బైబిలు బోధిస్తున్నదానికి లోబడేలా ఇతరులకు సహాయం చేయండి
బైబిలు బోధిస్తున్నదానికి లోబడేలా ఇతరులకు సహాయం చేయండి
“మంచి నేలనుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.”—లూకా 8:15.
“అది అద్భుతమైన పుస్తకం. అది నాకు, నా విద్యార్థులకు ప్రియమైన పుస్తకం. ఆ పుస్తకం ఉపయోగిస్తూ ఇంటి గుమ్మం దగ్గరే ప్రజలతో బైబిలు అధ్యయనాలు ఆరంభించవచ్చు.” బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * అనే పుస్తకం గురించి యెహోవాసాక్షుల పూర్తికాల సేవకురాలు అలా వ్యాఖ్యానించింది. ఆ ప్రచురణనే పేర్కొంటూ ఓ వృద్ధ రాజ్య ప్రచారకుడు ఇలా అన్నాడు: “నేను ఆసక్తిగా పరిచర్యలో పాల్గొన్న 50 ఏళ్లలో చాలామంది యెహోవాను తెలుసుకునేలా సహాయంచేసే ఆధిక్యత నాకు లభించింది. కానీ ఈ అధ్యయన సాహిత్యం అసాధారణమైనదనే నేను చెప్పాలి. ఉత్తేజకరమైన ఉపమానాలు, బొమ్మలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.” బైబిలు బోధిస్తోంది పుస్తకంపట్ల మీ మనోభావం కూడా అలాగే ఉందా? ఈ బైబిలు అధ్యయన ఉపకరణం యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి మీకు సహాయం చేసేందుకు రూపొందించబడింది. ఆయనిలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
2 శిష్యులను చేయమని యేసు ఇచ్చిన నిర్దేశానికి ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తున్న తన 66 లక్షలమంది సాక్షులను చూసినప్పుడు యెహోవా హృదయం నిస్సందేహంగా సంతోషిస్తుంది. (సామెతలు 27:11) యెహోవా వారి ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడనేది స్పష్టం. ఉదాహరణకు, 2005వ సంవత్సరంలో సువార్త 235 దేశాల్లో ప్రకటించబడగా సగటున 60,61,500 బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఫలితంగా అనేకులు ‘దేవునిగూర్చిన వర్తమాన వాక్యమును, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు.’ (1 థెస్సలొనీకయులు 2:13) గత రెండు సంవత్సరాల్లో దాదాపు 5 లక్షలకన్నా ఎక్కువమంది క్రొత్త శిష్యులు యెహోవా ప్రమాణాలకు తగ్గట్టుగా తమ జీవితాల్ని మలచుకొని దేవుని సమర్పిత సేవకులయ్యారు.
3 మీరు ఇటీవల ఎవరితోనైనా బైబిలు అధ్యయనం నిర్వహించడంలోని ఆనందాన్ని అనుభవించారా? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ‘యోగ్యమైన మంచి మనస్సుతో దానిని అవలంబించి ఓపికతో ఫలించు’ వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. (లూకా 8:11-15) శిష్యులను చేసే పనిలో బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మీరెలా ఉపయోగించవచ్చో మనం పరిశీలిద్దాం. మన చర్చ మూడు ప్రశ్నలను పరిశీలిస్తుంది: (1) మీరెలా బైబిలు అధ్యయనం ఆరంభించవచ్చు? (2) ఎలాంటి బోధనా పద్ధతులు సమర్థవంతంగా ఉంటాయి? (3) ఒక వ్యక్తి విద్యార్థిగా మాత్రమేకాక, దేవుని లిఖిత వాక్యమైన బైబిలు బోధకుడయ్యేందుకు మీరెలా ఆయనకు సహాయం చేయవచ్చు?
మీరెలా బైబిలు అధ్యయనం ఆరంభించవచ్చు?
