ఆఫ్రికా భాషా బైబిళ్ల ముద్రణలో మైలురాళ్లు
ఆఫ్రికా భాషా బైబిళ్ల ముద్రణలో మైలురాళ్లు
ఆఫ్రికన్లు తమ మాతృభాషల్లో దేవుని వాక్యాన్ని చదవాల్సిన అవసరముందని యూరప్‌కు, ఉత్తర అమెరికాకు చెందిన నిజాయితీగల బైబిలు పాఠకులు ఎంతోకాలం క్రితమే గుర్తించారు. ఆ ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా అనేకమంది ఆఫ్రికా భాషలను నేర్చుకొనేందుకు ఆఫ్రికాకు వెళ్లారు. కొంతమంది కొన్ని ఆఫ్రికా భాషలకు లిపిని సృష్టించి నిఘంటువులను తయారుచేశారు. ఆ తర్వాత బైబిలును అనేక ఆఫ్రికా భాషల్లోకి అనువదించే పనిని ప్రారంభించారు. అదంత సులభమైన పనేమీ కాదు. “అతి సాధారణమైన, అతి ప్రధానమైన క్రైస్తవ నమ్మకాలను అనువదించేందుకు సరైన పదాన్ని కనుగొనడానికి కూడా ఒక అనువాదకుడు ఎన్నో సంవత్సరాలు పరిశోధించాల్సి రావచ్చు” అని ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ వివరిస్తోంది.
గతంలో లిపి లేని ఒక ఆఫ్రికా భాషలో పూర్తి బైబిలు అనువాదం మొట్టమొదటిసారిగా 1857లో స్వానా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. * అది ఒక పుస్తకంగాకాక వివిధ విభాగాలుగా ముద్రించబడి బైండింగు చేయబడింది. కొంతకాలానికి బైబిలు అనువాదాలు ఇతర ఆఫ్రికా భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. అలా అందుబాటులోకి వచ్చిన అనేక తొలి ఆఫ్రికా బైబిలు అనువాదాల్లో, దేవుని పేరైన యెహోవా, అటు హీబ్రూ లేఖనాల్లో, లేక “పాత నిబంధన”లో, ఇటు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, లేక “క్రొత్త నిబంధనలో” ఉంది. అయితే, రివైజ్డ్ ఎడిషన్‌లను, నూతన అనువాదాలను బైబిలు గ్రంథకర్త అయిన యెహోవా పవిత్ర నామాన్ని గౌరవించని వ్యక్తులు ప్రచురించారు. వారు దేవుని నామాన్ని గౌరవించే బదులు, దైవిక నామం స్థానంలో దేవుడు లేక ప్రభువు అనే పదాలు ఉపయోగించే మూఢనమ్మకాలుగల యూదా సాంప్రదాయాన్ని అనుసరించారు. కాబట్టి, దేవుణ్ణి ప్రేమించే ఆఫ్రికావాసులకు, దైవిక నామాన్ని దాని స్థానంలో తిరిగి చేర్చే ఒక బైబిలు అనువాదం అవసరమైంది.
యెహోవాసాక్షుల పరిపాలక సభ 1980వ పడి మొదలుకొని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము అనేక ప్రధాన ఆఫ్రికా భాషల్లోకి అనువదించబడేందుకు తీవ్ర కృషి చేసింది. సులభంగా అర్థం చేసుకోగల ఈ బైబిలును పశ్చిమ, మధ్య, దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఇతర ప్రధాన భాషల్లోకి అనువదించే పని కొంతకాలానికి ప్రారంభమైంది. దానివల్ల, నేడు బైబిలును అమూల్యంగా ఎంచే ఆఫ్రికాలోని లక్షలాదిమంది తమ మాతృభాషలో నూతనలోక అనువాదమును చదవగలుగుతున్నారు. ఇప్పటివరకు నూతనలోక అనువాదము ఆఫ్రికా ఖండంలోని 17 స్వదేశీ భాషల్లో పూర్తిగా లేక పాక్షికంగా అందుబాటులో ఉంది.
