కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యులను తయారుచేసే పనిలో నేనెంతో సంతోషించాను

శిష్యులను తయారుచేసే పనిలో నేనెంతో సంతోషించాను

జీవిత కథ

శిష్యులను తయారుచేసే పనిలో నేనెంతో సంతోషించాను

పామెలా మోజ్లి చెప్పినది

1941లో, ఇంగ్లాండ్‌ దేశం యుద్ధంలో తలమునకలైవున్న సమయంలో మా అమ్మ నన్ను లీసెస్టర్‌లో జరుగుతున్న యెహోవాసాక్షుల సమావేశానికి తీసుకెళ్లింది. జోసెఫ్‌ రూథర్‌ఫర్డ్‌ పిల్లల గురించి ఇచ్చిన ప్రత్యేక ప్రసంగాన్ని మేము విన్నాము. నేను, మా అమ్మ ఆ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేందుకు మాకు సహాయం చేసినవారు ఎంతో సంతోషించడాన్ని నేను గమనించాను. యేసుక్రీస్తుకు శిష్యులను తయారుచేయడంలో ఎంత సంతోషం కలుగుతుందో నేనప్పుడు గుర్తించలేదు.

మేము 1940 నుండి శిష్యులుగా మారే దిశగా ప్రగతి సాధించడం మొదలుపెట్టాం. 1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన భయానకమైన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. మా అమ్మ “లోకం శాంతిని ఎందుకు కనుగొనలేకపోతోంది” అనే ప్రశ్నను చెమర్చిన కళ్లతో పదేపదే అడగడం నాకు గుర్తుంది. మా తల్లిదండ్రులు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుండగా సైన్యంలో పనిచేసి ఆ యుద్ధంలో జరిగిన దురాగతాలను చూశారు. మా అమ్మ బ్రిస్టల్‌ నగరంలో ఉన్న ఆంగ్లికన్‌ మతాచారిని ఆ ప్రశ్న అడిగింది. ఆయన “యుద్ధాలు ఎప్పుడూ ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ ఉంటాయి” అని మాత్రమే చెప్పాడు.

అయితే, ఆ తర్వాత కొంతకాలానికి ఒక వృద్ధ స్త్రీ మా ఇంటికి వచ్చింది. ఆమె ఒక యెహోవాసాక్షి. “లోకం శాంతిని ఎందుకు కనుగొనలేకపోతోంది” అనే ప్రశ్ననే మా అమ్మ ఆమెను కూడా అడిగింది. ఈ హింసాయుత విధానాంతంలో మనం జీవిస్తున్నామనే సూచనలో యుద్ధాలు ఒక భాగమని ఆ సాక్షి వివరించింది. (మత్తయి 24:​3-14) అనతికాలంలోనే ఆమె కూతురు మాతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించింది. మేము బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు సంతోషంగా గమనిస్తున్నవారిలో వారిద్దరు కూడా ఉన్నారు. శిష్యులను తయారుచేయడం ఎందుకంత సంతోషాన్నిస్తుంది? కొన్నాళ్ల తర్వాత దానికిగల కారణాన్ని నేను తెలుసుకున్నాను. శిష్యులను తయారుచేసే పనిలో నేను గడిపిన 65 కన్నా ఎక్కువ సంవత్సరాల్లో నేను తెలుసుకున్న కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటాను.

బోధించడంలో ఉన్న ఆనందాన్ని కనుగొనడం

నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు బ్రిస్టల్‌లో రాజ్య ప్రకటనా పనిలో భాగం వహించడం ప్రారంభించాను. ఒక సహోదరుడు నాకు ఫోనోగ్రాఫ్‌తోపాటు సాక్ష్యమిచ్చే కార్డును ఇచ్చి, “ఇప్పుడు నీవు అవతలివైపు వీధిలోవున్న ఇళ్లకు వెళ్లు” అన్నాడు. అలా నేను ఒంటరిగానే ప్రకటనాపని ప్రారంభించాను. నాకెంతో భయమేసింది. నేను రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాన్ని వినిపించి ఆ తర్వాత బైబిలు సాహిత్యాన్ని తీసుకోమని ప్రజలను కోరే సాక్ష్యమిచ్చే కార్డును గృహస్థులకు చూపించేదాన్ని.

1950వ పడి మొదలుకొని, ఇంటింటి పరిచర్యలో బైబిలు నుండి లేఖనాన్ని చదవడానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది. నేను బిడియస్థురాలిని కాబట్టి, అపరిచితులతో మాట్లాడి, వారికి బైబిలు లేఖనాలను వివరించడం నాకు మొదట్లో కష్టంగా అన్పించింది. అయితే నేను మెల్లమెల్లగా ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. అప్పుడే నేను పరిచర్యను నిజంగా ఆస్వాదించడం మొదలుపెట్టాను. కొంతమంది మమ్మల్ని ఏదో పుస్తకాలను అమ్ముకునేవారిగా దృష్టించేవారు, కానీ మేము వారికి బైబిలు లేఖనాలను చదివి వివరించినప్పుడు వారు మమ్మల్ని దేవుని వాక్య బోధకులుగా గుర్తించారు. నేను ఈ పనిని ఎంతగా ఆనందించానంటే నేను దీనిలో ఎక్కువగా భాగం వహించాలని కోరుకున్నాను. కాబట్టి, 1955 సెప్టెంబరులో, నేను పయినీరుగా పూర్తికాల పరిచర్య ప్రారంభించాను.

పట్టుదల ప్రతిఫలాలనిస్తుంది

నేను నేర్చుకున్న మొదటి పాఠాల్లో, దయాపూర్వకమైన పట్టుదల ప్రతిఫలాలనివ్వగలదు అనేది ఒకటి. ఒక సందర్భంలో నేను కావలికోట పత్రికను వయోలెట్‌ మోరీస్‌ అనే స్త్రీకి ఇచ్చాను. నేను ఆమెను కలుసుకోవడానికి తిరిగివెళ్లినప్పుడు, ఆమె తలుపు బార్లా తెరచి, చేతులుకట్టుకొని నిలబడి నేను ఆమెకు లేఖనాల నుండి వివరిస్తున్నదాన్ని శ్రద్ధగా విన్నది. నేను ఆమెను కలుసుకున్న ప్రతీసారి ఆమెకు నిజంగా ఆసక్తి ఉన్నట్లు అనిపించేది. అయితే నేను క్రమ బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించినప్పుడు ఆమె, “ఇప్పుడు కాదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక చూద్దాం” అని చెప్పింది. నేను ఎంత నిరాశ చెందానో! “వెదకుటకు పోగొట్టుకొనుటకు” సరైన సమయం ఉందని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 3:​6, 7) పట్టువీడకూడదని నేను నిర్ణయించుకున్నాను.

ఒక నెల తర్వాత, నేను ఆమె ఇంటికి తిరిగి వెళ్లి, మరి కొన్ని లేఖనాలు చర్చించాను. అనతికాలంలో, ఆమె ప్రతీవారం తన ఇంటిగుమ్మం దగ్గర బైబిలు అధ్యయనాన్ని చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె ఇలా అడిగింది: “మీరు లోపలికి రావడం మంచిదని నాకనిపిస్తుంది, మీరేమంటారు?” తర్వాత, వయోలెట్‌ ఎంత చక్కని తోటి విశ్వాసురాలిగా, స్నేహితురాలిగా తయారైందో! అవును, వయోలెట్‌ యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకుంది.

తన భర్త తనకు చెప్పకుండా తమ ఇల్లు అమ్మేసి తనను వదిలివెళ్లాడని తెలుసుకొని ఒకరోజు వయోలెట్‌ నిర్ఘాంతపోయింది. సంతోషకరంగా, సాక్షియైన ఒక స్నేహితుని సహాయంతో ఆమె ఆ రోజు మధ్యాహ్నమే మరో ఇంటిని చూసుకుంది. యెహోవాపట్ల కృతజ్ఞతతో ఆమె తన శేష జీవితాన్ని పయినీరు సేవలో గడపాలని నిర్ణయించుకుంది. యెహోవా ఆత్మ ఆమెలో సత్యారాధనపట్ల ఉత్సాహాన్ని నింపడం నేను చూసినప్పుడు శిష్యులను తయారుచేయడంలో ఎందుకంత సంతోషం కలుగుతుందో గ్రహించాను. అవును, దానినే నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను!

నేనూ మేరీ రాబిన్‌సన్‌ అనే మరో సహోదరీ, 1957లో స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో ఉన్న రథర్‌గ్లెన్‌ అనే పారిశ్రామిక ప్రాంతానికి నియమించబడ్డాం. మేము పొగమంచులో, గాలివానల్లో, మంచులో ఇలా అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో ప్రకటించాం, అయితే మాకు దానికి తగిన ప్రతిఫలం లభించింది. ఒకరోజు నేను జెస్సీని కలిశాను. నేను ఆమెతో బైబిలు అధ్యయనం చేయడంలో ఆనందించాను. ఆమె భర్త వాలీ కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు, ఆయన మొదట్లో నన్ను తప్పించుకొని తిరిగేవాడు. ఆయన బైబిలు అధ్యయనం చేసి, దేవుని రాజ్యం మాత్రమే ప్రజలకు ఆదర్శవంతమైన పరిస్థితులను తీసుకొస్తుందని గుర్తించినప్పుడు పులకరించిపోయాడు. కొంతకాలానికి వారిద్దరూ శిష్యుల్ని తయారుచేసేవారిగా మారారు.

మొదటి ప్రతిస్పందన మోసకరంగా ఉండవచ్చు

కొంతకాలానికి మా నియామకం స్కాట్లండ్‌లోని పైస్లి పట్టణానికి మారింది. ఒకరోజు నేను ప్రకటిస్తున్నప్పుడు, ఒక స్త్రీ నా ముఖమ్మీదే తలుపేసింది. కొంతసేపటికి ఆమె నాకు క్షమాపణ చెప్పాలని నా కోసం వెతికింది. నేను తర్వాతి వారం వెళ్లినప్పుడు, ఆమె ఇలా అంది: “నేను దేవుని ముఖమ్మీదే తలుపువేశానని నాకు అనిపించింది. నేను బయటికి వెళ్లి మీ కోసం వెదికాను.” ఆమె పేరు పర్ల్‌. ఆమె తన స్నేహితులతో, బంధువులతో ఎంత నిరాశ చెందిందంటే నిజమైన స్నేహితురాలి కోసం దేవునికి ప్రార్థించినట్లు ఆమె నాకు చెప్పింది. “అప్పుడే మీరు మా ఇంటికి వచ్చారు” అని ఆమె చెప్పింది. “మీరే ఆ నిజమైన స్నేహితురాలు కావచ్చని నేనిప్పుడు గుర్తించాను.”

పర్ల్‌కు స్నేహితురాలవడం అంత సులభం కాలేదు. ఏటవాలుగా ఉన్న కొండ శిఖరం మీద ఆమె నివసించేది, ఆమె ఇంటికి వెళ్ళాలంటే నేను ఆ కొండను కాలినడకన ఎక్కాలి. నేను ఆమెను మొదటిసారి కూటానికి తీసుకువెళ్లడానికి ఆమె ఇంటికి వెళ్తున్నప్పుడు వీచిన గాలివానకు నేను పడిపోయినంత పనయ్యింది. నా గొడుగు చిరిగిపోవడంతో దాన్ని పడేశాను. నా ముఖమ్మీదే తలుపు వేసిన తర్వాత కేవలం ఆరు నెలలకే పర్ల్‌ నీటి బాప్తిస్మం ద్వారా దేవునికి సమర్పించుకుంది.

ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె భర్త బైబిలు అధ్యయనం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు, అనతికాలంలోనే ఆయన నాతోపాటు ఇంటింటి పరిచర్యకు వచ్చాడు. ఎప్పటిలాగే, ఆ రోజు వర్షం కురుస్తోంది. “నా గురించి ఆలోచించవద్దు. నేను ఇలాంటి వాతావరణంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడడానికి గంటల తరబడి నిలబడేవాణ్ణి, యెహోవా కోసం ఈ మాత్రం చేయలేనా” అని అన్నాడు. స్కాట్లండ్‌వాసుల దృఢసంకల్పం చూసి నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోయేదాన్ని.

కొన్ని దశాబ్దాల తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, నేను అధ్యయనం చేసినవారిలో చాలామంది విశ్వాసంలో కొనసాగడాన్ని చూడడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. శిష్యులను తయారుచేయడంలో ఆనందం ఉంది. (1 థెస్సలొనీకయులు 2:​17-20) నేను స్కాట్లండ్‌లో దాదాపు ఎనిమిదికన్నా ఎక్కువ సంవత్సరాలు సేవచేసిన తర్వాత, 1966లో మిషనరీగా శిక్షణ పొందడానికి వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు ఆహ్వానించబడ్డాను.

విదేశీ క్షేత్రంలో

బొలీవియాలోని శాంతాక్రజ్‌ అనే ఉష్ణమండల పట్టణంలో సేవచేయడానికి నాకు నియామకం ఇచ్చారు, అక్కడ దాదాపు 50 మంది ప్రచారకుల సంఘం ఉంది. ఆ పట్టణాన్ని చూడగానే నాకు హాలీవుడ్‌ చిత్రాల్లో ఎడారిగా చూపించబడే పశ్చిమ అమెరికా గుర్తొచ్చింది. సింహావలోకనం చేసుకున్నప్పుడు, నేను అతి సాధారణ మిషనరీగానే నా జీవితాన్ని గడిపానని నాకనిపిస్తోంది. నామీద ఎన్నడూ మొసళ్లు దాడిచేయలేదు, ఆవేశపూరితులైన అల్లరిమూక నన్ను చుట్టుముట్టలేదు, నేను ఎడారిలో తప్పిపోలేదు, మహాసముద్రంలో ఓడ బద్దలుకాలేదు. అయినా, శిష్యులను తయారుచేసే పని నన్ను ఎంతో పులకరింపజేసింది.

ఆ పట్టణానికి వెళ్ళిన మొదట్లో నేను బైబిలు అధ్యయనం చేసిన స్త్రీలలో ఆంటోన్యా ఒకరు. బైబిలును స్పానిష్‌ భాషలో బోధించడం నాకెంతో కష్టమైంది. ఒకసారి, ఆంటోన్యా వాళ్ల చిన్న అబ్బాయి ఇలా అన్నాడు: “మమ్మీ, ఆవిడ మనల్ని నవ్వించడానికే స్పానిష్‌ భాషలో తప్పులు మాట్లాడుతోందా?” చివరకు ఆంటోన్యాతోపాటు వాళ్ళ కూతురు యోలాండా కూడా శిష్యులయ్యారు. యోలాండాకు న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న డిటో అనే పేరుగల ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన కూడా బైబిలును అధ్యయనం చేయడం, మన కూటాలకు హాజరవడం ప్రారంభించాడు. బైబిలు సత్యాన్ని బోధించడంలో ఇమిడివున్న మరో విషయాన్ని ఆయనతో అధ్యయనం చేసినప్పుడు నేను నేర్చుకున్నాను, కొన్నిసార్లు వ్యక్తులకు మృదువుగానే అయినా సూటిగా చెప్పాలి.

డిటో అధ్యయనాలను తప్పిపోవడం ప్రారంభించినప్పుడు అతనితో ఇలా అన్నాను: “డిటో, తన రాజ్యానికి మద్దతు ఇవ్వమని యెహోవా నిన్ను బలవంతం చేయడు. నువ్వే నిర్ణయించుకోవాలి.” తాను దేవుణ్ణి సేవించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పినప్పుడు నేనిలా అన్నాను: “నీ దగ్గర విప్లవ నాయకుని చిత్రాలున్నాయి. మీ ఇంటికి వచ్చి వీటిని చూసేవాళ్ళెవరైనా నీవు దేవుని రాజ్యానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నావని అనుకుంటారా?” ఆయనకు అలా మృదువుగానే అయినా సూటిగా చెప్పడం అవసరమైంది.

రెండు వారాల తర్వాత, విప్లవం మొదలైంది, విశ్వవిద్యాలయ విద్యార్థులకు, పోలీసులకు మధ్య తుపాకీలతో పోరాటం జరిగింది. “మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం!” అని తన స్నేహితునికి డిటో అరుస్తూ చెప్పాడు. “లేదు! మనం ఈ గొప్పదినం కోసమే వేచివున్నాం” అంటూ ఆయన సహచరుడు రైఫిల్‌ పట్టుకొని విశ్వవిద్యాలయ మేడవైపుకు పరుగులు తీశాడు. ఆ రోజు మరణించిన ఎనిమిదిమంది డిటో స్నేహితుల్లో ఆయన ఒకడు. డిటో నిజక్రైస్తవునిగా మారాలని నిర్ణయించుకోకపోతే ఆయన కూడా మరణించేవాడు, నేను ఆయనను చూసినప్పుడు ఎంత సంతోషం కలిగిందో మీరు ఊహించగలరా?

యెహోవా ఆత్మ పనిచేయడాన్ని చూడడం

ఒకరోజు, నేను ఒక ఇంటికి అంతకుముందే ఒకసారి వెళ్లానని అనుకొని దానిని దాటి వెళ్తున్నప్పుడు ఆ ఇంటావిడ నన్ను పిలిచింది. ఆమె పేరు ఈగ్నేసియా. ఆమె భర్త ఆడాల్బర్టో దృఢకాయుడైన పోలీసు అధికారి, ఆమెకు యెహోవాసాక్షుల గురించి తెలుసు. అయితే, ఆయన నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఆమె ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి అడ్డుగా నిలిచింది. ఆమె అనేక ప్రాథమిక బైబిలు బోధల విషయంలో తికమకపడింది, అందువల్ల నేను ఆమెతో బైబిలు అధ్యయనం ప్రారంభించాను. ఆడాల్బర్టో ఈ బైబిలు అధ్యయనాలను ఆపుజేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నా, నేను ఆయనతో ఇతర అంశాల గురించే ఎక్కువసేపు మాట్లాడగలిగాను. మేము స్నేహితులవడానికి అదే పునాది వేసింది.

ఈగ్నేసియా స్నేహశీలురాలైన సంఘ సభ్యురాలిగా మారి, ఓదార్పు అవసరమైన అనేకమంది సహోదర సహోదరీల ఆధ్యాత్మిక, భౌతిక బాగోగులపట్ల శ్రద్ధవహించడాన్ని చూసినప్పుడు నేనెంతగా ఆనందించానో ఊహించండి. కొంతకాలానికి ఆమె భర్త, వారి ముగ్గురు పిల్లలు సాక్షులయ్యారు. చివరకు ఆడాల్బర్టో సువార్తకున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు ఆయన పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎంత ఉత్సాహంగా మాట్లాడాడంటే ఆయన పోలీసుల నుండి కావలికోట, తేజరిల్లు! పత్రికల 200 చందాలను కట్టించాడు.

యెహోవా వృద్ధి కలుగజేస్తాడు

శాంతాక్రజ్‌లో ఆరేళ్లు పనిచేసిన తర్వాత నేను బొలీవియా ప్రధాన నగరమైన లాపాజ్‌కు నియమించబడ్డాను, తర్వాతి 25 ఏళ్లు నేనక్కడ పనిచేశాను. 1970ల తొలి సంవత్సరాల్లో లాపాజ్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో కేవలం 12 మంది సభ్యులే ఉండేవారు. ప్రకటనాపని విస్తృతమయ్యేకొద్దీ, మరిన్ని సదుపాయాలు అవసరమయ్యాయి, అందువల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న శాంతాక్రజ్‌ నగరంలో క్రొత్త బ్రాంచి కార్యాలయం నిర్మించబడింది. బ్రాంచి కార్యాలయం 1998లో అక్కడికి మార్చబడింది, బ్రాంచి కార్యాలయ సభ్యురాలిగా ఉండేందుకు నేను ఆహ్వానించబడ్డాను. ఇప్పుడు ఈ కార్యాలయంలో 50 కన్నా ఎక్కువమంది సభ్యులు పనిచేస్తున్నారు.

శాంతాక్రజ్‌లో ఉన్న ఏకైక సంఘం 1966లో 50 కన్నా ఎక్కువ సంఘాలుగా విస్తరించింది. అప్పుడు బొలీవియా అంతటిలో ఉన్న 640 మంది సాక్షులు ఇప్పుడు దాదాపు 18,000 మంది అయ్యారు!

సంతోషకరంగా, బొలీవియాలో నా నియామకం ప్రతిఫలదాయకంగా ఉంది. అయితే, అన్నిచోట్లా ఉన్న తోటిక్రైస్తవుల యథార్థతనుబట్టి నేనెల్లప్పుడూ ప్రోత్సహించబడినట్లు భావిస్తున్నాను. రాజ్య ప్రకటనాపనిని యెహోవా ఆశీర్వదించడాన్ని చూసి మనమందరం ఆనందిస్తాం. శిష్యులను తయారుచేసే పనిలో భాగం వహించడం నిజంగా ఆనందాన్నిస్తుంది.​—⁠మత్తయి 28:​19, 20.

[13వ పేజీలోని చిత్రం]

స్కాట్లండ్‌లో పయినీరు సేవచేయడం

[15వ పేజీలోని చిత్రాలు]

బొలీవియా బ్రాంచి కార్యాలయంలో సేవచేయడం; (అంతర చిత్రం) గిలియడ్‌ 42వ తరగతి స్నాతకోత్సవమప్పుడు