పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
హార్‌మెగిద్దోనులో జరిగే “సర్వాధికారియైన దేవుని . . . యుద్ధము” అంటే ఏమిటి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి?—ప్రకటన 16:14, 16.
సరళంగా చెప్పాలంటే, హార్‌మెగిద్దోను యుద్ధం, యెహోవా నియమిత రాజైన యేసుక్రీస్తు దేవుని శత్రువులను నాశనం చేసేందుకు భవిష్యత్తులో పోరాడే భూగోళవ్యాప్త యుద్ధం. ఈ శత్రువులు, అంటే “లోకమంతట ఉన్న రాజులు,” “దయ్యముల” ప్రచారంతో ప్రేరేపించబడి, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” కోసం “హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను చోటుకు” సమకూర్చబడతారు.—ప్రకటన 16:14-16.
యుద్ధ ప్రత్యర్థులు సమకూర్చబడే స్థలం అక్షరార్థమైనది కాదు. “హార్‌మెగిద్దోను” అనే పేరుకు “మెగిద్దో పర్వతం” అని అర్థం. (ప్రకటన 16:15) ఆ పేరుతో పర్వతమంటూ ఏదీలేదు. అంతేకాక, ‘భూరాజులు వారి సేనలు’ అందరూ ఒకేచోట సమకూడడం సాధ్యంకాని పని. (ప్రకటన 19:19) నిజానికి, “చోటు” అనే పదం, భూమిపైనున్న రాజకీయ పాలకులు వారి సహచరులు తీసుకురాబడే స్థితిని సూచిస్తుంది అంటే వారు యెహోవాకు, “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన యేసుక్రీస్తు ఆధ్వర్యంలో “పరలోకమందున్న సేనలకు” వ్యతిరేకంగా ఉండే స్థితిని సూచిస్తుంది.—ప్రకటన 19:14, 16.
గమనార్హమైన విషయమేమిటంటే, “హార్‌మెగిద్దోను” అనే పదం ప్రాచీన ఇశ్రాయేలు నగరమైన మెగిద్దోతో ముడిపెట్టబడింది. అది కర్మెలు పర్వతానికి తూర్పుదిశలో యుద్ధ సంబంధంగా అత్యంత అనువైన స్థలంలో ఉండేది కాబట్టి మెగిద్దో పట్టణం ఆ కాలంనాటి ప్రధాన వర్తక రహదారులను, సైనిక మార్గాలను నియంత్రించేది. అది నిర్ణయాత్మక యుద్ధాలు జరిగే స్థలంగా కూడా ఉంది. ఉదాహరణకు, న్యాయాధిపతియైన బారాకు “మెగిద్దో కాలువల” దగ్గరే సేనాధిపతి సీసెరా ఆధిపత్యంలో వచ్చిన శక్తివంతమైన కనాను సైన్యాన్ని ఓడించాడు. (న్యాయాధిపతులు 4:12-24; 5:19, 20) న్యాయాధిపతియైన గిద్యోను కూడా ఆ పట్టణానికి దగ్గర్లోనే మిద్యానీయులను జయించాడు. (న్యాయాధిపతులు 7:1-22) మెగిద్దోను రాబోయే యుద్ధంతో ముడిపెట్టడం ద్వారా, దేవుడు తన కుమారుని ద్వారా శత్రువులనందరినీ పూర్తిగా అపజయానికి గురిచేస్తాడని బైబిలు ధృవీకరిస్తోంది.
దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? హార్‌మెగిద్దోను యుద్ధం తర్వాత ఈ భూమిపై భ్రష్టత్వం, దుష్టత్వం తీసివేయబడతాయి. మానవ చరిత్ర అంతటిలో ఎన్నడూ లేని సువర్ణ ఘడియలు ప్రారంభమౌతాయి. (ప్రకటన 21:1-4) దేవుని రాజ్యం యొక్క ప్రేమపూర్వకమైన నిర్దేశం క్రింద ఈ భూమి పరదైసుగా మారి అందులో నీతిమంతులు నిత్యమూ నివసిస్తారు.—కీర్తన 37:29.