కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా కృతజ్ఞతగల దేవుడు

యెహోవా కృతజ్ఞతగల దేవుడు

యెహోవా కృతజ్ఞతగల దేవుడు

‘మీరు చేసిన కార్యమును, మీరు తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.’​—⁠హెబ్రీయులు 6:​10.

యెహోవా తన చిత్తం చేసేందుకు యథార్థంగా ప్రయత్నించే వారి కృషిని విలువైనదిగా పరిగణిస్తూ వారిని మెండుగా ఆశీర్వదిస్తాడు. (హెబ్రీయులు 11:⁠6) దేవుని వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ అసాధారణ లక్షణం గురించి నమ్మకస్థుడైన బోయజుకు తెలుసు కాబట్టే, విధవరాలైన తన అత్తను ప్రేమగా చూసుకొన్న మోయాబీయురాలైన రూతుతో ఇలా అన్నాడు: ‘యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును, నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును.’ (రూతు 2:​12) మరి రూతును దేవుడు ఆశీర్వదించాడా? నిస్సందేహంగా! ఆమె కథ బైబిల్లో వ్రాయబడింది! అంతేకాక, ఆమె బోయజును పెళ్లి చేసుకొని రాజైన దావీదుకు, యేసుక్రీస్తుకు పూర్వీకురాలైంది. (రూతు 4:​13, 17; మత్తయి 1:​5, 6, 16) యెహోవాకు తన సేవకులపట్ల కృతజ్ఞత ఉందని చూపించే బైబిల్లోని అనేక ఉదాహరణల్లో ఇది ఒకటి మాత్రమే.

2 కృతజ్ఞత చూపించకుండా ఉంటే, తాను అన్యాయం చేసినట్లవుతుందని యెహోవా పరిగణిస్తాడు. హెబ్రీయులు 6:⁠10 ఇలా చెబుతోంది: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” దైవభక్తిగల మనుష్యులు పాపులైనా, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినా ఆయన వారిపట్ల కృతజ్ఞత కనబరుస్తాడన్న విషయమే ఈ వ్యాఖ్యానాన్ని విశేషమైనదిగా చేస్తోంది.​—⁠రోమీయులు 3:​23.

3 మన అపరిపూర్ణత కారణంగా మన దైవభక్తి క్రియలు నిరర్థకమైనవని, దేవుని ఆశీర్వాదానికి అనర్హమైనవని మనం భావించవచ్చు. కానీ యెహోవా మన ఉద్దేశాలను, పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని, పూర్ణాత్మతో మనం చేసే సేవను అమూల్యమైనదిగా పరిగణిస్తాడు. (మత్తయి 22:​37) ఉదాహరణకు, ఒక తల్లి తన బల్లపై ఓ బహుమానాన్ని అంటే అంత ఖరీదుచేయని నెక్లెస్‌ను చూసిందనుకుందాం. ఆమె ఆ బహుమానాన్ని ఏమాత్రం విలువైనదిగా ఎంచకుండా ప్రక్కన పడేయవచ్చు. కానీ దానితోపాటు ఉన్న కార్డులోని మాటలు తన చిన్నారి పాప తాను దాచిపెట్టుకున్న డబ్బంతాపెట్టి ఆ బహుమానం కొన్నట్లు వెల్లడిచేస్తాయి. ఇప్పుడా తల్లి ఆ బహుమానాన్ని మరో కోణంలోంచి చూస్తుంది. బహుశా చెమర్చిన కళ్లతో ఆమె తన కూతుర్ని అక్కున చేర్చుకుని తన హృదయపూర్వక కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది.

4 మన ఉద్దేశాలు, పరిమితులు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, మనమాయనకు ఇవ్వగలిగింది అల్పమైనా, అధికమైనా యెహోవా దాన్ని విలువైనదిగా ఎంచుతాడు. ఈ విషయంలో, యేసు తన తండ్రికి పరిపూర్ణ ప్రతిబింబంగా ఉన్నాడు. విధవరాలి చిన్న కానుకకు సంబంధించిన బైబిలు వృత్తాంతాన్ని గుర్తుచేసుకోండి. “కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన [యేసు] పారజూచెను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి​—⁠ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.”​—⁠లూకా 21:​1-4.

5 అవును, ఆ స్త్రీ పరిస్థితిని అంటే ఆమె బీద విధవరాలనే విషయం తెలిసిన యేసు ఆమె ఇచ్చిన కానుకయొక్క నిజమైన విలువను అర్థం చేసుకొని, దానిని విలువైనదిగా ఎంచాడు. యెహోవా గురించి కూడా అలాగే చెప్పవచ్చు. (యోహాను 14:⁠9) మీ పరిస్థితులు ఎలావున్నా, కృతజ్ఞతగల మన దేవుని, ఆయన కుమారుని అనుగ్రహం మీకు లభిస్తుందని తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా లేదా?

దైవభక్తిగల ఐతియోపీయునికి యెహోవా ప్రతిఫలమివ్వడం

6 యెహోవా తన చిత్తం చేసేవారికి ప్రతిఫలమిస్తాడని లేఖనాల్లో పదేపదే చూపించబడింది. దైవభక్తిగల ఐతియోపీయుడైన ఎబెద్మెలెకుతో దేవుడు వ్యవహరించిన విధానాన్ని పరిశీలించండి, ఆయన యిర్మీయా సమకాలీనుడు, నమ్మకద్రోహియైన యూదా రాజైన సిద్కియా ఇంట్లో సేవకుడు. యూదా ప్రధానులు ప్రవక్తయైన యిర్మీయాపై రాజద్రోహిగా తప్పుడు ముద్రవేసి, ఆహారంలేక మరణించేలా ఆయనను ఓ గోతిలో (నీటిని నిలవజేసే కట్టడంలో) పడేశారని ఎబెద్మెలెకుకు తెలిసింది. (యిర్మీయా 38:​1-7) యిర్మీయా తాను ప్రకటించిన సందేశాన్నిబట్టి తీవ్రంగా ద్వేషించబడ్డాడని తెలుసుకున్న ఎబెద్మెలెకు తన ప్రాణాన్ని ఫణంగాపెట్టి రాజును వేడుకున్నాడు. ఆ ఐతియోపీయుడు ధైర్యంగా ఇలా అన్నాడు: “రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము, అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును.” రాజాజ్ఞ మేరకు ఎబెద్మెలెకు 30 మంది మనుష్యులను తీసుకొనివెళ్లి దేవుని ప్రవక్తను కాపాడాడు.​—⁠యిర్మీయా 38:​8-13.

7 ఎబెద్మెలెకు విశ్వాసంతో చర్య తీసుకున్నాడని యెహోవా గమనించాడు, ఆ విశ్వాసం ఆయనకున్న ఎలాంటి భయాన్నైనా అధిగమించేందుకు ఆయనకు సహాయం చేసింది. యెహోవా తన కృతజ్ఞతను చూపిస్తూ యిర్మీయా ద్వారా ఎబెద్మెలెకుతో ఇలా అన్నాడు: “మేలుచేయుటకై కాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; . . . ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవు . . . నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, . . . దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు.” (యిర్మీయా 39:​16-18) అవును, యెహోవా ఎబెద్మెలెకును, అలాగే యిర్మీయాను దుష్టులైన యూదా ప్రధానుల నుండి ఆ తర్వాత యెరూషలేమును నాశనంచేసిన బబులోనీయుల నుండి కాపాడాడు. “తన భక్తుల ప్రాణములను ఆయన [యెహోవా] కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలోనుండి ఆయన వారిని విడిపించును” అని కీర్తన 97:⁠10 చెబుతోంది.

“రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును”

8 దైవభక్తితో మనం చేసే క్రియలపట్ల యెహోవాకు కృతజ్ఞత ఉందని, వాటిని ఆయన విలువైనవిగా పరిగణిస్తాడని చెప్పేందుకున్న మరో రుజువును ప్రార్థన గురించి బైబిలు చెబుతున్నదానిలో చూడవచ్చు. “యథార్థవంతుల ప్రార్థన ఆయనకు [దేవునికి] ఆనందకరము” అని జ్ఞానవంతుడు వ్రాశాడు. (సామెతలు 15:⁠8) యేసు కాలంలో చాలామంది మతనాయకులు నిజమైన భక్తితో కాదుగానీ ప్రజలను ఆకట్టుకునేందుకు బహిరంగంగా ప్రార్థించారు. “వారు తమ ఫలము పొందియున్నారు” అని యేసు చెప్పాడు. కానీ “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును” అని ఆయన తన అనుచరులకు ఉపదేశించాడు.​—⁠మత్తయి 6:​5, 6.

9 యేసు బహిరంగంగా ప్రార్థించడాన్ని ఖండించడంలేదు, ఎందుకంటే ఆయనే కొన్ని సందర్భాల్లో బహిరంగంగా ప్రార్థించాడు. (లూకా 9:​16) ఇతరులను ఆకట్టుకోవాలనే ఆలోచనతోకాక యథార్థ హృదయంతో మనం ప్రార్థించినప్పుడు యెహోవా దానినెంతో విలువైనదిగా పరిగణిస్తాడు. వాస్తవానికి మన ఏకాంత ప్రార్థనలు దేవునిపట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమకు, ఆయనమీద మనకున్న నమ్మకానికి చక్కని సూచనగా ఉంటాయి. కాబట్టి, యేసు తరచూ ఏకాంతంగా ప్రార్థించేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగించదు. ఓ సందర్భంలో ఆయన ‘పెందలకడనే చాలా చీకటిగా ఉండగానే’ ప్రార్థించాడు. మరో సమయంలో, “ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ” మీదికి వెళ్లాడు. తన 12 మంది అపొస్తలులను ఎంపిక చేసుకోవడానికి ముందు యేసు ఒక రాత్రంతా ఒంటరిగా ప్రార్థనలో గడిపాడు.​—⁠మార్కు 1:​35; మత్తయి 14:​23; లూకా 6:​12, 13.

10 యెహోవా తన కుమారుడు హృదయపూర్వకంగా ప్రార్థించడాన్ని ఎంత శ్రద్ధగా వినివుంటాడో ఊహించండి! వాస్తవానికి, యేసు కొన్ని సందర్భాల్లో ‘మహా రోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున’ దేవుడాయన ప్రార్థన విన్నాడు. (హెబ్రీయులు 5:⁠7; లూకా 22:​41-44) మన ప్రార్థనలు అంతటి నిజాయితీని, దేవుణ్ణి సంతోషపెట్టాలనే ప్రగాఢ కోరికను ప్రతిబింబించినప్పుడు, మన పరలోకపు తండ్రి మన ప్రార్థనలను జాగ్రత్తగా వింటూ, వాటిని విలువైనవిగా పరిగణిస్తాడని మనం నమ్మవచ్చు. అవును, “తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.”​—⁠కీర్తన 145:​18.

11 మనం రహస్యంగా ప్రార్థించడాన్నే యెహోవా విలువైనదిగా పరిగణించినప్పుడు, మనం రహస్య సమయాల్లో తనకు విధేయత చూపించడాన్ని ఆయన ఇంకెంత విలువైనదిగా పరిగణిస్తాడో కదా! అవును, మనం రహస్యంగా చేసేవన్నీ యెహోవాకు తెలుసు. (1 పేతురు 3:​12) మనం ఏకాంతంగా ఉన్నప్పుడు నమ్మకంగా, విధేయంగా ఉండడం, యెహోవాపట్ల మనకు ఉద్దేశంలో స్వచ్ఛమైన, సరైనది చేసేందుకు స్థిరంగావున్న ‘సంపూర్ణ హృదయం’ ఉందనేందుకు చక్కని సూచికగా ఉంటుంది. (1 దినవృత్తాంతములు 28:​9, NW) అలాంటి ప్రవర్తన యెహోవా హృదయాన్ని ఎంత సంతోషపరుస్తుందో కదా!​—⁠సామెతలు 27:​11; 1 యోహాను 3:​22.

12 కాబట్టి నమ్మకమైన క్రైస్తవులు మనసును, హృదయాన్ని పాడుచేసే అశ్లీలతను, దౌర్జన్యాన్ని చూడడంలాంటి రహస్య పాపాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కొన్ని పాపాలు మానవుల కళ్లుగప్పినా, “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని మనం గ్రహిస్తాం. (హెబ్రీయులు 4:​13; లూకా 8:​17) యెహోవా మనసు నొప్పించేవాటికి దూరంగా ఉండేందుకు కృషిచేయడం ద్వారా, మనం పరిశుభ్రమైన మనస్సాక్షిని కలిగివుండడమేకాక, మనపై దేవుని ఆమోదముందని తెలుసుకొని సంతోషిస్తాం. అవును, “యథార్థమైన ప్రవర్తనగలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు” వ్యక్తిని యెహోవా నిజంగా విలువైనవారిగా పరిగణిస్తాడనేదానిలో సందేహం లేదు.​—⁠కీర్తన 15:​1, 2.

