కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యశీలత ఇతరుల నుండే ఆశిస్తున్నామా?

సత్యశీలత ఇతరుల నుండే ఆశిస్తున్నామా?

సత్యశీలత ఇతరుల నుండే ఆశిస్తున్నామా?

“అబద్ధాలంటే నాకు అసహ్యం, ఇతరులు నాకు అబద్ధాలు చెబితే నేను సహించలేను!” ఓ 16 ఏళ్ల అమ్మాయి కోపంగా చెప్పింది. మనలో చాలామందికి అలాగే అనిపిస్తుంది. మౌఖికంగా గానీ, రాతపూర్వకంగా గానీ ఇతరులు మనకు సరైన సమాచారమే అందించాలని మనం కోరుకుంటాం. అయితే, ఇతరులకు సమాచారాన్ని అందించేటప్పుడు మనం సత్యమే మాట్లాడుతున్నామా?

జర్మనీలో జరిపిన సర్వేలో పాల్గొన్న అనేకమంది, “ఏదైనా హాని నుండి మనల్ని మనం కాపాడుకోవాలన్నా, ఇతరులను కాపాడాలన్నా చిన్నచిన్న విషయాల్లో అబద్ధాలు చెప్పడం తప్పేమీకాదు, పైగా ప్రజలు కలిసి పనిచేయాలంటే అలా చేయడం అవసరం” అని భావించారు. ఒక విలేఖరి ఇలా రాసింది: “సత్యం చెప్పడం, అన్ని సందర్భాల్లో మనం సంపూర్ణంగా సత్యాన్నే మాట్లాడడం మంచి ఆదర్శమే అయినా అది జీవితాన్ని నిస్తేజంగా మారుస్తుంది.”

ఇతరులు మనకు సత్యం చెప్పాలని కోరుకుంటూ, అదే సమయంలో మనం ఇతరులతో సత్యం చెప్పకపోవడానికి కొన్నిసార్లు సరైన కారణమే ఉందని అనుకుంటున్నామా? మనం సత్యం చెబుతామా లేదా అనేది అంత ప్రాముఖ్యమా? అబద్ధమాడడంవల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి?

అబద్ధమాడడంవల్ల కలిగే నష్టం

అబద్ధమాడడంవల్ల కలిగే నష్టం గురించి ఆలోచించండి. అబద్ధమాడడంవల్ల దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అపనమ్మకం ఏర్పడుతుంది. ఏ ఆధారంలేని గాలి కబుర్లు ఒక వ్యక్తి ప్రతిష్ఠను దిగజారుస్తాయి. ఉద్యోగులు మోసం చేయడంవల్ల నిర్వహణ వ్యయం పెరిగి, వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. పన్నులు చెల్లించే విషయంలో తప్పుడు వివరాలివ్వడంవల్ల ప్రజానీకానికి సేవలు అందించేందుకు కావాల్సిన ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పరిశోధకుల తప్పుడు సమాచారం, ఆయా వ్యక్తుల ఉజ్వలమైన భవిష్యత్తును పాడుచేసి ప్రఖ్యాత సంస్థలపై మచ్చతీసుకొస్తుంది. చిటికెలో ధనవంతుల్ని చేస్తామనే మోసపూరితమైన పథకాల ద్వారా నిలువుదోపిడికి గురైన అమాయక పెట్టుబడిదారులు తమ జీవితంలో కూడబెట్టుకున్నదంతా పోగొట్టుకుంటారు లేక ఇంకా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు. యెహోవా దేవుడు అసహ్యించుకునేవాటిలో “కల్లలాడు నాలుక,” ‘లేనివాటిని పలుకు అబద్ధసాక్ష్యం’ ఉన్నాయని బైబిలు మనకు చెప్పడంలో ఆశ్చర్యం లేదు.​—⁠సామెతలు 6:​16-19.

అబద్ధాలాడడం ఇంత విస్తృతంగా ఉండడంవల్ల అటు వ్యక్తులకు, ఇటు సమాజానికి హానికలుగుతుంది. ఆ మాటలతో ఎవరూ విభేదించరు. అయితే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అసత్యాన్ని ఎందుకు చెబుతారు? అన్ని సందర్భాల్లో సత్యం చెప్పకుండా ఉండడం అబద్ధం చెప్పినట్లౌతుందా? ఈ ప్రశ్నలకు, మరితర ప్రశ్నలకు జవాబులను మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

[3వ పేజీలోని చిత్రం]

అబద్ధమాడడంవల్ల దంపతుల మధ్య అపనమ్మకం ఏర్పడుతుంది