4 వెడల్పుగావున్న కాలువ మీదనుండి ఒక్క ఉదుటున దాటమని మిమ్మల్ని అడిగితే మీరు దానికి అంగీకరించకపోవచ్చు. కానీ ఒక్కొక్క అడుగువేస్తూ వెళ్లేందుకు మధ్యమధ్యలో రాళ్లుపెడితే దానిని దాటేందుకు మీరు మొగ్గు చూపవచ్చు. అదే విధంగా, తీరిక దొరకని వ్యక్తి బైబిలు అధ్యయనం చేసేందుకు వెనుదీయవచ్చు. అధ్యయనానికి ఎక్కువ సమయం, ప్రయత్నం అవసరమని గృహస్థుడు అనుకోవచ్చు. ఆయన తన అయిష్టతను అధిగమించడానికి మీరెలా సహాయం చేయవచ్చు? క్లుప్తమైన, ఉపయుక్తమైన చర్చలను ఎక్కువసార్లు నిర్వహించడం ద్వారా దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేసేలా ఒక వ్యక్తిని నడిపించేందుకు మీరు బైబిలు బోధిస్తుంది పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మీరు బాగా సిద్ధపడితే, ఆ వ్యక్తిని మీరు పునర్దర్శించే ప్రతీ సందర్భం ఆయన యెహోవాకు స్నేహితుడయ్యే దిశగా ఒక్కొక్క మెట్టుగా పనిచేస్తాయి.
5 కానీ బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండి ప్రయోజనం పొందేలా ఎవరికైనా సహాయంచేసే ముందు, మీకు ఆ పుస్తకంలోని విషయాలు క్షుణ్ణంగా తెలిసుండాలి. మీరు ఆ పుస్తకాన్ని ఆసాంతం చదివారా? ఓ జంట సెలవుపై వెళ్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని తమతోపాటు తీసుకెళ్లి సముద్ర తీరంలో విశ్రమిస్తూ దానిని చదవడం ఆరంభించారు. సందర్శకులకు వస్తువులు అమ్మే స్థానికురాలు వారి దగ్గరకొచ్చినప్పుడు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పేరును ఆమె గమనించింది. కొద్ది గంటలముందే తాను దేవుణ్ణి జవాబు అడుగుతూ ఆ ప్రశ్న గురించే ప్రార్థించానని ఆ దంపతులకు చెప్పింది. ఆ దంపతులు సంతోషంగా ఆమెకు ఆ పుస్తక ప్రతిని ఇచ్చారు. మీరు దేనికోసమైనా వేచివున్నప్పుడు గానీ లేదా ఉద్యోగ స్థలంలో గానీ, పాఠశాలలో గానీ సమయం తీసుకొని ఈ పుస్తకాన్ని బహుశా రెండవసారి చదివేందుకు ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకున్నారా? (ఎఫెసీయులు 5:15, 16) మీరలా చేస్తే, ఈ బైబిలు అధ్యయన ఉపకరణంతో మీకు బాగా పరిచయమేర్పడడమేకాక, దానిలోని విషయాల గురించి ఇతరులతో మాట్లాడే అవకాశాలను కూడా సృష్టించవచ్చు.