13 అయితే చెడుతనం నిండివున్న లోకంలో మన మనసును, హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు? (సామెతలు 4:​23; ఎఫెసీయులు 2:⁠2) ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నింటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, అనుచిత కోరికలు గర్భము ధరించి పాపాన్ని కనకుండా సత్వరమే చర్య తీసుకుంటూ మంచిని ప్రేమిస్తూ, చెడును తిరస్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. (యాకోబు 1:​14, 15) “ఇతనియందు ఏ కపటమును లేదు” అని నతనయేలు గురించి చెప్పినట్లే, యేసు మీ గురించి చెప్పినప్పుడు మీరెంత సంతోషిస్తారో ఆలోచించండి. (యోహాను 1:​47) బర్తొలొమయి అని కూడా పిలవబడిన నతనయేలుకు ఆ తర్వాత యేసు 12 మంది అపొస్తలుల్లో ఒకడయ్యే గొప్ప అవకాశం లభించింది.​—⁠మార్కు 3:​16-19.

“కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడు”

14 ‘అదృశ్య దేవుడైన’ యెహోవా ‘స్వరూపంలో’ ఉన్న యేసు, స్వచ్ఛమైన హృదయంతో దేవుని సేవించేవారిపట్ల కృతజ్ఞత చూపించడంలో ఎల్లప్పుడూ తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరిస్తాడు. (కొలొస్సయులు 1:​15) ఉదాహరణకు, యేసు తన ప్రాణాన్ని అప్పగించడానికి ఐదు రోజుల ముందు ఆయన, ఆయన శిష్యుల్లోని కొందరు బేతనియలోని సీమోను ఇంటికి అతిథులుగా వెళ్లారు. సాయంకాలమప్పుడు, లాజరు, మార్తల సోదరియైన మరియ (దాదాపు ఒక సంవత్సర జీతమంత ఖరీదైన) “మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని” యేసు పాదాలమీద, తలమీద పోసింది. (యోహాను 12:⁠3) “ఈ నష్టమెందుకు” అని కొందరు అన్నారు. అయితే యేసు మరియ చేసిన పనిని భిన్నమైన కోణంలో చూశాడు. త్వరలో సంభవించే తన మరణం, భూస్థాపన దృష్ట్యా ఆ చర్యను ఆయన ఉదారమైనదిగా, ఎంతో విశేషమైనదిగా దృష్టించాడు. అందువల్ల యేసు మరియను విమర్శించే బదులు ఆమెను సన్మానించాడు. “సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును” అన్నాడు.​—⁠మత్తయి 26:​6-13.

15 యేసులాంటి కృతజ్ఞతగల వ్యక్తిని మన నాయకునిగా కలిగివుండడం ఎంతటి ఆధిక్యతో కదా! వాస్తవానికి, మానవునిగా యేసు గడిపిన జీవితం యెహోవా ఆయనకోసం ఉంచిన పనికి అంటే మొదట అభిషిక్త క్రైస్తవుల సంఘానికి, ఆ తర్వాత లోకానికి ప్రధానయాజకునిగా, రాజుగా సేవచేసేందుకు ఆయనను ఆయత్తపర్చింది.​—⁠కొలొస్సయులు 1:​13; హెబ్రీయులు 7:​26; ప్రకటన 11:​15.

16 భూమ్మీదికి రాకముందే యేసుకు మానవాళిపట్ల ప్రగాఢమైన ఆసక్తి, విశేషమైన ప్రేమ ఉన్నాయి. (సామెతలు 8:​31) మానవునిగా జీవించడం ద్వారా, మనం దేవునికి చేసే సేవలో ఎదుర్కొనే పరీక్షలను ఆయన మరింత సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగాడు. “కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన [యేసు] తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. యేసు “మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను” కాబట్టి ఆయన “మన బలహీనతలయందు మనతో సహానుభవము” గలవానిగా ఉండగలడు.​—⁠హెబ్రీయులు 2:​17, 18; 4:​15, 16.

