సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
జీవిత కథ
సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
పౌల్ కుష్నీర్ చెప్పినది
మా తాతామామ్మలు 1897లో యుక్రెయిన్ నుండి కెనడాకు వలసవెళ్లి సస్కత్‌చెవాన్‌లోని యార్క్‌టాన్ దగ్గర స్థిరపడ్డారు. వారు తమ ముగ్గురు కొడుకులు, ఒక కూతురితో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ కూతురి పేరు మారెంకా, ఆమె మా అమ్మ. నేను 1923లో జన్మించాను, నేను ఆమె సంతానంలో ఏడవవాణ్ణి. అప్పట్లో జీవితం సాదాసీదాగానే ఉన్నా భద్రత ఉండేది. మాకు పౌష్టికాహారం, వెచ్చని దుస్తులు ఉండేవి, ప్రభుత్వం మౌలిక వసతులను ఏర్పాటు చేసేది. స్నేహపూర్వకంగా ఉండే ఇరుగుపొరుగువారు ఇంట్లో పెద్ద పనులు చేయాల్సి వచ్చినప్పుడు సహాయపడేవారు. 1925వ సంవత్సరం శరదృతువులో బైబిలు విద్యార్థుల్లో ఒకరు మా ఇంటిని సందర్శించారు, అప్పట్లో యెహోవాసాక్షులు బైబిలు విద్యార్థులని పిలవబడేవారు. ఆ సందర్శనంవల్లే మేము మా జీవితాల్లో కొన్ని ఎంపికలు చేసుకోవడానికి పురికొల్పబడ్డాము, అలా చేసుకోగలిగినందుకు నేనింకా కృతజ్ఞుడినే.
మాకు బైబిలు సత్యం పరిచయమవడం
మా అమ్మ ఆ బైబిలు విద్యార్థినుండి కొన్ని పుస్తకాలను తీసుకుని చదివి, అదే సత్యమని గ్రహించింది. త్వరలోనే ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, 1926లో బాప్తిస్మం తీసుకుంది. మా అమ్మ బైబిలు విద్యార్థిగా మారిన తర్వాత మా అందరికీ జీవితంపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మా ఇల్లు ఆతిథ్యానికి పెట్టింది పేరుగా మారింది. పిల్‌గ్రిమ్‌లు అని పిలువబడే ప్రయాణ పైవిచారణకర్తలు, బైబిలు విద్యార్థులు తరచూ మా ఇంటికి వచ్చి ఉండేవారు. ఒక ప్రయాణ పైవిచారణకర్త 1928లో “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్”ను సరళీకరించి చేయబడిన “యురేకా డ్రామా”ను మాకు చూపించాడు. ఆయన, పిల్లలమైన మా దగ్గర నుండి క్లిక్-క్లిక్‌మని శబ్దం చేసే కప్ప బొమ్మను తీసుకున్నాడు. డ్రామాలోని స్లైడు మార్చడానికి సమయం వచ్చినప్పుడల్లా ఆయన దానితో క్లిక్‌మని శబ్దం చేసేవాడు. మా ఆటబొమ్మ ఆ విధంగా ఉపయోగపడినందుకు మేమెంత గర్వపడ్డామో!
మా ఇంటికి తరచూ ఈమల్ జారిస్కీ అనే ఒక ప్రయాణ పైవిచారణకర్త తన ట్రైలర్‌లో వచ్చేవాడు. కొన్నిసార్లు ఆయనతో వాళ్ల కుమారుడు కూడా వచ్చి, పిల్లలమైన మమ్మల్ని పూర్తికాల పరిచారకులు లేదా పయినీర్లు అయ్యే గురి పెట్టుకోమని ప్రోత్సహించేవాడు. మా ఇంటికి అనేకమంది పయినీర్లు కూడా వచ్చి ఉండేవారు. ఒకసారి మా అమ్మ ఒక పయినీరు 1 పేతురు 4:8, 9.
