బైబిలు నిజంగా బోధిస్తున్నదే బోధించండి
బైబిలు నిజంగా బోధిస్తున్నదే బోధించండి
“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, . . . వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
యెహోవా వాక్యమైన పరిశుద్ధ బైబిలు, అత్యంత పురాతనమైనదేకాక, ప్రపంచంలోని పుస్తకాల్లోకెల్లా అత్యంత విరివిగా పంచిపెట్టబడిన పుస్తకం కూడా. దానిలో కొంతభాగమైనా 2,300కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. భూనివాసుల్లో 90కన్నా ఎక్కువశాతం మందికి అది వారి సొంతభాషలో లభ్యమౌతోంది.
2 లక్షలాదిమంది ప్రతీరోజు బైబిలులో కొంతభాగం చదువుతారు. కొందరు దాన్ని ఎన్నోసార్లు పూర్తిగా చదివేశారు. వేలాది మతశాఖలు తమ బోధలు బైబిలుపై ఆధారపడివున్నాయని చెప్పుకుంటాయి, కానీ అది బోధించేవాటితో మాత్రం ఏకీభవించవు. ఈ గలిబిలికి తోడు ఒకే మతంలోని సభ్యుల మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు ఉన్నాయి. కొందరికి బైబిలు, దాని మూలం, దాని విలువ గురించిన సందేహాలున్నాయి. చాలామంది దానిని ప్రమాణాలు చేయడానికి లేదా న్యాయస్థానంలో సత్యప్రమాణం చేయించడానికి ఆచారబద్ధంగా ఉపయోగించే పవిత్ర పుస్తకంగానే దృష్టిస్తారు.
3 నిజానికి బైబిల్లో మానవులకోసం దేవుని శక్తివంతమైన వాక్కు లేదా సందేశం ఉంది. (హెబ్రీయులు 4:12) కాబట్టి యెహోవాసాక్షులుగా మనం బైబిలు బోధిస్తున్నదేమిటో ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటాం. యేసుక్రీస్తు తన అనుచరులకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చేందుకు మనం సంతోషిస్తాం, ఆయన ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, . . . వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) మన బహిరంగ పరిచర్యలో మనం ప్రపంచంలో ప్రబలివున్న మత గందరగోళాన్నిబట్టి కలతచెందుతున్న యథార్థ హృదయులను కలుస్తుంటాం. వారు మన సృష్టికర్తను గురించిన సత్యాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతూ, జీవితార్థం గురించి బైబిలు చెబుతున్నదేమిటో తెలుసుకోవాలని కోరుకోవచ్చు. చాలామంది చింతిస్తున్న మూడు ప్రశ్నలను మనం పరిశీలిద్దాం. ప్రతీదాని విషయంలో మతనాయకులు తప్పుగా చెబుతున్నదేమిటో గమనించి, ఆ తర్వాత బైబిలు నిజంగా బోధిస్తున్నదేమిటో సమీక్షిద్దాం. ఆ ప్రశ్నలేమంటే: (1) దేవునికి మనపట్ల శ్రద్ధవుందా? (2) మనమిక్కడ ఎందుకున్నాం? (3) మనం చనిపోయినప్పుడు మనకేమి సంభవిస్తుంది?
దేవునికి శ్రద్ధవుందా?
4 దేవునికి మనపట్ల శ్రద్ధవుందా అనే ప్రశ్నతో మనం ఆరంభిద్దాం. విచారకరంగా చాలామంది శ్రద్ధలేదనే అనుకుంటారు. వారలా ఎందుకు భావిస్తారు? ఒక కారణమేమిటంటే, వారు ద్వేషం, యుద్ధం, బాధ నిండిన లోకంలో జీవిస్తున్నారు. ‘దేవునికి నిజంగా శ్రద్ధవుంటే ఆయన అలాంటి విషాదకర సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఆపుతాడని’ వారు తర్కిస్తారు.
5 దేవునికి మనపట్ల శ్రద్ధలేదని చాలామంది తలంచడానికి మరోకారణం, మతనాయకులు అలా తలంచేలా చేశారు. విషాద సంఘటన జరిగినప్పుడు మతనాయకులు తరచూ ఏమిచెబుతారు? ఒక వాహన ప్రమాదంలో తన చిన్నపిల్లలిద్దరినీ పోగొట్టుకున్న స్త్రీతో ఒక మతగురువు ఇలా అన్నాడు: “అది దేవుని చిత్తం, దేవునికి ఇంకా ఇద్దరు దూతలు అవసరమయ్యారు.” మతగురువులు అలా మాట్లాడితే, వారు జరుగుతున్న దుర్ఘటనలకు దేవుణ్ణి యాకోబు 1:13) యెహోవా దేవుడు ఎన్నడూ కీడు తలపెట్టడు. అవును, “సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.”—యోబు 34:10.
