కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

పిల్లల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

పిల్లల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

“నువ్వు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు!” మనతో అలా ఎవరైనా అంటే మనకు కోపంరావచ్చు. చిన్నపిల్లలు ఎంత ముద్దొచ్చినా, వయోజనులలో సాధారణంగా ఉండే పరిపక్వత, అనుభవం, జ్ఞానం వారిలో కనిపించవు.​—⁠యోబు 12:​12.

అయినా, యేసు ఒక సందర్భంలో తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 18:⁠3) యేసు మాటలకున్న భావమేమిటి? వయోజనులు అనుకరించాల్సిన ఏ లక్షణాలు చిన్నపిల్లల్లో ఉంటాయి?

చిన్నపిల్లల్లో ఉండే వినయాన్ని పెంపొందించుకోవడం

యేసు అలా వ్యాఖ్యానించేందుకు దారితీసిన పరిస్థితిని పరిశీలించండి. చాలాదూరం ప్రయాణం చేసి కపెర్నహూముకు వచ్చిన తర్వాత యేసు, “మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరి” అని శిష్యులను అడిగాడు. జరిగినదానికి సిగ్గుపడిన శిష్యులు మాట్లాడలేదు, ఎందుకంటే వారు తమలో ఎవరు గొప్ప అని వాదులాడుకున్నారు. చివరకు వారు, యేసును ఇలా అడిగేందుకు ధైర్యాన్ని కూడగట్టుకున్నారు: “పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు?”​—⁠మార్కు 9:​33, 34; మత్తయి 18:⁠1.

యేసుతో దాదాపు మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత కూడా ఆ శిష్యులు హోదా లేక పదవి గురించి వాదులాడుకోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, అలాంటి విషయాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చిన యూదా మతంలో వారు పెరిగారు. ఆ మత నేపథ్యంతోపాటు మానవ అపరిపూర్ణత ఆ శిష్యుల ఆలోచనలను ప్రభావితం చేసివుండవచ్చు.

యేసు కూర్చొని, శిష్యులను తన దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు: “ఎవడైనను మొదటివాడై యుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెను.” (మార్కు 9:​35) ఆ మాటలువిని వారు అవాక్కై ఉండవచ్చు. యేసు చేసిన తర్కం, గొప్పతనం విషయంలో యూదుల నమ్మకాలకు పూర్తి విరుద్ధంగా ఉంది! యేసు ఆ తర్వాత చిన్న బిడ్డను పిలిచి తన ప్రక్కన నిలబెట్టుకున్నాడు. ఆ బాలుణ్ణి ప్రేమపూర్వకంగా కౌగలించుకుంటూ, తాను చెప్పాలనుకున్న అంశాన్ని ఇలా నొక్కిచెప్పాడు: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.”​—⁠మత్తయి 18:​3, 4.

వినయం విషయంలో పిల్లలది ఎంత చక్కని మాదిరో కదా! ఈ చిత్రాన్ని ఊహించండి. బలంగా, ఎత్తుగా ఉన్న పురుషులు ఒక బాలుడి చుట్టూ చేరి అతనివంక తీక్షణంగా చూస్తున్నారు. వారి మధ్య ఆ బాలుడు ఎంతో భయంతో, అయోమయంగా నిలబడతాడు! ఆ పిల్లవాడిలో తలపడే స్వభావం గానీ, ద్వేషం గానీ కనిపించవు. ఆ బాలుడు ఎంతో దీన స్వభావాన్ని, అణకువను కనబరుస్తాడు. అవును, ఆ చిన్నపిల్లవాడు దైవిక లక్షణమైన వినయాన్ని కనబరచడంలో ఎంతో చక్కని మాదిరిగా ఉన్నాడు.

యేసు చెప్పాలనుకున్నది స్పష్టంగా ఉంది. మనం దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే చిన్నపిల్లలు కనబరిచే వినయాన్ని పెంపొందించుకోవాలి. కుటుంబం లాంటి యెహోవా సంస్థలో పోటీతత్వ తగవులకు లేదా గర్వానికి చోటులేదు. (గలతీయులు 5:​26) వాస్తవానికి, అపవాది అయిన సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఆ లక్షణాలే అతడ్ని పురికొల్పాయి. కాబట్టి, యెహోవా వాటిని అసహ్యించుకోవడంలో ఆశ్చర్యంలేదు!​—⁠సామెతలు 8:​13.

నిజక్రైస్తవులు ఇతరులకు సేవచేసేందుకు ప్రయత్నిస్తారు గానీ అధికారం చెలాయించేందుకు కాదు. చేయాల్సిన పని ఎంత హీనమైనదైనా లేక మనం సేవ అందించే వ్యక్తి ఎంత అల్పుడైనా నిజమైన వినయం ఇతరులకు సేవ చేసేందుకు మనల్ని పురికొల్పుతుంది. వినయంతో చేసే అలాంటి సేవ సంతృప్తికరమైన ప్రతిఫలాలను తీసుకొస్తుంది. యేసు ఇలా అన్నాడు: “ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనును.” (మార్కు 9:​37) ఔదార్యం, వినయం, పిల్లల్లాంటి స్వభావాన్ని పెంపొందించుకోవడం విశ్వంలోని మహోన్నతమైన వ్యక్తితో, ఆయన కుమారునితో ఐక్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. (యోహాను 17:​20, 21; 1 పేతురు 5:⁠5) ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని మనం పొందుతాం. (అపొస్తలుల కార్యములు 20:​35) దేవుని ప్రజల్లో కనిపించే సమాధానానికి, ఐక్యతకు దోహదపడ్డామనే సంతృప్తి మనకుంటుంది.​—⁠ఎఫెసీయులు 4:​1-3.

బోధింపదగినవారు, నమ్మకస్థులు

పిల్లల నుండి వయోజనులు నేర్చుకోగల మరో పాఠాన్ని యేసు ఆ తర్వాత ఇలా నొక్కిచెబుతున్నాడు: “చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడు.” (మార్కు 10:​15) పిల్లలు కేవలం వినయస్థులు మాత్రమే కాదు, వారు బోధింపదగినవారు కూడా. “వారు సమాచారాన్ని ఒక స్పంజిలా పీల్చుకుంటారు” అని ఒక తల్లి అంటోంది.

కాబట్టి, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, మనం రాజ్య సందేశాన్ని అంగీకరించి దానికి విధేయులవాలి. (1 థెస్సలొనీకయులు 2:​13) క్రొత్తగా జన్మించిన శిశువుల్లాగే మనం “నిర్మలమైన వాక్యమను పాలవలన [మనం] రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించాలి.” (1 పేతురు 2:⁠1) ఒక బైబిలు బోధను అర్థం చేసుకోవడం కష్టమనిపిస్తే అప్పుడేమిటి? “పిల్లలు తమ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు దొరికే వరకు ‘ఎందుకు’ అని అడుగుతూనే ఉంటారు” అని శిశు సంరక్షణ శాఖలో పనిచేస్తున్న ఒక స్త్రీ చెబుతోంది. వారి ఉదాహరణను మనం అనుసరించడం మంచిది. కాబట్టి అధ్యయనం చేస్తూ ఉండండి. అనుభవజ్ఞులైన క్రైస్తవులతో మాట్లాడండి. జ్ఞానం కోసం యెహోవాను వేడుకోండి. (యాకోబు 1:⁠5) పట్టుదలతో మీరు చేసే ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా సకాలంలో ప్రతిఫలమిస్తాడు.​—⁠మత్తయి 7:​7-11.