సహోదరుని చొక్కాను కుట్టడానికి తీసుకుని, ఆయన వేసుకోవడానికి మరో చొక్కా ఇచ్చింది. ఆయన వెళ్లిపోతున్నప్పుడు మరచిపోయి దాన్ని తనతో తీసుకువెళ్లాడు. చాలాకాలం తర్వాత, ఆయన దాన్ని పంపుతూ, ఆలస్యంగా పంపుతున్నందుకు క్షమాపణలు చెప్పాడు. “పోస్టు చేయడానికి అవసరమైన పది సెంట్లు నా దగ్గర లేక నేను దాన్ని పంపలేకపోయాను” అని ఆయన వ్రాశాడు. ఆ చొక్కాను ఆయనే వాడుకొని ఉంటే ఎంత బాగుండేదో అని మా అందరికీ అనిపించింది. నేను కూడా ఏదోక రోజు అలాంటి స్వయంత్యాగపూరిత పయినీర్లను అనుకరించాలని అనుకున్నాను. మా అమ్మ చూపించిన ఆతిథ్యానికి నేనెంతో కృతజ్ఞుడిని, ఎందుకంటే అది మా జీవితాల్ని ఎంతో మెరుగుపరచి, మాలో సహోదరత్వంపట్ల ప్రేమను అధికం చేసింది.—మా నాన్న బైబిలు విద్యార్థిగా మారలేదు; అయినా ఆయన మమ్మల్ని వ్యతిరేకించేవాడు కాదు. ఆయన 1930లో జరిగిన ప్రత్యేక దిన సమావేశం కోసం సహోదరులు మా షెడ్డును ఉపయోగించుకోవడానికి కూడా అనుమతించాడు. అప్పటికి నా వయసు ఏడేళ్లే అయినా, ఆ సందర్భపు ఆనందం క్రమబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాన్న 1933లో మరణించారు. విధవరాలిగా మారిన మా అమ్మపై ఎనిమిదిమంది పిల్లల భారం పడినా, మమ్మల్ని సత్యారాధనా మార్గంలో నడిపించాలనే ఆమె తీర్మానం కాస్తైనా సడలిపోలేదు. ఆమె నన్ను తనతోపాటు కూటాలకు తీసుకువెళ్లేది. ఆ కూటాలకు అసలు ముగింపే లేదన్నట్లు అనిపించేది, బయట ఆడుకోవడానికి అనుమతించబడిన పిల్లలతో నేను కూడా ఆడాలని ఆశపడేవాడిని. కానీ, అమ్మ మీద గౌరవంతో కూటాలకే హాజరయ్యేవాడిని. మా అమ్మ వంటచేస్తున్నప్పుడు, తరచూ ఒక లేఖనాన్ని చెప్పి అది బైబిల్లో ఎక్కడ ఉందో చెప్పమని అడిగేది. మా పొలంలో 1933వ సంవత్సరం మంచి పంట పండినందువల్ల చేతికందిన డబ్బుతో మా అమ్మ ఒక కారు కొన్నది. ఆమె డబ్బు వృథా చేస్తుందని ఇరుగుపొరుగువారు హేళన చేసినా, దైవపరిపాలనా కార్యకలాపాల్లో అది మాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆమె దాన్ని కొన్నది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుంది.
సరైన ఎంపికలు చేసుకోవడానికి ఇతరులు నాకు సహాయం చేశారు
ఏదో ఒక సమయంలో యౌవనులు తమ భవిష్యత్తును తీర్మానించే ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది. మా అక్కలు హెలెన్ మరియు కే ఆ ఎంపిక చేసుకోవాల్సివచ్చినప్పుడు వారు పయినీరు సేవ ప్రారంభించారు. మా ఇంట్లో ఆతిథ్యాన్ని ఆస్వాదించిన పయినీర్లలో ఒకరు జాన్ జాసుస్కీ, ఆయన మంచి నడవడిగల యౌవనుడు. పొలం పనుల్లో సహాయపడడానికి మా అమ్మ జాన్‌ను కొంతకాలంపాటు మాతోనే ఉండమని కోరింది. ఆ తర్వాత కొంతకాలానికి జాన్, మా అక్క కేను వివాహం చేసుకున్నాడు, వారిద్దరు మా ఇంటికి సమీపంలో ఉన్న ప్రాంతంలోనే పయినీరు సేవ చేశారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సెలవుల్లో వారితోపాటు క్షేత్రపరిచర్యకు రమ్మని వారు నన్ను ఆహ్వానించారు. అప్పుడే నేను పయినీరు సేవ అంటే ఎలా ఉంటుందో కొద్దిగా తెలుసుకోగలిగాను.
