ్యక్తి దేవుని సలహాను అనుసరించినప్పుడు, ఆయన చేసేదంతా ఎందుకు విజయవంతమౌతుంది? కీర్తనకర్త ఈ లోకంలోని విజయం గురించి మాట్లాడడం లేదు. దైవభక్తిగల వ్యక్తి విజయం, ఆయన దేవుని చిత్తం చేయడంతో ముడిపెట్టబడింది, దేవుని చిత్తం ఎల్లప్పుడూ విజయవంతమౌతుంది. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం మిమ్మల్నెలా విజయవంతుల్ని చేయగలదో మనం పరిశీలిద్దాం.

కుటుంబం: లేఖనాలు, భర్తలు ‘తమ సొంతశరీరములనువలే తమ భార్యలను ప్రేమింపవలెనని’ ప్రబోధించడమేకాక, భార్యలు “తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను” అని కూడా నిర్దేశిస్తున్నాయి. (ఎఫెసీయులు 5:​28, 33) తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం గడపాలని, వారితో సరదాగా కలిసి ఆనందించాలని, జీవితంలోని ప్రాముఖ్యమైన విషయాల గురించి వారికి బోధించాలని ప్రోత్సహించబడుతున్నారు. (ద్వితీయోపదేశకాండము 6:​6, 7; ప్రసంగి 3:⁠4) దేవుని వాక్యం తల్లిదండ్రులను ఇలా కూడా ఉపదేశిస్తోంది: ‘మీ పిల్లలకు కోపము రేపకుడి.’ ఈ ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు, ‘తలిదండ్రులకు విధేయులైయుండడం,’ ‘తమ తండ్రిని తల్లిని సన్మానించడం’ పిల్లలకు సులభమవుతుంది. (ఎఫెసీయులు 6:​1-4) ఈ దైవిక ఉపదేశాన్ని అన్వయించుకోవడం విజయవంతమైన కుటుంబ జీవితానికి దోహదపడుతుంది.

స్నేహితులు: చాలామంది తమకు స్నేహితులు ఉండాలని కోరుకుంటారు. మనకు ప్రేమించే, ప్రేమించబడే మానసిక, భావోద్వేగ సామర్థ్యముంది. “ఒకరి నొకరు ప్రేమింపవలెను” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (యోహాను 13:​34, 35) వారిలో, మనం ప్రేమించగల, మన అంతరంగ ఆలోచనలను, భావాలను పంచుకునేంతగా నమ్మగల స్నేహితులను కనుగొంటాం. (సామెతలు 18:​24) అన్నింటికన్నా మిన్నగా బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా మనం కూడా ‘దేవునికి దగ్గరవడమే’ కాక, అబ్రాహాములా ‘దేవుని స్నేహితులమని’ కూడా పిలువబడతాం.​—⁠యాకోబు 2:​23; 4:⁠8.

జీవితంలో సంకల్పం: నిజంగా విజయవంతులైనవారు ఏ లక్ష్యంలేని దైనందిన జీవితాన్ని కలిగివుండే బదులు, తమ జీవితంలో అర్థాన్ని, సంకల్పాన్ని కనుగొంటారు. వారి జీవితం ఈ విధానపు అస్థిరమైన పరిస్థితులపై ఆధారపడివుండదు. వారి లక్ష్యాలు నిజ జీవిత సంకల్పంపై కేంద్రీకరించబడి ఉంటాయి కాబట్టి, అవి నిజమైన, శాశ్వతమైన సంతృప్తికి నడిపిస్తాయి. ఒక వ్యక్తికి జీవితంలో ఏది సంకల్పాన్నిస్తుంది? “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”​—⁠ప్రసంగి 12:​13.

నిరీక్షణ: దేవుణ్ణి మన స్నేహితునిగా కలిగివుండడం మనకు భవిష్యత్తు నిరీక్షణను కూడా ఇస్తుంది. “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, దేవునియందే నమ్మికయుంచుడని” అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఉద్భోదించాడు. ఆ విధంగా ‘వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొంటారు.’ (1 తిమోతి 6:​17-19) దేవుని పరలోకరాజ్యం ఈ భూమ్మీద పరదైసును పునఃస్థాపించినప్పుడు ఆ వాస్తవమైన జీవం త్వరలోనే సార్థకమౌతుంది.​—⁠లూకా 23:​43.

మీరు బైబిలు సూత్రాలు అన్వయించుకున్నా, సమస్యలకు అతీతులేమీ కాదు, బదులుగా దుష్టులు తమమీదకు తెచ్చుకొనేలాంటి వేదనను, విషాదాన్ని చాలామేరకు తప్పించుకోగల్గుతారు. ముందు ప్రస్తావించబడిన డేవిడ్‌, అలాగే ఆయనలాంటి లక్షలాదిమంది తమ జీవితాల్లో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలోని విలువను తెలుసుకున్నారు. తన కాలపట్టికకు సరిపోయే ఉద్యోగాన్ని కనుగొన్న తర్వాత, డేవిడ్‌ ఇలా అన్నాడు: “నా భార్యాపిల్లలతో నా సంబంధం విషయంలోనేకాక, ఒక సంఘ పెద్దగా యెహోవాను సేవించే ఆధిక్యత విషయంలో నేనెంతో కృతజ్ఞతతో ఉన్నాను.” దేవుని ఉపదేశానికి చెవియొగ్గే వ్యక్తి గురించి కీర్తన ఇలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు: “అతడు చేయునదంతయు సఫలమగును”!

[6వ పేజీలోని చార్టు]

విజయానికి ఐదు మెట్లు

1 ఈ లోక ప్రమాణాలచేత నిర్దేశించబడడాన్ని నిరోధించండి.

కీర్తన 1:⁠1; రోమీయులు 12:⁠2

2 ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించండి.

కీర్తన 1:2, 3

3 మీ జీవితంలో బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోండి.

యెహోషువ 1:​7-9

4 దేవుణ్ణి మీ స్నేహితునిగా చేసుకోండి.

యాకోబు 2:​23; 4:8

5 దేవునియందు భయభక్తులు కలిగివుండి, ఆయన కట్టడలను అనుసరించండి.

ప్రసంగి 12:⁠13

[7వ పేజీలోని చిత్రాలు]

మీరు విజయవంతులు కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారా?