ఆమోసు మేడిపండ్లు ఏరుకొనేవాడా లేక మేడికాయలకు గాట్లుపెట్టేవాడా?
ఆమోసు మేడిపండ్లు ఏరుకొనేవాడా లేక మేడికాయలకు గాట్లుపెట్టేవాడా?
సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో, దూడ ఆరాధకుడు, యాజకుడు, దుష్టుడైన అమజ్యా, ఇశ్రాయేలులో ప్రవచించవద్దని ఆమోసు ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. దానికి అభ్యంతరం చెబుతూ ఆమోసు ఇలా అన్నాడు: “నేను . . . పసులకాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను [‘మేడికాయలకు గాట్లుపెట్టేవాణ్ణి,’ NW]. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి—నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.” (ఆమోసు 7:14, 15) అవును, యెహోవాయే ఆమోసును ప్రవక్తగా నియమించాడు, అంతేగానీ ఆయన తనను తాను నియమించుకోలేదు. తాను మేడికాయలకు ‘గాట్లుపెట్టేవాణ్ణి’ అని ఆమోసు చెప్పడంలోని భావమేమిటి?
అలా అనువదించబడిన హీబ్రూ పదం నూతనలోక అనువాదములో ఈ ఒక్క సందర్భంలోనే కనిపిస్తుంది. ఇతర బైబిలు అనువాదాలు ఆ పదాన్ని మేడికాయలకు ‘గాట్లుపెట్టేవాడు’ అని అనువదించే బదులు మేడిపండ్లను ‘ఏరుకొనువాడు,’ అత్తిచెట్లను ‘పరామర్శించువాడు’ మేడి వృక్షాల ‘పరిరక్షకుడు,’ అని అనువదించాయి. అయితే, ఆ పదం మేడికాయ కోసం వ్యవసాయకుడు తీసుకునే ప్రత్యేక చర్యను సూచిస్తుంది కాబట్టి, ఆ పదానికి “గాట్లుపెట్టేవాడు” అనేదే సరైన అనువాదం అని ఎకానమిక్ బోటనీ అనే పత్రిక చెబుతోంది.
గాట్లుపెట్టే పని ప్రాచీనకాలం నుండి ఈజిప్టులో, సైప్రస్‌లో బాగా తెలిసిన పని. ఆధునిక దిన ఇశ్రాయేలులో వేరే రకాల అంజూరపు చెట్లను పెంచుతున్నారు కాబట్టి, గాట్లుపెట్టే పని ఇప్పుడు అక్కడ కనిపించదు. అయితే, ఆమోసు కాలంలో ఇశ్రాయేలులో పండించిన మేడికాయలు ఈజిప్టు జాతుల నుండి వచ్చాయి కాబట్టి, ఇశ్రాయేలీయులు వాటికి గాట్లుపెట్టేవారు.
మేడికాయలకు గాట్లుపెట్టడంవల్ల అవి తేమను పీల్చుకొని రసమయంగా తయారౌతాయి. కాయలు త్వరగా పండేందుకు దోహదపడే ఈథలిన్ వాయువు ఉత్పత్తి కూడా పెరుగుతుంది, దానివల్ల పెద్దవైన, మధురమైన పండ్లు చేతికి అందుతాయి. అంతేకాక, గాట్లుపెట్టడంవల్ల ఆ కాయలు త్వరగా పక్వానికి చేరతాయి కాబట్టి, పరాన్నజీవులైన కందిరీగలు వాటిని పాడుచేయవు.
కాపరిగా, మేడికాయలకు గాట్లుపెట్టే వ్యక్తిగా ఆమోసు అంతటి అల్పమైన నేపథ్యానికి చెందినవాడైనా, ఆయన తన శత్రువులను చూసి భయపడలేదు. బదులుగా, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా యెహోవా తీర్పును ఆయన ధైర్యంగా ప్రకటించాడు. ఆయనలాగే జనసమ్మతంకాని సందేశాన్ని ప్రకటించాల్సిన నేటి దేవుని సేవకులకు ఆయన ఎంతటి చక్కని ఉదాహరణో కదా!—మత్తయి 5:11, 12; 10:22.