అయితే, ‘బోధింపదగినవారు సులభంగా మోసగించబడవచ్చు గదా’ అని కొందరు అనుకోవచ్చు. నమ్మదగిన మార్గనిర్దేశం ఉంటే వారలా మోసగించబడరు. ఉదాహరణకు, పిల్లలు సహజసిద్ధంగా మార్గనిర్దేశం కోసం తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు. ఒక తండ్రి ఇలా అంటున్నాడు: “తల్లిదండ్రులు ప్రతీరోజు తమ పిల్లలను కాపాడుతూ వారి అవసరాలు తీరుస్తూ ఉండడం ద్వారా పిల్లలు తమమీద నమ్మకముంచవచ్చని నిరూపిస్తారు.” మనం మన పరలోక తండ్రి అయిన యెహోవామీద నమ్మకముంచేందుకు మనకు అలాంటి కారణాలే ఉన్నాయి. (యాకోబు 1:​17; 1 యోహాను 4:​9, 10) యెహోవా తన లిఖిత వాక్యం ద్వారా మనకు నమ్మదగిన నిర్దేశాన్ని ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ, సంస్థ మనకు ఓదార్పునిచ్చి మద్దతునిస్తాయి. (మత్తయి 24:​45-47; యోహాను 14:​26) ఆ ఏర్పాట్లను ఉపయోగించుకోవడం మనకు ఆధ్యాత్మిక హాని జరగకుండా సహాయం చేస్తుంది.​—⁠కీర్తన 91:​1-16.

దేవునిపట్ల పిల్లలు కనబరిచేలాంటి నమ్మకాన్ని కనబరచడం మనకు మనశ్శాంతినిస్తుంది. ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వ్యాఖ్యానించాడు: “మన చిన్నతనంలో మన దగ్గర ప్రయాణానికి కావాల్సిన డబ్బులు లేకపోయినా, గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలో తెలియకపోయినా ప్రయాణాన్ని ప్రారంభించేవాళ్లం, అయితే మన తల్లిదండ్రులు మనల్ని క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తారో లేదో అని మనమేమాత్రం సంశయించేవాళ్లం కాదు.” మన జీవనయానంలో మనం యెహోవాపట్ల అలాంటి నమ్మకాన్నే కనబరుస్తున్నామా?​—⁠యెషయా 41:⁠9.

మన ఆధ్యాత్మికతకు అపాయం కలిగించే వైఖరుల, చర్యల జోలికి పోకుండా ఉండేందుకు దేవునిపట్ల మనకున్న సంపూర్ణ నమ్మకం సహాయం చేస్తుంది. మన నడవడి గురించి మన పరలోక తండ్రికి తెలుసని, మనం మొదట రాజ్యాన్ని, దేవుని నీతిని వెదికినంత కాలం ఆయన మనపట్ల శ్రద్ధ వహిస్తాడని యేసు చెప్పిన మాటలపై మనకు పూర్తి నమ్మకముంది. ఆధ్యాత్మిక బాధ్యతలను పణంగా పెట్టి వస్తుసంబంధమైన విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలనే శోధనకు గురికాకుండా ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది.​—⁠మత్తయి 6:​19-34.

“దుష్టత్వము విషయమై శిశువులుగా” ఉండడం

చిన్నపిల్లలు అపరిపూర్ణులుగా జన్మించినప్పటికీ ముచ్చటగొల్పే విధంగా వారిలో కల్మషంలేని హృదయం, మనసు ఉంటుంది. అందుకే, బైబిలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహిస్తోంది: “దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి.”​—⁠1 కొరింథీయులు 14:​20.

ఐదేళ్ల మోనీక్‌ను తీసుకోండి, తను వాళ్లమ్మతో ఉత్సాహంగా ఇలా చెప్పింది: “నా క్రొత్త ఫ్రెండ్‌ సారాకు నాలాగే ఉంగరాల జుట్టు ఉంది!” సారా శరీర వర్ణం వేరే అని, ఆమె వేరే జాతికి చెందిందని మోనీక్‌ చెప్పలేదు. ఒక తల్లి ఇలా అంటోంది: “చిన్నపిల్లలకు వర్ణభేదం తెలియదు. వారికి జాతి గురించి లేక వివక్ష గురించి తెలియదు.” ఈ విషయంలో పిల్లలు, అన్ని జనాంగాల ప్రజలను ప్రేమించే మన నిష్పక్షపాత దేవుని దృక్పథాన్ని ఎంత చక్కగా ప్రతిబింబిస్తారో కదా!​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.