17 యేసుకు తన అనుచరులకు వచ్చే పరీక్షలపట్ల అధిక అవగాహన ఉందనే విషయం ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత స్పష్టమైంది. అపొస్తలుడైన యోహాను వ్రాసినట్లుగా, ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాలకు ఆయన పంపిన లేఖలను పరిశీలించండి. స్ముర్న సంఘానికి యేసు ఇలా చెప్పాడు: “నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును.” ఇక్కడ యేసు నిజానికి ఇలా అంటున్నాడు: ‘నీ సమస్యలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను; నువ్వెంత బాధననుభవిస్తున్నావో నాకు తెలుసు.’ యేసు మరణంవరకు తాను అనుభవించిన శ్రమనుబట్టి పొందిన అధికారంతో, కనికరంతో ఇంకా ఇలా అన్నాడు: “మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.”​—⁠ప్రకటన 2:​8-10.

18 ఆ ఏడు సంఘాలకు వ్రాయబడిన లేఖలు, యేసుకు తన శిష్యులకు వచ్చే పరీక్షలు పూర్తిగా తెలుసనే విషయాన్ని, వారి యథార్థతా జీవితంపట్ల నిజమైన కృతజ్ఞతవుందనే విషయాన్ని ప్రతిబింబించే మాటలతో నిండివున్నాయి. (ప్రకటన 2:​1-3:​22) యేసు ఆ లేఖలు ఎవరికి ఉద్దేశించాడో వారు ఆయనతోపాటు పరలోకంలో పరిపాలించే నిరీక్షణగల అభిషిక్త క్రైస్తవులని గుర్తుంచుకోండి. వారు తమ ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ అత్యంత కనికరముతో పీడింపబడుతున్న మానవాళికి క్రీస్తు విమోచన క్రయధన బలి ప్రయోజనాలు చేకూర్చేందుకు దోహదపడే ఉదాత్తమైన పనికోసం సిద్ధం చేయబడుతున్నారు.​—⁠ప్రకటన 5:​9-10; 22:​1-5.

19 యేసుకు తన అభిషిక్త అనుచరులపట్ల ఉన్న ప్రేమ, రాబోయే “మహాశ్రమల” నుండి రక్షించబడే, ‘ప్రతి జనములోనుండి వచ్చిన గొప్పసమూహముగా’ రూపొందుతూ ఇప్పుడు లక్షల సంఖ్యలోవున్న తన యథార్థ “వేరే గొఱ్ఱెల”పట్ల కూడా విస్తరిస్తుంది. (యోహాను 10:​16; ప్రకటన 7:​9, 14) వీరు యేసు విమోచన క్రయధన బలిపట్ల, నిత్యజీవ నిరీక్షణపట్ల తమకున్న కృతజ్ఞతనుబట్టి యేసు పక్షం వహిస్తున్నారు. వారు తమ కృతజ్ఞతనెలా కనబరుస్తున్నారు? ‘దేవునికి రాత్రింబగళ్లు సేవచేస్తూ’ వారు తమ కృతజ్ఞతను కనబరుస్తున్నారు.​—⁠ప్రకటన 7:​15-17.

20 నమ్మకస్థులైన ఈ పరిచారకులు వాస్తవంగానే “రాత్రింబగళ్లు” యెహోవా సేవచేస్తున్నారని 27-30 పేజీల్లో ఇవ్వబడిన 2006 సంవత్సరపు ప్రపంచవ్యాప్త నివేదిక స్పష్టమైన రుజువునిస్తోంది. నిజానికి, ఆ ఒక్క సంవత్సరంలోనే వారు శేషించిన అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపుతో కలిసి బహిరంగ పరిచర్యకు మొత్తం 133,39,66,199 గంటలను వెచ్చించారు, ఆ గంటలన్నీ కలిపితే, అది 1,50,000 సంవత్సరాలకన్నా ఎక్కువకు సమానమవుతుంది!

ఎల్లవేళలా కృతజ్ఞత కనబర్చండి!

21 అపరిపూర్ణ మానవులతో వ్యవహరించేటప్పుడు యెహోవా, ఆయన కుమారుడు అత్యంత విస్తృతరీతిలో తమ ప్రగాఢ కృతజ్ఞతను కనబర్చారు. కానీ, మానవుల్లో అధికశాతంమంది దేవుని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, తమ స్వవిషయాలపైనే దృష్టి సారించడం శోచనీయం. “అంత్యదినములలో” జీవిస్తున్న ప్రజలను వర్ణిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: ‘మనుష్యులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, కృతజ్ఞతలేనివారిగా ఉంటారు.’ (2 తిమోతి 3:​1-5) హృదయపూర్వక ప్రార్థనతో, ఇష్టపూర్వక విధేయతతో, పూర్ణాత్మ సేవతో దేవుడు తమకోసం చేసినదానంతటిపట్ల కృతజ్ఞతను కనబరిచే నిజ క్రైస్తవులకు అలాంటివారు ఎంత భిన్నంగా ఉన్నారో కదా!​—⁠కీర్తన 62:⁠8; మార్కు 12:​30; 1 యోహాను 5:⁠3.

