కృతజ్ఞత చూపించడంలో పురోగమిస్తూ ఉండండి
కృతజ్ఞత చూపించడంలో పురోగమిస్తూ ఉండండి
“దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి! వాటి మొత్తమెంత గొప్పది.”—కీర్తన 139:17.
ఆశ్చర్యకరంగా అది బయటపడింది. యెరూషలేములోని యెహోవా ఆలయానికి మరమ్మతు చేస్తుండగా, ప్రధానయాజకుడైన హిల్కియాకు “మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము” కనబడింది, నిస్సందేహంగా అది దాదాపు 800 సంవత్సరాల క్రితం పూర్తిచేయబడిన అసలు ప్రతి! ఆ గ్రంథాన్ని తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దైవభయంగల యోషీయా రాజు ఎంతగా పులకించి ఉంటాడో మీరూహించగలరా? ఆయన దాన్ని ఎంతో అమూల్యమైనదిగా ఎంచి వెంటనే దాన్ని తన శాస్త్రియైన షాఫానుకిచ్చి బిగ్గరగా చదివించాడు.—2 దినవృత్తాంతములు 34:14-18.
2 నేడు కోట్లాదిమంది దేవుని వాక్యం అంతటినీ లేక అందులో కొంత భాగాన్ని చదవగలరు. అయితే అది లేఖనాల్ని తక్కువ విలువైనవిగా, అప్రాముఖ్యమైనవిగా చేస్తోందా? ఎంతమాత్రం లేదు! వాస్తవానికి వాటిలో, మన ప్రయోజనార్థమై వ్రాయబడిన సర్వశక్తుని తలంపులు ఉన్నాయి. (2 తిమోతి 3:16) దేవుని వాక్యాన్ని గురించిన తన భావాలను వ్యక్తంచేస్తూ కీర్తనకర్త దావీదు ఇలా వ్రాశాడు: “దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి! వాటి మొత్తమెంత గొప్పది.”—కీర్తన 139:17.
3 యెహోవాపట్ల, ఆయన వాక్యంపట్ల, సత్యారాధన కోసం ఆయనచేసిన ఏర్పాటుపట్ల దావీదుకున్న గౌరవం ఎన్నడూ సన్నగిల్లలేదు. దావీదు భావాలేమిటో ఆయన కూర్చిన అనేక శ్రావ్యమైన కీర్తనలు వ్యక్తంచేశాయి. ఉదాహరణకు, కీర్తన 27:4లో ఆయనిలా వ్రాశాడు: “యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.” ఆదిమ హీబ్రూ భాషలో, “ధ్యానించుటకు” అని అనువదించబడిన మాటకు విడువక మననం చేయడం, నిశితంగా పరిశీలించడం, ఆనందంగా, సంతోషంగా, ఆశ్చర్యంగా చూడడం అనే అర్థాలున్నాయి. దావీదు యెహోవాచేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లను అమూల్యమైనవిగా పరిగణిస్తూ, దేవుడు బయల్పరచిన ఆధ్యాత్మిక సత్యాలన్నింటిని అత్యంత ఇష్టంగా ఆస్వాదించిన ఆధ్యాత్మిక వ్యక్తి అనేది స్పష్టం. ఆయన కృతజ్ఞతా మాదిరి అనుకరణీయంగా ఉంది.—కీర్తన 19:7-11.
బైబిలు సత్యం తెలుసుకునే ఆధిక్యత లభించినందుకు కృతజ్ఞత కలిగివుండండి
4 దేవుని వాక్య అంతర్దృష్టిని పొందడం, అహంకారాన్ని వృద్ధిచేసే అవకాశమున్న మేధాసంపత్తిపై లేదా లోక విద్యపై ఆధారపడి ఉండదు. బదులుగా, అది తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించిన వినయస్థులైన, యథార్థహృదయులైన ప్రజలపట్ల యెహోవా చూపించే కృపపై ఆధారపడివుంటుంది. (మత్తయి 5:3; 1 యోహాను 5:20) యేసు కొందరు అపరిపూర్ణ మానవుల పేర్లు పరలోకంలో వ్రాయబడివున్నాయనే వాస్తవాన్ని ధ్యానించినప్పుడు, ఆయన “పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి—‘తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను’” అని అన్నాడు.—లూకా 10:17-21.