నిందిస్తున్నవారిగా ఉంటారు. అయితే శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (6 అలాంటప్పుడు, ఎందుకింత దుష్టత్వం, బాధలు ఉన్నాయి? ఒక కారణమేమిటంటే, మానవుల్లో చాలామంది దేవుణ్ణి పరిపాలకునిగా నిరాకరిస్తూ, ఆయన నీతియుక్త నియమాలకు, సూత్రాలకు లోబడడానికి ఇష్టపడడం లేదు. మానవులు తమకు తెలియకుండానే దేవుని శత్రువైన సాతానుకు లోబడ్డారు, ఎందుకంటే “లోకమంతయు దుష్టునియందున్నది.” (1 యోహాను 5:19) ఈ వాస్తవాన్ని గుర్తిస్తే, చెడు పరిస్థితులు ఎందుకున్నాయో అర్థం చేసుకోవడం సులభమవుతుంది. సాతాను దుష్టుడు, విద్వేషి, మోసకారి, క్రూరుడు. కాబట్టి లోకం దాని పరిపాలకుని వ్యక్తిత్వాన్నే ప్రతిబింబిస్తుందని మనం నమ్మవచ్చు. అందువల్ల దుష్టత్వం ఇంతెక్కువగా ఉండడంలో ఆశ్చర్యం లేదు!
7 మనమనుభవించే బాధలకు మరో కారణం మానవ అపరిపూర్ణత. పాపులైన మానవుల్లో ఆధిపత్యం కోసం పోరాడే స్వభావముంది, ఆ పోరాటం తరచూ యుద్ధాలకు, అణచివేతకు, బాధలకు దారితీస్తుంది. ప్రసంగి 8:9 సరిగానే ఇలా చెబుతోంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” బాధలకు మరో కారణం, ‘అనూహ్యంగానూ, కాలవశముచేతనూ’ జరిగే సంఘటనలు. (ప్రసంగి 9:11, NW) తరచూ, ప్రమాదం జరిగే సమయంలో ప్రజలు అనుకోకుండా అక్కడవుండడంవల్ల వారు విపత్తును ఎదుర్కొంటుంటారు.
8 ఈ బాధలు యెహోవావల్ల కలగడం లేదని తెలుసుకోవడం ఓదార్పుకరం. అయితే, మన జీవితంలో జరిగే వాటిపట్ల దేవునికి నిజంగా శ్రద్ధవుందా? ఉంది అనే జవాబు మనకు సంతోషాన్నిస్తుంది. మానవులు చెడు మార్గంలో వెళ్లేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడో ఆయన వాక్యం మనకు చెబుతున్న కారణాన్నిబట్టి యెహోవాకు శ్రద్ధవుందని మనకు తెలుసు. దేవునికున్న కారణాల్లో రెండు వివాదాంశాలు ఇమిడివున్నాయి: ఆయన సర్వాధిపత్యం, అలాగే మానవుల యథార్థత. యెహోవా సర్వశక్తిగల సృష్టికర్త కాబట్టి, తానెందుకు బాధలను అనుమతిస్తున్నాడో మనకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు లేదు. అయినప్పటికీ, ఆయనకు మనపట్ల శ్రద్ధవుంది కాబట్టే ఆయన మనకు వివరిస్తున్నాడు.
9 దేవునికి మనపట్ల శ్రద్ధవుందనేందుకు అదనపు రుజువును పరిశీలించండి. నోవహు కాలంలో భూమ్మీద చెడుతనం నిండినప్పుడు ఆయన “తన హృదయములో నొచ్చుకొనెను.” (ఆదికాండము 6:5, 6) నేడు దేవుడు దానికి భిన్నంగా భావిస్తున్నాడా? లేదు, ఎందుకంటే ఆయన మార్పులేని వాడు. (మలాకీ 3:6) ఆయన అన్యాయాన్ని ద్వేషించడమే కాక, ప్రజలు బాధపడడాన్ని చూడలేడు. మానవ పరిపాలనవల్ల, అపవాది ప్రభావంవల్ల కలిగిన హానినంతటినీ దేవుడు త్వరలోనే తొలగిస్తాడని బైబిలు బోధిస్తోంది. దేవునికి మనపట్ల శ్రద్ధవుందనడానికి ఇది నమ్మకమైన రుజువు కాదా?