యెషయా 61:1, 2) లూకా సువార్తలోవున్న యేసు చదివిన వాక్యం నూతనలోక అనువాదములో ఇలా అనువదించబడింది: ‘యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల గ్రుడ్డివారికి చూపు లభిస్తాయని ప్రకటించడానికి, నలిగినవారిని విడిపించడానికి, యెహోవా హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడు.’—లూకా 4:18, 19.
ఈ ఆఫ్రికా భాషా బైబిళ్ల పాఠకులు, దేవుని మహిమాన్విత నామమైన యెహోవాను ఉపయోగించే అనువాదం అందుబాటులో ఉన్నందుకు ఆనందిస్తున్నారు. ఉదాహరణకు, నజరేతులోని సమాజమందిరంలో యేసు చదవడానికి నిల్చున్నప్పుడు, యెషయా గ్రంథంలో తన తండ్రి పేరు కనిపించే భాగాన్ని చదవడం ద్వారా ఆయన తనకివ్వబడిన ఆజ్ఞ గురించి తెలియజేశాడు. (ఆఫ్రికా భాషా బైబిళ్ల ముద్రణ 2005 ఆగస్టులో మరో మైలురాయిని చేరుకుంది. అదే నెలలో, ఆఫ్రికాలోని వాడుకలో ఉన్న భాషల్లో, 76,000కన్నా ఎక్కువ నూతనలోక అనువాదము బైబిళ్లు యెహోవాసాక్షుల దక్షిణాఫ్రికా బ్రాంచిలో ముద్రించబడి, బైండింగు చేయబడ్డాయి. వాటిలో షోనా భాషలో ముద్రించబడిన 30,000 బైబిళ్లు కూడా ఉన్నాయి. ఆ బైబిలు ఎడిషన్, జింబాబ్వేలో జరిగిన యెహోవాసాక్షుల “దైవిక విధేయత” సమావేశాల్లో విడుదల చేయబడింది.
చిరస్మరణీయమైన ఆ నెలలో, దక్షిణాఫ్రికా బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించినవారు, ఆఫ్రికన్ భాషల్లో క్రొత్త బైబిలు ముద్రించబడడాన్ని చూసి ఎంతో ఆనందించారు. బైండరీ విభాగంలో పనిచేస్తున్న గ్లాన్‌గ్లా అనే బెతెల్ కుటుంబ సభ్యుడు ఇలా అన్నాడు: “షోనాతోపాటు మరితర ఆఫ్రికా భాషల్లో నూతనలోక అనువాదమును ముద్రించే పనిలో భాగం వహించే ఆధిక్యత లభించినందుకు నేనెంతో సంతోషించాను, ఎంతో ఉత్తేజితుడినయ్యాను.” నిజానికి, ఆయన దక్షిణాఫ్రికా బెతెల్ కుటుంబ సభ్యులందరి భావాలను వ్యక్తం చేశాడు.
విదేశాల్లో ముద్రించబడి అక్కడి నుండి దిగుమతి చేసుకోబడిన బైబిళ్లకన్నా క్రొత్త బైబిళ్లు ఆఫ్రికా ప్రజలకు మరింత త్వరగా, తక్కువ ధరలో లభిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, బైబిలు గొప్ప గ్రంథకర్త అయిన యెహోవా దేవుని పవిత్ర నామాన్ని ఉపయోగించే ఖచ్చితమైన అనువాదం ఆఫ్రికావాసులకు ఇప్పుడు సులభంగా అందుబాటులో ఉంది.
[అధస్సూచి]
^ పేరా 3 1835కల్లా మడగాస్కర్‌కు చెందిన మలగాసి భాషలోకి, 1840కల్లా ఇతియోపియాకు చెందిన అంహరిక్ భాషలోకి బైబిలు అనువదించబడింది. ఈ భాషల్లో, బైబిలు అనువదించబడడానికి ఎంతోకాలం ముందే వాటికి లిపి ఉంది.
[12వ పేజీలోని చిత్రం]
1840లో ప్రచురించబడిన స్వానా బైబిలులో దైవిక నామం
[చిత్రసౌజన్యం]
Harold Strange Library of African Studies
[13వ పేజీలోని చిత్రం]
దక్షిణాఫ్రికా బ్రాంచిలో ముద్రించబడుతున్న క్రొత్త బైబిళ్లను వీక్షిస్తున్న స్వాజీలాండ్ నుండి వచ్చిన సందర్శకులు