6 బహిరంగ పరిచర్యలో ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, దానిలోని ఉపమానాల్ని, లేఖనాలను, 4, 5, 6 పేజీల్లోని ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించండి. ఉదాహరణకు, ‘నేడు మానవాళి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది కాబట్టి, ఏది నమ్మకమైన నిర్దేశమిచ్చే మూలమని మీరు భావిస్తున్నారు’ అని అడుగుతూ మీరు సంభాషణను ఆరంభించవచ్చు. ఆ వ్యక్తి ప్రత్యుత్తరాన్ని జాగ్రత్తగా విన్న తర్వాత, 2 తిమోతి 3:16, 17 చదివి, మానవాళి సమస్యలకు బైబిలు సరైన పరిష్కారాన్ని అందిస్తోందని వివరించండి. ఆ పిమ్మట, గృహస్థుని అవధానాన్ని 4, 5 పేజీలకు మళ్లించి ఇలా అడగండి: “ఈ పేజీల్లో చూపించబడిన పరిస్థితుల్లో మిమ్మల్ని ఏది ఎక్కువగా బాధపెడుతోంది?” గృహస్థుడు దేనినైనా చూపించినప్పుడు, పుస్తకాన్ని ఆయన చేతికిచ్చి మీ బైబిలు నుండి సంబంధిత లేఖనాన్ని చదవండి. ఆ తర్వాత 6వ పేజీ చూపించి గృహస్థుణ్ణి ఇలా అడగండి: “ఈ పేజీ చివర్లో ప్రస్తావించబడిన ఆరు ప్రశ్నల్లో, మీరు దేనికి జవాబు తెలుసుకోవాలనుకుంటున్నారు?” ఆ వ్యక్తి ఒక ప్రశ్నను ఎంచుకున్నప్పుడు, ఆ ప్రశ్నకు జవాబిచ్చే అధ్యాయాన్ని చూపిస్తూ పుస్తకాన్ని ఆయనకిచ్చి, పునర్దర్శించినప్పుడు ఆ ప్రశ్నను చర్చించేందుకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోండి.
7 ఈ ప్రతిపాదిత చర్చను పూర్తిచేసేందుకు బహుశా ఐదు నిమిషాలు పట్టవచ్చు. అయితే ఆ కొద్ది నిమిషాల్లో ఆ గృహస్థునికి దేనిపై శ్రద్ధవుందో మీరు తెలుసుకుని, రెండు లేఖనాలు చదివి వాటిని అన్వయించడమేకాక, పునర్దర్శనానికి పునాది కూడా వేసుకున్నారు. గృహస్థునితో మీరు క్లుప్తంగా చేసిన ఆ సంభాషణ, ఆయనకు చాలాకాలం తర్వాత కలిగిన అత్యంత ప్రోత్సాహకరమైన, ఓదార్పుకరమైన అనుభవంగా ఉండవచ్చు. ఫలితంగా, తీరిక దొరకని వ్యక్తి సహితం “జీవమునకు పోవు ద్వారము[న]” ప్రవేశించే తదుపరి చర్య తీసుకునేలా మీరు సహాయం చేస్తుండగా, ఆయన మీతో మరింత సమయం గడిపేందుకు ఎదురుచూడవచ్చు. (మత్తయి 7:13) అనతికాలంలోనే ఆ గృహస్థుని ఆసక్తి వృద్ధిచెందుతుండగా అధ్యయన సమయాన్ని ఎక్కువ చేయవచ్చు. కూర్చొని కాస్త ఎక్కువ సమయం అధ్యయనం చేయవచ్చని ప్రతిపాదించడం ద్వారా అలా చేయవచ్చు.
సమర్థవంతమైన బోధనా పద్ధతులు
8 బైబిలు బోధలకు ఒక వ్యక్తి లోబడడం ఆరంభించినప్పుడు, తన అభివృద్ధిని అడ్డుకునే ఆటంకాలను బహుశా ఆయన ఎదుర్కోవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:12) పౌలు ఈ పరీక్షలను, నాసిరకపు నిర్మాణ వస్తువులను నాశనంచేసి బంగారం, వెండి, వెలగల రాళ్లకు హానిచేయని అగ్నితో పోల్చాడు. (1 కొరింథీయులు 3:10-13; 1 పేతురు 1:6, 7) మీ బైబిలు విద్యార్థి తనకు ఎదురయ్యే పరీక్షలను తట్టుకుని నిలబడేందుకు అవసరమైన లక్షణాలను వృద్ధిచేసుకోవడంలో తోడ్పడడానికి, అగ్నినిరోధక వస్తువులతో కట్టడంద్వారా మీరాయనకు సహాయం చేయాలి.
