జింబాబ్వేలో జరుగుతున్న ఆధ్యాత్మిక పని
జింబాబ్వేలో జరుగుతున్న ఆధ్యాత్మిక పని
ఆ ఆఫ్రికా దేశం పేరుకు “రాతి గృహం” అని అర్థం. ఈ దేశం విక్టోరియా జలపాతానికి, వివిధ జాతుల వన్యప్రాణులకు ప్రఖ్యాతి గాంచింది. దానిలో, సహారా ఎడారికి దక్షిణాన అతిపెద్దవైన ప్రాచీన మానవ నిర్మిత భవనాలు ఉన్నాయి. ఆ దేశం మధ్యభాగంలో గ్రానైట్ పీఠభూమి విస్తరించివుంది. ఆ పీఠభూమిలో సమశీతోష్ణ వాతావరణం ఉండడంవల్ల సారవంతమైన నేల, పచ్చగా కనిపించే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఆ దేశమే జింబాబ్వే, దాని జనాభా దాదాపు 1.2 కోట్లు.
ఆదేశానికి రాతి గృహం అనే పేరు ఎలా వచ్చింది? వేటగాడు, అన్వేషకుడైన ఆడమ్ రెన్డర్స్ 1867లో దాదాపు 1,800 ఎకరాల్లో విస్తరించివున్న అతిపెద్ద రాతి కట్టడాలను చూశాడు. సాధారణంగా మట్టితో, గుంజలతో నిర్మించబడిన గడ్డి పైకప్పుగల ఇళ్లున్న ఆఫ్రికాలోని సాగుచేయని మైదానాల్లో ఆయన ప్రయాణించాడు. అప్పుడు ఆయనకు ఒక పెద్ద నగరపు రాతి శిథిలాలు కనిపించాయి, దానినే ఇప్పుడు గ్రేట్ జింబాబ్వే అని పిలుస్తున్నారు.
ఈ శిథిలాలు, ఇప్పుడు మాస్వింగో అని పిలవబడుతున్న ప్రాంతానికి దక్షిణాన ఉన్నాయి. అక్కడి గోడలు కొన్ని దాదాపు 9 మీటర్లకన్నా ఎత్తుగా ఉండి, గచ్చు లేకుండా ఒకదాని మీద మరొకటి పేర్చబడిన గ్రానైట్ రాళ్లతో నిర్మించబడ్డాయి. ఆ శిథిలాల మధ్యలో దాదాపు 11 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వృత్తవ్యాసం ఉన్న పునాదిగల శంఖువు ఆకారపు కోట ఉంది. ఆ పెద్ద భవనాన్ని ఖచ్చితంగా దేనికోసం ఉపయోగించేవారనేది ఇప్పటికీ తెలియదు. ఆ శిథిలాలు సా.శ. ఎనిమిదవ శతాబ్దానికి చెందినవి, అయితే అంతకన్నా
వందలాది సంవత్సరాల పూర్వం నుండే ఆ ప్రాంతంలో జనవాసాలు ఉన్నట్లు రుజువులున్నాయి.1980 వరకు రోడేషియాగా పిలవబడిన ఆ దేశం బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత జింబాబ్వేగా మారింది. ఆ దేశ జనాభాలో షోనా, ఎన్డాబాలా అనే రెండు ప్రధాన జాతుల ప్రజలున్నారు, ఆ రెండు జాతుల్లో షోనా జాతివారే ఎక్కువగా ఉన్నారు. ఆ దేశప్రజలు అతిథులను ఆదరిస్తారు, యెహోవాసాక్షులు ఇంటింటి సువార్త పనిచేస్తున్నప్పుడు వారిలో ఆ గుణాన్ని గమనించారు. కొన్నిసార్లు ఇంటికి వచ్చినవారు అపరిచితులైనా, వారు తలుపు తట్టిన వెంటనే “లోపలికి రండి,” “కూర్చోండి” అని వారు ఆహ్వానిస్తారు. చాలామంది జింబాబ్వేవాసులకు బైబిలుపట్ల ప్రగాఢమైన గౌరవం ఉంది, లేఖనాధారిత చర్చలు జరుగుతున్నప్పుడు వారు తమ పిల్లలను కూడా కూర్చొని వినమని బలవంతపెడతారు.
ప్రోత్సాహకరమైన ఓదార్పు సందేశాన్నివ్వడం
జింబాబ్వే గురించి ప్రస్తావించబడినప్పుడు, “ఎయిడ్స్,” “కరవు” వంటి పదాలు ప్రసార మాధ్యమాల్లో తరచూ వినిపిస్తుంటాయి. ఎయిడ్స్ వ్యాప్తి చెందడం ఆఫ్రికాలోవున్న సహారా దక్షిణ భాగంలోని దేశాల జనాభామీద, ఆర్థిక వ్యవస్థమీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ ఎయిడ్స్ బారినపడినవారే ఎక్కువగా ఆసుపత్రికి వస్తుంటారు. ఆ వ్యాధి అనేకమంది కుటుంబ జీవితాలను కబళించింది.
ఆ విషయంలో జింబాబ్వేవాసులకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు, బైబిల్లో వివరించబడిన దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడమే శ్రేష్ఠమని చురుకుగా ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు, లైంగిక సంబంధం అనే దేవుని వరం కేవలం వివాహితులకు మాత్రమే పరిమితమని, సలింగ సంయోగాన్ని దేవుడు ఆమోదించడని, యెహోవా ధర్మశాస్త్రం రక్తమార్పిడులను, ఉత్ప్రేరక మాదకద్రవ్యాల వాడుకను నిషేధించిందని దేవుని వాక్యం బోధిస్తోంది. (అపొస్తలుల కార్యములు 15:28, 29; రోమీయులు 1:24-27; 1 కొరింథీయులు 7:2-5; 2 కొరింథీయులు 7:1) సాక్షులు బలమైన నిరీక్షణా సందేశాన్ని ప్రకటించి సమీప భవిష్యత్తులో దేవుని రాజ్యం వ్యాధులన్నింటినీ తొలగిస్తుందని కూడా నొక్కిచెబుతున్నారు.—యెషయా 33:24.
సహాయ సామగ్రిని అందివ్వడం
గత దశాబ్దంలో జింబాబ్వేలో కరవు ఉగ్రరూపం దాల్చింది. వన్యప్రాణులు ఆకలితో, నిర్జలీకరణముతో అలమటించి కుప్పకూలాయి. లక్షలకొద్దీ పశువులు మరణించాయి. మంటలు ఎన్నో హెక్టార్ల అడవులను సర్వనాశనం చేశాయి. ఎంతోమంది పిల్లలు, వృద్ధులు కుపోషణతో మరణించారు. జలవిద్యుత్తు ప్లాంట్లు పనిచేయడం ఆగిపోయే ప్రమాదం ఏర్పడేంతగా మహా జాంజెబీ నది నీటిమట్టం కూడా తగ్గిపోయింది.
అలాంటి వినాశనాన్ని ఎదుర్కోవడానికి యెహోవాసాక్షులు దేశంలోని వివిధ భాగాల్లో ఎనిమిది సహాయ కమిటీలను నెలకొల్పారు. ప్రయాణ పైవిచారణకర్తలు నిజమైన అవసరాలను అంచనా వేసేందుకు సంఘాలను సందర్శించారు. ఆ సమాచారాన్ని సరైన సహాయ కమిటీకి అందించారు. ఒక ప్రయాణ పైవిచారణకర్త ఇలా నివేదించాడు: “గత ఐదు సంవత్సరాల్లో మేము వేయి టన్నుల కన్నా ఎక్కువ జొన్నను, పది టన్నుల ఎండు చేపలను, అంతే పరిమాణంలో ఎండిన చిక్కుడు గింజలను పంచాం. మన ఆధ్యాత్మిక సహోదరులు రెండు టన్నుల ముఫుష్వాను [ఎండిన కూరగాయలను] తయారుచేశారు. పెద్ద పరిమాణంలో విరాళంగా ఇవ్వబడిన బట్టలతోపాటు సహోదరులకు కావాల్సిన నిధులను కూడా మేము పంచిపెట్టాం.” మరో ప్రయాణ పైవిచారణకర్త ఇలా అన్నాడు: “ఈ వస్తువులను తీసుకురావడానికి జింబాబ్వే, దక్షిణాఫ్రికాలలో అనుమతులను సంపాదించడానికి మేము ఎదుర్కొన్న సమస్యల గురించి, అత్యవసరమైన సహాయ సామగ్రిని రవాణా చేసేందుకు కావాల్సిన ఇంధనం ఎప్పటిలాగే కొరతగా ఉండడం గురించి నేను ఆలోచించినప్పుడు, సహాయ సామగ్రిని అందించడంలో మేము సాధించిన విజయం, మనకు ఏమి కావాలో మన పరలోక తండ్రికి తెలుసని యేసు ఇచ్చిన హామీని మరింతగా ధృవీకరిస్తోందనే నేను చెప్పాలి.”—మత్తయి 6:32.
పైవిచారణకర్తలు కరవు పీడిత ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఏమి చేస్తున్నారు? కొందరు తమకోసం, తాము బస చేసే ఇంటివారి కోసం ఆహారాన్ని తీసుకెళ్తున్నారు. కొందరు క్రైస్తవ సహోదరీలు తాము ఎదురుచూస్తున్న ప్రభుత్వ సహాయం కోసం క్యూలో నిలబడేందుకు ఆ రోజు ప్రకటనాపని చేయడం మానేద్దామా వద్దా అని చర్చించుకున్నారని ఒక పైవిచారణకర్త నివేదించాడు. వారు ప్రకటనాపనికే ప్రాముఖ్యతనిచ్చి, సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో వేచిచూడడం ద్వారా యెహోవామీద నమ్మకముంచాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ప్రభుత్వ సహాయం అందలేదు.
మరుసటి రోజు క్రైస్తవ కూటం ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సహోదరీలు మళ్లీ ఒక నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. వారు కూటానికి వెళ్లాలనుకున్నారా, లేక సహాయ సామగ్రి కోసం వేచివుండాలనుకున్నారా? వారు సరైన విషయాలకు ప్రాధాన్యతనిస్తూ, రాజ్య మందిరంలో జరిగే కూటానికి హాజరయ్యారు. (మత్తయి 6:33) ముగింపు పాట పాడుతున్నప్పుడు ట్రక్కు వస్తున్న శబ్దం వారికి వినిపించింది. సహాయ కమిటీలోని ఆధ్యాత్మిక సహోదరులు సహాయ సామగ్రిని నేరుగా రాజ్యమందిరానికే తీసుకువచ్చారు! ఆ కూటానికి హాజరైన నమ్మకమైన సాక్షుల హృదయాలు నిజమైన ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయాయి.
ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది
క్రైస్తవ సంఘానికి చెందనివారికి చేసే దయాపూర్వకమైన క్రియలు చక్కని సాక్ష్యమిచ్చేందుకు అవకాశాలను కల్పించాయి. మాస్వింగో ప్రాంతంలో పనిచేస్తున్న ఒక ప్రయాణ పైవిచారణకర్త కొంతమంది స్థానిక సాక్షులతో కలిసి సువార్త పనిలో పాల్గొన్నాడు. ఒక అమ్మాయి రోడ్డు ప్రక్కన పడివుండడాన్ని ఆయన గమనించాడు. ఆమె సరిగ్గా మాట్లాడలేకపోతుంది, ఆమె స్వరం కంపిస్తుంది కాబట్టి ఆమె ఎంతో అనారోగ్యంతో ఉన్నట్లు సాక్షులు గుర్తించారు. ఆ అమ్మాయి పేరు హమున్యారి, షోనా భాషలో దానికి “మీకు సిగ్గువేయడం లేదా?” అని అర్థం. కొండమీద జరుగుతున్న మత కార్యక్రమానికి వెళ్తున్న ఆమె చర్చివారు ఆమెను వదిలేసి వెళ్లారని సహోదరులు తెలుసుకున్నారు. ఆ సాక్షులు ఆమెకు ప్రేమపూర్వక సహాయం అందించి ఆమెను దగ్గర్లోని పల్లెటూరుకు తీసుకెళ్లారు.
ఆ పల్లెటూరులో కొంతమందికి హమున్యారి ఎవరో తెలుసు కాబట్టి, ఆమెను తీసుకెళ్లడానికి రమ్మని ఆమె బంధువులకు కబురు పంపించారు. ఆ పల్లెవాసులు సాక్షుల గురించి ఇలా అన్నారు: “ఇదే సత్యమైన మతం. క్రైస్తవులు ఇలాంటి ప్రేమనే కనబరచాలి.” (యోహాను 13:35) సహోదరులు అక్కడి నుండి సెలవు తీసుకునేముందు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? * అనే కరపత్రాన్ని హమున్యారికి ఇచ్చారు.
మరుసటి వారం, ప్రయాణ పైవిచారణకర్త హమున్యారి నివసిస్తున్న ప్రాంతంలోని సంఘాన్ని సందర్శించడానికి వెళ్లాడు. ఆమె ఇంటికి క్షేమంగా చేరుకుందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఆయనను, స్థానిక సహోదరులను చూసి ఆమె కుటుంబమంతా సంతోషించింది. ఆమె తల్లిదండ్రులు ఇలా అన్నారు: “మీరు నిజమైన మతాన్ని అభ్యసిస్తున్నారు. రోడ్డు మీద మరణించేందుకు వదిలేయబడిన మా అమ్మాయి ప్రాణాన్ని మీరు కాపాడారు.” “హమున్యారి అనే పేరుకు తగ్గట్లు, ఆమెను మరణించేందుకు వదిలేసినందుకు మీకు సిగ్గనిపించడంలేదా?” అని వారు ఆమె చర్చి సభ్యులను నిలదీశారు. సాక్షులు హమున్యారి కుటుంబంతో బైబిలు చర్చను ప్రారంభించి బైబిలు ఆధారిత సాహిత్యాన్ని ఇచ్చారు, తమ ఇంటికి మళ్లీ వచ్చి బైబిలు అధ్యయనం నిర్వహించమని వారు సహోదరులను కోరారు. గతంలో సాక్షులను వ్యతిరేకించిన కొంతమంది కుటుంబ సభ్యులు తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. వారిలో హమున్యారి బావ కూడా ఉన్నాడు, ఆయన ఒకప్పుడు ఆ ప్రాంతపు చర్చి నాయకుడు. ఆయన బైబిలు అధ్యయనాన్ని అంగీకరించాడు.
ఆరాధనా మందిరాలను నిర్మించడం
ఒక ప్రాచీన ప్రేరేపిత కవి ఇలా రాశాడు: “దేవా . . . నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము కీర్తన 63:1, 2) జింబాబ్వేలోని అనేకమంది విషయంలో ఆ మాటలు ఎంత నిజమో! వారు భౌతికంగా కరవు అనుభవిస్తున్నారు గానీ ఆధ్యాత్మికంగా వారు దేవుని కోసం, ఆయన మంచితనం కోసం పరితపిస్తున్నారు. యెహోవాసాక్షులు చేస్తున్న క్రైస్తవ పరిచర్యలో లభిస్తున్న ఫలితాల్లో మీరు దానిని గమనించవచ్చు. 1980లో జింబాబ్వేకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అక్కడున్న 476 సంఘాల్లో దాదాపు 10,000 మంది సాక్షులున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత, ఇప్పుడు క్రియాశీల సాక్షుల సంఖ్య మూడురెట్లు పెరిగి, సంఘాల సంఖ్య దాదాపు రెండు రెట్లు అయ్యింది.
నీకొరకు తృష్ణగొనియున్నది.” (వీటిలో కొన్ని సంఘాలకు మాత్రమే సొంత ఆరాధనా స్థలాలు ఉండేవి. 2001 జనవరిలో, జింబాబ్వేలోని 800కన్నా ఎక్కువ సంఘాల్లో 98 సంఘాలకు మాత్రమే కూటాలు జరుపుకోవడానికి అవసరమైన ఆరాధనా మందిరం అంటే రాజ్య మందిరం ఉండేది. అనేక సంఘాలు తమ కూటాలను చెట్ల క్రింద జరుపుకునేవి లేక గుంజలతో, మట్టి గోడలతో, గడ్డి పైకప్పుతో నిర్మించబడిన సామాన్య గుడిసెల్లో జరుపుకునేవి.
జింబాబ్వేలోని సాక్షుల ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరులు ఉదారంగా విరాళాలు ఇస్తున్న కారణంగా, ఆ సహోదరులు శ్రద్ధతో స్వచ్ఛంద సేవ చేస్తున్న కారణంగా అనేక సంఘాలు నిరాడంబరమైన, అదే సమయంలో గౌరవప్రదమైన రాజ్య మందిరాలను నిర్మించుకునేందుకు దోహదపడే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నిర్మాణ నైపుణ్యాలున్న అనేకమంది సాక్షులు విదేశాల నుండి జింబాబ్వేకు వచ్చి స్థానిక స్వచ్ఛంద సేవకులతో కలిసి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక స్థానిక సాక్షి ఇలా రాశాడు: “అందమైన రాజ్య మందిరాలను నిర్మించడానికి సహాయం చేసేందుకు అనేక దేశాల నుండి జింబాబ్వేకు వచ్చిన సహోదర సహోదరీలందరికీ మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నిర్మాణ పని జరిగేలా రాజ్యమందిర నిధికి విరాళాలు ఇచ్చిన మిగతా మీ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.”
ఈ దేశపు తూర్పు భాగంలో, సహోదరులు 50 సంవత్సరాలపాటు ఒక పెద్ద కోతిరొట్టె చెట్టు క్రింద కూడుకొన్నారు. నిజమైన ఆరాధనా మందిరం నిర్మించబడబోతోందని క్రైస్తవ పెద్దలకు తెలియజేసినప్పుడు వారిలో ఒకరు కంటతడిపెట్టకుండా ఉండలేకపోయారు. సమీప సంఘానికి చెందిన 91 ఏళ్ల పెద్ద ఇలా అన్నాడు: “ఇలాంటిది ఏదో జరగాలని నేను ఎంతోకాలంగా యెహోవాకు మొర్రపెట్టుకుంటున్నాను!”
ఈ ఆకర్షణీయమైన భవనాలు వేగంగా నిర్మించబడడం గురించి ఎంతోమంది వ్యాఖ్యానించారు. ఒక పరిశీలకుడు ఇలా అన్నాడు: “మీరు పగటిపూట నిర్మిస్తున్నారు, కానీ రాత్రిపూట దేవుడు నిర్మిస్తున్నట్లున్నాడు!” నిర్మాణపని చేస్తున్న సహోదరుల మధ్యవున్న ఐక్యతను, సంతోషాన్ని కూడా వారు గమనించారు. ఇప్పటివరకు, ఆ దేశమంతటా దాదాపు 350 క్రొత్త రాజ్య మందిరాలు నిర్మించబడ్డాయి. దీనివల్ల 534 సంఘాలవారు ఇటుకలతో దృఢంగా నిర్మించబడిన రాజ్య మందిరాల్లో సమకూడగలుగుతున్నారు.
అతి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక నిర్మాణ పని జింబాబ్వేలో కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి గురించి మనం ఆలోచించినప్పుడు అలాంటి ఆశీర్వాదాలకు కారకుడైన యెహోవాను స్తుతించేందుకు మనం ప్రోత్సహించబడుతున్నాం. అవును, “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.”—కీర్తన 127:1.
[అధస్సూచి]
^ పేరా 16 యెహోవాసాక్షులు ప్రచురించినది.
[9వ పేజీలోని మ్యాపులు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
జింబాబ్వే
హరారే
మాస్వింగో
గ్రేట్ జింబాబ్వే
[9వ పేజీలోని చిత్రం]
శంఖువు ఆకారపు కోట
[12వ పేజీలోని చిత్రం]
క్రొత్త రాజ్య మందిరం, కన్షెషన్ సంఘం
[12వ పేజీలోని చిత్రం]
తమ క్రొత్త రాజ్య మందిరం బయట నిలబడిన లిండేల్ సంఘ సభ్యులు
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
మెట్లున్న శిథిలాలు: ©Chris van der Merwe/AAI Fotostock/age fotostock; లోపలి చిత్రంలో కోట: ©Ingrid van den Berg/AAI Fotostock/age fotostock