కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితంలో సంకల్పమున్న శతాధికురాలు

జీవితంలో సంకల్పమున్న శతాధికురాలు

జీవితంలో సంకల్పమున్న శతాధికురాలు

ఇటీవల స్వీడన్‌లో 105 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల వయసున్నవారిగా నమోదు చేయబడిన 60 మందిలో ఎలీన్‌ కూడా ఉంది. ఆమె వయసు 105 సంవత్సరాలు. ఆమె తానుంటున్న వృద్ధాశ్రమం నుండి బయటికి వెళ్లలేకపోయినా, తాను 60 సంవత్సరాల క్రితం ఎంపిక చేసుకున్న జీవన విధానంలో కొనసాగడానికి అంటే క్రియాశీల యెహోవాసాక్షిగా ఉండడానికి ఆమె ఆరోగ్యం సహకరిస్తోంది.

ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు, ఎలీన్‌ అపొస్తలుడైన పౌలు గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఉంచిన మాదిరినే అనుకరిస్తుంది. పౌలు తనను సందర్శించేవారందరికీ ప్రకటించాడు. (అపొస్తలుల కార్యములు 28:​16, 30, 31) అదే విధంగా, ఎలీన్‌ పారిశుద్ధ్య పనివారితో, దంతవైద్యులతో, వైద్యులతో, హెయిర్‌ డ్రెస్సర్లతో, నర్సులతో, వృద్ధాశ్రమానికి వచ్చే ఇతరులతో బైబిల్లోని సువార్తను పంచుకోవడానికి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఆమె జ్ఞానం, అనుభవం నుండి ప్రయోజనం పొందేలా కొన్నిసార్లు తోటి విశ్వాసులు తమ బైబిలు విద్యార్థులను ఆమె దగ్గరికి తీసుకెళ్తారు.

ఎలీన్‌ సహవసించే సంఘంలోని సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆమె స్వభావాన్నిబట్టి, ఆమె కుతూహలాన్నిబట్టి ఆమెనెంతో ఇష్టపడతారు. ఒక తోటి విశ్వాసి ఇలా చెబుతున్నాడు: “సంఘ కార్యకలాపాల గురించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో ఆమెకు అద్భుతమైన సామర్థ్యం ఉంది. సంఘంలోని పిల్లలందరి పేర్లను, కొత్తగా చేరినవారి పేర్లను ఆమె గుర్తుంచుకుంటుంది.” ఎలీన్‌ తన ఆతిథ్య స్వభావానికి, హాస్య చతురతకు, జీవితంపట్ల ఆశావహ దృక్పథానికి పేరుగాంచింది.

ఎలీన్‌ తన సంతోషాన్ని కాపాడుకునేందుకు, జీవితంలో తనకున్న సంకల్పంపై దృష్టి నిలిపేందుకు ఆమెకేది సహాయం చేసింది? యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం అనే పుస్తకంలో నుండి ప్రతీరోజు ఒక లేఖనాన్ని ఆమె చదువుతుంది. భూతద్దాన్ని ఉపయోగిస్తూ, ఆమె ప్రతీరోజు బైబిల్లోని కొంత భాగాన్ని కూడా చదువుతుంది. ఎలీన్‌ యెహోవాసాక్షుల వారపు కూటాలకు సిద్ధపడుతుంది, శారీరక పరిమితులవల్ల వాటికి హాజరవలేకపోయినా ఆమె వాటి రికార్డింగులను వింటుంది. ఏ వయసు వారికైనా, బైబిలును, బైబిలు ఆధారిత సాహిత్యాలను క్రమంగా చదవడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం సంతృప్తికరమైన, సంకల్పవంతమైన జీవితం గడపడానికి సహాయం చేస్తుంది.​—⁠కీర్తన 1:⁠2; హెబ్రీయులు 10:​24, 25.