9 కీర్తనకర్త “యెహోవా మాటల[ను]” “మట్టిమూసలో ఏడుమారులు కరగి ఊదిన వెండి[కి]” పోలుస్తున్నాడు. (కీర్తన 12:6) అవును, బలమైన విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగించుకోగల విలువైన విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. (కీర్తన 19:7-11; సామెతలు 2:1-6) లేఖనాలను సమర్థవంతంగా మీరెలా ఉపయోగించవచ్చో బైబిలు బోధిస్తోంది పుస్తకం చూపిస్తుంది.
10 అధ్యయన సమయంలో, చర్చించబడుతున్న ప్రతీ అధ్యాయంలో ఇవ్వబడిన లేఖనాలవైపు విద్యార్థి అవధానాన్ని మళ్లించండి. కీలకమైన బైబిలు వచనాల్ని విద్యార్థి అర్థం చేసుకొని వాటిని వ్యక్తిగతంగా అన్వయించుకునేందుకు తోడ్పడడానికి ప్రశ్నలు అడగండి. ఏమి చేయాలో ఆయనకు చెప్పకుండా జాగ్రత్తపడండి. బదులుగా, యేసు మాదిరిని అనుకరించండి. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను ప్రశ్నించినప్పుడు, యేసు ఇలా జవాబిచ్చాడు: “ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావు?” ఆ వ్యక్తి లేఖనాలనుండి జవాబిచ్చినప్పుడు, దానిలోని సూత్రాన్ని తనకెలా అన్వయించుకోవాలో గ్రహించేందుకు యేసు ఆయనకు సహాయం చేశాడు. ఒక ఉపమానం చెబుతూ ఆ బోధ ఆ వ్యక్తిపై ఎలా ప్రభావం చూపించాలో గ్రహించేందుకు కూడా యేసు ఆయనకు సహాయం చేశాడు. (లూకా 10:25-37) విద్యార్థి లేఖన సూత్రాలను తనకు అన్వయించుకునేందుకు తోడ్పడగల సులభమైన ఉపమానాలెన్నో బైబిలు బోధిస్తోంది పుస్తకంలో ఉన్నాయి.
11 గ్రహించడానికి కష్టంగావున్న అంశాలను యేసు సులభమైన పదాలతో వివరించినట్లే, దేవుని వాక్యాన్ని వివరించేందుకు బైబిలు బోధిస్తోంది పుస్తకం సులభమైన, సూటియైన భాషను ఉపయోగిస్తోంది. (మత్తయి 7:28, 29) ఆయన మాదిరిని అనుకరించండి. సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా, ప్రామాణికంగా అందజేయండి. విషయాలను గబగబా పూర్తిచేయకండి. బదులుగా, విద్యార్థి పరిస్థితులనుబట్టి, సామర్థ్యాన్నిబట్టి ప్రతీ అధ్యయన సమయంలో చర్చించవలసిన పేరాల సంఖ్యను నిర్ణయించుకోండి. యేసుకు తన శిష్యుల పరిమితులు తెలుసు, అందుకే ఆయన ఆ సమయానికి అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచార భారాన్ని వారిపై మోపలేదు.—యోహాను 16:12.
12బైబిలు బోధిస్తోంది పుస్తకంలో 14 అంశాలను వివరించే అనుబంధం ఉంది. విద్యార్థి అవసరాలనుబట్టి ఉపదేశకునిగా మీరు దీనిలోని సమాచారాన్ని ఎలా ప్రయోజనాత్మకంగా ఉపయోగించవచ్చో తీర్మానించుకోగల్గాలి. ఉదాహరణకు, విద్యార్థికి ఫలానా అంశం గ్రహించడానికి కష్టంగావుంటే లేదా గత నమ్మకాలనుబట్టి ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటే, అనుబంధంలో సంబంధిత భాగంవైపు అవధానం మళ్లించి ఆ అంశాన్ని స్వయంగా పరిశీలించమని చెప్పడం సరిపోవచ్చు. అలాకాకుండా విద్యార్థి అవసరతలు ఆ సమాచారాన్ని మీరే చర్చించడం తగినదని సూచించవచ్చు. ఆ అనుబంధంలో, “మానవుల్లో అదృశ్యమైన, అమర్త్యమైన భాగం ఏదైనా నిజంగా ఉందా?” “‘మహాబబులోనును’ గుర్తించడం” వంటి ప్రాముఖ్యమైన లేఖన అంశాలున్నాయి. మీ విద్యార్థితో మీరు ఈ అంశాలను చర్చించేందుకు ఇష్టపడవచ్చు. అనుబంధంలో చర్చించబడిన అంశాలకు ప్రశ్నలు ఇవ్వబడలేదు కాబట్టి, అర్థవంతమైన ప్రశ్నలు వేసేందుకు మీరు ఆ సమాచారంతో సుపరిచితులై ఉండాలి.