5 అలా హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత, యేసు తన శిష్యులవైపు తిరిగి ఇలా అన్నాడు: “మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరి.” అవును, తమకు వెల్లడిచేయబడుతున్న ప్రశస్తమైన రాజ్య సత్యాలను తేలికగా తీసుకోవద్దని యేసు తన నమ్మకమైన అనుచరులను ప్రోత్సహించాడు. ఆ సత్యాలు దేవుని సేవకుల లూకా 10:23, 24.
పూర్వతరాల వారికి వెల్లడిచేయబడలేదు, ఇంకా ఖచ్చితంగా యేసు కాలంలోని ‘జ్ఞానులకు, వివేకులకు’ వెల్లడిచేయబడలేదు!—6 మన కాలంలో దైవిక సత్యంపట్ల కృతజ్ఞతతో ఉండేందుకు మనకు మరిన్ని కారణాలున్నాయి, ఎందుకంటే యెహోవా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా తన ప్రజలకు తన వాక్యాన్ని గురించి మరింత లోతైన అంతర్దృష్టిని అనుగ్రహించాడు. (మత్తయి 24:45; దానియేలు 12:10) అంత్యకాలం గురించి ప్రవక్తయైన దానియేలు ఇలా వ్రాశాడు: “చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును.” (దానియేలు 12:4) నేడు దేవుని గురించిన తెలివి ‘అధికమైందని,’ యెహోవా సేవకులకు ఆధ్యాత్మిక ఆహారం సమృద్ధిగా లభిస్తోందని మీరంగీకరించరా?
7 దేవుని ప్రజల విస్తారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి మహాబబులోను మతాల గందరగోళానికి ఎంత తేడావుందో కదా! ఫలితంగా అబద్ధ మతంతో విసిగివేసారిన అనేకులు సత్యారాధనవైపు మరలుతున్నారు. వారు “[మహాబబులోను] పాపములలో పాలివారు” కాకూడదని లేదా “దాని తెగుళ్లలో ఏదియు” తమకు ప్రాప్తించకూడదని కోరుకునే గొర్రెల్లాంటి ప్రజలు. అలాంటి వారందరిని యెహోవా, ఆయన సేవకులు నిజ క్రైస్తవ సంఘంలోకి ఆహ్వానిస్తున్నారు.—ప్రకటన 18:2-4; 22:17.
కృతజ్ఞతగలవారు దేవుని దగ్గరకొస్తారు
8 తన ఆధ్యాత్మిక ఆరాధనా మందిరం గురించి యెహోవా ముందే ఇలా చెప్పాడు: “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.” (హగ్గయి 2:7) ఆశ్చర్యకరమైన ఈ ప్రవచనం మొదటిగా హగ్గయి కాలంలో పునరుద్ధరించబడిన దేవుని ప్రజలు కొందరు, యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించినప్పుడు నెరవేరింది. నేడు హగ్గయి మాటలు, యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి సంబంధించి మరింత గొప్పగా నెరవేరుతున్నాయి.
9 దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేందుకు ఇప్పటికే లక్షలాదిమంది అలంకారార్థ ఆలయానికి చేరుకోవడమేకాక, ప్రతీ సంవత్సరం “అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులు” లక్షల సంఖ్యలో సమకూర్చబడుతూనే ఉన్నాయి. (యోహాను 4:23, 24) ఉదాహరణకు, 2006వ సేవా సంవత్సరపు ప్రపంచవ్యాప్త నివేదిక 2,48,327 మంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారని చూపిస్తోంది. అంటే ప్రతీరోజు సగటున 680 మంది క్రొత్తవారు బాప్తిస్మం తీసుకుంటున్నారని అది సూచిస్తోంది! సత్యంపట్ల వారికున్న ప్రేమ, రాజ్య ప్రచారకులుగా యెహోవాను సేవించాలనే వారి కోరిక వారు నిజంగా దేవునిచేత ఆకర్షించబడ్డారనే రుజువునిస్తోంది.—యోహాను 6:44, 65.
10 ఈ యథార్థహృదయుల్లో చాలామంది, “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” గ్రహించారు కాబట్టే, సత్యంవైపుకు ఆకర్షితులయ్యారు. (మలాకీ 3:18) ఉదాహరణకు, వాన్, వర్జీనియా దంపతుల అనుభవాన్నే పరిశీలించండి, వారు ప్రొటస్టెంటు చర్చీకి చెందినవారైనా వారికి తీరని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వారు యుద్ధాన్ని ద్వేషించేవారు, మతనాయకులు సైనికులను, యుద్ధాయుధాలను ఆశీర్వదించడాన్ని చూసి కలవరపడి, కలతచెందారు. వర్జీనియా సండే స్కూల్లో అనేక సంవత్సరాలు బోధించినా, వారు వృద్ధులౌతుండగా చర్చీలోని ఇతరులు తమను పట్టించుకోవడం లేదనట్లు వారు భావించారు. “ఎవరూ మా దగ్గరకు రాలేదు లేదా మా ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల శ్రద్ధ చూపించలేదు. చర్చీకి కావల్సిందల్లా మా దగ్గరున్న డబ్బే. మేమెంతో నిరుత్సాహానికి గురయ్యాం” అని వారు చెప్పారు. వారి చర్చీ సలింగసంయోగులను అనుమతించినప్పుడు వారు మరింత కృంగిపోయారు.
11 ఈ మధ్యకాలంలో వాన్, వర్జీనియాల మనవరాలు, ఆ తర్వాత వారి కూతురు యెహోవాసాక్షులయ్యారు. వాన్, వర్జీనియాలు ఆ విషయంలో మొదట బాధపడినా, ఆ తర్వాత వారు తమ మనసు మార్చుకొని బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. “మేము కేవలం మూడు నెలల్లోనే బైబిలు గురించి గత 70 సంవత్సరాల్లో తెలుసుకున్న దానికన్నా మరెంతో ఎక్కువ తెలుసుకున్నాం” అని వాన్ చెప్పాడు. దేవుని పేరు యెహోవా అని మాకు తెలీదు, రాజ్యం మరియు భూపరదైసు అంటే ఏమిటో అసలే తెలియదు. సహృదయులైన ఆ దంపతులు త్వరలోనే క్రైస్తవ కూటాలకు హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం ఆరంభించారు. “సత్యం గురించి అందరికీ చెప్పాలని మేము ఇష్టపడుతున్నాం” అని వర్జీనియా చెప్పింది. వారిద్దరూ తమ 80వ పడిలో ఉన్నప్పుడు 2005లో బాప్తిస్మం తీసుకున్నారు. “నిజమైన క్రైస్తవ గృహం మాకు లభించింది” అని వారన్నారు.
‘ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి’ ఉన్నందుకు కృతజ్ఞత కలిగివుండండి
12 యెహోవా తన చిత్తం చేయడానికి తన సేవకులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. ఉదాహరణకు, నోవహు ఓడను ఎలా నిర్మించాలనే విషయంలో స్పష్టమైన, నిర్దిష్టమైన సూచనలను అందుకున్నాడు, మొదటిసారే ఆ ఓడ ఖచ్చితమైన ప్రమాణాలతో నిర్మించబడాలి! అది అలాగే ఖచ్చితంగా నిర్మించబడింది. ఎందుకు? ఎందుకంటే, “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:14-22) నేడు కూడా యెహోవా తన చిత్తం చేసేందుకు తన సేవకులను సంపూర్ణముగా సిద్ధం చేస్తున్నాడు. నిజమే, స్థాపించబడిన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, సరైన మనోవైఖరిగలవారు యేసుక్రీస్తు శిష్యులయ్యేందుకు సహాయం చేయడం మన ప్రాథమిక పని. నోవహు విషయంలోలాగే మన విజయం కూడా విధేయతపై ఆధారపడి ఉంటుంది. యెహోవా తన వాక్యం ద్వారా, తన సంస్థ ద్వారా ఇస్తున్న నిర్దేశాన్ని మనం విధేయతతో అనుసరించాలి.—మత్తయి 24:14; 28:19, 20.
13 ఆ పని చేసేందుకు మనం, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు . . . ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైన” మన ఉపకరణాన్ని అంటే దేవుని వాక్యాన్ని ‘సరిగా’ ఉపయోగించడాన్ని నేర్చుకోవాలి. (2 తిమోతి 2:15; 3:16, 17) మొదటి శతాబ్దంలోలాగే, యెహోవా క్రైస్తవ సంఘం ద్వారా మనకు విలువైన శిక్షణనిస్తున్నాడు. పరిచర్యలో మనకు సహాయపడేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా 99,770 సంఘాల్లో ప్రతీవారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవాకూటం నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రాముఖ్యమైన కూటాలకు క్రమంగా హాజరవుతూ, నేర్చుకున్న అంశాలను అన్వయించుకోవడం ద్వారా వాటిపట్ల మీ కృతజ్ఞతను చూపిస్తున్నారా?—హెబ్రీయులు 10:24, 25.