మరికొంత కాలానికి నేను, మా అన్న జాన్ మా పొలం వ్యవహారాలను కొద్దోగొప్పో చూసుకోగలిగే స్థాయికి చేరుకున్నాం. దాంతో మా అమ్మకు వేసవి నెలల్లో ఇప్పుడు సహాయ పయినీరు సేవ అని పిలువబడే సేవ చేసేందుకు అవకాశం లభించేది. ఒక ముసలి గుర్రం లాక్కెళ్ళే రెండు చక్రాల బండిని ఆమె ఉపయోగించేది. ఆ మొండి గుర్రానికి మా నాన్నగారు సౌలు అని పేరుపెట్టారు కానీ మా అమ్మ దగ్గర మాత్రం అది చాలా విధేయంగా ఉండేది. మా అన్న జాన్, నేను పొలం పనులు చేయడంలో చాలా ఆనందించేవాళ్లం కానీ మా అమ్మ క్షేత్రసేవ నుండి వచ్చిన తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పినప్పుడల్లా మా మనసు పొలంపైనుండి పయినీరు పరిచర్యవైపు మరింతగా మళ్లేది. నేను 1938లో క్షేత్రసేవా కార్యకలాపాల్లో మరింతగా పాల్గొనడం ప్రారంభించి, 1940, ఫిబ్రవరి 9న బాప్తిస్మం తీసుకున్నాను.
కొంతకాలానికి నేను సంఘంలో పరిచారకునిగా నియమించబడ్డాను. నేను సంఘ రికార్డులను చూసుకునేవాడిని, సంఘంలో అభివృద్ధి జరిగిన ప్రతీసారి నాకెంతో ఆనందం కలిగేది. మా ఇంటికి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో నాకు వ్యక్తిగత ప్రకటనా క్షేత్రం ఉండేది. చలికాలంలో నేను ప్రతీవారం అక్కడికి నడిచి వెళ్లి, బైబిలుపట్ల ఆసక్తి చూపించిన ఒక కుటుంబం నివసించే ఇంటిపైన చిన్నగదిలో రెండు మూడు రోజులు ఉండేవాడిని. ఒకసారి ఒక లూథరన్ ప్రచారకునితో జరిగిన చర్చలో నేను నేర్పుగా మాట్లాడనందువల్ల, తన మందను విడిచివెళ్లకపోతే పోలీసులను పిలుస్తానని బెదిరించాడు.
దాంతో ప్రకటనాపనిలో కొనసాగాలనే నా తీర్మానం మరింత బలపడింది.మా అక్క కే, ఆమె భర్త జాన్ 1942లో అమెరికాలోని ఓహాయోలో ఉన్న క్లీవ్‌లాండ్‌లో జరుగనున్న సమావేశానికి హాజరవ్వాలని పథకం వేసుకున్నారు. వారు నన్ను కూడా రమ్మని ఆహ్వానించినప్పుడు నేనెంతో సంతోషించాను. నా జీవితంలో జరిగిన అత్యంత మధురమైన సంఘటనల్లో ఆ సమావేశం ఒకటి. నా భవిష్యత్ ప్రణాళికలను అది మరింత బలపరిచింది. అప్పట్లో ప్రపంచవ్యాప్త పనికి సారథ్యం వహిస్తున్న సహోదరుడు నేథన్ నార్ 10,000 పయినీర్ల కోసం ప్రేరణాత్మకమైన పిలుపునిచ్చినప్పుడు నేను కూడా వారిలో ఒకరిగా ఉండాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాను!
