చదివేందుకు సులభమైనదే, కానీ అది ఖచ్చితమైనదేనా?
చదివేందుకు సులభమైనదే, కానీ అది ఖచ్చితమైనదేనా?
ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ 2005 సెప్టెంబరులో జరిగిన ద 100 మినిట్ బైబిల్ విడుదలను ఎంతో ఉత్సాహంగా సమర్థించింది. వంద నిమిషాల్లో చదివి పూర్తి చేయడానికి రూపొందించబడిన ఈ కొత్త బైబిలు హెబ్రీ లేఖనాలను ఒక్కోటి ఒక్కో పేజీ ఉన్న 17 భాగాలుగా, గ్రీకు లేఖనాలను 33 భాగాలుగా సంక్షిప్తపరిచింది. అందులో “విసుగు పుట్టించే భాగాలు” తొలగించబడ్డాయని ఒక పునర్విచారకుడు అన్నాడు. అవును, అది చదివేందుకు సులభమైనదే, కానీ అది ఖచ్చితమైనదేనా?
అందులో దేవుని నామమైన యెహోవా కనిపించదు, అంతేకాక మరిన్ని తప్పులు కూడా ఉన్నట్లు బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేసేవారు కనుగొంటారు. (కీర్తన 83:18) ఉదాహరణకు, 1వ భాగంలో, దేవుడు “భూమిని ఆకాశమును ఆరు దినాల వ్యవధిలో సృష్టించాడు” అని ఉంది. అయితే, ఆదికాండము 1:1 స్పష్టంగా “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని చెబుతోంది. ఆ తర్వాత భూమిపై జరిగిన సృష్టి కార్యాలు ఆరు “దినములు” లేదా నిర్దిష్ట కాలవ్యవధులవరకు కొనసాగాయని ప్రాథమిక వృత్తాంతం వివరిస్తుంది. ఆపై, ఆదికాండము 2:4 సృష్టి జరిగిన కాలాన్ని సమీకరిస్తూ దాన్ని “దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినము” అని పిలుస్తోంది.
ద 100 మినిట్ బైబిల్ ప్రకారం “మానవజాతిని నిందించే బాధ్యత అప్పగించబడిన . . . [దేవుని] సేవకుల్లో ఒకడైన సాతాను” యథార్థవంతుడైన యోబుపై దాడిచేశాడు. ఇక్కడ ఉన్న అసంబద్ధత మీకు కనిపిస్తోందా? “సాతాను” అనే పదానికి “విరోధి” అని అర్థం. నిజానికి, సాతాను దేవుని సేవకుడు కాడు కానీ దేవునికి ప్రధాన శత్రువు, మానవజాతిని నిందించడానికి అతడు తనను తానే స్వయంగా నియమించుకున్నాడు.—ప్రకటన 12:7-10.
మరి ద 100 మినిట్ బైబిల్‌లో ఉన్న క్రైస్తవ గ్రీకు లేఖన భాగాల విషయమేమిటి? గొఱ్ఱెల, మేకల గురించిన ఉపమానంలో యేసు “అత్యల్పులైన ఏ ఒక్కరికైనా” సహాయం చేసేవారిని తాను ఆదరిస్తానని చెప్పినట్లుగా ఈ కొత్త బైబిల్ తెలియజేస్తుంది, అయితే నిజానికి యేసు తన అడుగుజాడల్లో నడిచేవారికి అంటే తన “సహోదరులకు” సహాయం చేసేవారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. (మత్తయి 25:40) ఆ బైబిల్లోని ప్రకటన గ్రంథపు సంక్షిప్త రూపం దాని పాఠకులకు “రోము అంటే మహాబబులోను, సర్వనాశనం చేయబడుతుంది” అని చెబుతోంది. అయితే, ప్రాథమిక వ్రాతప్రతుల్లో “మహాబబులోను”కు అలాంటి గుర్తింపు ఇవ్వబడలేదనే విషయం బైబిలు విద్యార్థులకు తెలుసు.—ప్రకటన 17:15-18:24.
సృష్టికర్త గురించి తెలుసుకుని, ఆయన సంకల్పాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవారికి సంపూర్ణ బైబిలు ఇచ్చే జ్ఞానం మరింకేదీ ఇవ్వలేదు. బైబిలు చదవడానికి 100 నిమిషాలకన్నా ఎక్కువ సమయమే పడుతుందని ఒప్పుకోవాలి. అయితే అలా చదవడం ఎనలేని ఆశీర్వాదాలను తెస్తుంది. (యోహాను 17:3) మీరలా చేయడానికి కృషిచేసి ఆ ఆశీర్వాదాలను మీ సొంతం చేసుకోండి.—2 తిమోతి 3:16, 17.