14 ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో దేవుని ప్రజలు పరిచర్యలో తీవ్రంగా శ్రమిస్తూ తాముపొందిన శిక్షణపట్ల తమ కృతజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు, 2006వ సేవా సంవత్సరంలో 67,41,444 రాజ్య ప్రచారకులు సేవకు సంబంధించిన అన్ని రంగాల్లో మొత్తం 133,39,66,199 గంటలను వెచ్చించారు, వాటిలో నిర్వహించబడిన 62,86,618 గృహ బైబిలు అధ్యయనాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్త నివేదికలో ఇవ్వబడిన ప్రోత్సాహకరమైన వివరాల్లో ఇవి కొన్నిమాత్రమే. మన మొదటి శతాబ్దపు సహోదరులు వారి కాలంలోని ప్రకటనాపనికి సంబంధించిన విస్తరణా నివేదికలనుండి ఎంతో ప్రోత్సాహాన్ని పొందినట్లే, ఈ నివేదికను జాగ్రత్తగా పరిశీలించి దానినుండి ప్రోత్సాహం పొందమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.—అపొస్తలుల కార్యములు 1:15; 2:5-11, 41, 47; 4:4; 6:7.
యెషయా 43:10) నిజమే, మన సహోదర సహోదరీల్లోని వృద్ధుల, వ్యాధిగ్రస్థుల లేదా బలహీనుల స్తుతియాగమును విధవరాలి కానుకతో పోల్చవచ్చు. అయితే తమకు చేతనైనమేరకు పూర్ణాత్మతో దేవుని సేవించేవారందరిపట్ల యెహోవాకు ఆయన కుమారునికి కృతజ్ఞత ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.—లూకా 21:1-4; గలతీయులు 6:4.
15 ప్రతీ సంవత్సరం మహాశబ్దంతో దేవుని సన్నిధికి చేరుకుంటున్న స్తుతులు, యెహోవాను తెలుసుకొని ఆయన గురించి సాక్ష్యమిచ్చేందుకు తమకు లభించిన ఆధిక్యతపట్ల యెహోవా సేవకుల ప్రగాఢ కృతజ్ఞతను ప్రతిబింబిస్తున్నాయి. (16 పరిచర్య కోసం మనకు శిక్షణనివ్వడమేకాక, యెహోవా తన సంస్థద్వారా మనకు చక్కని బోధనా ఉపకరణాల్ని కూడా దయచేస్తున్నాడు. ఇటీవలి దశాబ్దాల్లో, ఈ ఉపకరణాల్లో నిత్యజీవమునకు నడుపు సత్యము, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము, ప్రస్తుతం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాలు ఉన్నాయి. ఈ ఏర్పాట్లపట్ల నిజంగా కృతజ్ఞతవున్నవారు వాటిని పరిచర్యలో ప్రయోజనాత్మకంగా ఉపయోగిస్తారు.
బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ప్రయోజనాత్మకంగా ఉపయోగించండి
17బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 19 అధ్యాయాలు, వివరణాత్మక అనుబంధం, స్పష్టమైన, సరళమైన భాషతో, పరిచర్యకు లభించిన ఒక దీవెనగా నిరూపించుకుంటోంది. ఉదాహరణకు, 12వ అధ్యాయం “దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం” అనే అంశాన్ని చర్చిస్తోంది. దానిలోని అంశాలు ఒక విద్యార్థి దేవుని స్నేహితుడెలా కావచ్చనే విషయాన్ని వివరిస్తాయి, ఇది సాధ్యమని చాలామంది ఎన్నడూ పరిగణించివుండరు లేదా ఊహించివుండరు. (యాకోబు 2:23) ఈ బైబిలు అధ్యయన ఉపకరణానికి ఎలాంటి స్పందన లభిస్తోంది?