హెన్రీ అనే ప్రయాణ పైవిచారణకర్త, 1943 జనవరిలో మా సంఘాన్ని సందర్శించాడు. ఆయన ఇచ్చిన ప్రేరణాత్మకమైన ప్రసంగం మమ్మల్ని ఉత్సాహంతో నింపింది. ఆయన ప్రసంగం ఇచ్చిన తర్వాతి రోజు వాతావరణం మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది, నైరుతి దిశగా రివ్వున వీచే గాలులు చలిని మరింతగా పెంచాయి. అలాంటి చల్లని గాలులు వీస్తున్నప్పుడు మేము సాధారణంగా ఇళ్లలోనే ఉండిపోయేవాళ్లం, అయితే హెన్రీ మాత్రం పరిచర్యకు వెళ్లాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన, మరికొంతమంది, మంచుపై ఉపయోగించే గుర్రపు బండిలో ఒక చెక్కపొయ్యి పెట్టుకుని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లారు. నేను ఒంటరిగానే ఐదుమంది పిల్లలున్న ఒక కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్లాను. నేను వారికి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించినప్పుడు వారు దానికి అంగీకరించి, కొంతకాలానికి సత్యాన్ని అంగీకరించారు.
నిషేధించబడిన సమయంలో ప్రకటించడం
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా కెనడాలో రాజ్యసేవకు సంబంధించిన పని నిషేధించబడింది. మేము మా బైబిలు సాహిత్యాలను దాచిపెట్టాల్సివచ్చేది, దానికి మా పొలంలో అనువైన స్థలాలు చాలా ఉండేవి. పోలీసులు వాటికోసం వెతకడానికి తరచూ వచ్చినా వారికి ఏమీ దొరికేది కాదు. ప్రకటిస్తున్నప్పుడు మేము కేవలం బైబిలునే ఉపయోగించేవాళ్లం. మేము చిన్న గుంపులుగా కలుసుకునేవాళ్లం. మా అన్న జాన్‌కు, నాకు రహస్యంగా సాహిత్యాలను చేరవేసే పని అప్పగించబడింది.
యుద్ధం జరుగుతున్న సమయంలో, దేశవ్యాప్తంగా నాజీపరిపాలన అంతం (ఆంగ్లం) అనే పుస్తకాన్ని పంచిపెట్టే కార్యక్రమంలో మా సంఘం భాగంవహించింది. అవి పంచడానికి మేము అర్థరాత్రి వెళ్లాం. మేము నిశ్శబ్దంగా ప్రతీ ఇంటికి వెళ్లి గడపదగ్గర ఒక్కొక్క పుస్తకాన్ని పెడుతున్నప్పుడు నాకు చాలా భయంవేసింది. అంతగా భయపెట్టే పనిని నేను చేయడం అదే మొదటిసారి. ఆఖరి పుస్తకాన్ని పెట్టిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నాం! వెంటనే మేము పార్కు చేయబడిన కారు దగ్గరికి వచ్చి, అందరూ వచ్చారో లేదో చూసుకుని, కారును చీకటిలోకి పోనిచ్చాం.