పిల్లలకు క్షమించే అసాధారణ సామర్థ్యం కూడా ఉంది. ఒక తండ్రి ఇలా అంటున్నాడు: “చిన్నపిల్లలు అయిన జాక్‌, లీవై పోట్లాడుకున్నప్పుడు క్షమాపణ అడగమని మేము వారికి చెబుతాం, కొంతసేపటికి వారు మళ్లీ సంతోషంగా ఆడుకోవడం మొదలుపెడతారు. వారు ముఖం ముడుచుకోరు, గతాన్ని తవ్వరు, లేక క్షమించే ముందు డిమాండ్లు చేయరు. వారు మళ్లీ స్నేహితులుగా మారి తమ ఆటను కొనసాగిస్తారు.” వయోజనులు అనుకరించేందుకు అది ఎంత చక్కని మాదిరో కదా!​—⁠కొలొస్సయులు 3:​13.

అంతేకాక, చిన్నపిల్లలు దేవుడున్నాడని సులభంగా నమ్ముతారు. (హెబ్రీయులు 11:⁠6) వారిలో సహజంగా ఉండే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఇతరులకు ధైర్యంగా సాక్ష్యమిచ్చేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. (2 రాజులు 5:​2, 3) వినయంతో, హృదయపూర్వకంగా వారు చేసే ప్రార్థనలు ఎంతటి కఠిన హృదయాలనైనా స్పృశిస్తుంది. వారు శోధనలో ఉన్నప్పుడు అసాధారణ నైతిక బలాన్ని కనబరచగలరు. చిన్నపిల్లలు ఎంతటి అమూల్యమైన బహుమానాలో కదా!​—⁠కీర్తన 127:​3, 4.

పూర్వపు అందాన్ని తిరిగి పొందడం

‘బాల్యంలో కనిపించే చక్కని లక్షణాలను తిరిగి పొందడం వయోజనులకు సాధ్యమేనా’ అని మీరు అనుకోవచ్చు. అవును అనేదే దానికున్న సులభమైన, ప్రోత్సాహకరమైన జవాబు! ‘బిడ్డలవంటి వారిగా మారాలి’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞ, అది సాధ్యమని నిరూపిస్తుంది.​—⁠మత్తయి 18:⁠3.

ఉదాహరణకు, కళాఖండాల పునఃస్థాపకుల బృందం ఒకటి అమూల్యమైన కళాఖండాన్ని బాగుచేసే పనిని ప్రారంభించవచ్చు. ఆ ప్రక్రియలో వారు దానిమీద పేరుకుపోయిన మురికిని తొలగించి, గతంలో నైపుణ్యంతో చేయబడని పునఃస్థాపనా ప్రయత్నాలవల్ల జరిగిన నష్టాన్ని పూరిస్తారు. పునఃస్థాపకులు ఎంతో ఓర్పుతో కృషి చేసిన తర్వాత ఆ కళాఖండానికి సంబంధించిన మునుపటి అద్భుతమైన రంగులు, సహజ అందం అందరికీ కనిపిస్తాయి. అలాగే, పట్టుదలతో చేసే కృషితో, యెహోవా పరిశుద్ధాత్మ సహాయంతో, క్రైస్తవ సంఘపు ప్రేమపూర్వక మద్దతుతో మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు మనలో సహజంగా వికసించిన చక్కని లక్షణాలను తిరిగిపొందవచ్చు.​—⁠ఎఫెసీయులు 5:⁠1.

[9వ పేజీలోని చిత్రం]

పిల్లలు సహజసిద్ధంగా వినయస్థులు

[10వ పేజీలోని చిత్రం]

చిన్నపిల్లలు వివక్ష కనబరచరు, వారు త్వరగా క్షమించి, దానిని మరచిపోగలరు