కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యమే ఎందుకు మాట్లాడాలి?

సత్యమే ఎందుకు మాట్లాడాలి?

సత్యమే ఎందుకు మాట్లాడాలి?

మాన్ఫ్రెట్‌, తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడు ఒక కంపెనీలో శిక్షణ పొందుతున్నాడు. * ఆయనతోపాటు అనేకమంది ఇతర ఉద్యోగులు కూడా వారానికి రెండు రోజులు వృత్తివిద్యా కాలేజీకి హాజరయ్యేలా ఆ కంపెనీ ఏర్పాటు చేసింది. ఒకరోజు, సమయానికన్నా ముందే క్లాసు పూర్తైంది. అలా క్లాసు పూర్తయితే ఆ కంపెనీ నియమాల ప్రకారం, శిక్షణపొందుతున్నవారు ఉద్యోగస్థలానికి వెళ్ళి మిగిలిన సమయం పనిచేయాలి. మాన్ఫ్రెట్‌ అయితే పనికి వెళ్లాడు గానీ మిగతావారంతా తమ సమయాన్ని సరదాగా గడపడానికి వెళ్ళారు. ఆ రోజు అనుకోని విధంగా, శిక్షణ పొందుతున్నవారిని పర్యవేక్షించే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ అక్కడికి వచ్చాడు. ఆయన మాన్ఫ్రెట్‌ను చూసి, “నువ్వు ఈ రోజు క్లాసుకు ఎందుకు వెళ్లలేదు, మిగతావాళ్ళెక్కడ” అని అడిగాడు. మాన్ఫ్రెట్‌ దానికి ఎలా స్పందించాలి?

మాన్ఫ్రెట్‌ ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితి సాధారణంగా మనందరికీ ఎదురయ్యేదే. ఆయన నిజం చెప్పాలా, లేక తన తోటి విద్యార్థుల తప్పులను కప్పిపుచ్చాలా? నిజం చెబితే ఇతరులు ప్రమాదంలో పడతారు, వారు ఆయనను ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో అబద్ధమాడడం సరైనదేనా? మీరేమి చేసివుండేవారు? మనం మాన్ఫ్రెట్‌ గురించి తర్వాత చర్చిద్దాం, ముందుగా మనం నిజం చెప్పాలో వద్దో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు ఏమి గుర్తుంచుకోవాలో పరిశీలిద్దాం.

సత్య, అసత్యాల మధ్యవున్న ప్రధాన వైరం

మానవ చరిత్రారంభంలో, ప్రతీ విషయం సత్యంమీద ఆధారపడి ఉండేది. అప్పుడు వాస్తవాలను వక్రీకరించడం, సత్యాన్ని ప్రభావితం చేయడం లేక సత్యాన్ని వక్రీకరించి చెప్పడం వంటివేవీ జరగలేదు. సృష్టికర్త అయిన యెహోవా “సత్యదేవుడు.” ఆయన వాక్యం సత్యం, ఆయన అబద్ధమాడనేరడు, ఆయన అబద్ధమాడడాన్ని, అబద్ధికులను ఖండిస్తాడు.​—⁠కీర్తన 31:⁠5; యోహాను 17:​17; తీతు 1:⁠1.

అలాగైతే, అసత్యం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు తనను చంపడానికి ప్రయత్నిస్తున్న మతసంబంధ వ్యతిరేకులతో మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రామాణికమైన జవాబునిస్తూ ఇలా అన్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.” (యోహాను 8:​44) మొదటి మానవజంట దేవునికి అవిధేయత కనబరచి పాపులై మరణించేలా సాతాను ఏదెను తోటలో వారిని పురికొల్పిన సంఘటనను యేసు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.​—⁠ఆదికాండము 3:​1-5; రోమీయులు 5:⁠12.

సాతాను “అబద్ధమునకు జనకుడు,” అబద్ధాలకు, అసత్యానికి మూలకారకుడు అని యేసు మాటలు స్పష్టపరుస్తున్నాయి. నేడు కూడా అసత్యాన్ని ప్రధానంగా సాతానే ప్రోత్సహిస్తున్నాడు, వాస్తవానికి అతడు “సర్వలోకమును మోస పుచ్చుచున్నాడు.” అబద్ధమాడడం విస్తృతంగా ఉండడంవల్ల నేడు మానవులు అనుభవిస్తున్న నష్టాలకు అతడే కారకుడు.​—⁠ప్రకటన 12:​9.

సత్యం, అసత్యం మధ్య అపవాదియైన సాతాను ప్రారంభించిన ప్రధాన వైరం ఇప్పటికీ నియంత్రించలేనంతగా వ్యాప్తిలో ఉంది. అది మానవ సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ వ్యాపిస్తూ ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేస్తోంది. ఒక వ్యక్తి ఎటువైపు ఉన్నాడనేది ఆయన జీవన విధానం నిర్ణయిస్తుంది. దేవుని పక్షాన ఉన్నవారు ఆయన వాక్యమైన బైబిల్లో ఉన్న సత్యానికి అనుగుణంగా తమ జీవితాన్ని గడుపుతారు. “లోకమంతయు దుష్టుని యందున్నది” కాబట్టి, సత్యమార్గాన్ని అనుసరించని వ్యక్తులు తెలిసో తెలియకో సాతాను అధీనంలోకి వస్తారు.​—⁠1 యోహాను 5:​19; మత్తయి 7:​13, 14.

అబద్ధాలు చెప్పే స్వభావం ఎందుకు ఉంది?

“లోకమంతయు” సాతాను అధీనంలో ఉందనే వాస్తవాన్నిబట్టి, చాలామంది ఎందుకు అబద్ధాలు చెబుతారో మనం అర్థంచేసుకోవచ్చు. ‘“అబద్ధమునకు జనకుడు” అయిన సాతాను ఎందుకలా చేశాడు’ అని మనం అడగవచ్చు. మొదటి మానవ జంటతోపాటు తాను సృష్టించిన సమస్త సృష్టికి యెహోవాయే న్యాయమైన సర్వాధిపతి అని సాతానుకు తెలుసు. అయినా, తనకు చెందని ఈ ఉన్నతమైన, ప్రత్యేక స్థానం కావాలని సాతాను ఆశపడ్డాడు. యెహోవా స్థానాన్ని ఆక్రమించుకోవాలనే అత్యాశతో, స్వార్థపూరితమైన వాంఛతో పన్నాగం పన్నాడు. సాతాను తన కోరికను తీర్చుకోవడానికి అబద్ధాలను, కుయుక్తిని ఉపయోగించాడు.​—⁠1 తిమోతి 3:⁠6.

నేటి విషయమేమిటి? ఇప్పటికీ అత్యాశ, స్వార్థపూరితమైన వాంఛ వంటి గుణాలే అబద్ధమాడేందుకు అనేకమందిని పురికొల్పుతున్నాయని మీరు అంగీకరించరా? అత్యాశతో కూడిన వ్యాపారాలు, అవినీతిమయ రాజకీయాలు, మరియు అబద్ధ మతాల వంచన, అబద్ధాలు, ప్రలోభం, మోసం వంటివాటితో నిండివున్నాయి. ఎందుకు? జీవితంలో పైకెదగాలనే, లేక తమది కాని సంపద, అధికారం లేక హోదా పొందాలనే అత్యాశతో, వాంఛతో ప్రజలు సాధారణంగా ప్రేరేపించబడుతున్నందుకే కదా? జ్ఞానియు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా హెచ్చరించాడు: “ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.” (సామెతలు 28:​20) అపొస్తలుడైన పౌలు కూడా ఇలా రాశాడు: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.” (1 తిమోతి 6:​10) అధికారం కోసం లేక హోదా కోసం ఉండే మితిమీరిన వాంఛ గురించి కూడా అలాగే చెప్పవచ్చు.

నిజం చెప్పడంవల్ల కలిగే పర్యవసానాల గురించిన భయం లేక అలా చెబితే ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అనే భయం కూడా అబద్ధమాడడానికి మరో కారణం. ఇతరులు తమను ఇష్టపడాలని లేక తమను ఆమోదించాలని ప్రజలు కోరుకోవడం సహజమే. అయితే ఆ కోరికే వారు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ఇబ్బందికర వివరాలు దాచిపెట్టడానికి లేక ఇతరులకు తమపట్ల సదభిప్రాయం కలిగించడానికి, కొద్దిగానే అయినా సత్యాన్ని వక్రీకరించేలా చేస్తుంది. అందుకే సొలొమోను సముచితంగానే ఇలా రాశాడు: “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.”​—⁠సామెతలు 29:​25.

సత్యదేవునిపట్ల విశ్వసనీయత

ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ మాన్ఫ్రెట్‌ను వివరాలు అడిగినప్పుడు ఆయనేమి చెప్పాడు? మాన్ఫ్రెట్‌ సత్యమే చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “అధ్యాపకుడు త్వరగా క్లాసు ముగించాడు కాబట్టి నేను పనికి వచ్చాను. మిగతావారి గురించి నేనేమీ చెప్పలేను. వారినే అడిగి తెలుసుకోండి.”

మాన్ఫ్రెట్‌ యుక్తిగా, తప్పుదారిపట్టించే జవాబిచ్చి శిక్షణపొందుతున్న ఇతర ఉద్యోగుల మెప్పుదలను పొందగలిగేవాడు. అయితే సత్యానికి యథార్థంగా కట్టుబడివుండేందుకు ఆయనకు సరైన కారణాలున్నాయి. మాన్ఫ్రెట్‌ యెహోవాసాక్షి. ఆయన నిజాయితీగా ఉండడంవల్ల తన నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. అంతేకాక, తన యజమాని నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాడు. తన శిక్షణలో భాగంగా మాన్ఫ్రెట్‌, సాధారణంగా శిక్షణపొందుతున్నవారు పనిచేయడానికి అనుమతించబడని ఆభరణాల విభాగంలో నియమించబడ్డాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మాన్ఫ్రెట్‌ కంపెనీలోని బాధ్యతాయుతమైన స్థానానికి పదోన్నతి చెందాడు, ఆ ఎగ్జిక్యూటివే మాన్ఫ్రెట్‌ను అభినందించి, ఆయన సత్యానికి కట్టుబడివున్న ఆ సందర్భాన్ని గుర్తుచేయడానికి ఫోను చేశాడు.

యెహోవా సత్యదేవుడు కాబట్టి, ఆయనతో సన్నిహిత సంబంధం కోరుకునే ఎవరైనా “అబద్ధమాడుట మాని” “సత్యమే మాటలాడవలెను.” దేవుని సేవకుడు సత్యాన్ని ప్రేమించాలి. “నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు” అని ఒక జ్ఞాని రాశాడు. అయితే అబద్ధం అంటే ఏమిటి?​—⁠ఎఫెసీయులు 4:​25; సామెతలు 14:⁠5.

అబద్ధం అంటే ఏమిటి?

ప్రతీ అబద్ధం ఒక అసత్యమే, అయితే ప్రతీ అసత్యం అబద్ధం కాదు. ఎందుకలా? అబద్ధం అంటే “మాట్లాడే వ్యక్తికి ఆ విషయం తప్పని తెలిసినా, ఇతరుల్ని మోసగించే ఉద్దేశంతో దాని గురించి నిర్ద్వందంగా వాదించడమే” అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది. అవును, అబద్ధం చెప్పడంలో ఒక వ్యక్తిని మోసగించాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఉద్దేశరహితంగా అసత్యం మాట్లాడడం అంటే పొరపాటున అవాస్తవాలను లేదా తప్పుడు వివరాలను ఎవరికైనా చెప్పడం అబద్ధం చెప్పినట్లు కాదు.

అంతేకాక, సమాచారాన్ని అడుగుతున్న వ్యక్తి, పూర్తి సమాధానాన్ని పొందేందుకు అర్హుడో కాదో మనం ఆలోచించాలి. ఉదాహరణకు, వేరే కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌ మాన్ఫ్రెట్‌ను అవే ప్రశ్నలు అడిగాడని అనుకుందాం. ఆయనకు వివరాలన్నీ చెప్పాల్సిన అవసరం మాన్ఫ్రెట్‌కు ఉంటుందా? ఉండదు. అలాంటి సమాచారం తెలుసుకునే హక్కు ఆ ఎగ్జిక్యూటివ్‌కు లేదు కాబట్టి, వివరాలు ఇవ్వాల్సిన అవసరం మాన్ఫ్రెట్‌కు ఉండదు. నిజమే, ఈ సందర్భంలో కూడా ఆయన అబద్ధాలు చెప్పడం తప్పవుతుంది.

ఈ విషయంలో యేసుక్రీస్తు ఎలాంటి మాదిరి ఉంచాడు? యేసు ఒక సందర్భంలో, తన ప్రయాణ ప్రణాళికల గురించి తెలుసుకోవాలని కుతూహలపడిన కొందరు అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడు. “ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము” అని వారు ఆయనకు సలహా ఇచ్చారు. అప్పుడు యేసు ఎలా జవాబిచ్చాడు? “మీరు [యెరూషలేముకు] పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లను.” కొన్నిరోజులు గడిచిన తర్వాత యేసు పండుగకు హాజరయ్యేందుకు యెరూషలేముకు వెళ్లాడు. అయితే ఆయన వారితో ఎందుకలా అన్నాడు? తాను వెళ్లే స్థలాల గురించిన ఖచ్చితమైన వివరాలు తెలుసుకునే అవసరం వారికి లేదు. కాబట్టి యేసు అసత్యం చెప్పలేదు, వారు తనకు లేక తన అనుచరులకు చేయగల హానిని తగ్గించేందుకు ఆయన వారికి పూర్తి జవాబివ్వలేదు. అది అబద్ధంకాదు ఎందుకంటే అపొస్తలుడైన పేతురు, క్రీస్తు గురించి ఇలా రాశాడు: “ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.”​—⁠యోహాను 7:​1-13; 1 పేతురు 2:⁠22.

పేతురు విషయమేమిటి? యేసు నిర్బంధించబడిన రాత్రి, పేతురు మూడుసార్లు యేసు ఎవరో తనకు తెలియదని అబద్ధం చెప్పలేదా? అవును, పేతురు మనుష్యుల భయానికి లోనై అబద్ధమాడాడు. అయితే ఆయన వెంటనే “సంతాపపడి యేడ్చి” పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి, ఆయన పాపం క్షమించబడింది. అంతేకాక, ఆయన తన తప్పు నుండి పాఠాన్ని నేర్చుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత, ఆయన బహిరంగంగా యేసు గురించి మాట్లాడాడు, అలా మాట్లాడవద్దని యెరూషలేములోని యూదా అధికారులు ఆయనను బెదిరించినప్పుడు దానికి అంగీకరించనని ఆయన స్థిరంగా చెప్పాడు. పేతురు తాత్కాలికంగా తప్పిపోయినా వెంటనే తేరుకొనే ఉదాహరణ, బలహీన క్షణంలో సులభంగా కలవరపడి మాటల్లో క్రియల్లో తప్పిపోగల మనందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలి.​—⁠మత్తయి 26:​69-75; అపొస్తలుల కార్యములు 4:​18-20; 5:​27-32; యాకోబు 3:⁠2.

సత్యం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది

“నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును” అని సామెతలు 12:​19 వివరిస్తోంది. అవును, సత్య వాక్కు శాశ్వతంగా నిలుస్తుంది. ప్రజలు సత్యం మాట్లాడడానికి, దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి నిబద్ధత కనబరిస్తే మానవ సంబంధాలు మరింత స్థిరంగా, సంతృప్తికరంగా ఉంటాయి. అవును సత్యం మాట్లాడడంవల్ల సత్వరమే ప్రతిఫలాలు లభిస్తాయి. ఆ ప్రతిఫలాల్లో నిర్మలమైన మనస్సాక్షి, మంచి పేరు, వివాహ జీవితంలో, కుటుంబంలో, స్నేహితుల మధ్య, వ్యాపారంలో కూడా బలమైన బంధాలు నెలకొనడం వంటివి ఉన్నాయి.

మరోవైపు అబద్ధాలు ఏదో ఒక రోజు బయటపడతాయి. అబద్ధాలు చెప్పడంవల్ల కొంతకాలం ఇతరులను మోసగించవచ్చు, అయితే అసత్యం ఎంతోకాలం దాగివుండదు. అంతేకాక, సత్యదేవుడైన యెహోవా అసత్యాన్ని సహించడానికి, అబద్ధాలను ప్రోత్సహించేవారికి కాలపరిమితిని విధించాడు. సర్వలోకాన్ని మోసగిస్తున్న అబద్ధానికి కారకుడైన అపవాదియైన సాతాను ప్రభావాన్ని యెహోవా తొలగిస్తాడని బైబిలు వాగ్దానం చేస్తోంది. యెహోవా అబద్ధాలన్నిటినీ, అబద్ధికులందరినీ త్వరలోనే అంతం చేస్తాడు.​—⁠ప్రకటన 21:⁠8.

“నిజమాడు పెదవులు” శాశ్వతంగా స్థిరపరచబడినప్పుడు ఎంతటి ఉపశమనం కలుగుతుందో కదా!

[అధస్సూచి]

^ పేరా 2 పేరు మార్చబడింది.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

అనేకమంది అబద్ధం చెప్పేందుకు అత్యాశ, స్వార్థపూరితమైన ప్రగాఢ వాంఛ పురికొల్పుతున్నాయి

[6వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రతీ అబద్ధం ఒక అసత్యమే, అయితే ప్రతీ అసత్యం అబద్ధంకాదు

[6వ పేజీలోని చిత్రం]

క్రీస్తు ఎవరో తనకు తెలియదని పేతురు చెప్పడం నుండి మనమేమి నేర్చుకుంటాం?

[7వ పేజీలోని చిత్రం]

సత్యం మాట్లాడడంవల్ల స్థిరమైన, సంతృప్తికరమైన సంబంధాలు ఏర్పడతాయి