10 మనం అనుభవించే విషాదకర సంఘటనలు దేవుని చిత్తమేనని చెప్పే మతనాయకులు ఆయనను తప్పుగా వర్ణిస్తున్నారు. దానికి భిన్నంగా, మానవుల బాధలను అంతం చేయాలని యెహోవా ఇష్టపడుతున్నాడు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అని 1 పేతురు 5:7 చెబుతోంది. బైబిలు నిజంగా అదే బోధిస్తోంది!
మనమిక్కడ ఎందుకున్నాం?
11 మనమిక్కడ ఎందుకున్నాం అని అనేకమంది ఆలోచించే రెండవ ప్రశ్నను మనమిప్పుడు పరిశీలిద్దాం. లోకంలోని మతాలు తరచూ ఆ ప్రశ్నకు మానవుడు ఈ భూమ్మీద కేవలం తాత్కాలికంగా ఉంటాడని జవాబిస్తాయి. మరెక్కడో జీవించడానికి వెళ్లే మార్గంలో మన భూమి ఒక మజిలీ లేదా ఒక మెట్టులాంటిది మాత్రమేనని వారు భావిస్తారు. దేవుడు ఏదోక రోజున ఈ గ్రహాన్ని నాశనం చేస్తాడని కొందరు మతనాయకులు తప్పుగా బోధిస్తారు. అలాంటి బోధల కారణంగా, చాలామంది మరణం ఎలాగూ తప్పదనే ఆలోచనతో జీవితాన్ని ఇష్టానుసారంగా అనుభవించడమే మంచిదనే నిర్ణయానికొచ్చారు. మనమిక్కడ ఎందుకున్నామనే విషయం గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
12 ఈ భూమిపట్ల, మానవాళిపట్ల దేవునికి అద్భుతమైన సంకల్పం ఉంది. “నిరాకారముగానుండునట్లు ఆయన దాని [భూమిని] సృజింపలేదు, నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (యెషయా 45:18) అంతేకాక, “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన [యెహోవా] దానిని పునాదులమీద స్థిరపరచెను.” (కీర్తన 104:5) భూమి, మానవాళి విషయంలో దేవుని సంకల్పాన్ని గురించిన ఈ విషయాలను తెలుసుకోవడం మనమిక్కడ ఎందుకున్నామో అర్థం చేసుకునేందుకు మనకు సహాయం చేయగలదు.
13 మానవ నివాసానికి అనువుగా భూమిని సిద్ధం చేయడంలో యెహోవా చాలా శ్రద్ధ తీసుకున్నాడని ఆదికాండము 1, 2 అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన గ్రహానికి సంబంధించిన వాటన్నింటినీ సృష్టించిన తర్వాత చివర్లో ప్రతీదీ “చాలామంచిదిగ” ఉంది. (ఆదికాండము 1:31) దేవుడు మొదటి స్త్రీపురుషులైన ఆదాముహవ్వలను అందమైన ఏదెను తోటలో ఉంచి, వారికి శ్రేష్ఠమైన ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు. ఆ మొదటి దంపతులకు ఇలా చెప్పబడింది: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” వారు పరిపూర్ణులైన పిల్లలను కని, తమ ఉద్యానవన గృహాన్ని భూదిగంతములకు విస్తరింపజేసి, జంతువులపట్ల ప్రేమతో వ్యవహరిస్తూ వాటిని లోబరచుకోవాలి.—ఆదికాండము 1:26-28.
14 భూమిపై పరిపూర్ణ మానవ కుటుంబం నిత్యం నివసించాలనేది యెహోవా సంకల్పం. దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) అవును, మానవులు పరదైసు భూమిపై నిత్యం జీవించాలి. అది దేవుని సంకల్పమేకాక, బైబిలు నిజంగా బోధిస్తోంది కూడా అదే!
మనం చనిపోయినప్పుడు మనకేమి సంభవిస్తుంది?