18బైబిలు బోధిస్తోంది పుస్తకం “గృహస్థులను తక్షణమే సంభాషణలోకి దించగల ప్రత్యేక ఆకర్షణ”గా ఉందని ఆస్ట్రేలియాలోని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త
నివేదించాడు. ఆ పుస్తకాన్ని ఉపయోగించడం చాలా సులభమని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు: “అది చాలామంది రాజ్యప్రచారకుల్లో పరిచర్యపట్ల నమ్మకాన్ని, ఆనందాన్ని తిరిగినింపింది. కొందరు ఆ పుస్తకాన్ని బంగారమని పిలవడంలో ఆశ్చర్యం లేదు.”19 “దేవుడే మిమ్మల్ని పంపించివుంటాడు” అని గయానాలోని ఒక స్త్రీ తన ఇంటికి వచ్చిన పయినీరుతో అంది. ఆ స్త్రీతో కాపురం చేస్తున్న వ్యక్తి ఆమెను, తన ఇద్దరు చిన్నపిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పయినీరు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని 1వ అధ్యాయానికి తెరిచి “మనం ఎదుర్కొనే అన్యాయాల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు?” అనే ఉపశీర్షిక క్రిందున్న 11వ పేరాను బిగ్గరగా చదివాడు. “అందులోని అంశాలు ఆమెను ఎంతో స్పర్శించాయి. నిజానికి ఆమె అక్కణ్ణుంచి తన దుకాణం వెనక్కివెళ్లి బాగా ఏడ్చింది” అని ఆ పయినీరు చెబుతున్నాడు. ఈ స్త్రీ ఓ స్థానిక సహోదరితో క్రమ బైబిలు అధ్యయనానికి అంగీకరించి, ప్రగతి సాధిస్తోంది.
20 స్పెయిన్‌లో నివసించే హోసా అనే వ్యక్తి భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. సాంత్వనకోసం ఆయన మాదకద్రవ్యాలను ఆశ్రయించడమేకాక, మానసిక వైద్యుల సహాయం కూడా తీసుకున్నాడు. అయితే హోసాను ఎంతో కలవరపరచిన ఈ ప్రశ్నకు మానసిక వైద్యులు కూడా జవాబివ్వలేకపోయారు: “నా భార్య చనిపోయేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు?” ఓ రోజు హోసా తను పనిచేసే కంపెనీలోనే పనిచేస్తున్న ఫ్రాన్‌కెస్క్‌ను కలిశాడు. బైబిలు బోధిస్తోంది పుస్తకంలో “దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?” అనే 11వ అధ్యాయాన్ని కలిసి చర్చిద్దామని ఫ్రాన్‌కెస్క్ సూచించాడు. దానిలోని లేఖనాధార వివరణ, ఉపాధ్యాయుడు, విద్యార్థికి సంబంధించిన ఉపమానం హోసాపై గట్టి ప్రభావం చూపింది. ఆయన హృదయపూర్వకంగా అధ్యయనం ఆరంభించి, ప్రాంతీయ సమావేశానికి హాజరవడమేకాక, ఇప్పుడు స్థానిక రాజ్యమందిరంలో కూటాలకు హాజరౌతున్నాడు.
21 నలభై ఏళ్ల రోమన్, పోలాండ్‌లో వ్యాపారం చేస్తున్నాడు, ఆయనకు దేవుని వాక్యమంటే ఎనలేని గౌరవం. కానీ ఆయన తన పనిలో తీరికలేనంతగా నిమగ్నమైవున్న కారణంగా తన బైబిలు అధ్యయనంలో కొంతమేర మాత్రమే ప్రగతి సాధించాడు. అయినప్పటికీ, ఆయన జిల్లా సమావేశానికి హాజరై బైబిలు బోధిస్తోంది పుస్తకపు ప్రతిని పొందాడు. ఆ తర్వాత, ఆయన గణనీయంగా పురోగతి సాధించాడు. “ఆ పుస్తకం మూలంగా బైబిలు ప్రాథమిక బోధలన్నీ కలిసి ఓ పూర్తి చిత్రంగా రూపొందినట్లు కనిపిస్తోంది” అని ఆయన అంటున్నాడు. రోమన్ ఇప్పుడు క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తూ చక్కని పురోభివృద్ధి సాధిస్తున్నాడు.
కృతజ్ఞత చూపించడంలో పురోగమిస్తూ ఉండండి
22 “విడుదల సమీపించింది!” అనే ఉత్తేజకరమైన జిల్లా సమావేశంలో వివరించబడినట్లుగా, దేవుడు వాగ్దానం చేసిన, యేసుక్రీస్తు చిందించిన రక్తం సాధ్యపరచిన, ‘నిత్యమైన విమోచనను’ నిజ క్రైస్తవులు అమితంగా కోరుకుంటారు. “నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు” ఎడతెగక శుద్ధీకరించుకోవడంకన్నా ఈ ప్రశస్తమైన నిరీక్షణపట్ల హృదయపూర్వక కృతజ్ఞత చూపించేందుకు మెరుగైన మార్గమేదీ లేదు.—హెబ్రీయులు 9:11, 14.