22 తర్వాతి ఆర్టికల్‌లో మనం యెహోవా మనపట్ల ప్రేమతో చేసిన అనేక ఆధ్యాత్మిక ఏర్పాట్లలో కొన్నింటిని సమీక్షిస్తాం. ఈ ‘శ్రేష్ఠమైన ఈవులను’ మనం ధ్యానిస్తుండగా, మన కృతజ్ఞత అంతకంతకూ మరింత ప్రగాఢమగును గాక!​—⁠యాకోబు 1:​17.

మీరెలా జవాబిస్తారు?

• తాను కృతజ్ఞతగల దేవుడనని యెహోవా ఎలా చూపించాడు?

• ఒంటరిగా ఉన్నప్పుడు మనమెలా యెహోవా హృదయాన్ని సంతోషింపజేయవచ్చు?

• యేసు ఏయే విధాలుగా కృతజ్ఞతను కనబర్చాడు?

• కనికరం, కృతజ్ఞతగల పరిపాలకునిగా ఉండేందుకు మానవునిగా జీవించడం యేసుకు ఎలా సహాయం చేసింది?

[అధ్యయన ప్రశ్నలు]

1. మోయాబీయురాలైన రూతుపట్ల యెహోవా తన కృతజ్ఞతను ఎలా చూపించాడు?

2, 3. (ఎ) యెహోవా పలికిన కృతజ్ఞతా మాటలను ఏది అసాధారణం చేస్తుంది? (బి) యెహోవా ఎందుకు నిజమైన కృతజ్ఞతను వ్యక్తం చేయగలడు? ఉదాహరించండి.

4, 5. కృతజ్ఞత చూపించడంలో యేసు ఎలా యెహోవాను అనుకరించాడు?

6, 7. ఎబెద్మెలెకుపట్ల యెహోవా తన కృతజ్ఞతను ఎందుకు, ఎలా ప్రదర్శించాడు?

8, 9. యేసు చూపించినట్లుగా, యెహోవా ఎలాంటి ప్రార్థనలను విలువైనవిగా పరిగణిస్తాడు?

10. మన ప్రార్థనలు నిజాయితీని, దేవుణ్ణి సంతోషపెట్టాలనే ప్రగాఢ కోరికను ప్రతిబింబించినప్పుడు మనమేమి నమ్మవచ్చు?

11. మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవాటి గురించి యెహోవా మనోభావమెలా ఉంటుంది?

12, 13. మన మనసును, హృదయాన్ని కాపాడుకుంటూ మనం నమ్మకమైన శిష్యుడైన నతనయేలులా ఎలా ఉండవచ్చు?

14. మరియ చేసిన పనికి యేసు స్పందించిన తీరు ఇతరుల స్పందనకు ఎలా భిన్నంగావుంది?

15, 16. యేసు మానవునిగా జీవించి, దేవుణ్ణి సేవించడాన్నిబట్టి మనమెలా ప్రయోజనం పొందుతాం?

17, 18. (ఎ) ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాలకు వ్రాయబడిన లేఖలు యేసుకున్న ప్రగాఢమైన కృతజ్ఞత గురించి ఏమి వెల్లడిచేస్తున్నాయి? (బి) ఆ అభిషిక్త క్రైస్తవులు దేనికోసం సిద్ధం చేయబడుతున్నారు?

19, 20. ‘గొప్పసమూహముగా’ రూపొందేవారు యెహోవాపట్ల, ఆయన కుమారునిపట్ల తమ కృతజ్ఞతను ఎలా కనబరుస్తున్నారు?

21, 22. (ఎ) కృతజ్ఞత కనబర్చే విషయంలో క్రైస్తవులు ప్రత్యేకంగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[17వ పేజీలోని చిత్రం]

తన కూతురిచ్చిన అల్పబహుమానాన్ని తల్లి ప్రేమించినట్లే, యెహోవా కూడా మనం మన శక్తిమేరకు ఇచ్చినప్పుడు దాన్ని విలువైనదిగా పరిగణిస్తాడు