15 ఇప్పుడు మనం చాలామంది ఆలోచిస్తున్న మూడవ ప్రశ్నను చర్చిద్దాం: మనం చనిపోయినప్పుడు మనకేమి
సంభవిస్తుంది? మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలోనిదేదో ఇంకా సజీవంగానే ఉంటుందని లోకంలోని అధికశాతం మతాలు బోధిస్తున్నాయి. దేవుడు దుష్టులను శిక్షిస్తూ వారిని నరకాగ్నిలో నిత్యం బాధిస్తూ ఉంటాడనే ఆలోచనను కొన్ని మతశాఖలు ఇంకా అంటిపెట్టుకునే ఉన్నాయి. కానీ అది సత్యమేనా? మరణం గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?16 దేవుని వాక్యమిలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.” చనిపోయినవారు “ఏమియు ఎరుగరు” కాబట్టి, వారు వినలేరు, చూడలేరు, మాట్లాడలేరు, స్పర్శించలేరు లేదా తలంచలేరు. వారికిక ఏ లాభమూ కలుగదు. ఎలా కలుగుతుంది? వారెలాంటి పనీ చేయలేరు! అంతేకాక, “వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు,” ఎందుకంటే వారెలాంటి భావాలనూ వ్యక్తం చేయలేరు.—ప్రసంగి 9:5, 6, 10.
17 ఈ విషయం గురించి బైబిలు చెబుతున్నది చాలా సరళం, స్పష్టం—చనిపోయినవారు ఇంకెక్కడో సజీవంగా ఉండరు. పునర్జన్మను నమ్మేవారు చెప్పేవిధంగా, వేరే శరీరంతో తిరిగి జన్మించడానికి మరణ సమయంలో మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేదేదీ లేదు. మనమా విషయాన్ని ఇలా ఉదాహరించవచ్చు: మనం అనుభవించే జీవితం కొవ్వొత్తి మీది జ్వాలలాంటిది. ఆ జ్వాలను ఆర్పేసినప్పుడు, అదెక్కడికీ పోదు. అది ఆరిపోతుంది అంతే.
18 సరళంగావున్నా శక్తిమంతమైనదైన ఆ ఒక్క సత్యంలో దాగివున్న అంశాల గురించి ఆలోచించండి. చనిపోయినవారు ఏమియు ఎరుగరని బైబిలు విద్యార్థి తెలుసుకున్నప్పుడు, అతడు తన పూర్వీకులు బ్రతికివున్నప్పుడు ఎంత కోపిష్ఠులుగావున్నా, వారిప్పుడు తనను ఇబ్బందిపెట్టలేరని సులభంగా నిర్ధారించుకోగలగాలి. చనిపోయిన తన ప్రియమైనవారు వినలేరని, చూడలేరని, మాట్లాడలేరని, స్పర్శించలేరని లేదా తలంచలేరని కూడా అతను సత్వరమే గ్రహించాలి. కాబట్టి, చనిపోయినవారు పాపవిమోచన లోకంలో భరించలేని ఒంటరితనాన్నో లేక నరకయాతననో అనుభవించడంలేదు. అయితే, దేవుని జ్ఞాపకంలోవున్న మృతులు పునరుత్థానం చేయబడతారని బైబిలు బోధిస్తోంది. అదెంత అద్భుతమైన నిరీక్షణో కదా!—యోహాను 5:28, 29.
మనం ఉపయోగించడానికి ఒక క్రొత్త పుస్తకం
19 చాలామంది ఆలోచించే ప్రశ్నల్లో మనం మూడింటిని మాత్రమే పరిశీలించాం. ఈ మూడు అంశాల్లోనూ, బైబిలు బోధిస్తున్నది స్పష్టంగా, సూటిగావుంది. బైబిలు బోధిస్తున్నదేమిటో తెలుసుకోవాలని ఇష్టపడేవారితో అలాంటి సత్యాలను పంచుకోవడం ఎంత ఆనందదాయకమో కదా! అయితే యథార్థ హృదయులకు సంతృప్తికరమైన జవాబులు అవసరమయ్యే ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇంకా చాలావున్నాయి. అలాంటి ప్రశ్నలకు జవాబులు కనుగొనేలా వారికి సహాయం చేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనకుంది.