పయినీరు సేవ, జైలు, సమావేశాలు
1943 మే 1న మా అమ్మకు వీడ్కోలు చెప్పి, జేబులో 20 డాలర్లు, చిన్న పెట్టెతో నేను నా మొదటి పయినీరు నియామకానికి బయలుదేరాను. సస్కత్‌చెవాన్‌లోని క్విల్ లేక్ పట్టణంలో ఉంటున్న సహోదరుడు టామ్ ట్రూప్ ప్రేమపూర్వకమైన కుటుంబం నన్ను సాదరంగా ఆహ్వానించింది. ఆ తర్వాతి సంవత్సరం నేను సస్కత్‌చెవాన్‌లోని వేబర్న్‌లో ఉన్న మారుమూల క్షేత్రానికి వెళ్లాను. 1944లో డిసెంబరు 24న నేను వీధి సాక్ష్యమిస్తుండగా నన్ను అరెస్టు చేశారు. కొంతకాలం నన్ను స్థానిక జైల్లో ఉంచిన తర్వాత ఆల్బర్టాలోని జాస్పర్‌లో ఉన్న శిబిరానికి తరలించారు. అక్కడ నాతో మరికొందరు సాక్షులు కూడా ఉన్నారు, మా చుట్టూ యెహోవా దేవుని అద్భుత సృష్టికార్యాలైన కెనేడియన్ రాకీస్ పర్వతాలు కూడా విస్తరించి ఉన్నాయి. 1945 ప్రారంభంలో, శిబిర అధికారులు మమ్మల్ని ఆల్బర్టాలోని ఎడ్మంటన్‌లో ఒక కూటానికి హాజరవడానికి అనుమతించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పనికి సంబంధించిన అభివృద్ధి గురించి సహోదరుడు నార్ ఉత్తేజకరమైన నివేదికను అందించారు. మా ఖైదు పూర్తై మేము మళ్లీ పరిచర్యలో పూర్తిగా భాగం వహించే రోజు ఎప్పుడు వస్తుందా అని మేమంతా ఆత్రుతగా ఎదురుచూశాం.
నన్ను విడుదల చేసిన తర్వాత నేను మళ్లీ పయినీరు సేవను కొనసాగించాను. ఆ తర్వాత కొంతకాలానికి కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో “అన్ని జనాంగాల వ్యాప్తి” సమావేశం నిర్వహించబడుతుందని ప్రకటించబడింది. నేను పయినీరుగా కొత్తగా నియమించబడిన ప్రాంతంలోని ఒక సహోదరుడు తన ట్రక్కులో 20 మంది కూర్చునేవిధంగా బెంచీలు ఏర్పాటు చేశాడు. మేము 1947 ఆగస్టు 1న బయలుదేరి, 7,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాం, మార్గంలో పచ్చిక బయళ్లను, ఎడారులను, రమణీయ దృశ్యాలనేకాక ఎల్లోస్టోన్, యోసీమైట్ జాతీయ పార్కులను దాటుకుంటూ వెళ్లడంతో ఆ ప్రయాణం తీపి జ్ఞాపకంగా ఉండిపోయింది. 27 రోజులపాటు సాగిన ఆ ప్రయాణం మధురమైన అనుభవంగా ఉంది!
సమావేశం కూడా మరువలేని అద్భుతమైన అనుభవమే. యెషయా 6:8.
ఆ సమావేశ పనుల్లో పూర్తిగా పాలుపంచుకోవడానికి నేను ఉదయాల్లో అటెండెంటుగా పనిచేసి, రాత్రుల్లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడిని. మిషనరీ సేవపట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఏర్పాటుచేయబడిన కూటానికి హాజరైన తర్వాత నేను దరఖాస్తు నింపానుగానీ అక్కడికి వెళ్లడానికి అవకాశం లభిస్తుందనే ఆశ పెట్టుకోలేదు. అయితే, ఆ మధ్యకాలంలో అంటే 1948లో నేను కెనడాకు చెందిన క్విబెక్‌లో పయినీరుగా సేవచేయడానికి వెళ్లాను.—గిలియడ్, ఆ తర్వాతి జీవితం
నేను 1949లో వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 14వ తరగతికి ఆహ్వానించబడడంతో ఎంతో సంతోషించాను. ఆ శిక్షణ నా విశ్వాసాన్ని బలపర్చి నన్ను యెహోవాకు సన్నిహితం చేసింది. జాన్, కే అప్పటికే 11వ తరగతికి హాజరై ఉత్తర రోడీషియా (ప్రస్తుతం జాంబియా)లో మిషనరీలుగా సేవ చేస్తున్నారు. మా అన్న 1956లో గిలియడ్ పట్టభద్రుడయ్యాడు. ఆయన, ఆయన భార్య ఫ్రీడా బ్రెజిల్‌లో 32 సంవత్సరాలు సేవ చేశారు, ఆ తర్వాత ఆయన మరణించాడు.
