కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెషయా గ్రంథములోని ముఖ్యాంశాలు—II

యెషయా గ్రంథములోని ముఖ్యాంశాలు—II

యెహోవా వాక్యము సజీవమైనది

యెషయా గ్రంథములోని ముఖ్యాంశాలు​—⁠II

యెషయా ప్రవక్తగా తన నియామకాన్ని నమ్మకంగా నెరవేరుస్తున్నాడు. ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనలు అప్పటికే నెరవేరాయి. ఇప్పుడు ఆయన యెరూషలేము భవిష్యత్తు గురించి మరింతగా చెప్పబోతున్నాడు.

యెరూషలేము నగరం నాశనం చేయబడుతుంది, దాని నివాసులు బంధీలుగా తీసుకువెళ్ళబడతారు. అయితే ఆ నాశనం శాశ్వతమైనది కాదు. కొంతకాలం తర్వాత సత్యారాధన పునఃస్థాపించబడుతుంది. యెషయా 36:1-66:⁠24 వచనాల్లోని ప్రాథమిక సందేశం ఇదే. * ఈ అధ్యాయాల్లో చెప్పబడినదాన్ని పరిశీలించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు ఎందుకంటే, ఈ భాగంలోని అనేక ప్రవచనాలు ప్రధానంగా మన కాలంలో నెరవేరుతున్నాయి, లేదా సమీప భవిష్యత్తులో నెరవేరతాయి. యెషయా గ్రంథములోని ఈ భాగంలో మెస్సీయను గురించిన ఉత్తేజకరమైన ప్రవచనాలు కూడా ఉన్నాయి.

“రాబోవు దినములలో”

(యెషయా 36:1-39:⁠8)

రాజైన హిజ్కియా పరిపాలనలోని 14వ సంవత్సరంలో (సా.శ.పూ. 732) అష్షూరీయులు యూదాపై దాడిచేస్తారు. యెహోవా యెరూషలేమును కాపాడతానని వాగ్దానం చేస్తాడు. యెహోవా దూత ఒంటరిగా 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపడంతో దురాక్రమణ ముప్పు తొలగిపోతుంది.

హిజ్కియా వ్యాధిగ్రస్థుడవుతాడు. యెహోవా ఆయన ప్రార్థన విని ఆయనను స్వస్థపరిచి ఆయన జీవితకాలాన్ని 15 సంవత్సరాలు పొడిగిస్తాడు. బబులోను రాజు హిజ్కియాను అభినందించడానికి ప్రతినిధులను పంపించినప్పుడు, ఆయన మూర్ఖంగా వారికి తన సంపదలన్నీ చూపిస్తాడు. యెషయా ఇలా చెబుతూ హిజ్కియాకు యెహోవా సందేశాన్ని తెలియజేస్తాడు: “రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురు.” (యెషయా 39:​5, 6) వందకన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆ ప్రవచనం నెరవేరుతుంది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

38:8​—⁠నీడ ఎక్కేలా చేయబడిన “మెట్లు” ఏమిటి? సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దం నాటికి ఐగుప్తులో, బబులోనులో సన్‌డయల్స్‌ (నీడనుబట్టి సమయాన్ని కొలిచే పరికరాలు) ఉపయోగంలో ఉన్నాయి కాబట్టి, ఈ మెట్లు హిజ్కియా తండ్రియైన ఆహాజు సంపాదించిన సన్‌డయల్‌ దశలను సూచిస్తుండవచ్చు. లేక రాజభవనం లోపల మెట్లు ఉండివుండవచ్చు. మెట్ల ప్రక్కనున్న ఒక స్తంభంవల్ల బహుశా మెట్ల మీద క్రమంగా నీడపడుతూ ఉండవచ్చు, అదే వారికి సమయం లెక్కించుకోవడానికి ఉపకరించి ఉంటుంది.

మనకు పాఠాలు:

36:​2, 3, 22. షెబ్నా గృహనిర్వాహకునిగా తొలగించబడినా, ఆయన స్థానంలో నియమించబడిన వ్యక్తి దగ్గర సహాయకునిగా రాజు సేవలో కొనసాగడానికి అనుమతించబడ్డాడు. (యెషయా 22:​15, 19) మనం ఏదైనా కారణాన్నిబట్టి యెహోవా సంస్థలో బాధ్యతాయుతమైన స్థానం నుండి తొలగించబడితే, దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉండడానికి అనుమతిస్తే ఆ స్థానంలోనే ఆయనకు సేవ చేయడంలో కొనసాగవద్దా?