20 లేఖన సత్యాన్ని స్పష్టంగా, హృదయాలను ఆకట్టుకొనేలా బోధించడం ఒక సవాలే. ఆ సవాలును అధిగమించేలా మనకు సహాయం చేసేందుకు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” మనం క్రైస్తవ పరిచర్యలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా ఓ పుస్తకాన్ని సిద్ధం చేశాడు. (మత్తయి 24:45-47) ఈ 224 పేజీల పుస్తకం పేరు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
21 రెండువేల ఐదులో జరిగిన యెహోవాసాక్షుల “దైవిక విధేయత” జిల్లా సమావేశంలో విడుదల చేయబడిన ఈ క్రొత్త పుస్తకంలో గమనార్హమైన వివిధ అంశాలున్నాయి. ఉదాహరణకు, దీనిలో గృహ అధ్యయనాలు ఆరంభించేందుకు చాలా సహాయకరంగా ఉన్నట్లు రుజువౌవుతున్న ఐదు పేజీల ముందుమాట ఉంది. ఆ ముందు మాటలోవున్న చిత్రాలను, లేఖనాలను చర్చించడం చాలా సులభంగా ఉన్నట్లు మీరు కనుగొంటారు. బైబిల్లో అధ్యాయాలను, వచనాలను ఎలా చూడవచ్చో విద్యార్థులకు వివరించేందుకు కూడా మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
22 ఈ పుస్తకంలోని రచనా విధానం సరళంగా, స్పష్టంగా ఉంది. సాధ్యమైనప్పుడెల్లా విద్యార్థిని కూడా చర్చలో పాల్గొనేలా చేస్తూ అతని హృదయాన్ని చేరుకొనే ప్రయత్నం చేయబడింది. ప్రతీ అధ్యాయం ఆరంభంలో, అనేక ఉపోద్ఘాత ప్రశ్నలు, చివర్లో “బైబిలు ఈ విషయాలను బోధిస్తోంది” అనే బాక్సు ఉన్నాయి. ఆ బాక్సులో ఉపోద్ఘాత ప్రశ్నలకు లేఖనాధారిత జవాబులున్నాయి. ఈ క్రొత్త పుస్తకంలోని చక్కని చిత్రాలు, చిత్రవ్యాఖ్యానాలు, ఉపమానాలు విద్యార్థి క్రొత్త అంశాలను గ్రహించేందుకు సహాయం చేస్తాయి. పుస్తకంలోని ముఖ్యభాగం సరళభాషలో కూర్చబడినా, విద్యార్థికి అదనపు సమాచారం అవసరమైతే, పరిశీలించడానికి అనువుగా అనుబంధంలో లోతైన వివరాలతో 14 ప్రాముఖ్యమైన అంశాలున్నాయి.
23బైబిలు బోధిస్తోంది పుస్తకం వివిధ విద్యాస్థాయిల, వివిధ మత నేపథ్యాల ప్రజలకు బోధించేలా మనకు సహాయం చేసేందుకు రూపొందించబడింది. విద్యార్థికి బైబిలు గురించి ఏ మాత్రం తెలిసివుండకపోతే, ఒక అధ్యాయాన్ని ఒకే దఫాలో పూర్తిచేయడం కుదరకపోవచ్చు. సమాచారాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కాదుగానీ విద్యార్థి హృదయాన్ని చేరేందుకు కృషిచేయండి. పుస్తకంలో ఇవ్వబడిన ఉపమానాల్లో ఏవైనా విద్యార్థికి అర్థంకాకపోతే, దానిని వివరించండి లేదా ప్రత్యామ్నాయంగా మరో ఉపమానం ఉపయోగించండి. బాగా సిద్ధపడండి, ఆ పుస్తకాన్ని సమర్థవంతంగా ఉపయోగించేందుకు శాయశక్తులా ప్రయత్నించండి, ‘సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించగలిగేలా’ దేవుని సహాయం కోసం ప్రార్థించండి.—2 తిమోతి 2:15.
మీ అమూల్య ఆధిక్యతలపట్ల కృతజ్ఞతతో ఉండండి
24 యెహోవా తన ప్రజలకు అమూల్యమైన ఆధిక్యతలు అనుగ్రహించాడు. ఆయన తన గురించిన సత్యం మనం తెలుసుకోగలిగేలా చేశాడు. ఆ ఆధిక్యతను మనమెన్నటికీ తేలికగా తీసుకోకూడదు. వాస్తవానికి, యెహోవా తన సంకల్పాలను అహంకారులకు మరుగుచేసి వినయస్థులకు వెల్లడిచేశాడు. ఈ విషయం గురించి యేసు ఇలా చెప్పాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (మత్తయి 11:25) విశ్వ సర్వాధిపతియైన యెహోవాను సేవించే వినయస్థులతోపాటు లెక్కించబడడం అరుదుగా లభించే సన్మానం.