1950 ఫిబ్రవరిలో నేను పట్టభద్రుణ్ణి అయ్యే రోజున నాకు రెండు ప్రోత్సాహకరమైన టెలిగ్రాములు అందాయి, ఒకటి మా అమ్మనుండి వచ్చింది, మరొకటి క్విల్ లేక్ నగరంలోని ట్రూప్ కుటుంబంనుండి వచ్చింది. ట్రూప్ కుటుంబం పంపించిన టెలిగ్రాములో, “పట్టభద్రునికి సలహా” అనే శీర్షిక క్రింద ఇలా ఉంది: “ఇది మీ జీవితంలో ప్రాముఖ్యమైన రోజు, మీరు జీవితాంతం గుర్తుంచుకునే రోజు; విజయం, సంతోషం మీకు ప్రాప్తించాలని మేము కోరుకుంటున్నాము.”
నేను క్విబెక్ నగరంలో సేవచేయడానికి నియమించబడ్డాను, అయితే గిలియడ్ ముగిసిన తర్వాత కొంతకాలంపాటు న్యూయార్క్‌లోని గిలియడ్ స్కూల్ ఉన్న కింగ్‌డమ్ ఫామ్‌లోనే ఉన్నాను. ఒకరోజు సహోదరుడు నార్ నేను బెల్జియంకు వెళ్లడానికి ఇష్టపడతానా అని అడిగారు. మళ్ళీ, రెండు రోజుల తర్వాత నేను నెదర్లాండ్స్‌కు వెళ్లడానికి అంగీకరిస్తానా అని అడిగారు. కానీ నాకు అందిన నియామక పత్రంలో నేను “బ్రాంచి కార్యాలయ సేవకునిగా నియమించబడ్డాను” అని వ్రాయబడివుంది. అది చూసినప్పుడు ఆనందంతో ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు.
1950 ఆగస్టు 24న నెదర్లాండ్స్ వెళ్లేందుకు ప్రయాణమయ్యాను, అక్కడికి చేరుకోవడానికి 11 రోజులు పడుతుంది, నేను ఆ సమయంలో అప్పుడే విడుదల చేయబడిన న్యూ వరల్డ్ ట్రాన్‌లేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ గ్రీక్ స్క్రిప్చర్స్‌ను చదవడం పూర్తిచేశాను. నేను 1950 సెప్టెంబరు 5న రాటర్‌డామ్ చేరుకున్నాను, అక్కడి బెతెల్ కుటుంబం నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధం బీభత్సం సృష్టించినా సహోదరులు క్రైస్తవ కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో మంచి కృషి చేశారు. తీవ్ర హింసల్లో వారు తమ యథార్థతను ఎలా కాపాడుకున్నారో చెబుతున్నప్పుడు, అది విని అనుభవం లేని నాలాంటి యౌవన బ్రాంచి సేవకుని నిర్దేశం క్రింద పనిచేయడం ఆ సహోదరులకు కష్టమౌతుందేమో అని నాకు అనిపించింది. కానీ, నేను ఊహించినదంతా తప్పని కొంతకాలానికే రుజువైంది.
