స్త్రీపురుషులు ఒకరికోసం ఒకరు సృష్టించబడ్డారు
స్త్రీపురుషులు ఒకరికోసం ఒకరు సృష్టించబడ్డారు
స్త్రీపురుషులు కలిసివుండాలని ఎల్లప్పుడూ గాఢంగా కోరుకుంటారు. ఆ కోరికను దేవుడే కలుగజేశాడు. మొదటి మానవుడైన ఆదాము ఒంటరిగా ఉండడం మంచిదికాదని యెహోవా గమనించాడు. అందుకే దేవుడు “[పురుషునికి] సాటియైన సహాయమును” సృష్టించాడు.
యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలిగించి, ఆయన ప్రక్కటెముకలలో ఒకదానిని తీసుకొని “స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.” ఆదాము యెహోవా చేసిన అందమైన ఆ సృష్టిని చూసి ఎంత పులకరించిపోయాడంటే ఆయన, ‘ఇది నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము’ అని ఆమెను వర్ణించాడు. ఆ పరిపూర్ణ స్త్రీ అయిన హవ్వ తన స్త్రీత్వ లక్షణాలతో నిజంగా ప్రేమించదగినదిగా ఉంది. అంతేకాక పరిపూర్ణ వ్యక్తి అయిన ఆదాము హుందాతనం ఉట్టిపడే పురుష లక్షణాలతో గౌరవార్హునిగా ఉన్నాడు. వారిద్దరూ ఒకరికోసం ఒకరు సృష్టించబడ్డారు. బైబిలు ఇలా అంటోంది: “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.”—ఆదికాండము 2:18-24.
అయితే నేడు కుటుంబాలు విచ్ఛిన్నమౌతున్నాయి, స్త్రీపురుషుల మధ్య ఉన్న సంబంధం తరచూ హానికరంగా తయారౌతోంది లేక స్వార్థమే దానిని నిర్దేశిస్తోంది. స్త్రీపురుషుల మధ్య పోటీతత్వం విభేదాలకు, తగవులకు కారణమైంది. ఇవన్నీ స్త్రీపురుషుల విషయంలో దేవుడు సంకల్పించినదానికి విరుద్ధంగా ఉన్నాయి. మానవుడు భూమ్మీద అద్భుతమైన పాత్ర పోషించడానికి రూపొందించబడ్డాడు. స్త్రీ తన భర్తకు సాటియైన సహకారిగా ఉంటూ ఒక ప్రత్యేకమైన, విలువైన పాత్రను పోషించాల్సివుంది. వారు సామరస్యంతో కలిసి పనిచేయాలి. మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుండి యెహోవా దేవుని ఏర్పాటును గౌరవించిన స్త్రీపురుషులు ఆయన తమకోసం సంకల్పించిన పాత్రలను పోషించడానికి నమ్మకంగా ప్రయత్నించారు, అది వారికి మరింత సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. వారు పోషించిన పాత్రలేమిటి, ఆ పాత్రలను మనమెలా పోషించవచ్చు?
[3వ పేజీలోని చిత్రం]
స్త్రీపురుషులు దేవుని ఏర్పాటులో గౌరవప్రదమైన పాత్రలు పోషించడానికి రూపొందించబడ్డారు