25 దేవుడు తన గురించి ఇతరులకు బోధించే ఆధిక్యతను కూడా మనకనుగ్రహించాడు. ఆయన గురించి అబద్ధాలు బోధించేవారు ఆయనను తప్పుగా చిత్రీకరించారని గుర్తుంచుకోండి. అందువల్ల, చాలామంది యెహోవాకు మనమీద శ్రద్ధ లేదనీ, ఆయన నిర్దయుడనీ భావిస్తూ, ఆయన విషయంలో పూర్తిగా తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. ఆ దురభిప్రాయాన్ని తొలగించేందుకు మీరు ఇష్టపడుతున్నారా, ఆసక్తిగా ఉన్నారా? ప్రతీ ప్రాంతంలోని యథార్థ హృదయులు దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? అలాగైతే, ప్రాముఖ్యమైన విషయాల గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో ఇతరులకు ప్రకటించడంలో, బోధించడంలో ఉత్సాహంగా భాగంవహిస్తూ మీ దైవిక విధేయతను ప్రదర్శించండి. బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో సత్యాన్వేషకులు తెలుసుకోవాలి.
మీ జవాబులు ఏమిటి?
• మనపట్ల దేవునికి శ్రద్ధవుందని మనకెలా తెలుసు?
• మనం ఈ భూమ్మీద ఎందుకున్నాం?
• మనం చనిపోయినప్పుడు మనకేమి సంభవిస్తుంది?
• బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని ఏ అంశాలను మీరు ప్రత్యేకంగా విలువైనవిగా పరిగణిస్తారు?
[అధ్యయన ప్రశ్నలు]
1. బైబిలు ఎంత విస్తృతంగా అందుబాటులో ఉందని చెప్పవచ్చు?
2, 3. (ఎ) బైబిలు బోధల విషయంలో గందరగోళం ఎందుకుంది? (బి) మనమే ప్రశ్నలు పరిశీలిస్తాం?
4, 5. దేవునికి మనపట్ల శ్రద్ధలేదని ప్రజలెందుకు అనుకుంటారు?
6. ఈ లోకంలోని దుష్టత్వానికి, బాధకు మూలకారణమెవరు?
7. మనమనుభవించే బాధలకు కొన్ని కారణాలేమిటి?
8, 9. యెహోవాకు మనపట్ల నిజంగా శ్రద్ధవుందని మనకెలా తెలుసు?
10. మానవ బాధల విషయంలో యెహోవా ఎలా భావిస్తున్నాడు?
11. భూమ్మీది మానవ జీవితం గురించి లోకంలోని మతాలు తరచూ ఏమి చెబుతాయి?
12-14. భూమిపట్ల, మానవులపట్ల దేవుని సంకల్పం గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?
15. మనం చనిపోయినప్పుడు మనకేమి జరుగుతుందని లోకంలోని అధికశాతం మతాలు బోధిస్తున్నాయి?
16, 17. బైబిలు ప్రకారం చనిపోయినవారి స్థితి ఎలా ఉంటుంది?
18. చనిపోయినవారు ఏమియు ఎరుగరని ఒక బైబిలు విద్యార్థి తెలుసుకున్నప్పుడు, ఆయన ఎలాంటి నిర్ధారణకు రాగల్గుతాడు?
19, 20. క్రైస్తవులముగా మనకు ఏ బాధ్యతవుంది, మన పరిచర్యలో ఉపయోగించేలా ఏ బైబిలు అధ్యయన ఉపకరణం ప్రత్యేకంగా రూపొందించబడింది?
21, 22. బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది పుస్తకంలోని కొన్ని గమనార్హమైన అంశాలేమిటి?
23. బైబిలు అధ్యయనాలకు బైబిలు బోధిస్తోంది పుస్తకం ఉపయోగించడం గురించి ఏ సలహాలు ఇవ్వబడ్డాయి?
24, 25. యెహోవా తన ప్రజలకు ఎలాంటి అమూల్యమైన ఆధిక్యతలు అనుగ్రహించాడు?
[22వ పేజీలోని చిత్రాలు]
బాధలు అంతమౌతాయని బైబిలు బోధిస్తోంది
[చిత్రసౌజన్యం]
పైన కుడివైపు, అమ్మాయి: © Bruno Morandi/age fotostock; ఎడమవైపు, స్త్రీ: AP Photo/Gemunu Amarasinghe; క్రింద కుడివైపు, శరణార్థులు: © Sven Torfinn/Panos Pictures
[23వ పేజీలోని చిత్రం]
నీతిమంతులు పరదైసులో నిత్యం జీవిస్తారు