కొన్ని విషయాలపట్ల నిజంగానే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. నేను ఒక సమావేశం జరిగే ముందు అక్కడికి వెళ్లాను, సమావేశ స్థలంలోనే వేలాదిమంది ప్రతినిధులకు వసతి ఏర్పాటు చేయబడడం చూసి నేను ముగ్ధుడినయ్యాను. అయితే, తర్వాతి సమావేశం కోసం వారికి ప్రజల ఇళ్లలోనే వసతి ఏర్పాటు చేద్దాం అని సలహా ఇచ్చాను. అది చాలా మంచి సలహా అని సహోదరులు ఒప్పుకున్నా, తమ దేశంలో అది సాధ్యంకాని పని అని వారన్నారు. మేమందరం ఆ విషయం గురించి తర్కవితర్కం చేసిన తర్వాత
రాజీకి వచ్చాం, సగంమంది ప్రతినిధులకు సమావేశ స్థలంలో, మిగతా సగంమందికి సమావేశ నగరంలోని సాక్షులుకాని ప్రజల ఇళ్లలో వసతి ఏర్పాట్లు చేయాలని మేము నిర్ణయించాం. సహోదరుడు నార్ సమావేశానికి హాజరైనప్పుడు ఎంతో ఆనందంగా దాని ఫలితాలను ఆయనకు చూపించాను. అయితే ఆ తర్వాత, సమావేశం గురించి కావలికోటలో వచ్చిన నివేదిక చదివినప్పుడు నా ఆనందం నీరుగారిపోయింది, అందులో ఇలా ఉంది: “తర్వాతి సంవత్సరం సహోదరులు పూర్తి విశ్వాసంతో, ప్రతినిధులు సాక్ష్యమిచ్చేందుకు వీలుగా అత్యంత సమర్థవంతమైన చోట అంటే ప్రజల ఇళ్లలోనే వసతి ఏర్పాటు చేయడానికే ముందుగా ప్రయత్నిస్తారని మేము నమ్ముతున్నాం.” “తర్వాతి సంవత్సరం” మేము అలాగే చేశాం!1961 జూలైలో మా బ్రాంచి కార్యాలయం నుండి ఇద్దరు ప్రతినిధులు లండన్‌లో ఇతర బ్రాంచి ప్రతినిధులను కలుసుకోవడానికి ఆహ్వానించబడ్డాము. పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము డచ్ భాషతోసహా మరిన్ని భాషల్లో లభ్యమౌతుందని సహోదరుడు నార్ ప్రకటించారు. ఆ వార్త మమ్మల్ని ఎంతగా ఉత్తేజపరచిందో! అదో బృహత్కార్యమని మేమప్పుడు గుర్తించలేదు. రెండు సంవత్సరాల తర్వాత అంటే 1963లో క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతనలోక అనువాదమును డచ్ భాషలో విడుదల చేయడానికి న్యూయార్క్‌లో ఏర్పాటు చేయబడిన ఒక సమావేశ కార్యక్రమంలో భాగం వహించడానికి నేనెంతో సంతోషించాను.
నిర్ణయాలు, కొత్త నియామకాలు
1961 ఆగస్టులో నేను లైడా వామలింక్‌ను వివాహం చేసుకున్నాను. ఆమె కుటుంబమంతా 1942లో నాజీ హింస ప్రబలంగా ఉన్న సమయంలో సత్యాన్ని స్వీకరించింది. లైడా 1950లో పయినీరు సేవ ప్రారంభించింది, 1953లో బెతెల్‌కు వచ్చింది. బెతెల్‌లో, సంఘంలో తను చేసే కృషినిబట్టి ఆమె నాకు పరిచర్యలో విశ్వసనీయ తోడుగా ఉంటుందనిపించింది.
మేము పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరానికి, అదనపు తర్ఫీదు కోసం పది నెలల కోర్సుకు హాజరవడానికి నేను బ్రూక్లిన్‌కు ఆహ్వానించబడ్డాను. అప్పట్లో భార్యలు భర్తలతోపాటు వెళ్లే ఏర్పాటు ఉండేది కాదు. లైడాకు ఆరోగ్యం సరిగా లేకపోయినా నేను ఆ ఆహ్వానానికి అంగీకరించేందుకు ప్రేమపూర్వకంగా ఒప్పుకుంది. ఆ తర్వాత లైడా ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. మేము ఎలాగైనా బెతెల్‌లో మా సేవను కొనసాగించాలని ప్రయత్నించాం కానీ బయట పూర్తికాల సేవ చేయడమే మంచిదని నిర్ణయించుకున్నాం. కాబట్టి మేము ప్రయాణ పరిచర్య సేవను మొదలుపెట్టాం. ఆ తర్వాత కొంతకాలానికి నా భార్య శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. స్నేహితుల ప్రేమపూర్వక సహకారంతో మేము దాన్ని ఎదుర్కొని, ఒక సంవత్సరం తర్వాత జిల్లాసేవా నియామకాన్ని కూడా అంగీకరించగలిగాం.
