పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ప్రసంగి తాను ‘వెయ్యిమంది పురుషుల్లో ఒకనిని’ మాత్రమే కనుగొని, “అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు” అని అన్నప్పుడు ఆయన ఏమి చెప్పాలనుకున్నాడు?—ప్రసంగి 7:28.
ఆ ప్రేరేపిత మాటల సరైన భావాన్ని గ్రహించే ముందు, దేవుడు స్త్రీలను ఎలా దృష్టిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. బైబిలు, నయోమి కోడలైన రూతును “యోగ్యురాలని” పిలుస్తోంది. (రూతు 3:11) సామెతలు 31:10 ప్రకారం మంచి భార్య “ముత్యముకంటె అమూల్యమైనది.” అలాంటప్పుడు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను, “వెయ్యిమంది పురుషుల్లో ఒకణ్ణయినా నిజాయితీపరుణ్ణి చూడగలిగానుగాని, అంతమంది స్త్రీలలో ఒకతెను కూడా చూడలేకపోయాను” అని అన్నప్పుడు ఆయన ఏమి చెప్పాలనుకున్నాడు?—పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
సొలొమోను కాలంలోని అనేకమంది స్త్రీలలో నైతిక విలువలు దిగజారిపోయాయని ఆ వచనంయొక్క సందర్భం చూపిస్తోంది. (ప్రసంగి 7:26) ఈ పరిస్థితికి కారణం బహుశా బయలు దేవుణ్ణి ఆరాధించే అన్య స్త్రీల ప్రభావమే ముఖ్య కారణమైవుండవచ్చు. సొలొమోను రాజు కూడా అన్య భార్యల ప్రభావానికి లొంగిపోయాడు. ‘అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలు మూడువందల మంది ఉపపత్నులు ఉండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి’ అని బైబిలు చెబుతోంది. (1 రాజులు 11:1-4) పురుషుల్లో సహితం నైతిక విలువలు ఎంతగా దిగజారిపోయాయంటే వెయ్యిమందిలో కనీసం ఒక్క నిజాయితీపరుడు లేని పరిస్థితి, అంటే అలాంటివారు దాదాపు లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే సొలొమోను, “ఇది యొకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు” అనే నిర్ధారణకు వచ్చాడు. (ప్రసంగి 7:29) ఆయన ఇక్కడ స్త్రీలతో, పురుషులను పోల్చడం ద్వారా కాదుగానీ మానవజాతి అంతటినీ పరిశీలించిన తర్వాతే ఆయన ఆ నిర్ధారణకు వచ్చాడు. కాబట్టి ప్రసంగి 7:28లో కనిపించే మాటలను, సొలొమోను కాలంలోని స్త్రీపురుషులందరి నైతిక పరిస్థితిని గురించిన వ్యాఖ్యానంగానే దృష్టించాలి.
అయితే, ఆ వచనానికి వేరే భావం కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని ప్రవచనార్థకంగా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఏ స్త్రీ కూడా యెహోవాకు సంపూర్ణ విధేయతను చూపించలేదు. కానీ అలా సంపూర్ణ విధేయత చూపించిన ఒక పురుషుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు.—రోమీయులు 5:15-17.
[31వ పేజీలోని చిత్రం]
‘వెయ్యిమంది పురుషులలో ఒకడు’