37:​1, 14, 15; 38:​1, 2. కష్టకాలాల్లో మనం యెహోవాకు ప్రార్థన చేస్తూ ఆయనపై పూర్తి నమ్మకం ఉంచడం జ్ఞానయుక్తం.

37:​15-20; 38:​2, 3. యెరూషలేము అష్షూరీయుల దాడికి గురయ్యే ప్రమాదం ఉన్నప్పుడు, అది పడద్రోయబడడం యెహోవా నామానికి అపకీర్తి తెస్తుందేమోనని హిజ్కియా ఎక్కువగా చింతించాడు. ఆయన తన అనారోగ్యం తనకు ప్రాణాంతకంగా మారుతుందని తెలుసుకున్నప్పుడు ఆయన తన కోసం అంతగా బాధపడలేదు. కానీ తాను నిస్సంతుగా మరణించడం దావీదు రాజవంశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే ఎక్కువగా వ్యాకులపడ్డాడు. అష్షూరీయులతో యుద్ధం చేయడంలో ఎవరు నాయకత్వం వహిస్తారని కూడా ఆయన చింతించాడు. హిజ్కియాలాగే మనం మన స్వంత రక్షణకంటే యెహోవా నామము పరిశుద్ధపరచబడడం, ఆయన సంకల్ప నెరవేర్పు ప్రాముఖ్యమైనవని పరిగణిస్తాము.

38:​9-20. హిజ్కియా రచించిన ఈ గీతం, యెహోవాను స్తుతించడం కంటే జీవితంలో మరింకేదీ ప్రాముఖ్యం కాదని మనకు బోధిస్తుంది.

“నీవు కట్టబడుదువు”

(యెషయా 40:1-59:​21)

యెరూషలేము నాశనం, తత్ఫలితంగా వచ్చే బబులోను చెర గురించి ప్రవచించిన వెంటనే యెషయా పునఃస్థాపన గురించి ప్రవచిస్తున్నాడు. (యెషయా 40:​1, 2) “నీవు [యెరూషలేము] కట్టబడుదువు” అని యెషయా 44:⁠28 చెబుతోంది. బబులోను దేవుళ్ళ విగ్రహాలు “బరువుల”వలే మోసుకువెళ్ళబడతాయి. (యెషయా 46:​1-2) బబులోను నాశనం చేయబడుతుంది. ఇదంతా రెండు శతాబ్దాల తర్వాత నెరవేరుతుంది.

యెహోవా తన సేవకుణ్ణి “అన్యజనులకు వెలుగుగా” ఇస్తాడు. (యెషయా 49:⁠6) బబులోను “ఆకాశము” లేక పాలక వర్గం, “పొగవలె అంతర్ధానమగును,” దాని ప్రజలు “అటువలె చనిపోవుదురు,” కానీ ‘చెరపట్టబడిన సీయోను కుమారి తన మెడకట్లు విప్పివేసుకొనును.’ (యెషయా 51:⁠6; 52:⁠2) యెహోవా దగ్గరికి వచ్చి ఆయన చెప్పేది వినేవారికి ఆయనిలా చెబుతున్నాడు: “నేను మీతో నిత్యనిబంధన చేసెదను, దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.” (యెషయా 55:⁠3) దేవుని నీతియుక్త ప్రమాణాల ప్రకారం జీవించడం ‘యెహోవాయందు ఆనందించుటకు’ కారణమవుతుంది. (యెషయా 58:​14) మరోవైపున, ప్రజల దోషములు ‘వారికి, వారి దేవునికి మధ్య అడ్డముగా ఉంటాయి.’​—⁠యెషయా 59:⁠1.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

40:​27, 28​—⁠“నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు” అని ఇశ్రాయేలు ఎందుకు అన్నది? తాము అనుభవిస్తున్న అన్యాయాలు యెహోవాకు కనిపించడం లేదని ఆయన చూడడం లేదని బబులోనులోవున్న కొంతమంది యూదులు భావించారు. భూమిని సృష్టించిన, అలుపెరగని, సొమ్మసిల్లని సృష్టికర్తకు బబులోను అందనంత దూరంలో లేదని వారికి గుర్తు చేయబడింది.

43:​18-21​—⁠తిరిగివస్తున్న పరవాసులకు “మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి” అని ఎందుకు చెప్పబడింది? అంటే యెహోవా గతంలో చేసిన విడుదల కార్యాలను వారు మరచిపోవాలనే భావంలో కాదు. కానీ, వారు తాము మరింత సూటిగావున్న ఎడారి మార్గంగుండా యెరూషలేముకు సురక్షితంగా తిరిగి రావడం వంటి, వారు అనుభవించబోయే ఒక “నూతనక్రియ” కారణంగా తనను స్తుతించాలని యెహోవా కోరుకున్నాడు. “మహాశ్రమ” నుండి తప్పించుకుని వచ్చే “గొప్పసమూహము”కు కూడా యెహోవాను స్తుతించడానికి క్రొత్త, వ్యక్తిగత కారణాలు ఉంటాయి.​—⁠ప్రకటన 7:​9, 14.

49:6​—⁠మెస్సీయ భూపరిచర్య ఇశ్రాయేలు కుమారులకే పరిమితమైనా, ఆయన ఏ విధంగా “అన్యజనులకు వెలుగై” యున్నాడు? యేసు మరణం తర్వాత సంభవించిన దాని కారణంగా ఆయనలా ఉన్నాడు. యెషయా 49:6ను బైబిలు ఆయన శిష్యులకు అన్వయింపజేస్తుంది. (అపొస్తలుల కార్యములు 13:​46, 47) నేడు, ఆరాధకుల గొప్పసమూహం యొక్క సహాయాన్ని అందుకుంటున్న అభిషిక్త క్రైస్తవులు, “భూదిగంతములవరకు” ఉన్న ప్రజలకు జ్ఞానోదయం కలిగిస్తూ ‘అన్యజనులకు వెలుగుగా’ సేవచేస్తున్నారు.​—⁠మత్తయి 24:​14; 28:​19, 20.

53:​10​—⁠యెహోవాకు తన కుమారుణ్ణి నలుగగొట్టడం, ఏ భావంలో ఇష్టమయ్యింది? కనికరము, సహానుభూతిగల దేవుడైన యెహోవాకు తన ప్రియకుమారుడు బాధపడడాన్ని చూడడం ఎంతో వేదన కలిగించివుండవచ్చు. అయినప్పటికీ, యేసు ఇష్టపూర్వక విధేయత, ఆయన అనుభవించే బాధ మరియు ఆయన పొందే మరణం సాధించగలిగినవన్నీ ఆయనకు ఇష్టమయ్యాయి.​—⁠సామెతలు 27:​11; యెషయా 63:⁠9.

53:11​—⁠మెస్సీయ ఏ జ్ఞానము ద్వారా, “అనేకులను నిర్దోషులుగా” చేస్తాడు? ఇది, యేసు భూమిపైకి రావడం ద్వారా, మానవునిగా మారడం ద్వారా, మరణం పొందేంతగా అన్యాయంగా బాధ అనుభవించడం ద్వారా సంపాదించుకున్న జ్ఞానము. (హెబ్రీయులు 4:​15) అందుకే ఆయన, అభిషిక్త క్రైస్తవులు, గొప్పసమూహము దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేసేందుకు అవసరమైన విమోచన క్రయధన బలిని అనుగ్రహించాడు.​—⁠రోమీయులు 5:​19; యాకోబు 2:​23, 25.

56:6​—⁠“అన్యులు” ఎవరు, వారు ఏయే విధాలుగా ‘యెహోవా నిబంధనను ఆధారము చేసుకొంటున్నారు’? “అన్యులు” యేసుయొక్క “వేరే గొఱ్ఱెలు.” (యోహాను 10:​16) వారు క్రొత్త నిబంధనను ఆధారము చేసుకుంటారంటే దాని భావం వారు ఆ నిబంధనకు సంబంధించిన కట్టడలకు విధేయులవుతారు, దాని ద్వారా చేయబడిన ఏర్పాట్లన్నిటితో పూర్తిగా సహకరిస్తారు, అభిషిక్త క్రైస్తవులు తీసుకునే ఆధ్యాత్మిక ఆహారాన్నే తీసుకుంటారు, రాజ్యప్రకటనా పనిలో శిష్యులను చేసేపనిలో వారికి మద్దతునిస్తారు.

మనకు పాఠాలు:

40:​10-14, 26, 28. యెహోవా బలమైనవాడు, సున్నితమైనవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, మనం అర్థం చేసుకోగల దానికంటే ఎంతో ఎక్కువ వివేచనగలవాడు.