ప్రయాణ సేవలో మేము ఏడు సంవత్సరాలు ఉత్తేజకరంగా గడిపాం. ఆ తర్వాత నా జీవితంలో నేను మరోసారి ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది, ఈ సారి నేను రాజ్య పరిచర్య పాఠశాలలో ఉపదేశకునిగా బెతెల్‌కు ఆహ్వానించబడ్డాను. మాకు ప్రయాణ పరిచర్య అంటే ఎంతో మక్కువ ఏర్పడడంవల్ల అది కష్టమనిపించినా మేము దానికి ఒప్పుకున్నాం. రెండు వారాలపాటు సాగే ఆ పాఠశాలకు సంబంధించిన 47 తరగతులు, సంఘ పెద్దలతో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పంచుకోవడానికి సదవకాశాన్ని ఇచ్చాయి.
ఆ సమయంలో నేను మా అమ్మను కలుసుకోవడానికి 1978లో వెళ్ళాలని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇంతలో హఠాత్తుగా 1977 ఏప్రిల్ 29న, అమ్మ చనిపోయిందని మాకు టెలిగ్రాము అందింది. ఆప్యాయత నిండిన ఆమె స్వరాన్ని నేను ఇక ఎన్నటికీ వినలేనని, తను నా కోసం చేసినదానికి ఆమెకెంతో ఋణపడి ఉన్నానని చెప్పలేనని అర్థమవగానే నేను నిశ్చేష్ఠుడనైపోయాను.
రాజ్య పరిచర్య పాఠశాల కోర్సు ముగిసిన తర్వాత మమ్మల్ని బెతెల్ కుటుంబంలో సభ్యులుగా ఉండిపొమ్మని అడిగారు. ఆ తర్వాత గడిచిన సంవత్సరాల్లో నేను పదేళ్ళు బ్రాంచి కమిటీ కో-ఆర్డినేటర్‌గా సేవచేశాను. కొద్దికాలానికి పరిపాలక సభ, బాధ్యతను మరింత చక్కగా నిర్వర్తించగలిగే కొత్త కో-ఆర్డినేటర్‌ను నియమించింది. దానికి నేనెంతో కృతజ్ఞుడిని.
వయసు అనుమతించినమేరకు సేవించడం
లైడాకు, నాకు ఇప్పుడు 83 ఏళ్లు. నేను 60కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల సేవ చేయడంలో ఆనందించాను, వాటిలో 45 ఏళ్లు నాకు నమ్మకంగా చేయూతనిచ్చిన భార్యతో కలిసి సేవచేశాను. మా నియామకాలన్నింటిలో ఆమె నాకు అందించిన సహకారాన్ని తను యెహోవాకు చేసిన సమర్పిత సేవలో భాగంగా భావించింది. ప్రస్తుతం మేము బెతెల్‌లో, సంఘంలో చేయగలినంత చేస్తున్నాం.—యెషయా 46:4.
అప్పుడప్పుడు మేము మా జీవితంలోని మధురమైన సంఘటనలను గుర్తుచేసుకుంటాం. మేము యెహోవా సేవలో చేసినవాటి గురించి చింతించడం లేదు, మా జీవితంలోని తొలినాళ్లలో మేము చేసుకున్న ఎంపికలు శ్రేష్ఠమైనవనే నమ్ముతున్నాం. యెహోవాను మా పూర్తి శక్తితో సేవిస్తూ, ఆయనను ఘనపర్చాలనే తీర్మానంతో ఉన్నాం.
[13వ పేజీలోని చిత్రం]
మా అన్న బిల్, మా గుర్రం సౌలుతో నేను
[15వ పేజీలోని చిత్రం]
1961 ఆగస్టులో మా పెళ్లి రోజున
[15వ పేజీలోని చిత్రం]
లైడాతో నేడు