13 “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే” అని కీర్తన 127:1 చెబుతోంది. అందువల్ల, బైబిలు అధ్యయనం నిర్వహించేందుకు మీరు సిద్ధపడుతున్నప్పుడు యెహోవా సహాయం కోసం ప్రార్థించండి. ప్రతీ అధ్యయన ఆరంభంలో, ముగింపులో మీరుచేసే ప్రార్థనలు యెహోవాతో మీకున్న ఆప్యాయతా సంబంధాన్ని ప్రతిబింబించాలి. యెహోవా వాక్యాన్ని అర్థంచేసుకునే జ్ఞానం కోసం, అందులోని ఉపదేశాన్ని అన్వయించుకునే బలం కోసం ఆయనకు ప్రార్థించమని విద్యార్థిని ప్రోత్సహించండి. (యాకోబు 1:5) విద్యార్థి అలా చేసినప్పుడు, ఆయన పరీక్షలను తట్టుకునేందుకు బలపడి, అంతకంతకూ విశ్వాసంలో మరింత బలపడతాడు.
బైబిలు విద్యార్థులు బోధకులయ్యేందుకు సహాయం చేయండి
14 మన బైబిలు విద్యార్థులు యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించిన ‘వాటన్నింటికి’ లోబడాలంటే, వారు దేవుని వాక్య విద్యార్థి స్థాయినుండి దానిని బోధించే స్థాయికి ఎదగాలి. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:6-8) విద్యార్థి అలాంటి ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా సహాయపడేందుకు మీరేమి చేయవచ్చు?
15 అధ్యయన ఆరంభం నుండే మీతోపాటు సంఘ కూటాలకు హాజరవమని విద్యార్థిని ఆహ్వానించండి. దేవుని వాక్య బోధకులుగా మీరు ఆ కూటాల్లోనే శిక్షణ పొందుతున్నారని ఆయనకు వివరించండి. అనేక వారాలపాటు ప్రతీ అధ్యయనం తర్వాత, వివిధ కూటాల్లో, సమావేశాల్లో మీరుపొందే ఆధ్యాత్మిక ఉపదేశ కార్యక్రమం గురించి వివరించేందుకు కొంత సమయం తీసుకోండి. ఈ సందర్భాల్లో మీరు పొందే ప్రయోజనాల గురించి ఉత్సాహంగా మాట్లాడండి. (హెబ్రీయులు 10:24, 25) విద్యార్థి క్రమంగా కూటాలకు హాజరవడం మొదలుపెట్టినప్పుడు ఆయన దేవుని వాక్య బోధకుడయ్యే అవకాశముంది.
16 తాను చేరుకోగల లక్ష్యాలు పెట్టుకునేలా బైబిలు విద్యార్థికి సహాయం చేయండి. ఉదాహరణకు, తాను తెలుసుకుంటున్న విషయాలను స్నేహితునితో లేదా బంధువుతో పంచుకొమ్మని ఆయనను ప్రోత్సహించండి. అంతేకాక, బైబిలును పూర్తిగా చదివే లక్ష్యం పెట్టుకొమ్మని సూచించండి. క్రమంగా బైబిలు చదివే అలవాటును వృద్ధిచేసుకొని, దానిలో కొనసాగేలా ఆయనకు మీరు సహాయం చేసినప్పుడు, ఆ అలవాటు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దీర్ఘకాలంపాటు ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని ప్రతీ అధ్యాయానికి సంబంధించిన 2 తిమోతి 2:15.
ముఖ్యమైన ప్రశ్నకు జవాబిచ్చే కనీసం ఒక బైబిలు వచనాన్ని గుర్తుపెట్టుకునే లక్ష్యాన్ని పెట్టుకొమ్మని విద్యార్థికి ఎందుకు సూచించకూడదు? అలా చేయడం ద్వారా ఆయన ‘సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా’ తయారౌతాడు.—17 లేఖనాలను కంఠస్థం చేయడమో లేక అవి చెప్పే అంశాన్ని క్లుప్తంగా చెప్పడమో చేసే బదులు, తన విశ్వాసం గురించి హేతువు అడిగేవారికి జవాబిస్తున్నప్పుడు సంబంధిత బైబిలు వచనాలను వివరించమని ఆయనను ప్రోత్సహించండి. మీరు తన నమ్మకాలను వివరించమని అడిగే బంధువుగా లేదా తోటి ఉద్యోగిగా నటించే చిన్నచిన్న అభ్యాస కార్యక్రమాలు ఆయనకు సహాయం చేయవచ్చు. విద్యార్థి ప్రతిస్పందిస్తుండగా, ‘సాత్వికముతో భయముతో’ లేదా ప్రగాఢ గౌరవంతో ఎలా జవాబివ్వాలో చూపించండి.—1 పేతురు 3:15.
18 అనతికాలంలోనే ఆ విద్యార్థి క్షేత్ర పరిచర్యలో పాల్గొనేందుకు అర్హుడు కావచ్చు. ఈ పనిలో భాగం వహించేందుకు అనుమతించబడడం ఒక ఆధిక్యత అని నొక్కిచెప్పండి. (2 కొరింథీయులు 4:1, 7) ఆ విద్యార్థి బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగా అర్హుడయ్యాడని పెద్దలు నిర్ణయించినప్పుడు, సులభమైన సంభాషణలకు సిద్ధపడేందుకు ఆయనకు సహాయంచేస్తూ ఆయనతోపాటు క్షేత్రసేవకు వెళ్లండి. బహిరంగ పరిచర్యకు సంబంధించిన వివిధ రంగాల్లో క్రమంగా ఆయనతోపాటు పనిచేస్తూ, ఫలవంతమైన పునర్దర్శనాలు చేయడానికి ఎలా సిద్ధపడాలో బోధించండి. మీ మంచి మాదిరి ప్రోత్సాహకరమైన రీతిలో ప్రభావం చూపిస్తుంది.—లూకా 6:40.
‘నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొనుము’
19 ఒక వ్యక్తి “సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము” పొందేందుకు సహాయం చేయడానికి నిస్సందేహంగా చాలా కష్టపడాలి. (1 తిమోతి 2:4) అయితే, బైబిలు బోధకు లోబడేలా ఒకరికి సహాయం చేయడంలో లభించే సంతోషానికి జీవితంలోని ఏ ఆనందాలూ సాటిరావు. (1 థెస్సలొనీకయులు 2:19, 20) అవును, ఈ ప్రపంచవ్యాప్త బోధనా పనిలో “దేవుని జతపనివారమై” ఉండడం ఎంతటి ఆధిక్యతో కదా!—1 కొరింథీయులు 3:9.
20 యేసుక్రీస్తును, బలవంతులైన దేవదూతలను ఉపయోగిస్తూ యెహోవా త్వరలోనే “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని” కఠినమైన తీర్పు తీరుస్తాడు. (2 థెస్సలొనీకయులు 1:6-8) ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది పుస్తకం నుండి కనీసం ఒక్క బైబిలు అధ్యయనం నిర్వహించే లక్ష్యాన్ని మీరు పెట్టుకోగలరా? ఈ పనిలో మీరు భాగం వహిస్తుండగా ‘మిమ్మల్ని, మీ బోధ వినువారిని రక్షించుకునే’ అవకాశం మీకుంటుంది. (1 తిమోతి 4:16) బైబిలు బోధకు లోబడేలా ఇతరులకు సహాయం చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు అత్యవసరం.
[అధస్సూచి]
^ పేరా 3 యెహోవాసాక్షులు ప్రచురించినది.
మీరేమి నేర్చుకున్నారు?
• బైబిలు బోధిస్తోంది పుస్తకం ఏ ఉద్దేశంతో రూపించబడింది?
• బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించి మీరెలా బైబిలు అధ్యయనాలు ఆరంభించవచ్చు?
• ఎలాంటి బోధనా పద్ధతులు సమర్థవంతంగా ఉంటాయి?
• విద్యార్థి దేవుని వాక్య బోధకుడయ్యేలా మీరెలా సహాయం చేయవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది అనే పుస్తకం ఏ ఉద్దేశంతో రూపొందించబడింది? (బి) ఇటీవలి సంవత్సరాల్లో, శిష్యులను చేసేందుకు తన ప్రజలు చేసిన ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడు?
3. బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించడానికి సంబంధించిన ఏ ప్రశ్నలు ఈ ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి?
4. కొందరెందుకు బైబిలు అధ్యయనానికి వెనుదీస్తారు, వారి అయిష్టతను అధిగమించేలా వారికి మీరెలా సహాయం చేయవచ్చు?
5. బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మీరెందుకు చదవాలి?
6, 7. బైబిలు అధ్యయనాలు ఆరంభించేందుకు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మీరు ఎలా ఉపయోగించవచ్చు?
8, 9. (ఎ) మీ బైబిలు విద్యార్థికి ఎదురయ్యే అడ్డంకులను, పరీక్షలను తట్టుకుని నిలబడేందుకు మీరాయనను ఎలా సిద్ధం చేయవచ్చు? (బి) బలమైన విశ్వాసాన్ని పెంపొందించే అగ్నినిరోధక విషయాలను ఎక్కడ కనుగొనవచ్చు?
10. విద్యార్థి అవధానాన్ని బైబిలువైపుకు మీరెలా మళ్లించవచ్చు?
11. ప్రతీ అధ్యయన సమయంలో మీరెంత సమాచారాన్ని చర్చించాలి?
12. అనుబంధాన్ని ఎలా ఉపయోగించాలి?
13. విశ్వాసాన్ని బలపర్చడంలో ప్రార్థన ఏ పాత్ర పోషిస్తుంది?
14. బైబిలు విద్యార్థులు ఎలాంటి ప్రగతి సాధించాలి?
15. క్రైస్తవ కూటాలకు హాజరవమని మీ బైబిలు విద్యార్థిని ఎందుకు ప్రోత్సహించాలి?
16, 17. బైబిలు విద్యార్థి ఏర్పరచుకోగల, సాధించగల కొన్ని లక్ష్యాలేమిటి?
18. బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడయ్యేందుకు అర్హుడైనప్పుడు, మీరాయనకు అదనంగా ఎలాంటి సహాయం అందించవచ్చు?
19, 20. మనమే లక్ష్యం కలిగివుండాలి, ఎందుకు?
[26వ పేజీలోని చిత్రం]
ఈ పుస్తకాన్ని మీరు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారా?
[27వ పేజీలోని చిత్రం]
బైబిలు జ్ఞానంపట్ల ఒక వ్యక్తి ఆసక్తిని క్లుప్త చర్చ పురికొల్పగలదు
[29వ పేజీలోని చిత్రం]
విద్యార్థి అవధానాన్ని బైబిలువైపుకు మళ్లించేందుకు మీరేమి చేయవచ్చు?
[30వ పేజీలోని చిత్రం]
బైబిలు విద్యార్థి ప్రగతి సాధించేందుకు సహాయం చేయండి