23 అవును, ముందెన్నడూ లేనంతగా నేడు స్వార్థమనే ఒత్తిడివున్నా 60 లక్షలకన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులు దేవుని సేవలో సహనంతో నమ్మకంగా కొనసాగడం నిజంగా అద్భుతమే. అలాగే యెహోవా సేవకులకు దేవుని సేవించే ఆధిక్యతపట్ల ప్రగాఢ కృతజ్ఞత ఉందని చెప్పేందుకు కూడా ఇది రుజువుగా ఉంది. తమ “ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని” వారికి తెలుసు. ఆ కృతజ్ఞత పురోగమిస్తూ ఉండును గాక!—1 కొరింథీయులు 15:58; కీర్తన 110:3.
మీరెలా జవాబిస్తారు?
• దేవునిపట్ల, ఆయన ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల కృతజ్ఞత గురించి కీర్తనకర్త మనకేమి బోధిస్తున్నాడు?
• హగ్గయి 2:7లోని మాటలు నేడెలా నెరవేరుతున్నాయి?
• తనను సమర్థవంతంగా సేవించేలా యెహోవా తన సేవకులను ఎలా సిద్ధం చేస్తున్నాడు?
• యెహోవా మంచితనంపట్ల మీ కృతజ్ఞతను చూపించేందుకు మీరేమి చేయవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. మనం దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎందుకు పరిగణించాలి, కీర్తనకర్త తన కృతజ్ఞతను ఎలా వ్యక్తపరిచాడు?
3. దావీదు ఆధ్యాత్మిక వ్యక్తి అని ఏది చూపిస్తోంది?
4. ఎందుకు “యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందిం[చాడు]”?
5. యేసు శిష్యులు తమకు వెల్లడిచేయబడిన రాజ్య సత్యాలను ఎందుకు తేలికగా తీసుకోకూడదు?
6, 7. (ఎ) దైవిక సత్యంపట్ల కృతజ్ఞత కలిగివుండేందుకు మనకెలాంటి కారణాలు ఉన్నాయి? (బి) నిజమైన మతానికి, అబద్ధ మతానికి మధ్య నేడు ఎలాంటి తేడాను చూడవచ్చు?
8, 9. హగ్గయి 2:7లోని మాటలు నేడు ఎలా నెరవేరుతున్నాయి?
10, 11. ప్రజలు బైబిలు సత్యాన్ని అమూల్యమైనదిగా పరిగణించడం ఎలా ఆరంభించారో చూపించే ఒక అనుభవాన్ని వివరించండి.
12. యెహోవా తన సేవకులకు ఎల్లప్పుడూ ఏమి అందజేస్తాడు, ప్రయోజనం పొందేందుకు మనమేమిచేయాలి?
13. యెహోవా వేటిద్వారా మనకు శిక్షణనిస్తున్నాడు?
14. యెహోవా సేవకులు దేవుణ్ణి సేవించే ఆధిక్యతపట్ల తమ కృతజ్ఞతనెలా ప్రదర్శిస్తున్నారు? (27-30 పేజీల్లోని చార్టుకు సంబంధించిన వ్యాఖ్యానాలను చేర్చండి.)
15. యెహోవాకు తాము చేసే పూర్ణాత్మ సేవ విషయంలో ఎవరూ ఎందుకు నిరుత్సాహపడకూడదు?
16. ఇటీవలి కాలాల్లో దేవుడు ఎలాంటి బోధనా ఉపకరణాల్ని దయచేశాడు?
17, 18. (ఎ) బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని ఏ భాగాలను మీరు మీ పరిచర్యలో ప్రముఖంగా ఉపయోగించేందుకు ఇష్టపడతారు? (బి) బైబిలు బోధిస్తోంది పుస్తకం గురించి ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఏమని వ్యాఖ్యానించాడు?
19-21. బైబిలు బోధిస్తోంది పుస్తకంయొక్క విలువను నొక్కిచెప్పే కొన్ని అనుభవాలను వివరించండి.
22, 23. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణపట్ల మనమెలా నిరంతరం కృతజ్ఞతను చూపించవచ్చు?
[27-30వ పేజీలోని చార్టు]
ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2006వ సేవా సంవత్సరపు నివేదిక
(ముద్రిత ప్రతి చూడండి)
[25వ పేజీలోని చిత్రాలు]
తన చిత్తం నెరవేర్చేందుకు యెహోవా మనల్ని సంపూర్ణముగా సిద్ధం చేస్తున్నాడు