40:​17, 23; 41:​29; 44:⁠9; 59:⁠4. రాజకీయ పొత్తులు, విగ్రహాలు “శూన్యములు.” వాటిని నమ్ముకోవడం నిష్ప్రయోజనం.

42:​18, 19; 43:⁠8. దేవుని లిఖిత వాక్యాన్ని అలక్ష్యం చేయడమంటే, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా ఆయనిచ్చే ఉపదేశాన్ని వినడానికి నిరాకరించడమంటే ఆధ్యాత్మికంగా అంధులుగా, బధిరులుగా మారడమని అర్థం.​—⁠మత్తయి 24:​45.

43:​25. యెహోవా తన చిత్తానుసారంగా అతిక్రమములను తుడిచేస్తాడు. మనం పాపమరణాల బానిసత్వం నుండి విడిపించబడి జీవాన్ని పొందడం కన్నా యెహోవా నామము పరిశుద్ధపరచబడడమే ఎంతో ప్రాముఖ్యమైనది.

44:⁠8. ఆశ్రయదుర్గమంత సుస్థిరమైన, దృఢమైన యెహోవా మద్దతు మనకుంది. ఆయన దైవత్వం గురించి సాక్ష్యమిచ్చేందుకు మనం ఎన్నడూ భయపడకూడదు!​—⁠2 సమూయేలు 22:​31, 32.

44:​18-20. విగ్రహారాధన హృదయ భ్రష్టత్వానికి సూచన. మన హృదయంలో యెహోవాకున్న స్థానాన్ని మరేదీ ఆక్రమించకూడదు.

46:​10, 11. ‘తన ఆలోచన నిలిచేలా’ చేసుకునేందుకు అంటే, తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు యెహోవాకున్న సామర్థ్యం, ఆయన దేవత్వానికి తిరుగులేని నిదర్శనం.

48:⁠17, 18; 57:​19-21. మనం రక్షణ కోసం యెహోవా వైపు చూస్తే, ఆయనకు సన్నిహితమైతే, ఆయన ఆజ్ఞలను ఆలకిస్తే, మన సమాధానం ప్రవహిస్తున్న నదిలోని నీరంత సమృద్ధిగా ఉంటుంది, మన నీతికార్యాలు సముద్రపు అలలంత విరివిగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని విననివారు “కదలుచున్న సముద్రము”వలే ఉన్నారు. వారికి నెమ్మదిలేదు.

52:​5, 6. సత్యదేవుడు బలహీనమైనవాడని బబులోనీయులు తప్పుగా అనుకున్నారు. ఇశ్రాయేలీయులు బానిసలుగా వెళ్ళడానికి కారణం యెహోవాకు వారిపట్ల కలిగిన అయిష్టత అని వారు గుర్తించలేదు. ఇతరులకు కష్టాలు వచ్చినప్పుడు, దానికి కారణం ఏమిటనే విషయంలో మనం తొందరపడి ఒక నిర్ణయానికి రాకపోవడం జ్ఞానయుక్తం.

52:​7-9; 55:​12, 13. రాజ్యప్రకటన, శిష్యులను చేసే పనిలో ఆనందంగా పాల్గొనడానికి మనకు కనీసం మూడు కారణాలున్నాయి. ఆధ్యాత్మికంగా ఆకలిగొన్న దీనులకు మన పాదములు సుందరముగా ఉంటాయి. మనం యెహోవాను ‘కన్నులార చూస్తాము’ లేక ఆయనతో సన్నిహిత సంబంధం కలిగివుంటాము. మనం ఆధ్యాత్మిక సమృద్ధిని కూడా ఆనందిస్తాము.

52:​11, 12. “యెహోవా సేవోపకరణములను” మోయడానికి, అంటే పరిశుద్ధ సేవ కోసం ఆయన చేసిన ఏర్పాట్లను నిర్వర్తించడానికి మనం అర్హులం కావాలంటే మనం ఆధ్యాత్మికంగా, నైతికంగా పరిశుభ్రంగా ఉండాలి.

58:​1-14. భక్తిని, నీతిని వేషధారణగా ప్రదర్శించడం వ్యర్థం. సత్యారాధకులు దైవభక్తికి సంబంధించిన యథార్థమైన వ్యక్తీకరణలు, సహోదరప్రేమతో నిండిన పనులు మెండుగా చేయాలి.​—⁠యోహాను 13:​35; 2 పేతురు 3:​11.

59:​15-19. యెహోవా మానవ వ్యవహారాలను గమనించి, తన నిర్ణీత సమయంలో జోక్యం చేసుకుంటాడు.

ఆమె “భూషణకిరీటము” కావాలి

(యెషయా 60:1-66:​24)

ప్రాచీనకాలాల్లో, అలాగే మన కాలంలో సత్యారాధన పునఃస్థాపించబడడాన్ని సూచిస్తూ యెషయా 60:1 ఇలా చెబుతోంది: “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.” సీయోను “యెహోవాచేతిలో భూషణకిరీటము” కావాలి.​—⁠యెషయా 62:⁠3.

బబులోను చెరలో ఉన్నప్పుడు పశ్చాత్తాపపడే తన తోటి దేశస్థుల పక్షాన యెషయా యెహోవాకు ప్రార్థిస్తున్నాడు. (యెషయా 63:15-64:​12) నిజమైన సేవకులకు అబద్ధ సేవకులకు మధ్యవున్న తేడాను చూపించిన తర్వాత, తనను సేవించేవారిని యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడో ప్రవక్త ప్రకటిస్తున్నాడు.​—⁠యెషయా 65:1-66:​24.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

61:​8, 9​—⁠“నిత్యనిబంధన” అంటే ఏమిటి, “సంతానము” అంటే ఎవరు? ఇది అభిషిక్త క్రైస్తవులతో యెహోవా చేసిన నూతన నిబంధన. “సంతానము” అంటే వారి సందేశానికి ప్రతిస్పందించే లక్షలాదిమంది “వేరేగొఱ్ఱెలు.”​—⁠యోహాను 10:​16.

63:5​—⁠దేవుని ఉగ్రత ఎలా ఆయనకు ఆధారమవుతుంది? దేవుని ఉగ్రత నియంత్రిత భావావేశం, నీతియుక్తమైన ఆగ్రహం. ఆయన తన నీతియుక్తమైన తీర్పులను అమలుచేయడానికి ఆయన ఉగ్రత ఆయనకు మద్దతు ఇస్తుంది, ఆయనను పురికొల్పుతుంది.

మనకు పాఠాలు:

64:⁠6. అపరిపూర్ణ మానవులు తమనుతాము కాపాడుకోలేరు. పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే విషయానికి వస్తే, వారి నీతియుక్తమైన పనులు మురికిగుడ్డతో సమానం.​—⁠రోమీయులు 3:​23, 24.

65:​13, 14. యెహోవా తన నమ్మకమైన సేవకుల ఆధ్యాత్మిక అవసరతలు సమృద్ధిగా తీరుస్తూ వారిని ఆశీర్వదిస్తాడు.

66:​3-5. యెహోవా వేషధారణను అసహ్యించుకుంటాడు.

‘హర్షించుడి’

బబులోనులో పరవాసులుగా నివసిస్తున్న నమ్మకమైన యూదులకు పునఃస్థాపన ప్రవచనాలు ఎంత ఓదార్పునిచ్చి ఉండవచ్చో కదా! యెహోవా ఇలా చెప్పాడు: “నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను.”​—⁠యెషయా 65:​18.

మనం కూడా భూమిని చీకటి కమ్ముకుంటున్న, జనములను కటికచీకటి కమ్ముకుంటున్న కాలంలో జీవిస్తున్నాం. (యెషయా 60:⁠2) ఇవి “అపాయకరమైన కాలములు.” (2 తిమోతి 3:⁠1) కాబట్టి, బైబిలు పుస్తకమైన యెషయా గ్రంథములో అందజేయబడిన యెహోవా రక్షణ సందేశం మనకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది.​—⁠హెబ్రీయులు 4:​12.

[అధస్సూచి]

^ పేరా 4 యెషయా 1:1-35:⁠10 వచనాల చర్చకోసం కావలికోట డిసెంబరు 1, 2006 సంచికలో, “యెహోవా వాక్యము సజీవమైనది​—⁠యెషయా గ్రంథములోని ముఖ్యాంశాలు​—⁠I” చూడండి.

[8వ పేజీలోని చిత్రం]

అష్షూరీయుల నుండి కాపాడబడాలని హిజ్కియా ప్రార్థించడానికిగల ముఖ్య కారణమేమిటో మీకు తెలుసా?

[11వ పేజీలోని చిత్రం]

‘సువార్త ప్రకటించువారి పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి’