కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్త్రీపురుషులు వారి గౌరవప్రదమైన పాత్రలు

స్త్రీపురుషులు వారి గౌరవప్రదమైన పాత్రలు

స్త్రీపురుషులు వారి గౌరవప్రదమైన పాత్రలు

యెహోవా దేవుడు మొదట ఆదామును, ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. హవ్వ సృష్టించబడక ముందు ఆదాము జీవితానుభవం గడించాడు. ఆ సమయంలో యెహోవా అతనికి కొన్ని ఆదేశాలిచ్చాడు. (ఆదికాండము 2:​15-20) ఆదాము దేవుని ప్రతినిధిగా ఉంటూ వాటిని తన భార్యకు తెలియజేయాలి. కాబట్టి, సహేతుకంగానే ఆయన ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాల్లో నాయకత్వం వహిస్తాడు.

క్రైస్తవ సంఘంలో అలాంటి ఏర్పాటే ఉంది, దానిని పరిశీలించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని . . . పురుషునిమీద అధికారము చేయుట[కు] ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?” (1 తిమోతి 2:​12, 13) క్రైస్తవ సంఘ కూటాల్లో స్త్రీలు పూర్తిగా మౌనంగా ఉండాలని కాదు. ఆమె మౌనంగా ఉండడమంటే, ఆమె పురుషునితో వివాదాలకు దిగకుండా ఉండడమని దానర్థం. ఆమె ఆయన నియమిత స్థానాన్ని అగౌరవపరచకూడదు లేక సంఘానికి బోధించడానికి ప్రయత్నించ కూడదు. సంఘాన్ని పర్యవేక్షిస్తూ, దానికి బోధించే బాధ్యత పురుషులకు అప్పగించబడింది, అయితే స్త్రీలు అనేక విధాలుగా క్రైస్తవ కూటాల్లో భాగం వహించడం ద్వారా వాటికి మద్దతునిస్తారు.

దేవుని ఏర్పాటులో స్త్రీపురుషుల పాత్రల గురించిన అంతర్దృష్టిని మనకిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు . . . అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు [వారిద్దరూ ఒకరిపై మరొకరు ఆధారపడివున్నారు]. స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి.”​—⁠1 కొరింథీయులు 11:​8-12.

స్త్రీలకున్న చక్కని ఆధిక్యతలు

దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో స్త్రీలకు ఎన్నో ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి, వారికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండేది. ఉదాహరణకు, సామెతలు 31:​10-31 వచనాలు మంచి బట్ట కొనుగోలు చేసి తన ఇంటివారికి చక్కని వస్త్రాలను కుట్టిపెట్టే “గుణవతియైన భార్య” గురించి వివరిస్తున్నాయి. అంతెందుకు, ‘ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది’! (13, 21-25 వచనాలు) ఈ ఉత్తమ స్త్రీ, ‘వర్తకపు ఓడల్లాగా’ దూర ప్రాంతాల నుండైనా సరే మంచి ఆహారాన్ని తీసుకొస్తుంది. (14వ వచనం) ‘ఆమె పొలమును చూచి దానిని తీసుకుంటుంది,’ అంతేకాక, ‘ద్రాక్షతోట నాటిస్తుంది.’ (16వ వచనం) ‘ఆమె వ్యాపారలాభం తెలుసుకుంటుంది’ కాబట్టి, ఆమె కార్యకలాపాలు లాభకరంగా ఉంటాయి. (18వ వచనం) ‘తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టడంతోపాటు’ యెహోవాపట్ల భయభక్తులుకలిగి కష్టపడి పనిచేసే ఈ స్త్రీ నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తుంది. (20, 27 వచనాలు) కాబట్టి, ఆమె ప్రశంసించబడడంలో ఆశ్చర్యంలేదు!​—⁠31వ వచనం.

మోషే ద్వారా యెహోవా ఇచ్చిన నియమాలు, స్త్రీలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలు కల్పించాయి. ఉదాహరణకు, యెహోషువ 8:​35లో మనమిలా చదువుతాం: “స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్కటియు లేదు.” యాజకుడైన ఎజ్రా గురించి బైబిలు ఇలా పేర్కొంటోంది: “[ఆయన] యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి.” (నెహెమ్యా 8:​2, 3) అలా ధర్మశాస్త్రం చదవబడడంవల్ల స్త్రీలు ప్రయోజనం పొందారు. మత సంబంధమైన పండగలను వారు కూడా ఆచరించారు. (ద్వితీయోపదేశకాండము 12:​12, 18; 16:​11, 14) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, ప్రాచీన ఇశ్రాయేలులోని స్త్రీలు యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడంతోపాటు ఆయనకు వ్యక్తిగతంగా ప్రార్థన కూడా చేయగలిగారు.​—⁠1 సమూయేలు 1:​10.

సా.శ. మొదటి శతాబ్దంలో, యేసుకు సపర్యలు చేసే ఆధిక్యత దైవభక్తిగల స్త్రీలకు లభించింది. (లూకా 8:​1-3) బేతనియలో ఏర్పాటు చేయబడిన రాత్రి భోజనంలో ఒక స్త్రీ ఆయన తలమీద అత్తరు పోసి, ఆయన కాళ్లకు దానిని పూసింది. (మత్తయి 26:​6-13; యోహాను 12:​1-7) యేసు తన పునరుత్థానం తర్వాత స్త్రీలకు కూడా కనిపించాడు. (మత్తయి 28:​1-10; యోహాను 20:​1-18) యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత సమకూడిన దాదాపు 120 మందిలో “కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియ” ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 1:​3-15) సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసు శిష్యులమీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి వారనేక భాషల్లో అద్భుతంగా మాట్లాడినప్పుడు యెరూషలేములోని మేడగదిలో ఈ స్త్రీలలో అనేకులు లేక అందరూ ఉన్నారనడంలో సందేహం లేదు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​1-12.

పెంతెకొస్తునాడు అపొస్తలుడైన పేతురు ఉదాహరించినట్లు, యోవేలు 2:​28, 29 ప్రవచన నెరవేర్పును చవిచూసిన వారిలో పురుషులే కాక స్త్రీలు కూడా ఉన్నారు: “నేను [యెహోవా] మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలును ప్రవచించెదరు . . . ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.” (అపొస్తలుల కార్యములు 2:​13-18) సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత కొంతకాలం వరకు, క్రైస్తవ స్త్రీలకు ఆత్మ వరాలు అనుగ్రహించబడ్డాయి. వారు అన్య భాషల్లో మాట్లాడి, ప్రవచించారు. వారు భవిష్యత్తు గురించి జోస్యాలు చెప్పారని దానర్థం కాదుగానీ వారు లేఖన సత్యాల గురించి మాట్లాడారు.

అపొస్తలుడైన పౌలు, రోములో ఉన్న క్రైస్తవులకు తాను రాసిన పత్రికలో, “ఫీబే అను మన సహోదరి” గురించి ఆప్యాయంగా మాట్లాడి, ఆమెను ఆదరించమని వారికి చెప్పాడు. ఆయన త్రుపైనా, త్రుఫోసా గురించి కూడా ప్రస్తావించి, వారు ‘ప్రభువునందు బహుగా ప్రయాసపడుతున్నవారు’ అని చెప్పాడు. (రోమీయులు 16:​1, 2, 12) ఆ స్త్రీలు తొలి క్రైస్తవ సంఘంలో నియమిత స్థానాల్లో లేకపోయినా, పరలోక రాజ్యంలో తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసులుగా ఉండేందుకు దేవుని ద్వారా ఎన్నుకోబడే ఆశీర్వాదం వారికేకాక అనేక ఇతర స్త్రీలకూ లభించింది.​—⁠రోమీయులు 8:​16, 17; గలతీయులు 3:​28, 29.

నేడు దైవభక్తిగల స్త్రీలకు ఎంతటి గొప్ప ఆధిక్యత ఉందో కదా! “ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు” అని కీర్తన 68:​11 చెబుతోంది. అలా ప్రకటించే స్త్రీలను మెచ్చుకోవాలి. ఉదాహరణకు, గృహ బైబిలు అధ్యయనాల్లో వారు చేస్తున్న నైపుణ్యవంతమైన బోధ, అనేకమంది దేవుణ్ణి సంతోషపెట్టే సత్యబోధలను అంగీకరించేందుకు సహాయం చేస్తుంది. తమ పిల్లలు విశ్వాసులుగా మారేందుకు సహాయం చేయడంతోపాటు అనేక సంఘ బాధ్యతలున్న తమ భర్తలకు మద్దతిస్తున్న వివాహితులైన క్రైస్తవ స్త్రీలు కూడా ప్రశంసార్హులే. (సామెతలు 31:​10-12, 28) దేవుని ఏర్పాటులో అవివాహిత స్త్రీలకు కూడా గౌరవప్రదమైన స్థానం ఉంది, అంతేకాక “తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము” అని క్రైస్తవ పురుషులు ఆదేశించబడ్డారు.​—⁠1 తిమోతి 5:​1, 2.

పురుషుని విభిన్న నియామకాలు

ఒక క్రైస్తవ పురుషునికి దైవనియమిత పాత్ర అనుగ్రహించబడింది, ఆయన ఆ పాత్రను పోషించాలి. పౌలు ఇలా రాస్తున్నాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరింథీయులు 11:⁠3) పురుషునికి కూడా ఒక శిరస్సు ఉన్నాడు, ఆయనే క్రీస్తు. నిజానికి, పురుషుడు క్రీస్తుకు జవాబుదారుడు, చివరకు దేవునికి జవాబుదారుడు. పురుషుడు తన శిరస్సత్వాన్ని ప్రేమపూర్వకంగా నిర్వహించాలని దేవుడు కోరుతున్నాడు. (ఎఫెసీయులు 5:​25) మానవులు సృష్టించబడినప్పటి నుండి దేవుడు పురుషులను అదే కోరుతున్నాడు.

పురుషునికున్న శిరస్సత్వపు స్థానానికి అనుగుణంగా దేవుడు ఆయనకు నియామకాలు ఇచ్చినట్లు బైబిలు చూపిస్తోంది. ఉదాహరణకు, యెహోవా జలప్రళయం సమయంలో ప్రాణ రక్షణ కోసం పురుషుడైన నోవహుతో ఓడను నిర్మింపజేశాడు. (ఆదికాండము 6:9-7:​24) పురుషుడైన అబ్రాహాముకు తన సంతానం ద్వారా భూమ్మీద ఉన్న వంశాలన్నీ, జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేయబడింది. ఆ సంతానంలోని ప్రథమ భాగం క్రీస్తుయేసే. (ఆదికాండము 12:⁠3; 22:​18; గలతీయులు 3:​8-16) దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడుదల చేసేందుకు పురుషుడైన మోషేను నియమించాడు. (నిర్గమకాండము 3:9, 10, 12, 18) యెహోవా మోషే ద్వారానే ధర్మశాస్త్ర నిబంధన లేక మోషే ధర్మశాస్త్రమని పిలవబడే నియమావళిని ఇచ్చాడు. (నిర్గమకాండము 24:​1-18) బైబిలు పుస్తకాలన్నిటినీ పురుషులే రాశారు.

క్రైస్తవ సంఘ శిరస్సుగా యేసు, పురుషులలో లేక ‘మనుష్యులలో ఈవులను అనుగ్రహించాడు.’ (ఎఫెసీయులు 1:​22; 4:​7-13) పౌలు పైవిచారణకర్తలకు ఉండాల్సిన అర్హతల గురించి వివరిస్తున్నప్పుడు పురుషుల గురించి ప్రస్తావిస్తున్నాడు. (1 తిమోతి 3:​1-7; తీతు 1:​5-9) కాబట్టి యెహోవాసాక్షుల సంఘాల్లో పురుషులు పైవిచారణకర్తలుగా లేక పెద్దలుగా, పరిచర్య సేవకులుగా సేవచేస్తున్నారు. (ఫిలిప్పీయులు 1:​1, 2; 1 తిమోతి 3:​8-10, 12) క్రైస్తవ సంఘంలో పురుషులే కాపరులుగా సేవచేయాలి. (1 పేతురు 5:​1-4) అయితే, ముందే పేర్కొన్నట్లుగా, స్త్రీలకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఆధిక్యతలు ఉన్నాయి.

వారు తమకివ్వబడిన పాత్రల్లో సంతోషంగా ఉన్నారు

దేవుడు అనుగ్రహించిన పాత్రలను పోషించడం అటు పురుషులకు, ఇటు స్త్రీలకు సంతోషాన్నిస్తుంది. భార్యాభర్తలు క్రీస్తును, ఆయన సంఘాన్ని అనుకరించినప్పుడు వైవాహిక జీవితాలు సంతోషకరంగా ఉంటాయి. “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. . . . మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను” అని పౌలు రాశాడు. (ఎఫెసీయులు 5:​25-33) కాబట్టి, భర్తలు తమ శిరస్సత్వాన్ని ప్రేమపూర్వకంగా నిర్వహించాలి గానీ స్వార్థపూరితంగా కాదు. క్రీస్తు సంఘం పరిపూర్ణ మానవులతో నిర్మించబడలేదు. అయినా యేసు దానిని ప్రేమించి, సంరక్షిస్తున్నాడు. అలాగే క్రైస్తవ భర్త తన భార్యను ప్రేమించి, సంరక్షించాలి.

క్రైస్తవ భార్యకు ‘తన భర్తపట్ల భయం ఉండాలి’ అంటే ప్రగాఢమైన గౌరవం ఉండాలి. (ఎఫెసీయులు 5:​33) ఈ విషయంలో ఆమె సంఘాన్ని మాదిరిగా తీసుకోవచ్చు. ఎఫెసీయులు 5:​21-24 ఇలా చెబుతోంది: “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.” తన భర్తకు లోబడడం కొన్నిసార్లు భార్యకు కష్టమనిపించినా “ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.” (కొలొస్సయులు 3:​18) తన భర్తకు లోబడడం ప్రభువైన యేసుక్రీస్తుకు సంతోషం కలిగిస్తుందని ఆమె గుర్తుంచుకుంటే అలా లోబడడం ఆమెకు సులభమౌతుంది.

ఒక క్రైస్తవ స్త్రీ, తన భర్త తోటి విశ్వాసి కాకపోయినా ఆయన శిరస్సత్వానికి లోబడాలి. అపొస్తలుడైన పేతురు ఇలా అంటున్నాడు: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతురు 3:​1, 2) తన భర్తయైన అబ్రాహామును గౌరవించిన శారా, ఇస్సాకుకు జన్మనిచ్చి యేసుక్రీస్తుకు పూర్వికురాలయ్యే ఆధిక్యతను పొందింది. (హెబ్రీయులు 11:​11, 12; 1 పేతురు 3:​5, 6) శారా మాదిరిని అనుసరించే భార్యలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు.

స్త్రీపురుషులు దేవుడు తమకు అనుగ్రహించిన పాత్రలను పోషించినప్పుడు, శాంతి, సామరస్యం నెలకొంటుంది. అది వారికి సంతృప్తిని, సంతోషాన్నిస్తుంది. అంతేకాక, లేఖనాధారిత నియమాలను అనుసరించడం ద్వారా దేవుని ఏర్పాటులో ఉన్న ప్రత్యేకమైన స్థానంతోపాటు లభించే గౌరవాన్ని ప్రతీ ఒక్కరూ పొందుతారు.

[7వ పేజీలోని బాక్సు]

దేవుడు తమకనుగ్రహించిన పాత్రల గురించి వారేమనుకుంటున్నారు?

సూజన్‌ ఇలా అంటోంది: “మావారు తన శిరస్సత్వాన్ని ప్రేమతో, దయతో నిర్వహిస్తారు. మేము నిర్ణయాలు తీసుకునే ముందు సాధారణంగా వాటి గురించి చర్చిస్తాం, ఆ తర్వాత ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని దానిని తీసుకుంటారని నాకు తెలుసు. క్రైస్తవ భార్యల విషయంలో యెహోవా చేసిన ఏర్పాటు నాకు నిజంగా సంతోషాన్నిస్తుంది, మా వివాహబంధాన్ని బలపరుస్తోంది. మేము ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేస్తున్నాం.”

మిన్డి అనే స్త్రీ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “యెహోవా తన సేవకురాండ్రకు అనుగ్రహించిన పాత్ర ఆయనకు మాపట్ల ప్రేమ ఉందనే హామినిస్తోంది. నేను మావారికి గౌరవమర్యాదలు ఇవ్వడంతోపాటు, ఆయన తన సంఘ బాధ్యతలను నిర్వర్తించడంలో మద్దతు కూడా ఇవ్వడం ద్వారా ఈ ఏర్పాటు చేసినందుకు నేను యెహోవాకు కృతజ్ఞత చూపించవచ్చని అనుకుంటున్నాను.”

[5వ పేజీలోని చిత్రాలు]

శిరస్సత్వం విషయంలో పురుషునికున్న స్థానానికి అనుగుణంగా దేవుడు నోవహుకు, అబ్రాహాముకు, మోషేకు వివిధ నియామకాలు ఇచ్చాడు

[7వ పేజీలోని చిత్రం]

సువార్త “ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు”